Thursday, July 25, 2024

****గడ్డ కట్టిన మనుషుల మధ్యన జీవించిన ఒక మహోన్నతుడి చరిత్ర.

 


అంటరానితనం.. వెలివేయటం.. మూడు రూపాయిలు.. ఎనిమిదిన్నర  రూపాయల జీతం..
ఓ బస్తాడు ఒడ్లు..ఓ బీడీ కట్ట. చివరికి పద్మభూషణ్ అవార్డ్.

చదవండి.. గడ్డ కట్టిన మనుషుల మధ్యన జీవించిన ఒక మహోన్నతుడి చరిత్ర.
◆◆◆
వడగాడ్పు జీవితం
--------------------------
వ్యాసరచన - ఎన్.జె.విద్యాసాగర్ గారు 

మహాకవి #గుఱ్ఱం_జాషువా ప్రజ్ఞ బహుముఖీనం. ఆయన కవి, నాటక రచయిత, నేత్రావధాని, చిత్రకారుడు. ఈయన తండ్రి గుఱ్ఱం వీరయ్య యాదవ కులానికి చెందినవాడు. తల్లి లింగమాంబది మాదిగ కులం. మిషను హాస్టల్లో చాట్రగడ్డపాడుకు చెందిన లింగమాంబతో గుర్రం వీరయ్యకు పరిచయం ఏర్పడిరది. లింగమాంబను పెళ్ళి చేసుకొంటానంటే యిరుపక్షాల పెద్దలు అంగీకరించలేదు. క్రైస్తవ మతం స్వీకరించాలని షరతు పెట్టి, స్వీకరించిన తరువాత క్రైస్తవ మతాధికారులు వీరి వివాహం జరిపించారు. హిందూమతం, యాదవ కులం రెండూ వదిలేసి ప్రేమకోసం క్రైస్తవ మతాన్ని, మాదిగ కులాన్ని స్వీకరించాడు గుర్రం వీరయ్య. కులాంతర వివాహం చేసుకొన్న ఈ దంపతులు పేదరికం, కులవివక్ష, బంధువుల నిరాదరణలకు గురయ్యారు. నెల్లూరు దగ్గర రామాయపట్నంలో పాస్టరు శిక్షణ పొంది వినుకొండలో పాస్టరుగా పనిచేశాడు వీరయ్య. 

పుట్టిన పిల్లలందరూ వరుసగా చనిపోతుండగా 1895 సెప్టెంబర్‌ 28వ తేది ఉదయం వినుకొండలో వూరికి దూరంగా వున్న మిస్సమ్మ తోటలో ఒక మూలన వున్న ఇంట్లో పుట్టాడు జాషువా. జాషువా అంటే ‘‘యెహోవాయే రక్షణ’’ అని అర్థం. జాషువాను తల్లిదండ్రులిద్దరూ అబ్బురంగా పెంచారు. చుట్టుపక్కల వాళ్ళు జాషువా కొంటెచేష్టల్ని భరించలేక ఇంత అల్లరి పిల్లవాణ్ణి ఎలా కన్నావమ్మా? యెప్పటికైనా బాగు పడతాడా అంటే తల్లి లింగమాంబ నా కొడుకును మీరు పెంచడం లేదుగా మీకెందుకా బాధ అని సమర్థించుకొనేది. వీరయ్యకు గొల్లసుద్దులు వింటే పూనకం వచ్చేది. కరియావలరాజు, పాగ్మ్యం వంటి గొల్లసుద్దుల్ని విని ఉద్వేగానికి లోనయ్యేవాడు. పలనాటి కథలంటే చెవికోసుకొనేవాడు. తండ్రి పాడిన గొల్లసుద్దులు, పలనాటి వీరగాధలు జాషువా మీద ప్రభావం చూపినాయి. హరిజనుల పిల్లలకు, సవర్ణుల పిల్లలకు మధ్య ఒక బల్లను అడ్డుగా వుంచిన పరిస్థితుల మధ్య జాషువా హైస్కూలు విద్యాభ్యాసం గడిరచాడు. హైస్కూల్‌ విద్య ముగిసిన తరువాత గుంటూరు జిల్లా బాపట్లలో అమెరికన్‌ బాపిస్టు మిషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో హయ్యర్‌ గ్రేడు టీచర్‌ శిక్షణ పొందాడు. ఆ తరువాత ‘ఉభయ భాషా ప్రవీణ’ చదివాడు.

