Thursday, October 9, 2025

 244 వ భాగం 
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 32 

తత్వం యదార్థ మాకర్ణ్య మందః ప్రాప్నోతి మూడతామ్|
అథవా$యాతి సంకోచ మముడః కో$పి మూడవత్||

తెలివిహీనుడు తత్వసారాన్ని విని సందేహాస్పదుడు అవుతాడు. బుద్ధిమంతుడు తత్వ జ్ఞాన సారాన్ని గ్రహించి అంతర్దృష్టితో అంతర్ముఖుడై సత్యాన్ని దర్శించి బాహ్యంగా మూడునివలే కనిపిస్తాడు.

సునిశితము తీక్షణము అయిన బుద్ధితో సుశిక్షితమైన ధ్యానానుకూల మానసంతో అంతర్దృష్టితో తన వ్యక్తిత్వాన్ని విమర్శించి చూసుకో గల నేర్పు సాధకునికి అత్యంత అవసరం. అట్టి సత్యాన్వేషి మాత్రమే శాస్త్ర హృదయ గత భావాన్ని అర్థం చేసుకొని సత్, చిత్ ఆనంద రూపమైన ఆత్మానుభవాన్ని పొందగలుగుతాడు. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అతి సూక్ష్మమైన గణిత శాస్త్ర విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలతో బోధిస్తే అర్థం చేసుకోలేక అయోమయ అవస్థలో పడిపోతాడు. అదే విద్యార్థి క్రమంగా విజ్ఞాన శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ పట్టభద్రుడైన తర్వాత అతనికి ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని బోధిస్తే ఎంతో చక్కగా అవగాహన చేసుకోగలుగుతాడు.

"మందః" తెలివి తక్కువ వారు... ఆలోచన శక్తినంతటిని ఇంద్రియసుఖభోగాల కోసమే వ్యయం చేయడముతో గంభీరమైన తాత్విక విషయాలను అర్థం చేసుకోలేని వాడని అర్థం. అట్టివానికి అద్వయమైన ఆత్మ తత్వపు అనంత తత్వాన్ని బోధిస్తే అర్థం కాక అయోమయ అవస్థలో పడిపోతాడు.

అధికారి అర్హుడు అయిన సత్యాన్వేషికి ఇదే తత్వాన్ని సమర్ధుడైన గురువు బోధిస్తే వెంటనే అర్థం చేసుకొని అంతర్ముకుడై అనంత శాంతి స్వరూపమైన ఆత్మను తానుగా తెలుసుకోగలుగుతాడు. బాహ్య చలనము ఆగిపోగా అంతర్ముకుడైన అట్టివానిని ప్రాపంచిక దృష్టి గల ప్రజలు మూడునిగా తలపోస్తారు. పరుగు పందెము వంటి జీవితములో సంపదలను సంపాదిస్తూ వ్యయప్రయాసలతో వస్తువులను సేకరిస్తూ ఉద్వేగాలతో ఉద్విఘ్నుడు అవుతూ ప్రాపంచిక భోగాల వెంట పిచ్చి పరుగులు తీస్తూ రాగద్వేషాల కష్టసుఖాల సుఖదుఃఖాల మధ్య నలిగిపోతూ జీవించేవాడే సాధారణంగా ప్రజ్ఞావంతుడిగా గుర్తింపబడుతాడు.

అష్టావక్ర మహర్షి ఇక్కడ మూఢుని వలె అని వాడుతున్నారు .నిజంగా మూఢుడు కాదు .అయినా అలా కనిపించేవాడని అర్థం. మూడుడు ఏ పనిని సమర్థవంతంగా చేయలేదడు,అయినా అతనిలో అనేక కోరికలు నిత్యము ఉద్భవిస్తూ అతనిని నిత్యం అశాంతికి లోను చేస్తుంటాయి. జ్ఞాని కూడా మూడుని వలనే కర్మలను చేయకుండా ఉన్నప్పటికీ అతను మనసు మాత్రం నిత్య శాంతి పూర్ణంగా కోరికలు లేకుండా ఉంటుంది.

వేదాంత వీధులలో అడుగుపెట్టడానికి కావలసిన అర్హతలను చర్చిస్తూ యోగ వాశిష్టం హస్యంగా ఇలా అంటుంది. 

స్థూల శరీరఅభిమానులయి,  స్వేచ్ఛాచారులయి, ఉద్వేగాలతో సుఖభోగాలలో మునిగిపోయిన వారికి జీవామృతం అనదగిన ఆత్మ విద్యను బోధించడం ఎలాగో తెలియడం లేదు. తెలివిహీనత అనే అలంకారముతో బాసించే స్త్రీల నుండే వారిని నేర్చుకోనిద్దాము.🙏🙏🙏  

No comments:

Post a Comment