Monday, July 1, 2024

 *శ్రీరమణీయభాగవత కథలు- 18*
( బాపు-రమణ )

జరిగిన కథ:
  *మోహినీ అవతారం* లోని శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచేస్తాడు. అది కనుక్కొన్న రాహు-కేతువులు స్వర్గానికి వచ్చి ఒక చుక్క అమృతం రుచి చూడగా, శ్రీ మహావిష్ణువు తన చక్రంతో వారి తలలు ఖండిస్తాడు. అయినా అమృతప్రభావం వలన ఆ తలలు మాత్రం ప్రాణాలతో ఉన్నాయి. వారిరువురూ సూర్య-చంద్రులను గ్రహణ రూపంలో పట్టుకుంటుంటారు.

ఇక చదవండి
******
*అడవి*

ఒక పుట్టలో ఒక దానవుడు తపస్సు చేస్తున్నాడు. పేరు భస్మాసురుడు. 

ఓం నమశ్శివాయ! 
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ! 

పుట్టలోంచి పొగలూ మంటలూ వస్తున్నాయి. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వత్సా! లే !

పుట్ట పెళ్లలుగా విరిగి పడింది. జడలు కట్టిన జుట్టు. ఎముకల పోగులాటి శరీరం కనిపించాయి. 

అభయహస్త మహిమతో ఆ భక్తుడు లేచి నిలబడుతునే పుష్టిగా ఆరోగ్యంగా మారిపోయాడు.

భస్మా:
హరహర మహాదేవ! శంభోశంకర!

ఈశ్వరుడు: నాయినా నీతపస్సుకి మెచ్చాను. ఏం వరం కావాలి. కోరుకో

భ: తండ్రీ! నాది విచిత్రమైన కోరిక. నేను రాక్షసునిగా పుట్టినా రక్తపాతం చూడలేను బాధతో
జీవి పెట్టే కేకలూ ఏడుపులూ వినలేను. శత్రు సంహారం నాకు చాలా బాధగా వుంది.

అందువల్ల నా శత్రువులను కొట్టి, నరికి, వారి నెత్తురోడ్చి హింసపెట్టకుండా వారిని సంహరించే
వరం ప్రసాదించు.

ఈశ్వ : ఆహా! శత్రు వధలో కూడా భూత దయ చూపే నీ మనస్సు నవనీత సమానం మరి ప్రాణికి బాధ కలగకుండా ఎలా చంపాలని నీ కోరిక?

భ:
: నేను ఎవరి తలపై చేతిని పెడితే వారు ఏ బాధతెలీక క్షణంలో భస్మం అయిపోవాలి. ఆ భస్మంతో నేను నిన్ను పూజించాలి.

ఈశ్వ: అద్భుతం! తధాస్తు! (మాయమవబోయాడు.)

భ: ప్రభూ - ఒక్కక్షణం నువ్విచ్చిన వరం నిజం అని నిరూపించే వరకు నువ్వు ఇక్కడే వుండాలి.

ఈ:అదేమిటి ? ఎందుకలా? :

భ:
నీ వరాన్ని నమ్మి నేను శత్రువు దగ్గరకు ఆయుధాలు లేకుండా వెళ్తానుకదా! తరువాత వాడి నెత్తిన చెయ్యి పెట్టాక వరం పని చెయ్యలేదనుకో ఆ శత్రువు వాడి ఆయుధంతో నన్ను నరికి పోగులు పెడతాడు. నా దగ్గిర ఏమీ వుండవు కదా!

ఈశ్వ:
నా వరాలు వమ్ము కావు నాయినా. అయినా నువ్వు కోరావు కాబట్టి ఇక్కడే వుంటాను.. (చుట్టూ చూసి) దగ్గరలో ఎవరూ లేరే!

భస్మాసురుడు దగ్గరగా వచ్చి చెయ్యి పైకెత్తాడు.

భస్మా:
: ఎవరో ఎందుకు నువ్వే వున్నావుగా!

ఈశ్వరుని తలపై చేయి పెట్టబోయాడు. శివుడు, చెంగున దూకి తప్పుకున్నాడు. భస్మానురుడు వెంట బడ్డాడు. శివుడు పరిగెడుతున్నాడు..

