Thursday, August 18, 2022

జ్ఞానంతో అత్యంత కీలకమైన ప్రశాంతత కలుగుతుంది.

 🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 👏
🚩🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్. 

సుప్రభాత వేళ నుంచి ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా,
కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలని ప్రతి మనిషికీ అనిపిస్తుంది.
 ప్రశాంతత మనసుకు లేపనం. ఆత్మకు ఔషధం. మానవ జీవితంలో ప్రశాంతత ఎంతో అవసరం.
 ఆధ్యాత్మిక జీవనం ప్రశాంతతతోనే సాధ్యం. జీవన బృందావనంలో ప్రశాంత పారిజాతాలు లేకపోతే వేణుమాధవుడు విహరించడానికి రాడు. ప్రశాంతత సీతాకోకచిలుకలా ఎగురుతూ ఉంటుంది. దాని వెంట పడితే అది దొరకదు. ఒక చోట హాయిగా కూర్చుంటే, వచ్చి వాలుతుంది. అలసిన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. జీవితం ప్రశాంతంగా ధ్యానంలా సాగిపోవాలని చాలా మంది ఆకాంక్ష. అలా జరగదు. ఎందుకిలా జరుగుతోంది అనే భావనే మనసును అల్లకల్లోలం చేసి ప్రశాంతతకు దూరం చేస్తుంది. ప్రశాంతతను తెచ్చి పెట్టుకోవాలి. అది పరిమళించే గులాబీల గుత్తిలా ఉండాలి. ప్రశాంతత లేని జీవితం వ్యర్ధం. తినే ఆహారం, పీల్చే గాలి, నడక, ఆలోచన, నిద్ర... ఇవన్నీ మనిషిని సుఖంగా ఉంచడానికే. ఈ సుఖంలోంచే ప్రశాంతత పుడుతుంది.

జ్ఞానంతో అత్యంత కీలకమైన ప్రశాంతత కలుగుతుంది. అది శాంతికి, పరమశాంతికి దారి తీస్తుందని యోగం తెలియజేస్తోంది. మొదట మనిషి నిలబెట్టు కోవాల్సింది ప్రశాంతత. దాని కోసమే కొంత ప్రయత్నం చెయ్యాలి. ఆ తరువాత ఎంత గొప్ప ఆధ్యాత్మిక స్థితినైనా అలవోకగా అందుకోవచ్చు.

జై గురుదేవ్.....

No comments:

Post a Comment