Friday, April 15, 2022

గురు ద్రోణ, భీష్మపితామహుల వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు. వారి సంహారంలో మీరెందుకు పాలుపంచుకున్నారు... ఇది అధర్మం కదా?

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం.ఈ యుద్ధం లో మహాయోధులెందరో మరణించారు. వారి మరణాల గురించి రుక్మిణికి కొన్ని సందేహాలు కలిగాయి. పరమాత్ముణ్ని ఇలా ప్రశ్నించింది. 'దేవా! గురు ద్రోణ, భీష్మపితామహుల వంటి మహనీయులు ధర్మబద్ధంగా జీవించారు. వారి సంహారంలో
మీరెందుకు పాలుపంచుకున్నారు... ఇది అధర్మం కదా? '

'రుక్మిణీ! నీవు చెప్పిన మహనీయులు నిజంగా గొప్పవారే. పూజ్యులు, పుణ్యమూర్తులే. కానీ, నిండుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో తమకు అధికారం, శక్తి ఉన్నా మౌనంగా ఉండిపోయారు. అది మహాపరాధం. దానివల్ల ఆ క్షణంలోనే వారి పుణ్యం నశించిపోయింది. వారి పూజ్యత శూన్యమైపోయింది. అందుకే వారికి మరణదండన.
'మరి లోకోత్తరమైన దానగుణం గల కర్ణుడి విషయం ఏమిటి? అర్ధించిన వారికి లేదనకుండా చివరకు తన కవచకుండలాలనే చీల్చి ఇచ్చేశాడే! అతడినెందుకు
సంహరించారు?'

'దేవీ! కర్ణుడి గురించి నీవు చెప్పింది అక్షరసత్యం. కానీ, మరణ వేదన పడుతున్న అభిమన్యుడు ఆర్తితో దోసెడు నీరు ఇచ్చి దాహం తీర్చమని కోరితే, పక్కనే నీటిచెలమ ఉన్నా, దుర్యోధనుడు అపార్థం చేసుకుంటాడేమోననే సంశయంతో కర్ణుడు ఇవ్వలేదు. అతడి జీవితకాల దానపుణ్యం ఆ క్షణమే లుప్తమైపోయింది. కడకు అతడి రథచక్రం అదే నీటి చెలమలో కూరుకుపోయి ప్రాణాంతకమైంది. ధర్మాలు కేవలం పాటిస్తే చాలదు. వాటిలోని సూక్ష్మాంశాలను కూడా గ్రహించి అనుసరించాలి!' అని బదులిచ్చాడు శ్రీకృష్ణుడు.* అంతరంగ భక్తి మానసిక పూజల ప్రాధాన్యం ఏమిటో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. దీన్నే ధర్మంలోని ధర్మం అంటారు. అగ్నిలోని వెలుగు, సత్యంలోని శక్తి, 'అంతర్యామి'లోని దివ్యత్వం... ఇవన్నీ సూక్ష్మ దృష్టికి మాత్రమే అర్థమవుతాయి. అలా అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక కృషిఫలం.

సేకరణ

No comments:

Post a Comment