జాషువా పుట్టిన పదేళ్ళ తరువాత తమ్ముడు ఇజ్రాయేల్‌ పుట్టాడు. జాషువా 15వ ఏట మేనమామ మందా వెంకటస్వామి రెండో కూతురు మేరిని వివాహం చేసుకొన్నాడు. భార్యల్ని అంత మర్యాదగా పిలిచే రోజులు కావవి. కానీ జాషువా తన భార్య మేరిని మెరాయ్‌ అని ప్రేమగా పిలిచేవాడు.

కవితా పరిశ్రమ
భాష మీద పట్టుకోసం ‘‘కంటబడ్డ పద్యకావ్యంబు సాధించి చదువకుండ వదలలేదు’’ ‘‘కవిత చెప్పువాడు గనుపింపనేయంబు సేయకుండ వెడలనీయ లేదు!’’ అని చెప్పుకొన్నాడు జాషువా. అధ్యయనంలో భాగంగా హిందూ పురాణాలు, పద్య కావ్యాలు చదవడం స్వమతస్థుల ఆగ్రహానికి కారణమైంది. హిందూ మతాన్ని ప్రచారం చేసే కథలు, నాటకాలు రాస్తున్నాడని క్రైస్తవ మతాధికారులు ఇంకా కొందరు కలిసి జాషువాను కులం నుండి వెలివేశారు. అందువల్ల తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను కూడా విడిచి వూరికి దూరంగా వుండవలసి వచ్చింది. కులం కట్టుబాటు పాటించకపోతే చేస్తున్న ఫాదరీ ఉద్యోగం యెక్కడ పోతుందోనని తండ్రి వీరయ్య కొడుకును ఇంటికి కూడా రావద్దని చెప్పాడు. పగలంతా వూరికి దూరంగా వున్న పాడుబడ్డ మసీదులో వుండి రాత్రి చీకటి కాగానే రహస్యంగా ఇంటికి వచ్చి తల్లి పెట్టిన భోజనం తిని మళ్ళీ మసీదుకు చేరుకొనేవాడు.

రహస్యంగా మిత్రుల సహాయంతో మసీదులో పురాణాలను, ఇతిహాసాలను చదివి భాషను సుసంపన్నం చేసుకొన్నాడు. జూపూడి హనుమచ్ఛాస్త్రి అనే బ్రాహ్మణ పండితుడు జాషువాకు కాళిదాస త్రయం బోధించి సంస్కృతం నేర్చుకోవాలనే తపన తీర్చాడు. కాళిదాస త్రయం అంటే మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం.

ఉద్యోగాలూ ` అవమానాలు
జాషువా తన సొంత ఊరు చాట్రగడ్డ పాడులో టీచరుగా నెలకు మూడు రూపాయల జీతానికి పనిచేశాడు. హిందూ గ్రంథాలను చదవడం, ఆ కథలనే నాటకాలుగా రాయడం మొదలైన కారణాలతో పాటు ఆయన ప్రణయ కలాపాలను కారణంగా చూపి ఆ ఉద్యోగం నుండి తొలగించారు. కొప్పరపు కవుల్లో ఒకరైన కొప్పరపు సుబ్బారావు వినుకొండ వచ్చినప్పుడు జరిగిన సభలో ఆయనమీద జాషువా ఒక పద్యం రాసి వినిపించినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. కానీ సభలోని అగ్రకులాల వాళ్ళు అంటరానివాడు యీ సభకు రావడమేమిటని సభనుండి వెళ్ళిపోయారు.

