*మార్గదర్శకులు మహర్షులు -11*
🪷
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
*కశ్యపప్రజాపతి -2*
గరుత్మంతుడు పుట్టిన తరువాత తల్లికి దాస్యవిముక్తి చేయాలని ఎంతో తాపత్రయ పడ్డాడు. ఎవరికైనా దాస్యంచేయవచ్చు కానీ, సవతిదాస్యం మరీ ఘోరం. సపత్నికి తనతో సమానమైన పత్నికి వినత దాస్యం చేయవలసివచ్చి దుఃఖంలో ఉంది. తల్లి దాస్యవిముక్తికై తనకు బలమైన ఆహారం కావాలన్నాడు గరుత్మంతుడు. సృష్టిలో ఇంద్రుడికంటే మరి వెయ్యింతల బలం కలిగినవాడు కదా! అందునా పక్షిరూపంలో ఉన్నాడు. సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి అన్నిటినీ భక్షించాడు. అయినా ఆకలి తీరలేదు.
కశ్యపమహర్షి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి "తండ్రీ! నాకు ఆహారం ఏమిటి?" అని అడిగాడు. ఆయన గరుత్మంతుడికి
"పశ్చిమాద్రి దగ్గరికి వెళ్ళు. నీకు అక్కడ రెండు జంతువులు బలమైనటువంటివి కనబడతాయి. వాటిలో ఒకటి తాబేలు, రెండవది ఏనుగు. అవి ఒకదానినొకటి జయించే కోరికతో వందలాది సంవత్సరా లుగా పోరాడుతున్నాయి. వాటి యుద్ధానికి భయపడి చుట్టుపక్కల జంతువులు, మనుష్యులు భీతావహులై ఉన్నారు. నీ ఆకలి తీరాలంటే వాటిని తిను. వాళ్ళు పూర్వం విభావసుడు, సుప్రతీకుడు అనేటటువంటి బ్రాహ్మణులు. మాత్సర్యంచేత కలహించుకుంటున్నారు. వాళ్ళు గొప్పదనం కోసం కలహించు కుంటున్నారు. పాండిత్యము, యోగము, తపస్సు కలిగి కూడా, మాత్సర్యంతో కలహించుకోవటంచేత వాళ్ళిద్దరూ చచ్చి, తరువాత గజకచ్ఛపాలై పుట్టారు” అని చెప్పాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
తండ్రి ఆనతి ప్రకారం గరుత్మంతుడు అలంబతీర్థమనే ఆ ప్రదేశానికి వెళ్ళి, ఎత్తుగా ఉన్న రౌహిణమనే పెద్ద చెట్టు మీదికెళ్ళి, దాని కొమ్మపై వాలి, వాళ్ళు ఎక్కడ కనబడతారో అని అడవి అంతా కలయచూచాడు. అది చాలా పెద్ద చెట్టే, బలంగా ఉన్నదే! కాని గరుత్మంతుడు చాలా బలమైన పక్షి కావడంతో, పైగా అంతకుముందే జలచరాలనన్నిటినీ భక్షించి ఉండడంతో, ఆయన బరువుకు ఆ చెట్టుకొమ్మ ఫెళఫెళమని విరిగింది. ఆ కొమ్మను ఆధారంగా చేసుకొని వాలఖిల్యా దులు తలక్రిందులుగా వ్రేలాడుతూ (భూస్పర్శ లేకుండా) తపస్సు చేసుకుంటు న్నారు! కొమ్మ కింద పడిపోతే వాళ్ళకు దెబ్బలు తగులుతాయి. వాళ్ళ తపస్సుకు భంగం కలుగుతుంది. అది తనకు పాపం. అలాకాకుండా ఆ విరిగిపోయిన కొమ్మను నోటితో పట్టుకొని జాగ్రత్తగా వాళ్ళకు ఏమీ భంగం కలగకుండా ఈ గజకచ్ఛపాలను రెండింటినీ, తన రెక్కలలో ఇరికించుకుని తండ్రి తపస్సు చేస్తున్న గంధమాదన పర్వతానికివెళ్ళి తండ్రికి నమస్కరించాడు. అతడి బలం అంతటిది! తండ్రిని, “వీళ్ళను ఏంచెయ్యమంటావు?” అని అడిగాడు.
కశ్యపుడు సంగతి గ్రహించి, వాలఖిల్యాదు లకు నమస్కరించి, అసలు విషయాన్ని వాళ్ళకు తెలిపాడు. “మిమ్మల్ని ఏదో చెయ్యాలనే ఉద్దేశ్యం ఆతడికి లేదు. అతని బరువుకు ఆ కొమ్మ విరిగిపోయింది. మీరు మరోలా భావించకుండా మరోచోటికి వెళ్ళి తపస్సు చేసుకోండి!" అని వాళ్ళను ప్రార్థించి, ప్రసన్నులను చేసుకున్నాడు. వాళ్ళు శాంతించి హిమవత్పర్వతాలకు వెళ్ళిపోయారు.
