నిరాయుధుడైన కర్ణుడిని అనైతికంగా చంపడం శ్రీకృష్ణుడికి ధర్మమా?
కర్ణుడు నిరాయుధుడు కాదు, కృష్ణుడు అనైతికంగానూ చంపించలేదు.
కర్ణుడు అర్జునుడు 17వరోజున ఒక్క ప్రహరం అంటే 3 గంటలు ముఖాముఖి పోరాడారు. యోధుడి రథం చుట్టూ ఉండే రక్షక సైనికులు తప్ప ఇంకెవ్వరు వాళ్ళిద్దరి మధ్య కలుగజేసుకోలేదు. కర్ణుడి రక్షక సైనికులను అర్జునుడు తుడిచేసాడు. తర్వాత ఇద్దరి మధ్యన పోరు బాగా సాగింది.
యుద్ధం ఆఖరు క్షణాలలో, ఇంకా బలమైన దివ్యాస్త్రాలను వాడమని కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించాడు. అప్పుడు అర్జునుడు రౌద్రాస్త్రాన్ని సంధిస్తాడు. ఇక్కడే కర్ణుడి రథచక్రం బ్రాహ్మణ శాపం వల్ల భూమిలో ఇరుక్కుంది.
ఓ పార్థా ఆగాగు, రథచక్రాన్ని ఎత్తుతాను, నీకిది ధర్మం కాదంటాడు. అర్జునుడు కాసేపు ఆగుతాడు. కృష్ణుడు మాత్రం ఆగలేదు -
ఏం రాధేయ, ఏకవస్త్రయై రజస్వలయైన ద్రౌపదిని సభామధ్యమునకు ఈడ్చినప్పుడు ఏమైనది ఈ ధర్మము? ఆమెతో మరో భర్తను పొందమని దుర్భాషలాడినప్పుడు ఏమైనది ఈ ధర్మము? భూమిమీద నిరాయుధుడై ఉన్న ఒక్క బాలుణ్ణి, అభిమన్యుడిపై మీ ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసినపుడేమైనది నీ నీతి? అని అర్జునుడిని అస్త్రాలు వేయమన్నాడు కృష్ణుడు. కృష్ణుని మాటలు విన్న రాధేయుడు సిగ్గుతో తల దించుకున్నాడు.
మళ్ళీ యుద్ధం సాగింది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడు మేఘాలను సృష్టించాడు, అర్జునుడు వాయవ్యాస్త్రంతో వాటిని తొలగించాడు. కర్ణుడు అర్జునుడి ఛాతిపై కొట్టగా అర్జునుడు ఒక్కసారిగా మూర్ఛపోయాడు. మళ్ళీ కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం మొదలుపెట్టి విఫలమైనాడు.
అర్జునుడు త్వరగా మూర్ఛనుండి కోల్కున్నాడు. ఈ శత్రువు శిరస్సును నీ బాణముతో ఛేదింపుమర్జునా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జునుడు కర్ణుడి ధ్వజాన్ని కూలగొట్టాడు. మహేంద్రవజ్రానలదండ సన్నిభమైన అంజలికాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అతని విల్లుకు బాణం ఎక్కుపెట్టిన తరువాత, భూమి కంపించడం ప్రారంభించింది, ఆకాశం అద్భుతమైన శబ్దాలతో నిండిపోయింది. "నేను తపస్సు నిజంగా ఆచరించిన వాడనైతే, గురువులను పెద్దలను సేవించి సంతోషింపచేసిన వాడనైతే, సదా పెద్దల వాక్కులను పాలించినవాడనైతే, ఈ అస్త్రము కర్ణుడిని చంపి, నాకు విజయము చేకూర్చుగాక" అని పిడుగుపాటు శబ్దంతో అర్జునుడు ఆ శరాన్ని విడిచిపెట్టాడు. ఆ అంజలికాస్త్రం తాకిడికి కర్ణుడి తల ఎగిరి పడింది. అతని శరీరం మిగతా భాగంలోంచి ఆతని ప్రాణాలు విడిచి సూర్యమండలంలో కలిసిపోయాయి. కర్ణుడి శరీరం నేలకొరిగింది.
ఇందులో అనైతికమేముంది?
కర్ణుడు నిరాయుధుడా? కాదు. బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించాడు.
భూమిలో ఇరుక్కున్న రథాంగం శాప ప్రభావాన ఇరుక్కుందని, బయటకి రాదని కర్ణుడికి కూడా తెలుసు. ఐనా అదే ఎత్తాడు.
కృష్ణుడు సమయమివ్వడని తెలుసు, ఐనా యుద్ధం మాని రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు.
అతని ధ్వజం నేలకూలింది, ఐనా రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు.
యుద్ధమంటే చిన్నపిల్లలాట కాదు, ఆగాగు నేను మెల్లగా రథమెక్కాక మనం మళ్ళీ ఆడుకుందామే అనటానికి. రథం మీద లేనివాడితో యుద్ధం చేయకూడదని నియమము లేదు.
నేల మీదనే నిల్చుని పోరాడవచ్చు, కర్ణుడంతటి వాడికి అదేం లెక్క కాదు, ఐనా రథ చక్రాన్నే ఎత్తుతూ ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడు చేయలేదా? ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసిననాడు అభిమన్యుడు నేల మీద లేడా? అర్జునుడు 14వ రోజున కౌరవ సైన్యంతో పాటు మహారథులతో నేలపై నిలబడి యుద్ధం చేసాడు. ఆ సమయంలో అర్జునుడు, అభిమన్యుడు కర్ణుడులా ఏడవలేదే?
అర్జునుడు కర్ణుడుని అనైతికంగా చంపలేదు. తప్పు ఖచ్చితంగా కృష్ణార్జునులది కాదు. కర్ణుడి చావుకు కర్ణుడే కారణం..అది ఎప్పటికైనా అనివార్యమైనదే.
No comments:
Post a Comment