🌹 శ్రీ రమణీయం - 35🌹
👌జీవన గీతా రహస్యం👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️
🌈 *35. జీవన గీతా రహస్యం* 🌹
✳️ మనం నిజంగా ఆధ్యాత్మిక సాధనను కోరుకుంటే దైవమే మార్గం సుగమం చేస్తుంది. అవసరమైతే వ్యాధినే వరంగా ఇచ్చి సాధన జరిగేలా చేస్తుంది. మన జీవనాన్ని ఒక చిత్రలేఖనంగా తీసుకుంటే అందులోని ప్రతి గీతలోనూ పరమార్థం దాగిఉంది. అది తెలుసుకోవడమే శ్రీ రమణభగవాన్ మనకు బోధించిన జీవన గీతారహస్యం.
✳️ రూపమే లేని గాలిని ఒక బూరలో నింపితే రూపం ఏర్పడుతుంది. అలానే రూపంలేని ప్రాణం మన దేహంతో సహా ఈ ప్రకృతి అంతటిని రూపంగా తీసుకుంది. మనం లౌకిక జీవనంలో ఏ అనుభవం పొందినా ఈ దేహం ద్వారా పొందాల్సిందే. ఈ దేహంతో ప్రాణానికి ఏర్పడ్డ సంబంధమే మనకి ప్రకృతిగా కనిపిస్తుంది. ప్రతి పదార్థంలోనూ ప్రాణమే దాగిఉంది కనుక ప్రాణంలేని ప్రకృతే లేదు. ప్రకృతి లేనిదే ప్రాణం వ్యక్తం కాదు. ఈ దేహం అనే ప్రకృతితో బాహ్య ప్రకృతికి ఏర్పడ్డ సంబంధమే మన అనుభవంగా ఉంటుంది. మన అనుభవాలన్నీ సుఖదుఃఖాల మధ్యనే ఉన్నాయి. ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖం అని, ప్రతికూలమైతే దుఃఖం అని అంటున్నాం. ఈ రెండింటిని సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయడమే ఆధ్యాత్మికత.
✳️ ప్రకృతిలో మార్పు సహజం. ప్రకృతిలో భాగమైన మనం ఆ మార్పులకు అతీతులం కాదు. అలా కాదని ఈ బాహ్యాన్ని ప్రయత్నించినా అది తాత్కాలికమే అవుతుంది. తిరిగి బాహ్యజీవనం సాగించక తప్పదు. అందుకే జీవనం అంతా ఆధ్యాత్మికతతో పరిమళించేలా ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణ జీవనం అవుతుంది.
✳️ నిద్రపోయేటప్పుడు కూడా కలల రూపంలో ప్రకృతి మనని అంటిపెట్టుకునే ఉంటుంది. ఆ తర్వాత సుషుప్తి అవస్థలో మాత్రమే అది మనని పూర్తిగా వదులుతుంది. ఇలలోని దేహాన్ని, కలలోని దేహభావనను వదలి, ఉండాల్సిన సత్యవస్తువుతో ఉండటం ధ్యానసమాధి. ఆ సత్యవస్తువు మనకు ముందే తెలియదు కనుక మన సాధన మనని ఆ స్థితికి చేరుస్తుంది. నామజపమైనా, యోగసాధన అయినా, భజన అయినా, భక్తి పారవశ్యమైనా మనకి ఆ స్థితి రుచి చూపించడానికే.