భ::ఓ స్వామీ! వరం నిరూపించేదాకా మాయమై పారిపోకు పోయావో మోసగాడివై పోతావు జాగ్రత్త.

శివుని వెంట అసురుడు తరుముతున్నాడు.

*కైలాసం*

పార్వతీ దేవి కలవరంతో భూలోకం వంక చూసింది. పక్కన నారదుడు

నార : అమ్మా! ఇపుడు నీ భర్తని కాపాడడానికి విష్ణుమాయ ఒకటే దారి. ఆయనను వేడుకో!
***** ****

పార్వ: (చేతులు జోడించి విష్ణువును ధ్యానించింది) ప్రభూ! లోక క్షేమం కోసం నా భర్త హాలహాలం మింగినపుడు కూడా నేనింత భయపడలేదు. ఈ సంకటస్థితి తప్పించు జగద్రక్షకా రక్షమాం రక్షమాం.!

*అడవి.*

ఒక సరస్సు దగ్గర భస్మాసురుడు ఆగి అటూ ఇటూ చూస్తున్నాడు. పొగ మంచు కమ్మి ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. గలగల గాజుల సంగీతం కిలకిమని నవ్వుల సంగీతం. ఒక పాట కూనిరాగంగా మొదలైంది.

అసురుడు శబ్దాన్ని బట్టి ఆటు నడిచాడు. పొగమంచు తెరల్లోంచి చీరకట్టుకున్న ఒక యువతి కనబడింది.

అసురుడు ఇంకొంచెం ముందుకు వెళ్లాడు.

ఒళ్లు పరవశింప జేసే సుగంధం. గాఢంగా ఆ గాలి పీల్చాడు. ఆనందించాడు. ఇంకో అడుగు ముందుకు వేశాడు

భ:
ఓ సుగంధ లక్ష్మి- ఎవరు నీవు.

ఆ యువతి ముందుకు వంగి నేలమీద వున్న మువ్వల పట్టెడ కాలికి కట్టుకుంటోంది. చిన్నగా చిందువేసి నాట్యం ఆరంభించింది. వెనక్కి చూడలేదు. భస్మాసురుడు ముందుకు వెళ్లాడు.

భ:
సుందరీ! నీ పేరేమిటి?

మో:
వికారిణీదేవి

నాట్యం చేస్తూనే గిర్రున తిరిగింది. ఆమె జడకుచ్చులు విసురుగా వచ్చి అనురుని బుగ్గల మీద తగులుతూ జారాయి. అసురుడు ఉక్కిరి బిక్కిరై పోయాడు.

ఆహా! ఏమి చమత్కారం! ఏమి సొగసు! అసలు పేరు చెప్పవా! (నాట్యం చేస్తూనే) ఇది నర్తన వేళ. మాటల వేళ కాదు నువ్వడిగినట్టు నేనాడను. నే చెప్పినట్టు నువ్వే ఆడాలి.

భ:
దానికేం ఆడేస్తాను.

సుం:
నేను నీక్కావాలి. నీ మోహం మొహం మీదే తాండవిస్తోంది. నాతో సమంగా అచ్చు ఆడితే నే చేసిన వన్నీ అలాగే చేస్తే నేను నీ దాననే నీ దాననురా నీ దాననురా!

భ:
(అనుకరిస్తూ) నీదాననురా

అంటూ నాట్యం ఆరంభిచాడు. ఇద్దరూ నాట్యమాడుతున్నారు. సరస్సు మధ్య పొగమంచు మరుగున
దాగివున్న శివుడు ఒకటి రెండు సార్లు నీటిలోంచి పైకి లేచి వారిని చూసి మళ్లీ మునుగుతున్నాడు. కైలాసం నుండి పార్వతీ వైకుంఠం నుండి లక్ష్మీదేవీ కూడా నాట్యాన్ని చూసి మురిసిపోతున్నారు.. పోతున్నారు.

నాట్యం చివర మోహిని తన చేతిని తలమీద పెట్టుకుంది. తన్మయుడై ఆమెను అనుకరిస్తున్న ఆ కూడా అదే పని చేశాడు. క్షణంలో బూడిదై పోయాడు. శివుడు సరస్సులోంచి తల పైకిత్తి చూశాడు.