శ్రీశ్రీ రాతల్లోను, మాటల్లోను కిందకులాలను అవమానించడానికి సంకోచించేవాడు కాదు. ముస్లింలను అవమానిస్తూ కసాయిబు అనడం మాల కులాన్ని గురించి మాలవాళ్ళు రెండు రకాలు ` డ్రామాల వాళ్ళు, సినిమాల వాళ్ళు అనడం మనకు తెలిసిందే. జాషువాను ఉపకవి, ద్వితీయ శ్రేణి కవి అన్నాడు శ్రీశ్రీ. ఆయన దృష్టిలో ప్రధమ శ్రేణి కవులంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాధ సత్యన్నారాయణ. వీళ్ళిద్దరి లోనూ వాస్తవికత లేదని, వీరిది వూహాప్రాధాన్యం కలిగిన కవిత్వం అని హేళన చేస్తూ ప్రణయ కవి యొకండు, పాషాణకవి యొకండు అని జాషువా విమర్శించాడు. అందుకే నవ్య సాహిత్య సమితి ప్రచురించిన కవితా సంకలనం ‘‘వైతాళికులు’’లో జాషువా కవిత్వానికి చోటు లేకుండా చేశారు.ఇప్పటికీ సాహిత్యకారులు వ్యాసాల్లో, ఉపన్యాసాల్లో చెళ్ళ పిళ్ళవారు, విశ్వనాధ వారు, దేవులపల్లివారు అని అగ్రకుల కవులను సంబోధిస్తారు. కాని గుర్రంవారు అని ఒక్కడూ అనడు.

1933లో ‘‘కవితా విశారద’’ బిరుదు స్వీకరించడానికి విశాఖపట్నం వెళ్ళినప్పుడు అందరికీ లోపల భోజనాలు ఏర్పాటు చేసి జాషువాను వరండాలో వేరుగా విస్తరి వేసి భోజనం పెట్టారు. 1957`59 మధ్య కాలంలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో స్పోకెన్‌ వర్డ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసినప్పుడు రేడియో కేంద్రంలోని బ్రాహ్మణులు జాషువా ఉనికినే భరించలేక పోయేవారు. చివరకు బీడీలు తాగుతున్నాడనే నెపంతో ఆ ఉద్యోగంలో నుండి తొలగించారు.

ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు అంటరానివారికి ప్రవేశం లేదు అని డప్పుకొట్టి చెప్పేవారు. ఇది తెలిసినా నాటకాల మీద వున్న మోజు కొద్దీ ఒకసారి నాటకానికి వెళ్ళి టిక్కెట్‌ కొనబోతే ‘నువ్వు అంటరాని వాడివి నాటకానికి రాకూడదు’ అని అవమానించారు. ఆ తరువాత రోజుల్లో మహానటుడు, పండితుడు బండారు రామారావు జాషువా రాసిన స్మశాన వాటిక ఖండకావ్యంలోని యెనిమిది పద్యాలను ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలోని కాటిసీనులో పాడినప్పుడు నిరక్షరాస్యులకు కూడా జాషువా కవితా సౌందర్యం తెలిసిపోయింది. కేవలం జాషువా పద్యాలకోసమే తెల్లవార్లు ప్రేక్షకులు ఎదురు చూస్తారు. డి.వి.సుబ్బారావు కాటిసీను పద్యాలతో గ్రామ్‌ ఫోను రికార్డు విడుదల చేసినప్పుడు మరింత ప్రాచర్యుం లభించింది. బండారు బాణీలను జోడిరచి చీమకుర్తి నాగేశ్వరరావు ప్రేక్షకులను జాషువా పద్యాలతో రంజింపచేశాడు.

బండారు రామారావు నీ పద్యాలను చెడగొడుతున్నాడు అని జాషువాకు ఎవరో చాడీలు చెప్పారు. నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రేక్షకుల మధ్యలో వుండి నాటకం చూశాడు. బండారు కమ్మని కంఠం నుండి అద్భుతమైన నటనతో జాలువారిన పద్యాలను విని జాషువా పులకించి పోయాడు. అప్పటికప్పుడు బండారు మీద పద్యం రాసి వినిపించాడు. బండారును ఆయన గురువు అద్దంకి మాణిక్యారావును గట్టిగా కౌగిలించుకొని ‘ఎంత సొగసుగా వున్నాయిరా మీ ముక్కులు. నాకొడకల్లారా ఇంత అందంగా ఎట్టపుట్టార్రా’’ అని ముద్దు పెట్టుకొన్నాడు. ఆ తరువాత వినుకొండలో బండారు రామారావుకు గండ పెండేరం తొడిగి సన్మానించాడు జాషువా.

