*డేటా సెంటర్లపై అక్కడ తీవ్ర వ్యతిరేకత*
అమెరికా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి మూయించేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు వదిలించుకోవాలని ఎన్రాన్ లాంటి కంపెనీలు తిన్నగా ఎక్కడకి వెళ్తాయో తెలుసా? మనలాంటి బీద దేశాలలో దేశంపట్ల ప్రేమ, విజన్ లేని నాయకులను పట్టుకుంటారు. అయితే ఏ పార్టీ జెండా పెట్టుకోకుండా ఇక్కడి ప్రజలు సాగించిన ప్రజాపోరాటాల వల్ల మన సోంపేట, కాకరాపల్లితో సహా ఎక్కడా ప్రభుత్వాల ఆటలు సాగలేదు. ఇప్పుడు మళ్లీ కథ మొదటికొచ్చింది. ఈసారి డేటా సెంటర్ల రూపంలో. ప్రజలను ప్రమత్తం చేయడానికి అప్పటిలా బాలగోపాల్ లేరు. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగి, ప్రజలకు పరిస్థితులు వివరించేంత సంయమనం ఉన్న ఉద్యమకారులూ కరువయ్యారు. బైపోలార్ గా మారిన పొలిటికల్ సినారియోలో ఏదో ఒక పార్టీని చంకన పెట్టుకుని, పాపం.. ఆ పార్టీ అధినేత తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా విధిలేని పరిస్థితులలో సమర్ధించాల్సి రావడం ప్రస్తుత విషాద వాస్తవం.
మన 'చదువుకున్న నిరక్షరాస్యులు' తెలుసుకుని ఆలోచించవలసిన గొప్ప అంశాన్ని Ramesh Adusumilli చెప్తున్నారు. ఓపిగ్గా చదివి, మీ వ్యాఖ్యను జోడించి మీ సోషల్ మీడియా లో చేర్చండి.
యూరోప్ లోని ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాలు.
ఐర్లాండ్ లో డేటా సెంటర్ పెట్టాలని గూగుల్ ప్రయత్నం చేయగా, మా దేశ ప్రజలంతా కలిసి వాడేంత పవర్ ఒక్క మీ డేటా సెంటర్ కే ఇవ్వాలి, మా దేశంలో మీ డేటా సెంటర్ వద్దు అని తిరస్కరించింది ఐర్లాండ్ ప్రభుత్వం.
నెదర్లాండ్స్ లో డేటా సెంటర్ పెట్టాలని మె టా ప్రయత్నం చేయగా, ఆక్కడి ప్రజలు వ్యతిరేకించటంతో వారి అప్లికేషన్ ను తిరస్కరించింది నెదర్లాండ్స్ ప్రభుత్వం. అంతేకాదు, దేశంలో పెద్ద డేటా సెంటర్లు పెట్టటానికి వీలు లేదు అని ఏకంగా చట్టమే చేసింది.
డెన్మార్క్ కూడా పెద్ద డేటా సెంటర్లు పెట్టటం వలన పవర్ గ్రిడ్లు దెబ్బతినటం తప్ప ఉపయోగం తక్కువ అని అనుమతులు ఇవ్వటం లేదు.
ఇక గూగుల్ లాటిన్ అమెరికా దేశాలైన చిలీ,ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో డేటా సెంటర్ పెట్టాలని ప్రయత్నించింది. ఎలాగోలా ఆ ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ అక్కడి ప్రజలు, పర్యావరణవేత్తలు నిరసన వ్యక్తం చేయటంతో ఈ పెద్ద కంపెనీలు ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నాయి.
ఇక అమెరికాలో డేటా సెంటర్ హబ్ గా పేరొందిన రాష్ట్రం వర్జీనియా. పవర్ గ్రిడ్ మీద పడే లోడు, పెరిగిన కరెంట్ బిల్లులు, వాటి నుంచి నిరంతరం వచ్చే ఎమిషన్స్, శబ్దాలు, విపరీతమైన నీటి వినియోగం, అవి తీసుకునే వందల ఎకరాల భూమి, ఇవన్నీ గమనించాక వాటిలో వచ్చే ఉద్యోగాల కన్నా నష్టపోయేది ఎక్కువ అని గ్రహించిన అక్కడి ప్రజలు NIMBY (Not In My BackYard) అంటూ వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు అయినా వాటికి మద్దతుగా మాట్లాడితే అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు. చెప్పులు, గుడ్డలు కూడా ఇక్కడే తయారు చేయాలని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేయటానికి వీలు లేదని రోజూ గొడవ చేసే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు కూడా వీటి విషయంలో మాత్రం ఏమీ అనటం లేదు.
ఆ దేశాల్లో అవసరాన్ని మించి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంటే power surplus ఉన్న దేశాలు అవి. మన మీద నీటి వనరులు ఎక్కువ. అయినా సరే డేటా సెంటర్లు పెట్టటానికి ఒప్పుకోక పోవటంతో ఈ పెద్ద కంపెనీలు సముద్రం ఒడ్డున ఉండే third world దేశాల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ e-waste ను ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో డంప్ చేస్తూ ఉంటాయి. కొంచెం అటుఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివే! ఇక్కడ విషాదం ఏమిటంటే మన ప్రభుత్వాలు వారు అడగని బెనిఫిట్లు కూడా ఇచ్చి, లాభనష్టాలు బేరీజు వేసే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా వాటికి ఎర్ర తివాచీ పరవటం!!
No comments:
Post a Comment