రామాయణమ్ 10
.
విశ్వామిత్రమహర్షి మాటలు విన్నాడు దశరధుడు.
మనసొప్పటంలేదు ఆయనకు! ఇలా అంటున్నాడు!
.
ఊన షోడశ వర్షేణ రామో రాజీవ లోచనః
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః
.
రాజీవ లోచనుడైన నా రామునకు పదహారు సంవత్సరాలు ఇంకారాలేదు ( పదహారుకు ఒకటి తక్కువ ,ఊన అంటే -1 )
రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడంలేదు! .
.
నా రాముడు ఇంకా బాలుడయ్యా! పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు ! అస్త్రాలు ఇంకా తెలువవు ! అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు ! కోరి కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా!.
.
మహర్షీ నేనే ధనుస్సు ధరించి మీవెంట నడుస్తాను ,నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షౌహిణి సైన్యం నడుస్తుంది!
మీ యాగసంరక్షణ నేనుగావిస్తాను మునీంద్రా! .
.
నా రాముడు బాలుడు! ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు వాడిని విడచి ఒక్కక్షణమైనా నేను బ్రతుకజాలను!.
.
అంతగా నీకు రాముడే కావలెనంటే అతనితోపాటు నన్ను నా చతురంగబలాలనూ కూడా తీసుకొని వెళ్ళు,అంతేకానీ ఒంటరిగా రాముని నే పంపజాలను!.
.
మునిచంద్రా అసలు ఆ రాక్షసులు ఎవరు? ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు?.
.
రాజా ఆరాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు ,రావణుడు బ్రహ్మవరప్రసాది ! విశ్రవసు పుత్రుడు!
వాడిచే ప్రేరేపింపబడి మారీచ సుబాహులనెడి వారు యజ్ఞవిఘ్నానికి పూనుకొన్నారు!
.
అసలు విషయం వినగానే దశరధమహారాజు తీవ్రమైన వేదనకు గురి అయి మహర్షీ !
దేవ,దానవ,యక్ష,గంధర్వ, పతగ,పన్నగులలో రావణుని ఎదిరించువారులేరే !
నా పసికూన! రాముని ,వానికి ఎదురు వెళ్ళమంటావా! నన్ను కనికరించు మహర్షీ! నా కొడుకు పట్ల అనుగ్రహము చూపు !.
.
మహర్షీ ! అంతటి బలవంతుడికి నేనుగానీ,నాసైన్యముగానీ ,నా కుమారుడుగానీ ఎదురునిలవలేము! యుద్ధము చేయజాలము!
.
ఆ మారీచ ,సుబాహులు మాయావులు మహాబలవంతులు వారిలో నా స్నేహితులతో కలసికూడా ఎవరో ఒకరితోనే తలపడగలను అలాంటిది ఇద్దరితో తలపడమని రాముని పంపటమా నా వల్ల కాదు! పంపనుగాక పంపను ! అని ఖండితముగా పలికాడు దశరధుడు!
.
దశరధుడి ఈ అసంబద్ధ ప్రేలాపనలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు! యజ్ఞ కుండంలో నేయివోయ భగ్గున లేచిన పెనుమంట అయినాడు ,తీవ్రమైన కోపంతో కనులు అరుణ వర్ణం దాల్చాయి!.
.
అడిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్నావ్ దశరధా!ఇది రఘువంశ సంజాతులు చేయవలసిన పనికాదు! సరే నీ కొడుకుతో ,బంధుమిత్రులతో సుఖంగా ఉండు వచ్చిన దారినే నే వెడతాను అని తీవ్రమైన ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు!.
.
విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వసిష్ఠుడు కల్పించుకొని !రాజా ! నీవు ఇక్ష్వాకుడవు ! నీ వంశమెట్టిది? లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇంక మాటమీద నిలబడే వారెవరయ్యా! నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు రాముని విశ్వామిత్రునితో యాగసంరక్షణార్ధమై పంపు!.
.
ఈ విశ్వామిత్రుడెవరనుకొన్నావు? ఈయన సంరక్షణ లొనున్న రామునికి అస్త్రములు తెలిస్తే నేమి? తెలియకున్న నేమి?.
.
విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము! పరాక్రమవంతులలో శ్రేష్టమైన వాడు!
.
ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకలభువనాలలో ఎవరికీ తెలియవు! మరి భవిష్యత్తులో కూడా ఈయనకంటే ఎక్కువగా ఎవరికీ తెలవవు!.
.
ఈయనకు తెలిసిన శస్త్రాస్త్రాలెలాంటివో చెపుతాను విను!
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
No comments:
Post a Comment