Thursday, July 25, 2024

ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు జపానికి దర్భాసనం ఎందుకు ఉపయోగిస్తారు.

 *ఒట్టినేలపై ఎందుకు కూర్చోకూడదు

జపానికి దర్భాసనం ఎందుకు ఉపయోగిస్తారు.

ఆసనం అంటే ఏమిటి?
వేటిని ఆసనములుగా ఉపయోగించాలి?
దేనిమీద కూర్చొని పూజ చేయకూడదు?
ఏ ఆసనం మీద కూర్చోవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగును?
మనం వేసుకొనే ఆసనము ఎంత ఎత్తులో ఉండాలి?
అనారోగ్యంగా ఉండి కింద కుర్చోలేని వారు ఎటువంటి ఆసనాన్ని ఉపయోగించాలి?

ఆసనం అంటే ఏమిటి?
ఆత్మసిద్ధి ప్రదానాశ్చ సర్వరోగనివారణం|
నవసిద్ధి ప్రదానాశ్చ ఆసనం పరికీర్తితం||
పూజ చేసేటప్పుడు ఆసనానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పై శ్లోకం ద్వారా ఆసనంలోని అక్షరాల సంస్కృత అర్ధాలను పరిశీలిస్తే…
‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తూ, ‘స’ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం.

పూజ చేసే సమయంలో నేలమీద కూర్చుని పూజ చేయకూడదు. వ్రతాలు, నోములు ధ్యానం, స్తోత్రాదులు చేసేటపుడు భగవంతునికి ఎదురుగా ఆసనం మీద ఆసీనులు కావాలి. ఉచితాసనం పైన కూర్చునే ధార్మిక కార్యాలు చేయాలని, ఆసనం లేకుండా చేసే పూజ దైవకార్యాలు ఎటువంటి ఫలాన్ని ఇవ్వవని బ్రహ్మాండపురాణం చెప్తోంది.

దేనిమీద కూర్చొని పూజ చేయకూడదు?

దేవాలయాల్లో పూజారులు కానీ నేలపైన కూర్చుని పూజచేసినట్లు అయితే వారికి కష్టాలు, మానసికవేదన, చిత్త్భమ్రబాధలు, దుఃఖాలు కలుగుతాయి. అందుకనే వారు దర్భాసనం,  కూర్మాసనం లేదా పుల్లల చాప లాంటివి ఆసనాలుగా ఉపయోగిస్తారు.

రాతి మీద కూర్చుని పూజచేస్తే అనారోగ్యాలు కలుగుతాయి.

చెక్కపైన కూర్చుని చేస్తే దురదృష్టం సంపద నష్టం లాంటివి కలుగుతాయి.

గడ్డిపైన కూర్చుని పూజచేస్తే ఇతరులనుంచి అవహేళన, అమర్యాద కలుగుతాయి.

వెదురు చాపపై కూర్చుని పూజించడం కూడా దారిద్య్రానికి గురౌతారు.

బట్టపైన కూర్చుని పూజచేస్తే హాని కలుగుతుంది.

కూర్చునేటప్పుడు ఏదో ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలని, కటికనేలమీద కూర్చోకూడదు అని పెద్దలు చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

కూర్చోడానికి కుర్చీ, పీట, మంచం - ఇలా ఏదో ఒక ఆసనాన్ని ఉపయోగించాలి. ఆసనం అనేది అనేక రకాలుగా చేయబడుతుంది. చెక్కతో తయారయ్యే పీట మొదలైన ఆసనాలు, ఈతాకు, తాటాకు, జనపనార తదితరాలతో తయారయ్యే చాపలు, ఉన్ని, నూలు తదితరాలతో రూపొందే వస్త్రాలు, దర్భాసనం, జింక చర్మం, పులిచర్మం, లోహంతో రూపొందిన ఆసనం - ఇలా అనేకం ఉన్నాయి. కూర్చునేటప్పుడు వీటిల్లో ఏదో ఒకదానిపై కూర్చోవాలి. అంతే తప్ప ఏ ఆసనమూ లేకుండా ఒట్టి నేలమీద కూర్చోకూడదు.

ఏ ఆసనం మీద కూర్చోవడం వల్ల ఎటువంటి ఫలితం కలుగును?

ప్రత్యేకంగా పూజకోసమే తయారుచేసుకొన్న పుల్లల చాపపైన కూర్చుని చేసే అదృష్టం, సంపదవృద్ధి కలుగుతాయి.

కృష్ణజింకచర్మం పైన కూర్చుని పూజ చేయడం సర్వ శ్రేష్ఠం అంటారు.

తివాచి పైన కూర్చుని కూడా పూజ చేయవచ్చు. ఏకాగ్రత కలుగుతుంది.

పట్టు వస్త్రాన్ని ఆసనంగా ఉపయోగించడం వల్ల శ్రేయస్సు కలుగును. కానీ దీనిని పవిత్రంగా భద్రపరుచుకోవాలి.

అలానే ఎరుపు రంగు కంబళిపైన కూడా కూర్చుని పూజ చేయడం వలన సంపదలు కలుగును.