✳️ మహర్షులు నిరంతరం జప, ధ్యాన సమాధుల్లో ఉండేవారు. నిరంతరం దైవస్మరణతో ఉంటే మన నిత్యజీవితంలో కూడా ఆ ఫలాన్ని పొందవచ్చు. మనం కళ్ళు తెరిచినప్పుడు, మూసినప్పుడు మనసులో అనేక రూపాలు, విషయాలు కదులుతుంటాయి. ఆధ్యాత్మిక సాధనలో దైవదర్శనం కూడా అలాంటిదే అయితే దాని ప్రత్యేకత ఏముంది. ఏకాగ్రత కోసం ఏర్పరచుకున్న రూపం కనిపించడం సాధనలో ఒకపురోగతి మాత్రమే. నిజమైన దర్శనం మనసుకు అతీతమైనది. అదే తురియావస్థ. ఆ స్థితిలో చూడటం, చూసేవాడు, చూడబడేది విడివిడిగా ఉండవు. ఆస్థితిలో చూస్తున్నాననిగానీ, నేను చూస్తున్నా నని గానీ, ఫలానాది చూస్తున్నానని గానీ లేని స్థితి నిజమైన దైవ దర్శనం. అదే దివ్యత్వం. ఆ దివ్యత్వాన్ని సాధించటానికి మనోదేహాలే మనకు సాధనా పరికరాలు.
✳️ ధ్యానస్థితి కోసం అభ్యాసం చేయాలి. ధ్యానస్థితి, నిద్రాస్థితి ఒకేలా ఉంటాయి. కానీ చిన్న తేడా ఉంది. రూపనామాలు లేని ఉనికిగా ఉంటే ధ్యానం. ఆ ఉనికి కూడా లేని స్థితే నిద్రావస్థ. మన ప్రయత్నంతో సాధించే శాంతి ధ్యానం. అప్రయత్నంగా లభించే దేహ విముక్తి నిద్ర. మన మనసు ప్రకృతితో ఉంటే బద్ధులం అవుతున్నాం. సత్యంతో ఉంటే బుద్ధులం అవుతున్నాం. మనం ఉదయంలేచింది మొదలు దినచర్య అంతా అనేక కర్మలతోనే ముడిపడి ఉంది. అవి ఎవరికైనా తప్పేవికావు. ప్రతీపనికి విధిగా జ్ఞాపకం అవసరం. జ్ఞాపకాలు, పనుల కలయికే జీవనం. మనకి రెండురకాల జ్ఞాపకాలున్నాయి. అవి దేహపరమైనవి, మానసికమైనవి. దేహపరమైన జ్ఞాపకాలు అంటే జీవన అవసరాలు. మానసిక జ్ఞాపకాలంటే సుఖ, దు:ఖ భావనలు. ఈ మనోజ్ఞాపకాలే మనలని అశాంతికి గురిచేసేవి. ప్రతిపని మనం సుఖసంతోషాలతోనే ముగియాలని కోరుకుంటున్నాం. ఇదే ఒక జ్ఞాపకంగా ఉంది. జ్ఞాపకంలో అనుభవించిన సుఖసంతోషాలతో పోల్చుకొని ప్రస్తుతం కలిగిన సంతోషాన్ని పొందలేక పోతున్నాం. అందువల్లనే కలిగిన సంతోషాన్ని కూడా పొందలేకపోతున్నాం. అంటే మనసు సుఖసంతోషాలతోపాటు అవే రకమైన గత అనుభవాలు కూడా కోరుకుంటుంది. అది సాధ్యం కాకపోవడంతో దు:ఖపడుతుంది.
✳️ మామిడి చెట్టును నాటిన ఐదేళ్ళకు అది ఫలాలను ఇస్తుంది. ఇక్కడ చైతన్యశక్తి చేసుకున్న ఏర్పాటులోనే ఫలం ఉంది. ఫలంకోసం మరో కొత్త ఏర్పాటురాదు. ఇది గుర్తించలేకనే అశాంతి. జీవనంలో 'ఇది అనవసరం’ అని ప్రత్యేకంగా చెప్పే అంశం ఏదీలేదు. ఎందుకంటే అవసరం దోషం కాదు. ‘అతి’యే దోషం. మనం ఇప్పుడు అనేక పనులకోసం అనేక జ్ఞాపకాలతో ఉన్నాం. కనుకనే అది జీవనం అయింది. *ఒకే జ్ఞాపకంతో ఉండగలిగితే అదే ధ్యానం.* రోజంతా ఒకే జ్ఞాపకంలో ఉండటం ఎలా సాధ్యం. రోజంతా పనులు ఆపుకొని నామజపం చేయటం కష్టం. పనికీ, పనికి మధ్య ఆ నామాన్ని స్మరించగలిగితే అది నిరంతర నామజపమే అవుతుంది. అలాకాకుండా ఆ భావనలోనే లీనమైపోతే అది సమాధి. అదే పవిత్రజీవనం. అలాంటి మహానుభావుల వద్దకు వెళ్ళి చేసే సత్సంకల్పాలు వెంటనే ఫలిస్తాయి.
