Saturday, April 23, 2022

ప్రేమ బంధం (చిత్రాల్లో మీతో పాటు కనిపించే వ్యక్తులు మీ సొంతమైనవారా? లేక కష్టకాలంలో మీతో ఉన్నవారు మీ సొంతమైన వారా?)

365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో


♥️ కథ-174♥️


చిత్రాల్లో మీతో పాటు కనిపించే వ్యక్తులు మీ సొంతమైనవారా? లేక కష్టకాలంలో మీతో ఉన్నవారు మీ సొంతమైన వారా?


ప్రేమ బంధం


అప్పుడే సూర్యుడు ఉదయించాడు, ఒక వృద్ధుడు డాక్టర్ ఇంటి తలుపు వద్దకు వచ్చి బెల్ కొట్టడం ప్రారంభించాడు.


"ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు?" అంటూ డాక్టర్ భార్య తలుపు తీసింది.

ఆ పెద్దాయనను చూసి డాక్టర్ భార్య, "అంకుల్ ఇంత పొద్దున్నే వచ్చారు? అంతా బాగానే ఉందా?" అని అడిగింది.

ఆ పెద్దాయన, "నేను నా బొటనవేలు కుట్లు ఇప్పించుకోవడానికి వచ్చాను. ఉదయం 8:30 గంటలకు వేరేచోటికి వెళ్ళవలసిఉంది, కాబట్టి త్వరగా వచ్చాను. క్షమించండి డాక్టర్!", అన్నాడు.

వృద్ధుడి నివాసం వైద్యుని ఇంటి పరిసరాల్లో ఉంది. అవసరమైనప్పుడల్లా ఆ డాక్టర్ దగ్గరకు వస్తాడు. అందుకే ఇద్దరికీ కొంత పరిచయం. గది నుండి డాక్టర్ బయటకి వచ్చి, " అంకుల్ కూర్చోండి, బొటనవేలు చూపించండి", అన్నాడు.

డాక్టర్ బొటన వేలి కుట్లు జాగ్రత్తగా విప్పి," అంతా చాలా బానేఉంది. మీ గాయం మానింది. అయినప్పటికీ, మీకు దెబ్బ తగలకుండా కట్టు కడతాను", అన్నాడు.


చాలా మంది వైద్యులు ఉన్నారు, కానీ ఈ వైద్యుడు చాలా సానుభూతిపరుడు, ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధ వహించేవాడు, చాలా దయగలవాడు.
డాక్టర్ కట్టు కట్టి, "అంకుల్, మీరు 8:30 గంటలకు ఎక్కడికి చేరుకోవాలి. మీకు ఆలస్యం అయితే, నేను మిమ్మల్ని దించుతాను" అని అన్నాడు.

వృద్ధుడు, "వద్దు డాక్టర్, ప్రస్తుతానికి నేను ఇంటికి వెళ్లి అల్పాహారం సిద్ధం చేయాలి, తర్వాత సరిగ్గా 9:00 గంటలకు బయలుదేరతాను", అంటూ కృతజ్ఞతలు తెలిపి బయలుదేరడానికి లేచి నిలబడ్డాడు.

వైద్యులు చాలా మంది ఉంటారు, కానీ హృదయంతో వైద్యం చేసేవారు చాలా అరుదు.
ఆ వ్యక్తి లేచి నిలబడగానే, డాక్టర్ భార్య వచ్చి, "అంకుల్, మాతో ఇక్కడే అల్పాహారం తీసుకోండి!" అనగానే, పెద్దాయన, "లేదమ్మా! నేను ఇక్కడ అల్పాహారం తీసుకుంటే, అక్కడ ఆమెకు అల్పాహారం ఎవరు పెడతారు?" అన్నాడు.

డాక్టర్, " మీరు ఎవరి కోసం అల్పాహారం చేయాలి?" అని అడిగాడు.

వృద్ధుడు, "నా భార్య కోసం" అని చెప్పాడు.

" ఆమె ఎక్కడ ఉంటారు, ఉదయం 9:00 గంటలకు మీరు ఎక్కడకు వెళ్ళాలి?", అని డాక్టర్ అడిగాడు.

