Sunday, July 21, 2024

రామాయణము నేటి పాలకులకి హెచ్చరికలు చేస్తున్నది.

 శ్రీమద్రామాయణము. 

"" (234 వ ఎపిసోడ్),,

""" త్వామాసాద్య మహాత్మానం ధర్మజ్ఞం ధర్మవత్సలం,
అర్థిత్వాన్నాథ వక్ష్యామః తచ్చ నః క్షంతుమర్హసి""
(అరణ్య.కాం.06-10),

 శరభంగాశ్రమములో యున్న రామచంద్రప్రభువు కడకు బ్రహ్మతేజస్సంపన్నులు,అష్టాంగయోగసాధనలో నిష్ణాతులు,యోగసాధనలో నిష్ణాతులైన తాపసులు రాముని కడకు వచ్చి  ఓ రామా! దేవలోకానికి మహేంద్రుడెంతటి వాడో ఈ భూమండలానికి నీవు ప్రభుడవు.ధర్మస్వరూపుడవు ధర్మరక్షకుడవు.మా అభ్యర్థనలను మన్నించి ఇక్కడ మేము క్రూర రాక్షసుల బాధలకు తట్డుకొనలేక పోతున్నాము.మమ్ము రక్షించమని ప్రాధేయపడ్డారు.

అంతకు మునుపే శరభంగమహాముని రామలక్ష్మణులను "సుతీక్షణ" మహర్హి కడకు వెళ్లమని వారు చెప్పినచోట నివాసమేర్పరుచుకొనమని చెప్పి  రామ దర్శనముకై పెక్కేండ్లు నిరీక్షించి తనతపోశక్తిని రామునికి ధారపోసి అగ్నిలో ప్రవేశించి శరీరాన్ని దహింపచేసుకున్నాడు.
"" రామస్తు విస్మితో భ్రాతా భార్యయా చ సహాత్మవాన్""అగ్నికి ఆహుతియైన శరభంగ ముని ఔదార్యానికి సీతారామలక్ష్మణులు ఆశ్చర్యచకితులయ్యారు.

శరభంగుని అత్మాహుతి ఈ తాపసుల అభ్యర్థనలకు రాముడు చలించిపోయి

"" నైవ మర్హథ మాం వక్తుమ్ ఆజ్ఞప్తో~హం తపస్వినామ్,
కేవలేనాత్మకార్యేణ  ప్రవేష్టవ్యం మయా వనమ్""(06-22),

ఓ తాపసులారా! తమరందరు నన్నిలా ప్రార్థించుట ఉచితముకాదు.నేను మీ ఆజ్ఞలను పాటింపవలసినవాడను.నా స్వకార్యనిమిత్తం ఈ వనాలకి వచ్చినా ,పితృవాక్యపరిపాలనలో ఈ వనాలకి రావటము వల్ల  ఈ రాక్షసులను హతమార్చుట నావిధియని పలుకుతాడు.

ఇక్కడ రాముడు అకారణముగ ఎటువంటి స్పర్థలేని రాక్షసులను హతమార్చుట ఉచితమా యని యోచించిన రాముడు ధర్మమూర్తిగ పేర్గాంచిన వాడు , రామచంద్రప్రభువు  ప్రజలను రక్షించుటయందు రామునికి  గల ఆసక్తి ఏమిటి?,

"" అధర్మస్తు మహాం స్తాత! భవేత్ తస్య మహీపతేః,
యో  హరేద్భలిషడ్భాగం న చ రక్షతి పుత్రవత్""(06-11),

ప్రజలను రక్షించుట రాజు కర్తవ్యము ఎందుకనగా రాజు ప్రజల ఆదాయమునుండి (షడ్భాగము) ఆరవ వంతు పన్నుగ స్వీకరించును.పన్ను తీసుకొని ప్రజల కష్టములను తీర్చని రాజు అధర్మపరుడు.కనుక ప్రజలను రక్షించుట రాజు కర్తవ్యమే.

కానీ ఇక్కడ రాముని రక్షింపమని వేడుకున్న  తాపసులు రాజ్య ప్రజలు కారు.కారడవులలో మోక్షార్థులై లోక కళ్యాణార్థము తపమాచరించు వారు.మరి వీరిని కాపాడవలసిన ధర్మము రాజునకు యున్నదా యని యోచించిన,

""యత్ కరోతి పరం ధర్మం మునిర్మూలఫలాశనః,
తత్ర రాజ్ఞశ్చతుర్భాగః  ప్రజా  ధర్మేణ రక్షతః||,(06-14),,

కేవలము కందమూలఫలములను స్వీకరిస్తు ఈ తాపసులు చేయు ఉత్తమకార్యముల ఫలములో (చతుర్భాగము)నాల్గవభాగము ధర్మబధ్దముగ రాజునకు చేరును. ఆ తపః ఫలరూపముగ రాజు నాల్గవవంతు పుణ్యము పొందుచున్నాడు కనుక తాపసుల రక్షణభారము నిస్సందేహముగ రాజుదే.

రామునికి  ఈ ధర్మముల పట్ల అచంచలమైన ధర్మనిరతి యున్నందున తాపసులతో "" మమ్ము రక్షింపుడని అభ్యర్థించక  ఆజ్ఞాపించమని వేడి,

"" దత్వా~భయం చాపి తపో~నానాం ధర్మే ధృతాత్మా సహ లక్ష్మణేన,
తపోధనైశ్చాపి సభాజ్యవృత్తః సుతీక్ష్ణమేనాభిజగామ వీరః||,(06-26),,

రామచంద్రుడు ధర్మమూర్తి ఆదర్శప్రభువు కనకనే ఆ తాపసులకి అభయమిచ్చి రాక్షసమూకనుండి వారికి ఇక ఎట్టి ఆపదలుండవని పలికి సుతీక్ష్ణ మహర్షి కడకు బయలదేరి వెళ్లాడు.

ప్రభువైన వాడు ప్రజలనుండి కేవలము పన్నులు వసూలు చేసి తదుపరి వారి బాగోగులు విచారించక పోవటము అమానుషమని రామాయణము నేటి పాలకులకి హెచ్చరికలు చేస్తున్నది.

జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

No comments:

Post a Comment