ఒకరోజు హరిశ్చంద్ర పాత్రధారి డి.వి.సుబ్బారావు విజయవాడలో జాషువా కుమార్తె హేమలతను కలుసుకొని అమ్మా! మీ నాన్నగారి పద్యాలు పాడుకొంటూ పేరు తెచ్చుకొన్నాను. బాగుపడ్డాను. ఈ ఐదువందలూ పుచ్చుకోమ్మా అని చేతిలో పైకం పెట్టాడు.

ఘంటసాలగా పేరొందిన ఘంటసాల వెంకటేశ్వరరావు జాషువా రాసిన ‘‘శిశువు’’ పద్యాలను గ్రామ్‌ఫోన్‌ రికార్డులో పాడాడు. ఒకసారి మద్రాసులో ఘంటసాల ఇంటికి వెళ్ళాడు జాషువా. ఎవరండీ మీరు అని అడిగిన ఘంటసాల భార్యతో గుఱ్ఱం జాషువా వచ్చాడని చెప్పమ్మా అన్నాడు. లోపలికి వెళ్ళి ఘంటసాలకు చెప్పడంతో ఆయన బయటకు వచ్చి ఇక్కడే కూర్చున్నారే లోపలికి రండి అన్నాడు. నేను లోపలికి రాను. నేను బయటే ఉంటాను. ఎందుకంటే నేను అంటరాని వాడిని అన్నాడు జాషువా. భలేవారే అని గట్టిగా కౌగిలించుకొని జాషువాను లోపలికి తీసుకెళ్ళాడు ఘంటసాల.

పేదరికంలో సచేల స్నానం
మిషను స్కూల్లో ఉద్యోగం పోయిన తరువాత రాజమండ్రిలో మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశాడు జాషువా. మొదట నెలకు పదిహేను రూపాయల జీతం యివ్వడానికి ఒప్పుకొన్న సినిమా హాలు యజమాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండుపూటలా భోజనం వరకు యేర్పాటు చేశాడు. సినిమా హాల్లో పనిచేసే వాళ్ళల్లో జాషువా ఒక్కడే దళితుడు. దళితులకు హోటల్‌లో భోజనం పెట్టరు ఒక స్నేహితుడు భోజనం తీసుకొచ్చేవాడు. చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. కట్టుకున్న జత మినహా రెండో జత బట్టలు లేవు. సెకండ్‌ షో అయిపోయిన తరువాత వెళ్ళి గోదావరినదిలో ఉన్న ఒక్కజతా ఉతుక్కొని అవి ఆరిపోయేదాకా వుండి వాటినే మళ్ళీ వేసుకొనేవాడు. ఆ వుద్యోగం మానుకొన్న తరువాత రాజమండ్రి కోటిలింగాల పాఠశాలలో శ్రీపాద కృష్ణమూర్తి సిఫారసుతో నెలకు ఎనిమిదిన్నర రూపాయల వేతనంతో తెలుగు టీచరుగా చేరాడు.

తాకట్టులో గండపెండేరం
గుంటూరు జిల్లా కొలకలూరులో నూతక్కి అబ్రహం కవి వుండేవాడు. జాషువా గబ్బిలం రాస్తే అబ్రహాం మత్కుణం (నల్లి) పద్య కావ్యం రాశాడు. ‘‘నా అనుంగు శిష్యుడబ్బు రామబ్బురముగా రాసిన మత్కుణం’’ అని జాషువా ముందు మాట రాశాడు. అబ్రహాం కూడా చాలా పేదవాడు. ఒకసారి గుంటూరు జిల్లా రేపల్లెలో శ్రీశ్రీకి, నూతక్కి అబ్రహంకు సన్మానం జరిగింది. శాలువతో సత్కరించారు. సన్మానానికి కృతజ్ఞతలు చెబుతూ... నన్ను సన్మానించినందుకు మీకు నా వందనాలు. కాని ఈ శాలువా ఎంత ఖరీదు చేస్తుందో నాకు తెలీదు. శాలువా కాకుండా ఆ డబ్బులేవో నాకిస్తే కనీసం తెల్లకాగితాలైనా కొనుక్కొనేవాడిని. నాలాంటి పేదవాడికి కావలసింది దుప్పట్లు చప్పట్లు కాదు. ఆ శాలువా ఖరీదు నాకు ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది అన్నాడు నూతక్కి అబ్రహం.

