258వ భాగం
🕉️అష్టావక్రగీత🕉️
అధ్యాయము 18
శ్లోకం 46
నిర్వాసనం హరిం దృష్ట్యా
తూష్టీం విషయదంతినః|
పలాయంతే న శక్తాస్తే సేవంతే కృతచాటవః||
వాసనా రహితుడైన పురుష సింహుని చూసి విషయాలను బడే మదగజములు పారిపోతాయి. పారిపోలేకపోతే విధేయులైన సేవకుల వలె సేవిస్తాయి.
జీవన్ముక్తుని గొప్పదనం ఇక్కడ వర్ణింపబడుతుంది .విషయాల మధ్య జీవిస్తున్న అవి అతనిని బాధింపజాలవు. అంతేకాక మహారాజును సేవించే సేవకుల వలె భక్తి గౌరవాలతో సేవిస్తాయి అని మహర్షి అంటున్నారు.
మన బుద్ధిలో ఉన్న వాసనల వ్యక్త రూపమే కోరికలు. వాసనారహితులైన వానికి కోరికలు ఉండవు. ఆ భయ భోగాలను అనుభవించాలనే మనలోని కోరికే మనలను విషయాలకు బానిసలను చేస్తుంది. కోరికలు లేని వ్యక్తి ముందు విషయాలు ఉన్న అవి అతనిని వశపరచుకోలేవు. బొమ్మల దుకాణంలో ఉన్న పిల్లవాడు వచ్చే ఉత్సాహ ఉద్రేకాలకు లోన అవడం మనకు తెలిసిందే. అతని తండ్రి మాత్రమే నిర్వీకారంగా ఉంటాడు. ఇద్దరి చుట్టూ అనేక ఆట వస్తువులు ఉండటం నిజమే .అయితే బాలునికి మాత్రమే కోరిక ఉండటముతో అవి బాలుని మనసుతో ఆడగలుగుతాయి. అతని తండ్రిలో వాటికి సంబంధించిన వాసనలు లేకపోవడంతో నిర్వీకారంగా ఉండగలుగుతాడు.
వాసనారహితులైన జీవన్ముక్తుల్లో కోరికలు ఉండవు. కాబట్టి ప్రాపంచిక విషయాలు అతనిని ఆకర్షించే బాధించవు. బంధించవు. తపోనిష్టా గర్విష్టులైన వయోవృద్ధులైన ఎందరోమునులు దేవేంద్రుడు పంపిన అప్సరసల రూప వయోవిలాసాలకు మోహపడి తపస్సును వీడి మాయాజాలంలో చిక్కుకున్న సంఘటనలను మనం పురాణాలలో అనేక చోట్ల చూడవచ్చు. అదే కైలాసపతి ముందు సాక్షాత్తు ఇంద్రాణి వచ్చి నాట్యం చేసిన అతనిలో ఎటువంటి చలనము ఉండదు. యోగనిష్టలో తపోదీక్షలో అణచిపెట్టబడిన కోరికలు అవకాశం వస్తే విజృంభిస్తాయి. జ్ఞానముతో కోరికల యొక్క మూలాన్ని వాటి ప్రభావాన్ని బాగా తెలుసుకొని కోరికల నుండి ముక్తిని పొందిన వానిని విషయాలు ఎన్నైనా ఏవైనా ఆకర్షించవు,బాధించవు.
కోరికలతో నిండిన మనసును మాత్రమే ప్రాపంచిక విషయాలు ఆకర్షిస్తాయి. కోరికలు లేని జ్ఞాని మదగజ సమమైన ఇంద్రియ భోగ్య విషయాల మధ్య సింహం వలె ధీరుడే చరిస్తూ ఉంటాడు. ఏనుగులు చాలా బలమైన జంతువులే అయినప్పటికీ మృగరాజు అయిన సింహాన్ని అవి ఏమి చేయలేవు. అలాగే విషయాలు ఎంత సుందర రమనీయాలు అయినా కోరికలు లేని జ్ఞానిని ఏమీ చేయలేవని మహర్షి అంటున్నారు. భగవద్గీత కూడా ఇదే భావాన్ని సూచిస్తుంది.
విరాగి అయిన యోగి విషయ భోగాలు ఆకర్షించలేక తిరిగిపోతాయి. ఇట్టి విరాగిలో కోరికలు లేకపోయినా విషయాలకు స్పందించే గుణము మాత్రం మిగిలి ఉంటుంది. ఆత్మా అనుభవముతో అది కూడా అంతరిస్తుంది.
ఈ భావానికి తోడుగా మహర్షి మరొక్క భావాన్ని కూడా చెబుతున్నారు .ఈ విధంగా విషయాలు తొలగిపోకపోయినా వాసనరహితులైన మహాత్ముని, విశ్వాసము గల బటులు రాజును సేవించినట్లుగా సేవిస్తూ లొంగి ఉంటాయి.🙏🙏🙏
No comments:
Post a Comment