Tuesday, June 9, 2020

'నేను’లో ఏముంది?

'నేను’లో ఏముంది?

కొన్ని అవయవాల సమూహం కాదు నేను అనేది. నిజానికి ‘నేను’ సర్వేంద్రియాలకు, మనసుకు అధిష్ఠానమైన, మూలమైన ప్రేరకమైన ఆత్మకు పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. ఒకటి నడిపించేది, అదే ఆత్మ. రెండోది నడిచేది, అదే శరీరం.

ప్రపంచంలో మనకు తరచుగా వినిపించే చమత్కార పదం ‘నేను’. ‘నేను’కు అసలైన అర్థం తెలియని వాడు సాధారణంగా, సహజ స్వభావసిద్ధంగా పరుల మాట వినడు. విన్నా విశ్లేషించుకోడు. తన బలహీనతలు గమనించడు. తాను పట్టిన కుందేటికి మూడు కాదు రెండే కాళ్లనేందుకూ సిద్ధపడతాడు. తాను లేకపోతే లోకమే నడవదంటాడు. సత్య, ధర్మ, న్యాయ, సంస్కార విచక్షణ కోల్పోతాడు. నేనంటే తెలుసుకోలేకపోతే ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి.

తపోధనులు, యోగులు, సిద్ధులు, మహర్షులు చెబుతూనే ఉన్నారు- ఈ ‘నేను’ను వదిలించుకొమ్మని. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఘోషిస్తూనే ఉన్నాయి- ఈ ‘నేను’ను మరిచిపొమ్మని. ఈ మాట అహాన్ని, అజ్ఞానాన్ని పెంచి విషవృక్షమై మనిషికి గరళపు నీడనిస్తూ క్షణక్షణం మరణం చూపుతుంటుంది. అదే శాశ్వతమైన తృప్తి, సుఖం అన్న భ్రమలో పడిపోతూంటాడు మనిషి. స్వార్థానికి బానిసైపోతాడు.

‘నీవు ఒక వ్యక్తిననుకుంటున్నావు. నీవోచోట, ప్రపంచం ఓచోట, దేవుడు మరోచోట ఉన్నారనుకోవడం భ్రమ. నిజానికి ఈ మూడూ ఒకటే. ఆ అనుభూతిని పొందటమే అద్వైత సిద్ధి’ అంటారు రమణమహర్షి. ‘నేను’ అనే తలపు ఎక్కడినుంచి పుడుతుందో, అక్కడ దృష్టిపెడితే పలుకుతున్నవాడు పట్టుపడతాడు, అదే నీవు. అతణ్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం’ అంటారాయన.

‘కలడు కలండనెడివాడు కలడోలేడో’ అన్న ద్వంద్వస్థితే జీవ రసాయనాల అసమతుల్యతకు కారణం. ద్వైత స్థితి నుంచి అద్వైతస్థితి దిశగా శ్వాసమీద ధ్యాస అనే తొలిమెట్టు ఎక్కి- అనుభూతి, అన్వేషణ, జ్ఞానం, విశ్లేషణ లాంటి మెట్లెక్కుతూ ‘ఆత్మజ్యోతి’ అనే దివ్య, రమ్య భవ్యసౌధానికి చేరుకోవాలి. భగవంతుడు విశ్వవ్యాపకుడైనప్పుడు, ఆ ప్రగాఢ విశ్వాసానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తరవాత ఇంకా నువ్వేమిటి, నేనేమిటి... అంతా ఒకటే కదా... అదే కదా ‘త్వమేవాహం’ అంటే! నీ హృదయాంతరాల్లో సర్వదా ప్రకాశించే అంతర్‌ జ్యోతిని దర్శించి తరించమంటోంది యోగశాస్త్రం. అప్పుడే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, మూర్ఖత్వం అనే క్లేశాలను వదిలే వీలుంటుంది అంటుంది దేవీభాగవతం. నేను నుంచి మనం వైపు, మనం నుంచి మననం వైపు, మననం నుంచి మోక్ష భవనం వైపు ప్రస్థానం చేయడమే సాధకుడి పరమావధి.

పోతన అన్నది అందుకే- పలికెడిది భాగవతమట అని! తాను రాస్తున్నానని చెప్పలేదు. అదే భక్తి జ్ఞాన వైరాగ్య కల్పవృక్షానికి పడిన మహాబీజం. ఇహంతో ఇవాళ ప్రవహిస్తున్నది ‘అహం’ అనే హాలాహలం. అది అమృతజలంగా మారితే లోకమే కల్యాణమందిరమవుతుంది. ‘నీవు నిమిత్తమాత్రుడివి. కర్మచెయ్యి, ఫలితం నాకు వదిలెయ్యి’ అంటూ గీతాబోధ చేసి అర్జునుణ్ని చైతన్యవంతుణ్ని చేసిన వాసుదేవుడి ఉపదేశ రహస్యం కూడా ఇదే! ‘నేను’ అన్నది ఆత్మస్వరూపమని అంతర్‌దృష్టితో చూసేవారికే అవగతమవుతుంది. అంతర్ముఖీనమైన మనసుకే ‘నేతి’ ‘నేతి’ (ఇదికాదు) అన్న భావనకు గల తాత్పర్యం బోధపడుతుంది. ‘అహం బ్రహ్మాస్మి’ (నేనే భగవంతుణ్ని) అన్న సత్యం గ్రాహ్యమవుతుంది. పశుత్వం నుంచి శివత్వంవైపు జరిగే పవిత్ర యాత్రకు ‘అందరికీ శుభమగుగాక’ మూల భావనే భారతీయ సంస్కృతి నినాదమైంది.

No comments:

Post a Comment