'కమెండో’ ఎడిటర్‌ వినుకొండ నాగరాజు శ్రీశ్రీని రైలు ఎక్కిస్తూ హైదరాబాదులో మీ విగ్రహం వెయ్యాలనుకొంటున్నాను గురువు గారూ అన్నాడు. దానికి శ్రీశ్రీ నువ్వు విగ్రహం ఎక్కడ వేస్తావో చెప్పు అక్కడ నేనే నిలబడతా ఆ విగ్రహం డబ్బు లేవో నాకివ్వు అన్నాడు. శ్రీశ్రీ దగ్గర డబ్బులేక పోవచ్చుకాని జాషువా నూతక్కి అబ్రహంల వంటి పేదవాడు కాదు. వీళ్ళది దుర్భరమైన పేదరికం. ‘రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడెము’ కావాలన్నాడు అల్లసాని పెద్దన. అంటే, అవి కనీస సౌకర్యాలు వారికి, నాకు అవి కూడా చాలవు అన్నాడు కృష్ణశాస్త్రి. కాని ఇంట్లో బస్తా బియ్యం బీడికట్ట ఉంటే చాలు కలాన్ని పరుగులు పెట్టించగలనన్నాడు జాషువా. ఒకసారి నూతక్కి అబ్రహం, జాషువా తెనాలిలో తిరుగుతూ డబ్బు దొరికే మార్గం లేక నీరసించిపోయారు. చివరికి గండపెండేరం తీసుకెళ్ళి తాకట్టుపెట్టి డబ్బు తీసుకురమ్మని అబ్రహంను పురమాయించాడు జాషువా. ‘‘అయ్యా! చూస్తూచూస్తూ గండపెండేరం ఎట్లా తాకట్టు పెట్టాలయ్యా! అన్నాడు అబ్రహం. మన ఆకలి కూడా తీర్చడానికి అది ఉపయోగపడనప్పుడు మనకెందుకురా అది అన్నాడు జాషువా. గండపెండేరం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో అవసరం తీరింది. ఆ తరువాత అబ్రహం కవి మూడు బస్తాలు ధాన్యం అమ్మి గండపెండేరం విడిపించుకొని జాషువాకు అప్పగించాడు.

చిత్రకారుడూ ` నఖచిత్రకారుడు
 ఒకసారి అష్ఠావధానం జరుగుతున్నప్పుడు అవధానికి ఒక సమస్య ఇచ్చాడు జాషువా. సంస్కృతంలో దాని భావం ` ఒక జంతువు నాలుగు రోడ్ల కూడలిలో               వుంది. దానికి ఎనిమిది కాళ్ళు, రెండు ముఖాలు. దానికి సిగ్గు, భయం లేవు. కామంతో ఉంది. ఈ సమస్యను పూరించమన్నాడు జాషువా. ఈ సమస్యను అవధానితో సహా అక్కడున్న వాళ్ళు ఎవరూ చెప్పలేకపోయారు. చివరకు జాషువా లేచి చాక్‌పీస్‌ తీసుకొని బోర్డుమీద చిత్తకార్తె పిలుపు నందుకొని ప్రణయంలో మునిగి ఉన్న ఆడకుక్క మగకుక్క బొమ్మగీసాడు. అప్పుడు అర్థమయింది అందరికి, రెండు ముఖాలు ఎనిమిది కాళ్ళ జంతువు అంటే.

1952లో ఒక రోజు సాయంత్రం గుంటూరులో మాధవరెడ్డి రాజయ్యగారి ఇంటికి వెళ్ళాడు జాషువా. అక్కడ పిల్లల్ని వెంటతీసుకొని తిరుగుతున్న తల్లికోడి కనిపించింది. టేబుల్‌పైనున్న కార్డు ముక్క తీసుకొని గోటితో కదులుతున్న పిల్లల కోడి దృశ్యాన్ని చిత్రీకరించాడు జాషువా. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. రాజయ్య చూసి కవిగారూ! మీకు నఖచిత్ర కళలో సైతం ప్రావీణ్యమున్నట్లు చాలామందికి తెలియదే! అన్నాడు సంతోషంగా.