✳️ మనం ధ్యానానికి, జపానికి ఆలోచనలు అడ్డువస్తున్నాయని అనుకుంటున్నాం. ఆలోచన అంటే ఏమిటంటే, చేద్దాం అనుకుని వదలి అంతరంగంలో ఉన్న పనికి మనసులో సాగే ప్రణాళికే ఆలోచన. మనసు అనుకున్నది శరీరం చేస్తే అది అనుభవం అవుతుంది. శరీర క్రియగా మారని ప్రణాళికే వృధా ఆలోచన. పనులు, వాటికి అవసరమైన జ్ఞాపకాలు కావల్సిందే. పనికిరాని, పనిలేని జ్ఞాపకాలు శాంతికి దూరం చేస్తున్నాయి. ఏ పనిలో ఉన్నామో ఆ ఆలోచనలో ఉంటే శాంతిగా ఉంటాం. విమానంలో వెళ్తూ కూడా ఇల్లు శుభ్రం చేసుకోవాల్సిన పని గురించి ఆలోచించాలా?
✳️ మనం మాట్లాడకుండా ఉండటమే మౌనం అనుకుంటున్నాం. నోటితో మాట్లాడక పోయినా మనసు మాట్లాడుతూనే ఉంటే అది మౌనంకాదు. సత్యసాయిబాబావారు ఇలా చెప్పారు... " రేడియో శబ్దాన్ని ఎంత తగ్గించినా, పూర్తిగా కట్టేసే వరకూ అందులో ఉండే బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది. అలానే మాట్లాడకుండా ఉన్నా ఆలోచనలతో మన మనోశక్తి ఖర్చు అవుతూనే ఉంటుంది.”
✳️ మనసు ఒక బ్రహ్మరాక్షసి. దానికి ఏదో ఒక పని లేక పోతే అది అశాంతికి గురిచేస్తుంది. అందుకే నిరంతర నామం, సత్సంగంతో ఉంటే మనసు అదుపులో ఉంటుంది. జపానికి ఫలానా దైవనామమే కావాలని నిబంధన లేదు. ‘అమ్మ’ అన్న పదంనుండి ప్రతిదీ మనం నేర్చుకున్నదే. పుట్టగానే ఎదురుగా ఉన్న అమ్మ గురించే మనకు తెలియదు. ఇక ఏ దేవుడి గురించి మాత్రం ఏమి తెలుస్తుంది? మనం నేర్చుకున్నదంతా విన్నదే. రాముడి గురించి అయినా, రమణుడి గురించి అయినా విన్నాం కనుక ఇతరులందరికి వారితో పోలికను తెస్తున్నాం. మనం ఏదీ ప్రత్యక్షంగా చూసిందిలేదు. మనశ్శాంతి కోసం చేసుకునే ఆధ్యాత్మిక సాధనలో కూడా కేవలం విన్న జ్ఞానంతో వాదులాట ఎందుకు? మనం సొంతంగా తెలుసుకున్నదే మనకి బలం. అందుకే రమణ భగవాన్ *"తెలియని దైవంగురించి తెలుసుకునే ముందు అసలు ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకో”* అన్నారు. మనం ఏమిటో మనకి తెలిసిన రోజున దైవం ఏమిటో అనుభవంలోకి వస్తుంది.
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment