*కైజర్ దర్శనం*
👐
రచన : నాగార్జున
చాలా కాలం క్రితం పర్షియాలో కైజర్ అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన పవిత్రమైన జీవితం గడిపేవాడు. మహా ప్రవక్తగా, మహా జ్ఞానిగా పేరు పొందాడు. అతడు ప్రతి రోజూ అల్లాతో మాట్లాడతా డని చెప్పుకొనేవారు ప్రజలు.
పర్షియాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే అతడిని తలుచుకొని తమ కష్టాలు తొలగించమని వేడుకొనేవారు. అలా నిజమైన భక్తితో తలచుకొనే వాళ్ళకి అతడు ఏదో విధంగా సహాయం చేసేవాడు.
ఆ కాలంలో పర్షియాను పాలించే రాజు తరచు యుద్ధాలలో పాల్గొనడం వల్ల చాలా చిరాకుగా వుండేవాడు. ఆయన కైజర్ గురించి విన్నాడుగానీ, తన కష్టాలను పోగొట్టమని కైజర్ ను ప్రార్దించేందుకు ఆయనకు ఆహంకారం అడ్డు వచ్చింది. అందుచేత ఆ ప్రవక్తను తనకు చూపిన వారికి వారేమి కోరినా ఇస్తానని రాజ్యమంతటా చాటింపు వేయించాడు.
ఆ రాజ్యంలోనే తీవ్రమైన దారిద్య్రం అనుభవిస్తున్న ఒక బీదవాడు ఒకడు ఉండేవాడు. అతడికి ఊరంతా అప్పులు వుండేవి. అతడి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆకలితో అలమటించేవారు. అతనీ చాటింపు వినగానే కోటకు వెళ్ళి తాను ఆ ప్రవక్తను చూపించగలనని, దానికి కొంత గడుపు కావాలనీ చెప్పి రాజు గారిని వెయ్యి దీనారాలు అడిగాడు.
ఆ ప్రవక్తను నలభై రోజులలో చూపకపోతే తల తీయిస్తానని చెప్పి బీదవాడికి రాజు ఆతడడిగిన సొమ్ము ఇచ్చాడు. ఆ షరతు కు అంగీకరించి సొమ్ముతో బీదవాడు ఇంటికి చేరాడు.
ఆ డబ్బుతో మొదట అప్పులు తీర్చేసి, మిగిలిన దానితో తన కుటుంబానికి కావలసిన ఆహారం, దుస్తులు కొనుక్కొ న్నాడు. రాజుగారి నుండి డబ్బు పుచ్చుకున్న రోజు నుంచి కైజర్ ని భక్తితో స్మరించి, తనను ఆపద నుండి కాపాడమ ని ప్రార్ధించేవాడు. ఆ విధంగా ముప్పయి తొమ్మిది రోజులు గడిచిపోయాయి.
నలభయ్యవ రోజున తన భార్యను పిలిచి ఇలా చెప్పాడు. “రాజుగారికి కైజర్ దర్శనం చేయించే షరతు మీద నేను ఈ సొమ్ము తెచ్చాను. నిజంగా నాకు ఆ మహా ప్రవక్త ఎక్కడ ఉండేది తెలియదు. కనుక నన్ను రాజు తప్పక ఉరి తీయస్తా డు” అన్నాడు.
ఈ మాటలు విన్న అతడి భార్య ఏడవ నారభించింది.
“దిగులు పడబోకు, మన బాకీలన్ని తీర్చాను. పిల్లలకు ఏ లోటూ ఉండదు. ఇక నేను చనిపోతే మాత్రం ఏమిటి?” అని భార్యను ఓదార్చి నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజుగారు కొలుపు తీర్చి వున్నారు. బీదవాడు 'కైజర్' ను తీసుకొచ్చాడా లేదా అని ప్రజలంతా కుతూహలంగా చూస్తున్నారు.
అతన్ని చూడగానే రాజు ఆనందంతో అనుకున్న గడువుకు వచ్చేశావు. నాకు కైజర్ దర్శనం చేయించబోతున్నావు కదూ" అన్నాడు.
బీదవాడు తలవంచుకొని “మహా ప్రభూ! నా లాంటి సామాన్యుడు మహా ప్రవక్త కైజర్ ను మీ వద్దకు తీసుకురాగలడని మీరెలా అనుకున్నారు? నేను పేదరికం వల్ల నా కుటుంబాన్ని పోషించలేకపోయా ను. ఇంకే ఆధారం లేక మీ వద్ద వెయ్యి దీనారాలు తీసుకొని అప్పులు తీర్చాను. నా కుటుంబానికి కావలసిన అవసరాలు కూర్చుకున్నాను. ఇక నేను మీకు లొంగి పోవటానికి వచ్చాను. మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే” అన్నాడు.
