గంజాయి వనంలో...
మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయి. సద్గుణాల ప్రభావం కొందరిలో ఎక్కువ పాలుంటుంది. దుర్గుణాల ప్రభావం ఇంకొందరిలో ఎక్కువగా ఉంటుంది. దానవుల్లోనూ ధర్మవర్తనులున్నారు. మానవుల్లోనూ ఆసురీ ప్రవృత్తిగలవారున్నారు. శ్రీరామ వనవాస సమయంలో సీతమ్మను అపహరించదలచిన రావణుడు మారీచుణ్ని బంగారు లేడి రూపం ధరించి, సీతను ఆకర్షించమని ఆదేశిస్తాడు. రామబాణ ప్రభావాన్ని లోగడ చవిచూసి గుణపాఠం నేర్చుకున్నవాడు కనుక రాముడి జోలికి వెళ్ళవద్దని, అతడు ధర్మ స్వరూపుడని మారీచుడు ఎంతగానో హితవు చెబుతాడు. తాను చెప్పింది చెయ్యకపోతే చంపుతానంటాడు రావణుడు. ఆ దుర్మార్గుడి చేతిలో చావడం కంటే ధర్మమూర్తి రాముడి చేతిలో చావడమే శ్రేయస్కరమనుకుని, విధిలేక మారీచుడు రావణుడి ఆనతికి తలొగ్గుతాడు. దానవ లక్షణం లేని మారీచుడు రామచంద్రమూర్తి ఆదర్శ వ్యక్తిత్వాన్ని గ్రహించిన ధార్మికుడు.
శ్రీరాముడి గురించి తెలిసిన విభీషణుడు అన్న రావణుడికి ఎంతగానో హితబోధ చేశాడు. విసిగి, రాముడి శరణు వేడుకున్నాడు. ధర్మమెటువైపు ఉంటే అక్కడే జయం లభిస్తుందని గ్రహించిన జ్ఞాని- విభీషణుడు.
ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పక్షాన ఉన్నా, ఏ వర్గాన ఉన్నా మంచిని మంచి అనే చెప్పుకొంటాం. చెడును చెడు అనే చెప్పుకొంటాం. విష్ణువును ద్వేషించడమే కాకుండా, దూషించడమే కాకుండా, శ్రీహరిని అహర్నిశలు స్మరించే ప్రహ్లాదుణ్ని, తన తనయుడని అయినా ఆలోచించక పుత్రవాత్సల్యాన్ని విస్మరించి, చిత్రహింసలకు గురిచేశాడు హిరణ్యకశిపుడు. రాముడి మీద అమితమైన వాత్సల్యమున్న కైకమ్మ మంధర దుర్బోధల వల్ల యుగయుగాల్లోనూ సర్వుల చేత దూషితురాలైపోయింది.
దానవ సాధ్వి మండోదరి భర్త రావణుడికి ఎంతగానో ధర్మబద్ధమైన సలహాలు ఇచ్చింది. అశోకవనంలో త్రిజట అనే రాక్షసి సీతకు ధైర్యం చెప్పి, తన స్వప్న వృత్తాంతం వెల్లడించి ఓదారుస్తుంది. కౌరవ సోదరుల్లో యుయుత్సుడు, వికర్ణుడు ధర్మ పరాయణులైన పాండవులనే సమర్థించారు. రాక్షసుడైనా బలిచక్రవర్తి తన దానశీలతతో కీర్తి గడించాడు. శల్యుడు కర్ణుడికి రథసారథిగా వ్యవహరించినా అర్జునుడి విజయానికే సహకరించాడు.
రాక్షస చక్రవర్తి బాణాసురుడి పుత్రిక ఉష శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుణ్ని ప్రేమించి, వివాహమాడింది. రాక్షస మహిళ హిడింబి కుమారుడు ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం నుంచే పోరాడి వీరమరణం పొందాడు. వీరంతా గంజాయి వనంలో తులసి మొక్కల్లాంటి వారు.
భారతావని తపోభూమిగా, పుణ్యభూమిగా, ఆర్య భూమిగా విశ్వవిఖ్యాతమైంది. మునులు, తపోధనులు, యోగులు, అవధూతలు, ప్రవచనకారులు, ఆచార్యులు, విద్వాంసులు, కళాకారులు, సమాజ సేవకులు, నాయకులు, సుపరిపాలకులు... అసంఖ్యాకంగా ఈ భూమి మీద ఆవిర్భవించారు. జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు, చేస్తున్నారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన జ్ఞాన వాకిలిగా విరాజిల్లుతోంది మన దేశం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల జ్ఞాన భాండాగారమంతా అందుబాటులో ఉంది. దీన్ని జాతి తన జీవన ప్రస్థానంలో సమన్వయ పరచుకోవాలి. సత్సాంగత్యం ప్రభావం అపారం. సత్కథాశ్రవణ ఫలితం అనంతం. సద్గ్రంథ పఠన అభ్యాసం ఆవశ్యకం.
No comments:
Post a Comment