శివు : 

సంభ్రమాశ్చర్యాలతో) అద్భుతం పరమాద్భుతం!

సరస్సు బయటకు వచ్చాడు. సుందరి మాయమై పోయింది. సన్నటి గాలి ఈలవేసింది అసురుని బూడిద శివుడి పాదాలకు తీగలా సోకింది.

*వైకుంఠ మందిరం*

లక్ష్మీనారాయణులు / శివపార్వతులు ఆసీనులైవుండగా నారదుడు ఒక పక్కన కూచుని వీణపై మోహిని పాడిన పాటను పలికిస్తున్నాడు.

నారదా - ఎక్కడదీ గానము? ఎక్కడో విన్నట్టుందే!

శివ: నారదా ఎక్కడదీ గానము? ఎక్కడో విన్నట్టుందే!

నార:
: ప్రభూ - కొత్తరాగం శ్రీమన్నారాయణ వరప్రసాదం.

శివ:
: అలాగా? పేరు?

నార:
(విష్ణువు వైపు చూస్తూ) శివరంజని.

శివు :

(నవ్వి) ఓహో! భస్మాసురుని పడగొట్టిన బ్రహ్మండాస్త్రం కదా! బ్రహ్మాస్త్రాన్ని మించిన ఆస్త్రం. అవును స్వామీ! అమృత భాండం కధ తరువాత నాకు ఒక చిత్రమైన ఊహ కలిగింది అనుమతిస్తే చెప్పగలను.

నలుగురూ ఆసక్తిగా తలలు పంకించారు.

నార : మీ హరి హరుల ఆయుధాలు సుదర్శన చక్రం త్రిశూలాలను మించినది మోహిన్యస్త్ర అని తేలింది.

 శివు: అదేమిటి?

నార:

: ఒక్క బొట్టు రక్తం రాలకుండా ఒక్క ప్రాణం తీయకుండా లక్షలాది రాక్షసులను పడగొట్టి చెడగొట్టింది మోహినీ అవతారమే కదా.

లక్ష్మి: అవునవును. సౌందర్యం శృంగారం సంగీతం

పార్వ : వాటికి సాటిలేవని చాటి చెప్పాయి.

శివు: అవును నిజమే! శ్రీహరీ! లోకోత్తర సౌందర్య రాశివిగా రూపు ధరించావుట గదా! నా కొక్కసారి ఆ దివ్యరూప దర్శనభాగ్యం కల్పించవా..

విష్ణు : (వినయం నటిస్తూ) మహదేవా. ఏదో ఆసమయాన ఆపద్దర్మంగా ఒక మాయ చేశాను పని చక్కబడింది. అంతే తప్ప విశేషమేమీ లేదు. అది కూడా వాళ్లు రాక్షసులు కాబట్టి బోర్ల పడ్డారు గానీ - శ్రీపార్వతీదేవి అతిలోక సౌందర్యాన్ని మెచ్చి విడిగా వుండలేక తనువులోనే సగమిచ్చిన సత్యశివసుందరేశ్వరుడివి నీ వంటి వారిని మెప్పించే గొప్ప అంద చందాలేమీ కావులే స్వామీ.

శివు:
నారదుడు అంత గొప్పగా చెబుతుంటే నువ్వు కాదంటే ఎలా?

విష్ణు : పార్వతీ పతీ. ఆడదాని అంద చందాల గురించి అనుభవమే కాదు. ఆధ్యాసే లేని ఘోటక బ్రహ్మచారి నారదుడు ఎలా విలువ కట్టగలడు? నారదుని చతురోక్తులు నాలిక చివరి నించే వస్తూంటాయి. ఔనా? చిరంజీవీ?

నారదుడు:
: (దొంగా / అన్నట్లు చూస్తూ) నారాయణ! నారాయణ!