📖
నిష్పురుషపర్వతమనేచోట ఆ వృక్షశాఖను వదిలిపెట్టమన్నాడు గరుత్మంతుడితో
కశ్యపుడు. అతడు అలాగే చేసి ఆ గజ కచ్ఛపములను హిమవత్పర్వత ప్రాంతాల కి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరినీ సావకాశంగా భక్షించాడు. ఆ తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు మహాబలపరాక్రమాలతో! అక్కడి నుంచీ ఇంద్రుడిని జయించి అమృతాన్ని తీసుకొచ్చి తన సవతి తల్లి అయినటు వంటి కద్రువకిచ్చాడు. ఆమె ప్రసన్నురాలై తన తల్లికి దాస్యవిమోచనాన్ని ప్రసాదించింది. భారతంలోని ఆదిపర్వము లోనిది ఈ గాథ.
📖
ఒకప్పుడు 'పరశురాముడు' క్షత్రియులను చంపటానికి ఇరవై ఒక్కమార్లు భూ ప్రదక్షిణం చేసాడు. ఏ క్షేత్రాలు చూడటానికీ కాదు. వాళ్ళను చంపటానికి! ఆయనకు క్షత్రియులంటే అంతకోపం! అంతా అయిన తరువాత ఆయనకు పాపం మాట జ్ఞాపకం వచ్చింది. "వాళ్ళు నన్ను ఎదిరించలేదు. పారిపోతున్న క్షత్రియులను కూడా నేను చంపేసాను. నేను బ్రహ్మణుడిని కదా!" అని అనుకొని, పాపక్షయం కోసమని పరశు రాముడు అశ్వమేధయాగం చేసాడు. ఈ రాజవంశాలనన్నిటినీ నిర్మూలన చేసిన తరవాత, ఆ రాజులను చంపిన తరువాత, భూమిమీది రాజ్యాలన్నీ పరశురాముడివే! ఏం చేసుకుంటాడు! ఆ భోగాలు, సుఖాలు అక్కరలేదు ఆయనకు. అందుకని, అశ్వమేధయాగం చేసిన తరువాత, కశ్యప మహర్షిని పిలిచి ఈ భూమినంతా ఆయనకు దానంచేసాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
లోకానుగ్రహం కోసమని కశ్యపమహర్షి పరశురాముడు చేసిన భూదానాన్ని పరిగ్రహించి, "పరశురామా! ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్షత్రియ వంశాలు పుట్టి పెరగాలి. కానీ అప్పుడు నీ ప్రతిజ్ఞ ప్రకారం మళ్ళీ వాళ్ళని నీవ్వు చంపవలసివస్తుంది. కాబట్టి నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళు. భూమండలాన్నంతా నాకిచ్చేసావు కదా! అందుకని ఈ భూమి అంతా ఇప్పుడు నాదే! దీన్ని వదిలేసి వెళ్ళిపో! దక్షిణదేశ సముద్రము వైపుకు వెళ్ళిపో! అక్కడికి వెళ్ళి సముద్రుడిని యాచించు! ఆయన నీవు నివసించటానికి ఒక చేట అంత భూమినిస్తాడు. శూర్పాకార ప్రదేశము (చేట ఆకారంలో ఉండే భూమి) నువ్వు పొందుతావు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఉండు" అని చెప్పాడు.
ఆ కారణంచేతనే పరశురాముడు ఆ తరువాత దక్షిణభారతదేశంలోని కేరళకు వచ్చాడని పురాణములలో విశ్వసించ బడుతున్నది. దక్షిణాపథమంతా కూడా, తూర్పు పశ్చిమ సముద్రాలు రెంటితోకలిపి ఒకమాటు చూస్తే, త్రికోణంగా - చేట ఆకారంగా ఉంటుంది. అక్కడ ఉండమని చెప్పి, అది సముద్రుడు ఆయనకిచ్చాడు.
📖
భూమికి కాశ్యపి అనే పేరొచ్చింది. 'కాశ్యపేనాభి మంత్రితా కాశ్య పేర్నాం భూమిర్నాం భూమికా!' - 'భూసూక్తం'లో 'కాశ్యపేనాభి మంత్రితా' అని ఉంటుంది. కశ్యప ప్రజాపతిచేత ఇది మళ్ళీ సంతాన వంతమయింది. భూమి యందు కశ్యప ప్రజాపతి సంతానంచేత - అనుగ్రహంచేత మళ్ళీ రాజవంశాలు పుట్టాయి. ప్రాణికోటి పెరిగింది. ప్రజలందరూ వృద్ధిచెంది, మళ్ళీ నాగరికత బాగా పెరిగింది.
(ఈ విధంగానే -
కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ॥
అని శ్రీ సూక్తంలో చదువుతాం. 'కర్దమేన ప్రజాభూతా' అంటే, భూలక్ష్మి అని అర్థం అక్కడ. ఆ వాక్యం, శ్రీమహాలక్ష్మీ స్తోత్రంలో మనం చెప్పేవన్నీ కూడా విష్ణుపత్ని అయిన లక్ష్మికి మాత్రమే అన్వయంకావు. 'కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ' - అంటే ఈ కర్దమ ప్రజాపతి చేత ప్రజాభూత అయింది. 'ప్రజాభూత' అంటే సంతాన వంతురాలయింది అని అర్థం. భూలక్ష్మి అంటాం దానిని).
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment