*జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం.....*
మానవ జీవితం అంతా దోషభూయిష్టం. దుఃఖభూయిష్టం. అప్పుడప్పుడు కొన్ని సుఖాలున్నా దుఃఖాలు మాత్రం తప్పవు. ఇలా దుఃఖాలతో కూడినదే ఈ మానవజన్మ అని తెలిస్తే దీనిపై వైముఖ్యం కలుగుతుంది. వైరాగ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మలు వద్దు అనిపిస్తుంది. జన్మరాహిత్యానికి ప్రయత్నించాలి అనిపిస్తుంది. కనుక ఈ జన్మలోని దుఃఖ దోషాలను నిశితంగా పరిశీలించాలి.
‘ప్రపంచం దుఃఖమయం, దేహం రోగమయం’ అని పెద్దలు చెబుతారు. ‘అనిత్యమసుఖంలోకం’ అని గీతాచార్యుడే అన్నాడు. ‘విద్ధి వ్యాద్యభి మానగ్రస్తం లోకం శోక హతం చ సమస్తం’ అని భజగోవిందంలో శంకరాచార్యులవారన్నారు. వ్యాధులతోను, అభిమానంతోను కూడి దుఃఖాల చేత సతమతమైపోతున్నదీ జన్మ అని.
పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడూ ఏడుస్తాడు, మధ్యలో రోగాలొస్తే ఏడుస్తాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తాడు. ఇవే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం.
(i) జన్మదుఃఖం :-
ఇది ఎలాంటిదో గర్భోపనిషత్ చెబుతున్నది.. కోడిగ్రుడ్డు అంత గర్భకోశంలో 9 నెలల నివాసం. అక్కడి క్రిములచేత పీడించబడటం, జఠరాగ్ని చేత తపించిపోవటం, తల్లి ఆహారవిహారాల వల్ల అలమటించిపోవటం, మావిచేత బిగించబడి తలక్రిందులుగా ఉండటం, పూర్వజన్మలస్మృతితో విపరీతంగా దుఃఖించటం, ప్రసూతివాయువుల చేత త్రోయబడటం, బయటబడి మలమూత్రాలలో పెద్దపురుగులాగా పొర్లాడటం - ఇవన్నీ జన్మదుఃఖాలే.
(ii) మృత్యుదుఃఖం :-
పుట్టిన ప్రతిజీవి తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యుదుఃఖం. ఈ దేహం మృత్యుదేవత సొత్తు. పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు, స్వీటు, హాటులతో చక్కగాపెంచి, ఫారిన్ సెంట్లు, పౌడర్లు, సోపులు, కాస్మెటిక్స్ తో పోషించిన ఈ బంగారంలాంటి శరీరానికి చివరిదశ ఏమిటో కళ్ళు మూసుకొని ఒక్కసారి భావనకు తెచ్చుకోండి. మర్మస్థానాలు భేదించబడటం, అంగసంధులు వికలమైపోవటం, నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటకురావటం, ప్రాణోత్ర్కమణ జరిగేటప్పుడు లక్ష తేళ్ళు ఒక్కసారిగా కుడితే కలిగేంత బాధ, వశం దప్పి మలమూత్రాలు విడిచి పెట్టటం, భరించలేని యాతన. ఇవి మృత్యురోగాలు.
ఇంతేనా ? ఇక మరణించబోతున్నాను అని తెలియగానే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, కట్టాలనుకున్న మేడలు, భార్యాబిడ్డలు అంతా గుర్తుకు వస్తారు. ఇంత సంపాదించి అన్నీ వదిలిపెట్టి పోతున్నానే అనే బాధ. ఇదంతా మృత్యు బాధ.
మరణానికి మరొక మారుపేరు "మార్పు". మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ మరణం అనే పదాన్ని వాడగానే చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించివున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే "అవస్థాషట్కము" అని అంటారు. అవి 1. పుట్టుట, 2. ఉండుట, 3. పెరుగుట, 4. మారుట, 5. క్షీణించుట, 6. నశించుట. దీనినే భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగము 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు.: 'దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి '
జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతరప్రాప్తి అను నాలుగు అవస్థలు కలవని. ఇవన్నియూ మార్పులే అని. మనిషి, బాల్యము పోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుటలేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, భయం పొందుతూ ఉంటాడు. మనిషి, మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటంవల్ల భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని, మోహాన్ని, బంధాన్ని అతిగా పెంచుకోవటంవల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలుగచేస్తుంది.మృత్యు భయం వీడకపోవటానికి కారంణం...
భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ మృత్యు భయం వీడకపోవటానికి కారణం ‘మోహం' మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు, ధర్మరాజుని ప్రపంచంలో అన్నిటినీమించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు! అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవటమే ఆశ్చర్యమని చెబుతాడు! మృత్యువుని గురించి నచికేతుడు యమధర్మరాజుని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అది ‘కఠోపనిషత్' గా ప్రసిద్ధి చెందింది. ఇక భగవద్గీతలో కూడా దీన్ని గురించి చెప్పబడింది. దాని ప్రకారం - ఏది అభౌతికమైనది అంటే.‘ఆత్మే' అభౌతికమైనది.దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ' అవుతుంది. ‘జీవాత్మ' దేహత్యాగం చేస్తే ‘ఆత్మ'గా మిగిలిపోతుంది. పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం. భూమిలోను అగ్నితత్వం. అగ్నిలోను, జలతత్వం, జలములోను వాయుతత్వం. వాయువులోను శబ్దతత్వం. ఆకాశంలోను లయమౌతాయి. ఇదీ క్లుప్తంగా గీత చెప్పింది.మృత్యువును, జననం అంత సహజంగా చూస్తారు.
భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవించాయి కదా మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే పూర్తిగా నిరాసక్తతగా ఉండండి Be Totally Detached ఎందుకంటే మృత్యువు సమీపించినప్పుడు జరిగేది అదే చనిపోవటమంటే అన్నిటినీ వదులుకోవటం To give up everything మృత్యువు అన్నిటినుంచి మనల్ని తోసివేస్తుంది. ఇవన్నీ క్రోడీకరిస్తే మృత్యువు అంటే స్వేచ్ఛగా ఉండటమే అనుక్షణం మనం శ్వాస, నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం, కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం. పునర్జన్మ అంటే ఇదే So, Living is Dying ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువుని చూసి భయపడటం అర్ధరహితం,
జర-మరణ-మోక్షయ
మామ్ ఆశ్రిత్య యతన్తి యే
తే బ్రహ్మ తద్ విదుః కృత్స్నమ్
అధ్యాత్మమ్ కర్మ చఖిలమ్
వృద్ధాప్యం మరియు మృత్యువు నుండి విముక్తి కోసం ప్రయత్నించే తెలివైన వ్యక్తులు భక్తితో నన్ను ఆశ్రయిస్తారు. అతీంద్రియ మరియు ఫలవంతమైన కార్యకలాపాల గురించి వారికి పూర్తిగా తెలుసు కాబట్టి వారు నిజానికి బ్రహ్మం..
చివరిగా ఒక్క వ్యాఖ్య
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ||
No comments:
Post a Comment