భార్య మరణం
 భార్య పిల్లలను ప్రాణంగా చూసుకొనేవాడు జాషువా. భార్య మేరీని ప్రేమగా మెరాయ్‌ అని పిలిచేవాడు. ‘‘ఆమె శరీర వర్ణం పసిడి కాంతులీనుతుంది. ఆమెను భరతమాతగా నటింపచెయ్యాలంటే కిరీటం ధరింపజేస్తే చాలు అని రాశాడు జాషువా శిష్యుడు పెద్ది సత్యనారాయణ. జాషువా యెక్కడికైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు మంచి జరగాలని భార్య యెదురొచ్చేది. నాకు రైలు అందకపోయినా, దొంగ జేబుకొట్టినా నీవే జవాబు దారీ అని హాస్యమాడేవాడు జాషువా.

భీమవరం సన్మానానికి బయల్దేరి వెళుతున్నప్పుడు నన్నుకూడా తీసుకెళ్ళండి అని భార్య మేరీ అడిగింది. ఈసారి తప్పకుండా తీసుకు వెళ్తాను మెరాయ్‌. ఇప్పుడు ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో అని నచ్చ చెప్పి వెళ్ళాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సన్మానసభలో తన పద్య పఠనంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న సమయంలోనే మేరీ మరణించిదన్న దుర్వార్త జాషువాకు తెలిసింది. భార్య మరణవార్త వినడంతోనే కన్నీరు కట్టలు తెంచుకొంది.
 ‘‘నీ వటు కాటిదిక్కు పనయనించిన నాటి మరుక్షణాన 
 సర్వావయ సంధిబంధనములన్నియు వీడె కవిత్వ భారతీ
 దేవత మూగవోయె సుదతీమణి నాదు కళా స్రవంతియున్‌
 నీ వెనుకన్‌ శ్మశాన ధరణిన్‌ నిదురించినదో ! సతీమణీ !’’

పిల్లలందరిలో హేమలత అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆమెకు చిన్నప్పుడే సాహిత్యంతో పాటు భరతనాట్యం కూడా నేర్పించాడు. గుంటూరు ఏ.సి. కాలేజీ అసెంబ్లీ హాలులో కనకాభిషేకం చేసిన సన్మానసభకు ముందుగా హేమలత భరతనాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఆమె నాట్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె లవణం (విజయవాడ నాస్తిక కేంద్రం వ్యవస్థాపకుడు గోరా కుమారుడు) ను కులాంతర వివాహం చేసుకున్నది.
 అయిదవ కుమార్తె !
 లవణం గారికి అర్థాంగి
 సహజ కరుణాన్విత !
 దివ్యాదర్శ భరిత !
 హేమలత !
 మిత్ర ప్రలాప
 ధర్మజ్ఞ సుమా !
 అని తన కుమార్తె గురించి జాషువా రాశాడు.

1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించింది. కానీ అంతలోనే జాషువాకు పక్షవాతం వచ్చింది. కదలలేని స్థితిలో ఉండగా గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆ బిరుదుకు సంబంధించిన పత్రం ` బహుమతులు చేర్చారు. సిల్కు లాల్చి, పంచె ధరించి జరీ కండువా వల్లె వాటుగా జారవిడిచి పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీసాలను సవరించుకొంటూ యెప్పుడూ శిష్యులూ అభిమానులు వెంట రాగా హుందాగా తిరిగిన జాషువా మాట పడిపోయి మంచం పట్టాడు. ఎవరైనా యెలా ఉన్నారూ అని అడిగితే జవాబుగా మీసం మీద చెయ్యివేసి మెలి తిప్పేవాడు. కవితాభిమానులు, బంధువులు, స్నేహితులు జాషువా 75వ జన్మదినాన్ని వైభవంగా జరిపారు.

 ‘‘నరజన్మంబను వ్యాధి బాధల కమోఘంబైన దివ్యౌషధం బరయన్‌ మృత్యువు’’ అని రాసుకొన్న జాషువా జులై 24 1975న గుంటూరులో మరణించినా ప్రజల నాల్కలపై నిలిచే ఉన్నాడు.

No comments:

Post a Comment