మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగలదు. మనుషులంతా ఒక్కటే అన్నది సనాతన ధర్మం భావం.
ఈ విషయం అందరూ గమనించాలి.
ముఖ్యంగా మానవుడు సనాతన ధర్మం మార్గంలో నడుచుకోవడానికి ముందు తనలోని స్వార్థాన్ని, ఈర్ష్యా ద్వేషాలను సంపూర్ణంగా విసర్జించాలి. మానవ జన్మకు సార్థకత చేకూర్చగలగాలి. ఈ దేహం శాశ్వతం కాదు. మరి ఈ దేహంపై మోహం ఎందుకు? ఆలోచించాలి. స్వార్థానికి స్వస్తిపలికి నిస్వార్థజీవిగా బ్రతకాలి. జీవిత పరమార్థం సనాతన ధర్మం. అందుకు నిత్యం కట్టుబడి ఉండాలి. సనాతన సిద్ధాంతం మరువరాదు. సత్య, ధర్మ, శాంతి ప్రేమలకు అవి దోహదపడగలవు.
ధర్మం ఆచరించడంలో అవరోధాలు ఏర్పడకుండా చూసుకోవాలి. మంచిని పెంచుకోవాలి. మమతానురాగాలు పంచుకోవాలి. దివ్యజ్ఞానం కాంతులు వెదజల్లే సనాతనధర్మం మహనీయులు ఎందరో పాటించారు. కనుకనే వారు మహనీయులు కాగలిగారు. సనాతన ధర్మంతో ముందుకు సాగిపోయేవారికి విజయం వరిస్తుంది.
అజ్ఞానమనే చీకటినుండి విజ్ఞానమనే వెలుగు మార్గంలో పయనించాలంటే మానవుడు జ్ఞాన సంపద పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మికత విలువలు గ్రహించాలి.
ప్రస్తుత పరిస్థితులలో మానవుడు భగవంతుని ఆరాధన సంగతి మరిచిపోయి ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపిస్తూ భౌతికపరమైన బంధములకోసం విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. సకల లోకైక రక్షకుడు భగవంతుడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. భగవత్ చింతన మరువరాదు. భగవత్ ఆరాధన ఆధ్యాత్మికతకు ఒక పునాది వంటిది. సనాతన ధర్మం అన్నసిద్ధాంతం విశాల విశ్వం అంతటా ప్రసరింపజేయాలి. అందుకు మానవ ధర్మం సంసిద్ధం కావాలి.
హిందూ ధర్మాన్ని పరిరక్షించేది సనాతనధర్మం. దీనివలన సౌభ్రాతృత్వం, సహకారం, సమభావం వెల్లివిరుస్తాయి. సనాతన ధర్మంలో అందరూ శాంత స్వభావికులే కావాలి. కోపం, అసూయ, పగ, ప్రతీకారం, ధన వ్యామోహం, కామం, మోహం వంటి దుర్గుణాలకు దూరంగా ఉండాలి. శాంతం సముద్రం కంటే గొప్పది. సనాతన ధర్మం కూడా అటువంటిదే. మన హిందూ సాంప్రదాయం, మన హిందూ ధర్మ విశిష్టత, సనాతన ధర్మంలో ప్రధాన సూత్రాలను మనం ప్రతినిత్యం పాటించాలి.
మన ప్రాచీన సంస్కృతికి నిదర్శనం హిందూ ధర్మమైతే సనాతన ధర్మం చరిత్ర సంస్కృతికి ప్రతిరూపం కాగలదు. పవిత్రమైన వేదములలో సైతం సనాతన ధర్మం యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగింది. మన హిందూ సంస్కృతి ప్రతిరూపమే సనాతన ధర్మ సందేశం. మానవుడు భూతదయ కలిగివుండవలయును.
దానధర్మాములు చేయుటలో ఆసక్తి కలిగివుండాలి. అహింసా పరమో ధర్మః అన్న సిద్ధాంతం తప్పకుండా పాటించాలి. నా అన్న స్వార్థానికి స్వస్తి పలకాలి. ఇతరులపట్ల దయాగుణం కలిగి ఉండాలి. తనకున్నదానిలో పేదలకు కాస్త సాయం చేసే స్వభావం కలిగివుండాలి. ప్రతిరోజూ ధ్యానం సాధన చేయాలి. ధ్యానమార్గం ద్వారా మానవునికి భౌతిక శక్తి లభిస్తుంది. జాతీయ సమైక్యతా భావంతో అందరూ ఒక్కటేనని గ్రహించాలి.
మహనీయుల సూక్తులు ఆచరించాలి. మహాపురుషుల మార్గం ధర్మమార్గం అనుసరించాలి. అప్పుడే సనాతన ధర్మం సత్యధర్మంతో ప్రకాశించగలదు. కృషి, దీక్ష, పట్టుదలలే మానవ ప్రగతికి మార్గదర్శకాలు కావాలి. మానవునికి సంతోషకర జీవనానికి సనాతన దర్మం ఉత్తమం.
No comments:
Post a Comment