Sunday, April 23, 2023

శ్రీ రమణ మహర్షులవారి 73వ ఆరాధనను ఏప్రిల్ 18,2023 న శ్రీ రమణాశ్రమంలో నిర్వహించారు.

 శ్రీ రమణుల 73వ ఆరాధన

శ్రీ రమణ మహర్షులవారి 73వ ఆరాధనను నిన్నటి రోజు అనగా ఏప్రిల్ 18,2023 న శ్రీ రమణాశ్రమంలో నిర్వహించారు. 

తెల్లవారు జామున 4.45 నిమిషములకు శ్రీ రమణాశ్రమమంతా మంగళ వాయిద్యముల నాదాలతో నిండిపోయింది. పలురకాల పుష్పాలతో , పూలమాలలతో శ్రీ రమణేశ్వర మహా లింగాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అటు పిమ్మట మహన్యాస రుద్ర జపము, శ్రీ రమణులచే కూర్చబడ్డ  స్తోత్రాల యొక్క పారాయణం మరియు చందనాది సుగంధ లేపనముల సేవలు కొనసాగాయి. తదనంతరం 11 గంటలకు భక్తి పాటల గానము మరియు దీపారాధన జరిగాయి 11:30 కు శ్రీ రమణాశ్రమం వేంచేసిన భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. 

ఈ కార్యక్రమం యూట్యూబ్ లో ప్రసారం చేయబడింది. యూట్యూబ్ లో సుమారు పదివేల మంది భక్తులు శ్రీ రమణ ఆరాధనను తిలకించగా 5000 భక్తులకు పైగా శ్రీ రమణాశ్రమం వేంచేసి శ్రీ రమణ ఆరాధన మహోత్సవంలో పాల్గొన్నారు. 

శ్రీ రమణులు తరచూ ఇలా అంటూ ఉండేవారు, "నేను మరణిస్తున్నాను" అని అందరూ అంటున్నారు . కానీ నేను ఎక్కడికీ వెళ్ళిపోవటం లేదు! నేను ఎక్కడికి వెళ్ళగలను!? ఇచ్చటనే ఉన్నాను."  

'టాక్స్ విత్ శ్రీ రమణ మహర్షి' అనే గ్రంథంలో అందరూ గురువును కేవలం దేహంగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి గురువు దేహ భావనకు అతీతుడై , లోపల వెలుగొందు ఆత్మ స్వరూపుడు. శిష్యుడికి దారి చూపించడానికి ఒక దేహాన్ని ధరించి ఆత్మయే గురువుగా సాక్షాత్కరించును. భక్తుడు ఈశ్వరునికి గాని గురువుకి కానీ శరణాగతి చెందినచో ఈశ్వరుడే గురు రూపంలో భక్తుని కడతేర్చగలడు. 

సద్గురుని పాదాల చెంత సంపూర్ణంగా శరణాగతి  చెందిన వానికి ఏ విషయం పైన సందేహములు తలెత్తవు. సద్గురుని శరణు వేడిన పిమ్మట అంతః గురువైన ఆత్మ శిష్యుణ్ణి బాహ్యము నుంచి లోపలికి లాగును. దేహంతో కనిపించే బాహ్య గురువు శిష్యుణ్ణి లోపలికి అంటే ఆత్మ వైపుకు నడిపించును. ఇదియే గురువు యొక్క అపారమైన అనుగ్రహము. 

శ్రీ రమణుల ఆరాధనను జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో మనమందరము శ్రీ రమణుల బోధను అనుసరించి 'నేను - నాది' అనేటటువంటి వాటిని త్యజించి , దేహము యొక్క మరణము మృత్యువు కాదనీ , 'మృత్యువు' అనే పదానికి నిజమైన అర్థము ఈ 'నేను - నాది' అనేటటువంటిదవి సమూలంగా నాశనము కావటానినే 'మృత్యువు' అని అందురని గ్రహించాలి. 

No comments:

Post a Comment