దానికి ఆ పెద్దాయన, "డాక్టర్, నేను లేకుండా ఆమె ఎప్పుడూ జీవించలేదు, కానీ ఇప్పుడు ఆమె అనారోగ్యంతో ఉంది, ఆమె నర్సింగ్ హోమ్ లో ఉంది."

డాక్టర్, "ఎందుకు, ఆమెకి ఏమైంది?" అడిగాడు ఆసక్తిగా.

ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "నా భార్యకు అల్జీమర్స్ వ్యాధి ఉంది, దానితో ఆమె జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయింది, గత 5 సంవత్సరాలుగా, ఆమె నన్ను గుర్తించట్లేదు, నేను నర్సింగ్ హోమ్ కి వెళ్తాను. అల్పాహారం తినిపించినప్పుడు, ఆమె నా వైపు తడి నిండిన విశాలమైన కళ్ళతో చూస్తుంది. నేను ఆమెకు ఒక అపరిచితుడిని", చెప్తున్న వృద్ధుడి కళ్లు చెమర్చాయి.


డాక్టర్, అతని భార్య ఇలా అడిగారు, "అంకుల్, మీరు 5 సంవత్సరాల నుండి ప్రతిరోజూ నర్సింగ్ హోమ్ కి అల్పాహారం ఇవ్వడానికి వెళుతున్నారు, మీరు వయస్సులో పెద్ద వారు కదా, మీకు అలసట కలగట్లేదా, మీరు విసుగు చెందలేదా?", అని అడిగారు.

వృద్ధుడు ఇలా అన్నాడు, " డాక్టర్, నేను వారానికి మూడుసార్లు వెళ్తాను, జీవితాంతం ఆమె నాకు గొప్ప సేవ చేసింది. ఈ రోజు నేను ఆమె సహాయంతోనే జీవితాన్ని గడుపుతున్నాను. ఆమెను చూడగానే నాకు ఉత్సాహం వస్తుంది. ఆమె దగ్గర కూర్చుంటే నాకు బలం వస్తుంది. ఆమె లేకుంటే ఈపాటికి మంచాన పడి ఉండేవాడినేమో. కానీ, ఆమె ఆరోగ్యం బాగుచేసుకోవాలి, ఆమెను బాగా చూసుకోవాలి అనే భావనతోనే నాకు రోజురోజుకూ బలం, చురుకుదనం వస్తుంది. ఉదయం లేచి తయారై, ఆవిడని కలవడానికి వెళ్ళి ఆమెతో అల్పాహారం చేయడం, నా చేతులతో ఆమెకు ఆహారం అందివ్వడం .. కలిసి అల్పాహారం తినడంలో ఉన్న ఆనందమే వేరు.."


డాక్టర్, "అంకుల్, ఒక విషయం చెప్పండి.. ఆమె మిమ్మల్ని గుర్తించదు, మీతో మాట్లాడదు, నవ్వదు, అయినా మీరు ఆమెను చూడటానికి ఎందుకు వెళతారు?"

అప్పుడు ఆయన అన్న మాటలు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన, హృదయాన్ని హత్తుకునే మాటలు.

ఆయన ఇలా చెప్పాడు, "డాక్టర్, ఆమెకు నేనెవరో తెలియదు, కానీ నాకు ఆమె ఎవరో నాకు తెలుసు కదా !" ఇలా అంటూ అతని కళ్లలో నుంచి కన్నీటి ధార మొదలైంది.
డాక్టర్, అతని భార్య కూడా కంటతడి పెట్టారు.

అందరూ ప్రేమిస్తారు, కానీ నిస్వార్థ ప్రేమ చాలా అరుదు!! ప్రేమ ఒక గొప్ప శక్తి, ప్రేమ ప్రతిదీ సులభం చేస్తుంది.


♾️


నిత్యజీవితపు వేడిమిలో చేసే తపస్య వల్ల ప్రేమ పవిత్రమవుతుంది. 🌼
దాజీ


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌


అనువాదబృందం ఆంధ్రప్రదేశ్

సేకరణ

No comments:

Post a Comment