వీటిలో కనీసం ఏ ఒక్కటి ఆసనంగా లేకపోయినా కనీసం అక్షతలను కింద వేసుకొని కూర్చొని పూజ చేయవచ్చును

కటికనేల మీద ఎందుకు కూర్చోకూడదు అంటే..

మన శరీరంలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఉత్పత్తి అయిన విద్యుత్తు బయటకు పోతూ ఉంటుంది. ఉత్పత్తి అయ్యే, వెలుపలికి పోయే విద్యుత్తు సమతూకంలో ఉండాలి. అందులో హెచ్చుతగ్గులు ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఒక ఆసనం మీద కూర్చోవడాన మన శరీర ఉష్ణోగ్రత సమానంగా ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఒట్టినేలమీద కూర్చున్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యేదాని కంటే ఎక్కువ విద్యుత్తు బయటకు పోతుంది. యోగాసనం వేసేటప్పుడు చాప లేదా పులిచర్మాన్ని ఉపయోగించాలి. ఒట్టినేలపై కూర్చోకూడదు అని శాస్త్రం చెప్తోంది. 

పూజ చేయడానికి, అన్నం తినడానికి, ప్రవచానానికి, మామూలుగా కాలక్ష్యేపానికి, విశ్రాంతి తీసుకోడానికి ఇలా రోజులో అనేక సందర్భాల్లో అనేక రకాలుగా కూర్చుంటాం.

ప్రత్యేకించి పూజా కార్యక్రమాలలో 
దర్భాసనం పై కూర్చుని పూజ చేసుకోవటం చాలా శ్రేష్టం.

పురాణాల్లో గరుత్మంతుడి కథ చాలామందికి తెలిసిందే. ఒక పందెంలో ఓడిపోయి, సవతి తల్లి కద్రువకు దాసిగా ఉన్న తన తల్లి వినతకు ఆ దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి గరుడుడు స్వర్గానికి వెళ్ళాడు. అమృతభాండాన్ని సంపాదించాడు. అయితే కద్రువ సంతానమైన నాగ జాతికి ఆ అమృతం అందకుండా చూడాలని ఇంద్రుడు కోరాడు. అమృతభాండాన్ని నాగుల దగ్గరకు తెచ్చి, వినతకు గరుత్మంతుడు దాస్య విముక్తి కలిగిస్తాడు. 

అమృతభాండాన్ని దర్భల మీద పెట్టి, శుచిగా స్నానం చేసి వచ్చి అమృతం స్వీకరించాలని నాగులకు చెబుతాడు. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఇంద్రుడు ఆ భాండాన్ని తీసుకుపోతాడు. అలా అమృత భాండం పెట్టడం వల్ల దర్భలు పవిత్రమయ్యాయి. 

అందుకే అమృతతుల్యమైన దర్భలతో చేసిన ఆసనం మీద కూర్చొని చేసే జపం మంచి ఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెప్పారు.

జపం లేదా పూజ చేసేటప్పుడు ఆసనం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి. ఆ ఆసనం గురించి కొంత తెలుసుకోవడం ఉత్తమం. దర్భాసనము వేసుకుని, దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేయడం ఉత్తమం. కొందరు క్రమంగా దర్భాసనం, కంబళి, వస్త్రం వేసుకుని జపం చేస్తారు. 

కేవలం పీట వేసుకుని జపం చేయడం మంచిది కాదు. "దరిద్రం దారుకాసనం" అన్నారు. పీటపై వస్త్రం వేసుకుని చేసుకోవాలి. పీట 6 అంగుళాల ఎత్తులో చేయించుకుంటే మంచిది అంటారు. అలా చేయడం వలన భూమ్యాకర్షణ శక్తికి లొంగక మన మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది.
దర్భాసనం

యోగులు దర్భాసనం వేసుకుని, దానిపై కృష్ణాజినం (జింకచర్మం) మరల దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేసుకునేవారు.

మీరు కూడా కృష్ణాజినం ప్రయత్నించేరు సుమా! ఆ పని మాత్రం చేయకండి. మన జపం చిన్న జీవికి కూడా హాని కలింగించ కూడదు. అలా జరిగిన నాడు ఆ జపం నిష్ఫలం.*

మనము వేసుకొనే ఆసనం ఎన్నడూ భగవంతుడి పీఠము కంటే ఎత్తులో ఉండరాదు. కానీ…

‘శరీర మాద్యం‌ ఖలు ధర్మసాధనం’ కావునా… శరీర రుగ్మతల దృష్ట్యా కింద కూర్చొని పూజ చేయలేని వారు ఎత్తైన కుర్చీపై  దర్భాసనమును వేసుకొని, పూజ చేయదలచిన పూజా పీఠమును కొంచెం ఎత్తుగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని భగవంతుడిని పూజించవచ్చు.

గమనిక: పూజ, ధ్యానం లేదా జపం పూర్తి అయిన తర్వాత ఆసనమును తప్పక తీసి భద్రపరచవలెను.

No comments:

Post a Comment