Sunday, April 23, 2023

కర్మ సిద్ధాంతం - 23

 కర్మ సిద్ధాంతం - 23
జీవులు చేసిన కర్మల్లో కొన్ని అతనికి సంబంధించిన వస్తువులను ఆశ్రయించి ఉంటాయి. ఆయా వస్తువులను దొంగిలిస్తే, దొంగతనం చేసిన పాపంతో బాటు ఎదుటి వ్యక్తి యొక్క పాపకర్మలు సైతం దొంగకు చుట్టుకుంటాయి.
భూ ఆక్రమణదారులకు కూడా ఎన్నో పాపాలు, శాపాలు చుట్టుకుంటాయి. అతడు చేసిన పాపం కారణంగా తన పితృదేవతలతో కలిసి ఏడు జన్మల బాటు కుక్క పేడ మధ్యలో పుట్టి, దాన్ని తిని, బ్రతికే కీటకాలు (పురుగులుగా) జన్మిస్తారు. అటు తర్వాత అతడు వరుణపాశాల చేత బంధించబడి, పక్షి లేదా జంతువుగా జన్మిస్తాడని కర్మవిపాకం చెబుతోంది.
భూమి, ధనము లేదా గోవును అపహరించినవాడు చేసిన పుణ్యం పూర్తిగా నశించి, ప్రళయ కాలం వరకు నరకంలో ఉంటాడు - కర్మ విపాకం.
అతడు చేసిన పాపానికి పితృదేవతలను సైతం అధోగతి పాలుజేసి, వారి ఆగ్రహానికి మరియు శాపానికి గురవుతాడు.
ఇతరుల భూమిని ఆక్రమించినవానికి పంచమహాపాతకాలతో సమానమైన పాపం వస్తుంది.
సాధారణ మానవుడు తాను ఏది కోల్పోయినా బాధపడడు గానీ తాను సంపాదించినది, కూడబెట్టినది నష్టపోతే మటుకు దుఃఖిస్తాడు. అందుకే మనకు కష్టం వచ్చినప్పుడు, అది తీరాలని భగవంతునకు డబ్బును ముడుపు కడతాము, లేదా హుండీలో వేస్తాము. అలాంటిది దేవుని హుండీని దోచుకునేవారి పాపం, దేవుని నగలు, మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్ళేవానికి వచ్చే పాపం వర్ణించలేనిది. వారికి మరణానంతరం మరుజన్మ లభించక, ఎంతోకాలం ఆహారం లేకుండా పిశాచంగా జీవించవలసి వస్తుంది. ఏ లోకానికి వెళ్ళకుండా, తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్ని కోట్ల సంవత్సరాలు ఏడుస్తూ గడుపుతాడు. అతని వంశం శాపగ్రస్తమవుతుంది.
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అనే సమేత తెలుగులో ఉంది. అలాంటి విషయమే ఒకటి. తనది కాని వస్తువును తాను దానం చేయలేడు, చేసినా పాపమే తప్ప పుణ్యం రాదు. ఖాళీ భూములు కనిపిస్తే చాలు, చాలామంది భక్తి పేరుతో దాన్ని ఆకర్మించి దేవాలయము, మసీదు, చర్చీలు నిర్మించడం చూస్తున్నాము. ఈ మధ్య గోశాలలు కూడా కడుతున్నారు. నీకున్న దాంట్లో నువ్వు దానం చేస్తే పుణ్యము, నువ్వు సంపాదించినది వినయంగా భగవంతునికి అర్పించడం భక్తి అవుతుంది గానీ కనిపించిన ప్రదేశాలను ఆక్రమించి అదంతా భక్తి అని చెప్పడం దైవాన్ని మోసగించడమే అవుతుంది. పైగా అవి అక్రమనిర్మాణాలని ప్రభుత్వం అనగానే అందులో రాజకీయాలు, గొడవలు, ధర్నాలు చేస్తారు. అంత భక్తి ఉన్నవాళ్ళు తమ ఇంటిని దేవాలయానికి రాసివ్వాలి గానీ ఎవరి స్థలాలో ఆక్రమించడం ఏంటి? అలాంటి వాటికి మద్దతు తెలపాల్సిన అవసరం లేదు. అది భూమిని దొంగిలించడం కాదా?
మానవులు అన్యాయంగా ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు పనికిరాదు. అవినీతిపరుని ఇంట భోజనం చేస్తే తిన్నవారికి సైతం పాపం చుట్టుకుంటుందని ఛాందగ్యోపనిషత్తు చెబుతోంది. అందుకే అప్పనంగా వచ్చిందని ఎక్కడపడితే అక్కడ తినకండి. ఉచితంగా వచ్చిందని మీరు వాళ్ళ పాపాలను తింటున్నారేమో ఆలోచించండి.
అన్యాయంగా ఆర్జించిన సొమ్ముతో సాధుసంతులకు, ఉపాసకులు, భగవద్భక్తులకు భోజనం పెట్టరాదని, అటువంటి వారి వద్ద సత్పురుషులు తినకూడదని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు.
పాపాత్ముని ప్రభావం ఎలా ఉంటుందంటే, అతడు నిలుచున్న చోట ఆరుగజాల వరకు భూమి కూడా అపవిత్రమవుతుందట. ఇది కూడా శ్రీ రామకృష్ణ పరమహంస వారే చెప్పారు. అంటే వారితో స్నేహం/ సాంగత్యం చేయడం కూడా పతనానికి హేతువే.
ఎవరికీ తెలియకుండా ధనం లేదా వస్తువులు దొంగిలించరాదు. అలా చేస్తే, కనీసం అతనికి క్షమాపణ చెప్పి, దొంగిలించిన దానిని తిరిగి ఇచ్చేయాలి. రోడ్డున దారికిన వస్తువులు (నగలు, ధనము లేదా ఇతరత్రా ఏవైనా) ఇంటికి తెచ్చుకుంటే అవి చాలా దుష్కర్మను వెంట తీసుకువస్తాయి. కొన్నిసార్లు పిశాచ బాధలు కూడా కలుగుతాయి. వాటికి పరిహారాలు కూడా ఉండవు. To be continued...

No comments:

Post a Comment