'గొప్ప చిక్కే వచ్చిపడిందే' అనుకున్నాడు రాజు. ఈ సమస్యను న్యాయంగా, ధర్మంగా పరిష్కరించడం ఎలాగా అని ఆలోచించాడు. ఎంతకీ ఏమీ పాలుపోక మంత్రుల కేసి చూసి “ఈ మనిషిని ఏం చెయ్యాలో చెప్పండి” అన్నాడు.
అప్పుడే ఒక వృద్ధుడు ఆ సభలోకి ప్రవేశించాడు.
రాజు అడిగిన ప్రశ్నకు బదులుగా మొదటి మంత్రి ఇలా అన్నాడు “నేరస్తుడి శరీరాన్ని కత్తెరలతో కత్తిరించివేయాలి. అదే తగిన శిక్ష”
రెండో మంత్రి అభిప్రాయం “ఆ ద్రోహిని మండుతున్న పొయ్యిలో త్రోసి బూడిద చెయ్యాలి” అని.
మూడోమంత్రి “నేనయితే వాడిని కత్తితో ముక్కలుముక్కలుగా నరుకుతాను. అటువంటి పాపికి అదే తగిన శాస్తి” అన్నాడు.
నాలుగో మంత్రి కొద్ది క్షణాలు సందేహించి ఆగి ఇలా అన్నాడు. “మహారాజా, ఈ విషయాన్ని మనం కొంచెం శాంతంగా ఆలోచించుదాం” అని మళ్ళీ కొంతసేపు ఆగాడు.
ఆ మంత్రి ఏం చెబుతాడోనని అంతా శ్రద్ధగా చూస్తున్నారు. ఆయన మళ్ళీ ఇలా అన్నాడు "అతను మోసగించిన మాట నిజమేగాని, రాజుగారి నిర్ణయాన్ని శిరసావహించటానికి సిద్ధపడ్డాడు. అతడు నిజాయితీతో ధైర్యంగా తన తప్పు ఒప్పుకున్నందుకు అతడిని వదలి పెట్టడమే న్యాయం.” అన్నాడు.
ఇంతలో సభలోకి వచ్చిన వృద్ధుడు లేచి మహారాజుకు నమస్కరించి “మహారాజా ఇప్పుడు మంత్రులు చెప్పిన సలహాలు విన్నారు కదా. ఈ విషయంలో నేనొక చిన్న విన్నపం చేయదలిచాను. నాకు ఒక అవకాశం ఇప్పించండి” అన్నాడు.
వెంటనే రాజు 'సరే' అన్నాడు.
బదులుగా వృద్ధుడు “మహారాజా! మొదటి మంత్రి పూర్వజన్మలో దర్జీవాడై వుండాలి. అందుకే అతని మనస్సు కత్తెర్ల చుట్టూ తిరుగుతోంది. రెండో మంత్రి బహుశా పూర్యజన్మలో వంటవాడై ఉండవచ్చు. ఎందుకంటే అతడు పొయ్యి ప్రసక్తి తెచ్చాడు కనుక. నరకడం గురించి మాట్లాడాడు కనుక మూడో మంత్రి బహుశా పూర్వ జన్మలో కసాయివాడు అయి వుండవచ్చు. కాని నాలుగో మంత్రి ప్రత్యేక దృష్టిని ప్రదర్శించాడు. బీదవాడి విషయాన్ని క్షమాదృష్టితో పరిశీలించాడు. నిజమైన మంత్రిలా సలహా చెప్పాడు. అతడు పూర్వజన్మలో కూడా మంత్రే అయి వుండాలి.
నేరస్తుడు మీ వద్దకు వచ్చినప్పుడు నిరాశతో కృంగిపోయి వున్నాడు. ఆకలి తో మాడిపోయే తన కుటుంబాన్ని రక్షించుకోవడానికై తన ప్రాణాన్ని సైతం ధారపోయటానికి సిద్ధపడ్డాడు. ఇక మీరు తెలుసుకోవలసినదేమంటే అతడు మీకు కైజర్ దర్శనం కూడా చేయించాడు” అన్నాడు.
ఇలా అంటూనే ఆ వృద్ధుడు సభ నుండి ఆదృశ్యమైపోయాడు.
“అతడే కైజర్ మహాప్రవక్త” అంటూ ఆ సభలో కలకలం రేగింది.
మహాజ్ఞాని కైజర్ ను చూడాలన్న తన చిలకాలపు కోరిక తీరినందుకు రాజు ఆనందిస్తూ బీదవాడిని కౌగిలించుకున్నా డు. అతడికి గొప్ప బహుమతులిచ్చి గౌరవించాడు. తప్పుడు సలహా ఇచ్చిన ముగ్గుకు మంత్రులను మంత్రి పదవి నుండి తొలగించాడు.
మహా ప్రవక్త కైజర్ దర్శనం తర్వాత రాజు చిరాకులన్నీ తగ్గి తన పరిపాలనని సుఖంగా సాగించాడు.
🪷
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉
No comments:
Post a Comment