Friday, October 24, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-184.
256d3;2410e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣8️⃣4️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                   *భగవద్గీత*
                  ➖➖➖✍️```
       (సరళమైన తెలుగులో)```


*7. విజ్ఞాన యోగము.*
(ఏడవ అధ్యాయము)
_________________________
*5. వ శ్లోకము:*

*అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।*
*జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥5॥*

“అర్జునా! ఈ ఎనిమిది విధములైన అపరమైన ప్రకృతి కంటే భిన్నమైనది, ఈ సమస్త విశ్వమును తనలో ధరించి ఉన్నది, సమస్త ప్రాణికోటిలో జీవంగా వెలుగుతున్నది అయిన మరొక ప్రకృతి ఉన్నది. అది నా యొక్క ప్రకృతి. 
ఈ ప్రకృతిని, పైన చెప్పబడిన ఎనిమిది విధములైన అపరా ప్రకృతి కంటే మేలైనదిగా తెలుసుకో.” 
```
ఈ శ్లోకంలో పరమాత్మ,  భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనోబుద్ధి అహంకారాలు ఈ ఎనిమిదితో కూడినది అపరా ప్రకృతి అనీ, వీటన్నిటి కంటే భిన్న మైనది, శ్రేష్టమైనది, పరమైనది అయిన పరమాత్మ ప్రకృతి మరొకటి ఉంది. దానినే పరా ప్రకృతి అనీ తెలుసుకోమంటున్నాడు. 
ఈ పరాప్రకృతి ఈ జగత్తుకు ఆధారంగా ఉంటూ ఉంది. ఈ జగత్తును చైతన్యవంతం చేస్తూ ఉంది. ఈ జగత్తులో ఉండే జీవరాసులు అన్నిటిలో జీవరూపంగా ఉంది. అందుకే ఈ పరాప్రకృతి అపరాప్రకృతి కంటే శ్రేష్టమైనది అని పరమాత్మ చెప్పాడు.

అపరా ప్రకృతి అంటే పంచభూతాలు, మనో, బుద్ధి, అహంకారాలు. ఇవి నిరంతరం మార్పు చెందుతుంటాయి. మార్పు వీటి సహజ లక్షణము. కాని ఈ ఎనిమిది ఇలా నిరంతరం మార్పుచెందుతున్నాయి అని తెలుసుకునేది వేరొకటి ఉండాలి కదా.    అప్పుడే కదా ఇవి మార్పుచెందుతున్నాయి అని తెలిసేది. పైగా అది మార్పు లేనిది, మార్పు చెందనిది అయి ఉండాలి. దానినే పరాప్రకృతి అని అంటారు. పరా ప్రకృతి అంటే సకల జీవరాసులలో వెలుగుతున్న ఆత్మస్వరూపము. ఈ పరాప్రకృతి, అపరా ప్రకృతి కంటే భినమైనది, బలమైనది, శ్రేష్టమైనది. మార్పుచెందనిది. కనిపించే ఈ అపరా ప్రకృతి కన్నా ఈ పరాప్రకృతి గొప్పది అని తెలుసుకో.

సులభంగా చెప్పాలంటే నేను పరాప్రకృతి. పంచ భూతాత్మకము అయిన నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నాలో ఉన్న అహంకారము అన్నీ అపరా ప్రకృతి. సాధారణంగా మనం అందరం "నా శరీరము, నా మనస్సు నా బుద్ధి" అని వాడుతూ ఉంటాము. "నా మనస్సు చికాకుగా ఉంది. నా బుద్ధి పనిచేయడం లేదు. నా శరీరం నా మాట వినడం లేదు" అని అంటూ ఉంటాము. అంటే నీవు వేరు, నీ మనో బుద్ధి అహంకారాలతో కూడిన శరీరం వేరు. నీ మనసు నీ మాట వినండలేదు. నీ శరీరం నలతగా ఉంది అనే విషయం తెలుసుకునే వాడు వేరొకడు ఉన్నాడు. ఆ "నేను" అనే తత్వమే పరాప్రకృతి. దీనికి కాలము, రూపము లేదు. నీవు 10 ఏళ్లప్పుడు ఈ "నేను" అనే తత్వము ఉంది. నీవు 40 ఏళ్లప్పుడు ఉంది. 70 ఏళ్లప్పుడు ఉంది. వయసు వచ్చేకొద్దీ కాలాను గుణంగా నీ శరీరం మార్పుచెందిందే కానీ, నీలో ఉన్న "నేను" అనే తత్వము మార్పు చెందలేదు. ఈ విషయం మనందరికీ తెలుసు, కానీ మనం దానిని అంగీకరించము.

చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఒక కుండ ఉంది. అందులో నీరు ఉంది. ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలిస్తున్నాడు. ఇప్పుడు కుండ దేహము. అందులో ఉన్న జలము మనస్సు, అందులో ప్రతిఫలించే సూర్యుడు ఆత్మ. ఆకాశంలో వెలిగే సూర్యుడు పరమాత్మ. కుండ, నీరు, అపరాప్రకృతి. అందులో ప్రతిఫలించే సూర్యబింబము పరాప్రకృతి. అయితే ఆకాశంలో వెలిగే సూర్యుడు, పురుషుడు, భగవానుడు, పరమాత్మ. సూర్యుడు ఎలాగైతే కుండలో ఉన్న నీటితో సంయోగం చెంది ప్రతిఫలిస్తున్నాడో, అలాగే పరమ ఆత్మ కూడా ఈ దేహములో ఆత్మస్వరూపంగా చేరి, మనసుతో కూడి, ప్రాపంచిక విషయములలో సూర్య బింబము ప్రతిఫలించినట్టు తేలియాడుతూ ఉంది. నీరు కదిలినపుడు సూర్యబింబము కూడా కదులుతూ ఉంది. కుండను ఆడించినప్పుడు నీరు, అందులో ఉన్న సూర్యబింబము తదనుగుణంగా ఆడుతూ ఉంది. కాని ఈ కదలికలు సూర్యునివి కావు. కేవలం జలం కదులుతుంటే అందులో ఉన్న ప్రతిబింబం కదులుతున్నట్టు మనకు అనిపిస్తూఉంది. అది మన భ్రమ. ఆభాస. కాని బింబం నిజంగా కదలడం లేదు. ఎందుకంటే జలం నిశ్చలంగా ఉంటే సూర్య ప్రతి బింబం కూడా నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన మనసు ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలంగా ఉంటే మనకు నిశ్చలము, నిర్వికారము అయిన ఆత్మదర్శనం కలుగుతుంది. కాబట్టి మోక్షము కోరువాడు ఈ రెండు ప్రకృతులను దాటి ఆత్మస్వరూపుడైన పరమాత్మ కొరకు ప్రయత్నం చేయాలి.
```