*హిమాలయాలు అడవి*

శివుడు ఒక సరస్సు వద్ద ధ్యానం చేసుకుంటున్నాడు. ఎక్కడి నించో చక్కని పూలబంతి వచ్చి దగ్గరగా పడింది. అందెల, గాజుల రవళికి కిలకిల నవ్వులు జత చేస్తూ లేడిపిల్లలా చెంగుచెంగున దూకుతూ 

ఒక చక్కని అమ్మాయి వచ్చింది. వంగి బంతి తీసుకుంది. శివుడు కళ్లు తెరిచాడు. అమ్మాయి బెదురుగా చూసి దణ్ణం పెట్టి మెరుపులా ఎగిరి పారిపోయింది. శివుడు విచిత్రంగా చూశాడు. లేచాడు. కొంచెం అవతల చెట్ల చాటున ఒక తోపువుంది. దాని మధ్య బంతి పైకి ఎగిరి క్షణం కనిపించి మళ్లీ దిగిపోతోంది. 

నవ్వులు అందెల చప్పుడూ వినిపిస్తున్నాయి. శివుడు నాలుగైదు సార్లు ఆ బంతిని చూశాడు. ఆ బంతే ఇంతకు ముందు తను చూసిన ఇంతి ముఖంలా కనిపించి నవ్వింది. విస్మయంతో శివుడు చురుగ్గా నడిచి పల్లంలో వున్న తోపును
చేరాడు. అక్కడ మోహిని ఒక్కతే బంతి పై కెగరేసి పట్టుకుంటూ ఆడుకుంటూంది. చిత్ర విచిత్ర గమకాల్లో, పైకి ఎదరకూ వెనకకూ బంతి ఎగురవేస్తూ ముందుకీ వెనక్కీ పక్కకీ పరుగులు పెడుతూ కిలకిల నవ్వుతూ ఆడుకుంటూంది. ఆమె జుట్టు ఎగురుతోంది, పైట జారుతోంది. చీర కుచ్చెళ్లు ఎగురుతున్నాయి. పాదాలు చిత్ర విచిత్రముగా లాస్యం చేస్తున్నాయి.

మో:
బంతులాడే ఇంతి బంతికాదులే ఇది ఇంతి చామంతి పూబంతి.

ఒకసారి బంతి తనవైపు వచ్చింది. శివుడు అందుకుని విసిరాడు. ఆ పడుచు కేరింతలు కొట్టి అందుకుని మళ్లీ విసిరింది. శివుడు మురిసిపోయాడు. పరవశుడై పోయాడు. వాలుగంటి వాడి వాలారు చూపులకు శూలి ధైర్యమెల్ల కోలుపోయి తరలి ఎరుగలేక మరచె గుణంబుల ఆలి మరచె నిజ గణాలి మరచె. 

కాము గెలువవచ్చు కాలారి గావచ్చు మృత్యుజయము గల్గిమెరయవచ్చు. ఆడువారి చూపుల గెలువగ వశముగాదు త్రిపుర వైరికైన!

ఒక స్థితిలో ఎగిరి కిందకు దిగుతున్న బంతిని ఇద్దరూ ఒక్కమారే పట్టుకో బోయారు. ఆమె పైట జారింది. శివుడు ఆమె బుజాల మీ చేతులు వేసి కౌగిలించుకోబోయాడు. ఆమె జారి పారిపోయింది.

అబలా పాఠుము పోకుమే యనుచు డాయంబాసి కబరీ బంధము బట్టి... కౌగిలించుకో బోగా ఆమె తిరిగి తప్పించుకుని పరుగెత్తింది. కొండలు ఏరులు కొలనులు వనములు దాటి శంభుండు...

ఇలా తరిమి తరిమి ఒక చోట ఆమె బుజాలు గట్టిగా పట్టుకున్నాడు. మెల్లిగా వెనక్కి తిప్పాడు. 

వెనకనుండి వయ్యారి భామలా వున్న ఆమె ఇటు తిరిగే సరికి పురుషావతారంలో సాక్షాత్తూ శ్రీహరిగా దర్శనమిచ్చింది.

(ఆశ్చర్యంతో) హరీ! నువ్వా!

విష్ణు: హరదేవా! నేనే! నువ్వే నేను. నేనే నువ్వు ఇది నువ్వు కోరిన ముచ్చట. అలగబోకు. శివుడు విశాలంగా విరగబడి నవ్వాడు. విష్ణువు కూడా నవ్వాడు.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*
***
(సశేషం)

No comments:

Post a Comment