Thursday, August 18, 2022

💝కాసేపు “ధ్యానం” మీద ధ్యానం పెడ్దాం ఈరోజు.

 ॐశ్రీవేంకటేశాయ నమః
💝కాసేపు “ధ్యానం” మీద ధ్యానం పెడ్దాం ఈరోజు.
💖 ’అణోరణియాన్ మహతో మహీయాన్’ కదా…!నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించి వున్న పరమాత్మను దర్శించటానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడమే.
❤️ మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం. వంచించే ఇంద్రియాలద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుకలోనికి తెచ్చే ప్రక్రియ. మనస్సు యొక్క నిశ్చలత్వం. మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.ఇతర భావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం. అంతరంగ చైతన్యముకు చేరువకావడం. హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.
💞 ఇలాఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించారు. ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం. ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖ ప్రయాణం. ఎవరికివారే పొందాల్సిన స్థితి. ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి. ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడి జీవితం పరిపూర్ణం ఔతుంది. ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.
💓 పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు, ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
💖 ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులతో, చేర్పులతో సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం. వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి ధ్యానంవలన అలవడుతుంది. ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావ సమతుల్యత అలవడుతుంది. గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది. అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయ వాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది.
💝 పరమాత్మ మన ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి. హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయ వాసనలు ఉండొద్దు.ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటేమార్గం.

💖 ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు దేవతలనూ, ప్రకృతి దృశ్యాలనూ దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు. కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది. అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి. ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి.
❤️ ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు. ఏ పని చేస్తున్ననూ ధ్యానం లా జరుగుతూ ఉండాలి. అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, పరిపూర్ణ జీవితమౌతుంది. ధ్యానసాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస వంటివి) ఉంటాయి. 
💞 ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు.సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి.ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస అన్నీ సమీకృతమై వీలీనమౌతాయి. ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి. ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం.
💕 ఇదే ఆత్మనిష్ట. ఆత్మనిష్ఠ కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయంలో తెలియజేశారు. మహర్షులనుండి ఇంద్రాది దేవతల వరకు, మహా యోగుల నుండి ముముక్షువుల వరకు ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.
💖 కట్టెలన్నీ అగ్ని వలన భస్మమైనట్లుగా మన కర్మలన్నీ ధ్యానం చేత భస్మమౌతాయి.
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః

సేకరణ 

No comments:

Post a Comment