*6. వ శ్లోకము:*

*ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।*
*అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥6 ॥*

“ఈ చర అచర జగత్తు అంతా ఈ పరాప్రకృతి, అపరా ప్రకృతితో కూడి ఉన్నాయి అని తెలుసుకో. ఈ చరాచర జగత్తు ఉత్పత్తి కావడానికి కారణం నేనే, అదే ప్రకారంగా ఈ చరాచర జగత్తు యొక్క ప్రళయానికి కూడా కారణం నేనే.”
```
ఇది వరకు చెప్పిన సూక్ష్మరూపంలో ఉన్న పంచభూతాలు పరిణామ క్రమంలో స్థూల రూపం ధరించాయి. అవే మనం చూచే ప్రకృతిలో ఉన్న కదలనివి, కదిలేవి అనే పదార్థాలు. వాటినే జడములు, చేతనములు అని అంటారు. ఈ జడ, చేతనములు అన్నిటికీ పరా ప్రకృతి, అపరా ప్రకృతి కారణము. అంటే పరమాత్మ తాను రెండుగా విడిపోయాడు. అవే పరా ప్రకృతి, అపరా ప్రకృతి. ఈ రెండు ప్రకృతులే ఈ సృష్టికి కారణము. అంటే ఈ సృష్టికి కారణభూతుడు పరమాత్మ. సమస్త జీవ జాతులు ఆ పరమాత్మ నుండి ఉద్భవించాయి. అలాగే ఈ సృష్టిని అంతమొందించేది పరమాత్మ.  బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివుడుగా లయం చేస్తున్నాడు. పుట్టడం చావడం... ఈ మధ్య కాలంలో జీవజాతులు అన్నీ ప్రకృతిలో ఆడుకుంటున్నారు. సముద్రంలో అలలు ఉవ్పెత్తున ఎగిసి పడుతుంటాయి. ఒక అల చాలా ఎత్తుగా లేస్తుంది. మరొకటి చిన్నగా ఉంటుంది. ఆ అలలు కాసేపు ఉంటాయి. మరలా సముద్రంలో కలిసి పోతాయి. మరలా ఉవ్వెత్తున లేస్తాయి. కొంతసేపు ఉంటాయి. మరలా సముద్రంలో లీనం అవుతాయి. అలాగే జీవజాతులు కూడా పుడతాయి, కొంతకాలం జీవిస్తాయి, మరలా లయం అవుతాయి. ఇదే జీవన నాటకము. ఈ నాటకానికి సూత్రధారి పరమాత్మ.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment