శ్రీమద్రామాయణము.
(225 వ ఎపిసోడ్),
గ్రహణం ధారణం చైవ, స్మరణం ప్రతిపాదనం|,
ఊహో~పోహో`ర్థ విజ్ఞానం, తత్వజ్ఞానంచధీగుణాః||"",
ఎదైనా విషయాన్ని వినాలనే కోరిక, వినుట,అలా వినిన గ్రహించగలగటము, అలా గ్రహించినదానిని మనస్సు నందు నిక్షిప్తము చేసుకోవడమనేవి బుధ్దికి సంబందించిన ముఖ్య విషయాలుకాగా, వీటితోబాటు ఊహించుట,సంశయ నివృత్తి కై ఆరాటము నివృత్తిచేసుకున్న దాని అర్థము చక్కగా గ్రహించుట,వాటి తత్వజ్ఞానాన్ని ఎరుంగుట అనుఎనిమిది గుణములు బుద్ధికి సంబందించిన గుణాలు.
వీటిలో మానవునికి ఏది లోపించిన వానిని అందరము బుద్ది హీనుడని లేదా వీడికి బుర్ర తక్కువ వాడని పిలుస్తాము.వీడు బుర్రతక్కువ సన్యాసి యని ఈసడిస్తాము.
రామాయణము కిష్కిందాకాండములో హనుమకి అంగదుడు తారుడు మొదలైనవారు సీతామాత జాడ తెలుసుకొనుటలో విఫలమయ్యామని విలపిస్తూ ప్రాయోపవేశానికి సిద్ద పడి ఆ విషయాన్ని హనుమకు తెలియచేస్తారు.అప్పుడు ఆంజనేయస్వామి వారిని కఠినమైన వచనములతో మందలిస్తు,
"" తేషు సర్వేషు భిన్నేషు తతో~భీషయదంగదం|,
భీషణైర్భహుంభిర్వాక్యైః కోపోపాయసమన్వతైః||,(54-07),
""నీ ప్రాయోపవేశ నిర్ణయం సమర్థనీయముకాదు.నీవు సుగ్రీవునికన్నా సమర్థుడవు.నీ తండ్రి వాలి వలె ఈ కపి రాజ్యాన్ని రక్షించగలవు.కానీ ఒక్క విషయము గుర్తించు ఈ మన వానరులు చంచలమనస్కులు.వారు ప్రభువు మాటకి కట్టుబడి సేవలు చేస్తారు గానీ తమ భార్యా పిల్లలని వదులుకొని నీవు కోరుకున్న విధముగ ప్రాయోపవేశానికి ఏ మాత్రము ఇష్టపడరని తన బుద్దిబలాన్ని ఉపయోగించి వారందరికి మంచి ఉపయుక్తమైన హితవు పలుకుతాడు.
ఇక్కడ హనుమంతులవారు తనకి గల బాహుబలము మనోబలము, ఉపాయబలము,మరియు బంధుబలము అనే నాలుగింటిలో ఉపాయబలాన్ని ఉపయోగించి తన వాక్ఛాతుర్యముతో ,
"" స చతుర్ణామ్ ఉపాయానాం తృతీయం ఉపవర్ణయన్,
భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్యసంపదా||,(54-06),
ఎప్పుడైతే ప్రాయోపవేశానికి అంగదాదులు సిధ్దపడ్డారో హనుమలవారు చతురోపాయములలో మూడవదియైన భేదోపాయము ద్వారా వానరులందరిని వారి ఆలోచనలకి భిన్నముగ తన వాక్చాతుర్యముతో మార్చుటకు ప్రయత్నించుటే మారుతి బుద్ది బలానికి నిదర్శనము. అలా హనుమ వారి ఆలోచనను మార్చకపోతే వారందరు ప్రాయోపవేశానికి ఒడిగట్టేవారే.దానితో తార పుత్రశోకముతో క్రుంగి పోయేది.సుగ్రీవుడు రామ కార్య విముఖుడయ్యేవాడు.రామాయణ గాథ మరోలస యుండేదేమో.కనుక బుధ్దిబలానికున్న ప్రాముఖ్యత అత్యంత శ్లాఘనీయమైనది.అందుకనే అందరము హనుమంతులవారిని "బుద్దిర్భలం" .......హనూమత్స్మరణాభవేత్. అని ప్రార్థించు కుంటాము.
ఎవరైనా నిరాశ నిస్ప్రలలో యున్నప్పుడు మనము మన బుద్ది బలాన్ని ఉపయోగించి ఎదుటివారికి ఆత్మస్థైర్యాన్ని ఎలా పెంపొందింప చేయాలో రామాయణము మనకి మారుతి వాక్చాతుర్యము ద్వారా తెలియచేస్తున్న విధానాన్ని మనము గుర్తెరగాలి
.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
No comments:
Post a Comment