Sunday, July 12, 2020

అన్నతమ్ముల అనుబంధం

అన్నతమ్ముల అనుబంధం

🦅 పూర్వకాలంలో సంపాతి, జటాయువు అనే పక్షి రాజులు ఉండేవారు.

వారిద్దరు అన్నదమ్ములు. మహా బలవంతులు.

ఒకసారి అన్నదమ్ములిద్దరికీ వారిద్దరిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలన్న ఉద్దేశం కలిగింది.

కైలాస పర్వతం మీద ఋషుల సమక్షంలో ఒక పోటీ పెట్టుకుని ‘సూర్యుడు అస్తమించేలోపు సూర్యుడి ఎత్తుకి ఎగిరి, తిరిగి రావాలని’ శపథం చేసుకున్నారు.

ఇద్దరూ ఆకాశంలోకి ఎగరడం మొదలుపెట్టారు. గాలిలో ఎగురుతున్న కొద్దీ వారికి అడవులు పచ్చిక బీళ్లులాగా, నదులు దారపు పోగులు లాగా కనిపించాయి.

అంత ఎత్తులోకి ఎగిరిన తరువాత మరింత ఉత్సాహంగా పోటీ పడి ఎగిరారు సంపాతి, జటాయువు.

ఒకసారి తమ్ముడు, మరొకసారి అన్న ‘నువ్వా నేనా’ అన్నట్టు ఎగరడంలో పోటీ పడ్డారు.

సౌరమండలం సమీపించారు. అంత ఎత్తుకి చేరేసరికి వారికి ఆయాసంతో బాటు భయం, మతి చలించడం, దృష్టి చెదరడం, మూర్ఛ రావడం లాంటి లక్షణాలు కలిగాయి.

కానీ వారి ముందున్న లక్ష్యం ముందు ఇవన్నీ చిన్నవై పోయాయి.

ఇద్దరిలోనూ పోటీలో గెలవాలన్న ఆశయం మాత్రమే కళ్ల ముందు కదలాడింది.

దాంతో మరింత ఉత్సాహంగా పోటీ పడుతూ ఎగిరారు.

వారి కళ్లకు సూర్యుడు భూమి సమానమైన ఎత్తులో కనిపించాయి.

సూర్యుడి వేడి కిరణాల తాకిడికి జటాయువుకి స్పృహ తప్పినట్లయింది. ఎగరడంలో పట్టు కోల్పోయాడు. నేల వైపు జారిపోసాగాడు. తమ్ముడి పరిస్థితిని సంపాతి గమనించాడు. సూర్య కిరణాల ధాటికి తమ్ముడి రెక్కలు మాడి మసయ్యే అవకాశం ఉందని పోల్చుకున్నాడు సంపాతి.

అతడిలో ఒకవైపు భయం, మరోవైపు తమ్ముడి మీద ప్రేమ కలిగాయి.

ఎలాగైనా తమ్ముని రక్షించాలని జటాయువు కంటే ఎత్తుకి ఎగిరి సూర్యుడుకి తమ్ముడికి మధ్య తన రెక్కలు పరిచాడు.

తమ్ముడిని రక్షించే ప్రయత్నంలో సంపాతి రెక్కలు రెండూ మాడి మసయ్యాయి. జటాయువుకి ప్రమాదం తప్పింది. రెక్కలు లేని సంపాతి మరో దిక్కున గాలికి కొట్టుకుపోయి వింధ్య పర్వతం మీద పడ్డాడు.

తరువాత కాలంలో సీతాదేవిని అపహరించి పుష్పక విమానంలో వెళుతున్న రావణుణ్ణి ఎదిరించి యుద్ధం చేసి రెక్కలు కోల్పోయింది ఆ జటాయువే. కొన ఊపిరితో ఎదురుచూసి రామలక్ష్మణులు రాగానే ఆ వార్త చెప్పి కన్ను మూశాడు జటాయువు.

సీత జాడ తెలుసుకోవడానికి వెళుతున్న ఆంజనేయుడు, అంగదుడు మొదలగు వానర వీరులకు వింధ్య పర్వతం మీద కనిపించిన సంపాతి ‘లంక వైపు రావణుడు సీతాదేవిని తీసుకుపోయిన’ సమాచారం చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ ధర్మం వైపు నిలిచి తమ ధర్మం నెరవేర్చారు.

"అంతేకాదు అన్నదమ్ములిద్దరూ ఉండాలో లోకానికి చాటి చెప్పారు సంపాతి జటాయువులు.


శపథం కారణంగా సౌర మండలం వరకు ఎగిరినప్పటికీ తమ్ముడు ఆపదలో ఉన్నట్టు గ్రహించి సోదర ప్రేమ చూపాడు సంపాతి.

పోటీలో గెలవాలని ఆశ పడకుండా రెక్కలు అడ్డుపెట్టి తమ్ముడిని రక్షించుకున్నాడు. తమ్ముడికి కష్టం కలిగించే గెలుపు అక్కర లేదనుకున్న సంపాతి కథ సోదరులెలా ఉండాలో మనకు నేర్పుతోంది.

ఆస్తుల కోసం అనుబంధాలు మరిచిపోయి కత్తులు దూసుకుంటున్న నేటి కాలపు అన్నదమ్ములు సంపాతి, జటాయువుల కథ చదివి పరివర్తన చెందాలి.

ప్రేమానుబంధాలు పెంచుకుని ఒకరికొకరు సంహరించుకుంటూ ఆనందంగా గడపాలి.👍

Source - whatsapp message

No comments:

Post a Comment