Saturday, July 13, 2024

 *🪷చాణక్య నీతి.🪷* 

శ్లోకం:

లాలయేత్ పంచ వర్షాణి, దశ వర్షాణి తాడయేత్ ।

ప్రాప్తేతు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్ ।।

భావం:

బాల్య, యౌవన కౌమార దశలలో తండ్రి తన కొడుకుని ఏ విధంగా తీర్చి దిద్దాలో తెలియ చెప్పే దిశా నిర్దేశక శ్లోకం ఇది.

ఇది కౌటిల్యుని నీతి శాస్త్రములోని శ్లోకం. చాణక్యుడు చెప్పినది.

కుమారునికి ఐదు సంవత్సరాలు వచ్చేవరకూ లాలించాలి, ప్రేమతో చూడాలి, వాత్సల్యాన్ని చూపించాలి, ముద్దు చేయాలి. ఆ తరువాత పది సంవత్సరాలూ కుమారుడు, ఎదుగుతున్న వయస్సులో చుట్టూ ఉన్న పరిసరాలనుండీ, ఇరుగుపొరుగు వారినుండీ, స్నేహితులనుండీ, తన ఎదుగుదలలో వచ్చే మార్పులని బట్టీ అనేకవిషయాలు గ్రహించి ఆకళింపు చేసుకుంటాడు. ఆ కౌమార దశలో మంచీ చెడుల రెండింటి ప్రభావమూ అతని మీద స్పష్టమైన ముద్రలు వేసే అవకాశం ఉంది.  ఇక్కడే విజ్ఞుడైన తండ్రి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, పదిహేను సంవత్సరాలు నిండే వరకూ  కుమారుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

ఈ అతి సున్నితమైన దశలో, మంచిమార్గం నుండి అదుపు తప్పకుండా ఉండుటకు, విపరీత భావోద్వేగాలకి లోను కాకుండా ఉండుటకు, అవసరాన్ని బట్టి, కుమారుని దండించడానికి కూడా వెనుకాడకూడదు.

పదహారు సంవత్సరాల ప్రాయానికి రాగానే తండ్రి కుమారునితో, హితము కోరే ఒక మంచి మిత్రునిలాగా మసలాలి. తండ్రి, తన వయస్సుతో వచ్చిన జీవితానుభవాన్ని క్రోడీకరించి, కుమారుడు చక్కటి వ్యక్తిత్వాన్ని రూపు దిద్దుకునేలా మంచి స్నేహితుడై అతని దిశానిర్దేశానికి సహాయకారిగా మెలగాలి.

వర్తమాన ఆధునిక ప్రపంచంలో, కాలంతో వచ్చిన మార్పుల దృష్ట్యా, కుమార్తెలకు కూడా కుమారులతో పాటు సమానమైన హక్కులు కల్పించి, సమానమైన విద్యావకాసాలు, ఉద్యోగావకాసాలు కల్పిస్తున్నారు. కావున, కుమారుని పెంపకంలో పైన చెప్పిన నీతి, కుమార్తెల విషయంలోనూ వర్తిస్తుంది. కుమార్తెల విషయంలోనూ తండ్రి అటువంటి జాగ్రత్తలు తీసుకోవలయును. ఈ విషయంలో లింగ విచక్షణ కూడదు.

No comments:

Post a Comment