👉 కరీంనగర్ జిల్లా : కమాన్పూర్
👉శ్రీ శ్వేత ఆదివరాహస్వామి ఆలయం
💠 శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలు. అలాంటి దశావతారాలలో మూడవది, ప్రసిద్ధమైంది ఆది వరాహావతారం. విశ్వమంతా జలమయమైన సమయంలో హిరణ్యాక్షుడు భూదేవిని చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు ఆమెను ఉద్దరించడం కోసం మహావిష్ణువు ఆది వరాహరూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుడిని వధిస్తాడు.
భూదేవిని సంరక్షిస్తాడు.
💠 మహావిష్ణువు మొదటి అవతారాలయిన మత్స్య, కూర్మ, వరాహ రూపాలలో ఆయనకి పూజలు తక్కువగానే వున్నాయి.
ఈ అవతారాలలో ఆయన దర్శనమిచ్చే పుణ్య క్షేత్రాలు కూడా తక్కువే.
వాటిలో ప్రముఖమైనవి మత్స్యావతారంలో చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామి (స్వామి కింద భాగం మత్స్య రూపంలో వుంటుంది) ; కూర్మావతారంలో శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో, వరాహావతారంలో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.
💠 తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామికి స్ధలమిచ్చిన ఆది దేవుడిగా వరాహస్వామిని కొలుస్తారు. వెంకటేశ్వరస్వామి కూడా ఆయన దగ్గరకు వచ్చే భక్తులంతా ముందు వరాహస్వామి దర్శనం చేసుకురావాలని, అలా అయితేనే ఆ యాత్ర సఫలమవుతుందని చెప్పారంటారు.
💠 తిరమల తర్వాత వరాహావతారానికి పూజలు తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పురాలో (పాత కరీంనగర్ జిల్లా) జరుగుతున్నాయి.
అనేక ఆలయాలలో వరాహావతారాన్ని ఆలయ స్ధంబాలమీద చెక్కిన విగ్రహాలలోనో, ఉపాలయాలలోనో చూడవచ్చుగానీ, ఆ స్వామికి ముఖ్యాలయంగా కమాన్ పురా ఖ్యాతి చెందింది.
💠 ఏదయినా గుడి గురించి చెబుతున్నప్పుడు అక్కడున్న గోపురం, ఆలయ ప్రాంగణం, చేసే ప్రత్యేక పూజల గురించి ప్రస్తావిస్తాం.
కానీ తెలంగాణ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో వెలసిన శ్వేత ఆది వరాహస్వామి ఆలయానికి గోపురం కాదు కదా కనీసం పైకప్పు లాంటివేవీ ఉండవు. అక్కడ జరిగే ఉత్సవాలూ తక్కువే. అయినా సరే... ఏడాది పొడవునా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి ఆ స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు!
💠 చుట్టూ నాలుగు కొండలు... వాటి మధ్య ఎలాంటి పైకప్పు లేదా ధ్వజస్తంభం లేకుండా కొలువైన దేవుడే శ్వేత ఆదివరాహస్వామి.
ఇక్కడ స్వామిని వరాల స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడ మొక్కలు తీర్చుకున్న వారికి వరాల ఇస్తారని అందుకే వరాల స్వామిగా ఘనత కెక్కింది.
💠 స్థలపురాణం :
🔅 600 ఏళ్ల క్రితం ఒక మహర్షి స్వామి వెలసిన స్థానంలోనే కూర్చుని తపస్సు చేశాడట. కొన్నాళ్లకు ఆ మహర్షికి స్వామి కలలో కనిపించి ఏదయినా కోరుకోమన్నాడట.
మహర్షి స్వామిని ఆ ప్రాంతంలో కొలువై ఉండమని కోరడంతో అక్కడున్న బండరాయిపైనే వెలసినట్లు ఇక్కడున్న ఆధారాలు చెబుతున్నాయి.
కొన్ని సంవత్సరాలక్రితం ఇంకో భక్తుడు స్వామిని దర్శించుకుని, ఏవో మొక్కులు మొక్కుకున్నాడట. అవన్నీ నెరవేరడంతో తన సొంత ఖర్చులతోనే ఇక్కడ మందిరం కట్టించేందుకు సిద్ధమయ్యాడట.
అయితే ఓ రోజు స్వామి అతడి కలలో కనిపించి తనకెలాంటి మందిరం లేదా గోపురం అవసరం లేదనీ.. తాను ఎళ్లవేళలా బయటే ఉంటాననీ, భక్తుల్లానే ఎండా, వానా, చలికాలాలను అనుభవిస్తాననీ చెప్పడంతో ఆ భక్తుడు తన ప్రయత్నాన్ని అందుకే విరమించుకున్నాడట.
💠 ఈ ఆలయంలో ఏ గోపురం కనిపించదు.
ఎక్కువగా వీసా ప్రయత్నాలు చేసేవారూ, వివాహం కానివారూ, సంతానం లేనివారూ వచ్చి మొక్కులు మొక్కుకుంటారు.
తమ కోరికలు నెరవేరిన తరువాత స్వామిని దర్శించుకుని ఈ ప్రాంగణంలోనే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
💠 ఇక్కడ తూర్పు దిశగా ఒక బండరాయిపైన చిన్న ఎలుక పరిమాణంలో స్వామి అవతరించాడని అంటారు. స్వామి ఇక్కడ ఏటికేడు పెరుగుతున్నాడనీ... ఈ విగ్రహంపైన వెంట్రుకలూ కనబడతాయనీ చెబుతారు. ఆలయ ప్రాంగణంలో రెండు బండలపైన స్వామి నడిచిన పాద ముద్రలూ కనిపిస్తాయి.
ఇక్కడి స్వామికి నిత్యపూజలూ, అభిషేకాలతోపాటు ఇతర పూజలూ ఏడాదంతా జరుగుతాయి.
💠 సింగరేణి కాలరీస్ వారు దేవాలయాభివృధ్ధికోసం బుల్ డోజర్ తో నేల చదును చేయ ప్రయత్నించగా ఒక బండరాయి దగ్గర సాగలేదుట. అక్కడ పరీక్షించగా కాలి ముద్రలు కనిపించాయిట. వాటిని స్వామివారి కాలిముద్రలుగా భావించి భక్తులు వాటికీ పూజ చేయసాగారు.ఆవరణలోనే స్వామికి కొంచెం దూరంలో పాదాల ముద్రలు వున్నాయి.
అక్కడ ఏనుగు పాదాలు, స్వామి పాదాలు వున్నాయట.
స్వామి ఏనుగెక్కి వచ్చారని భక్తులు విశ్వసిస్తారు. అక్కడ కూడా పసుపు, కుంకుమలతో పూజ జరగటంతో సరిగా ఆనవాళ్ళు కనబడవు.
💠 స్వామికి రోజూ ఉదయం 8 గం. లకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహం మొత్తాన్ని చందనంతో అలదుతారట.
💠 స్వామికి నిత్య పూజలు జరుగుతున్నాయి. అవేకాక, భక్తుల కోరికమీద సత్యన్నారాయణ వ్రతాలు, పిల్లల తల నీలాల సమర్పణ, అన్నప్రాశన, పుట్టిన రోజు, అన్నదానాలు వగైరా కార్యక్రమాలన్నీ అక్కడ ఎక్కువగా జరుగుతూంటాయి.
💠 ఈ ఆలయం కరీంనగర్ నుండి 60km.
No comments:
Post a Comment