వాట్సాప్ డీపీతో జాగ్రత్త... డీపీ తో అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకున్నట్లే...!
మీ భార్యంటే మీకు అతిప్రేమా.. మీ ప్రేమను చూయించడానికి ఆమె ఫోటోనే వాట్సప్ డీపీగా పెడుతున్నారా. లేదంటే ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్, కవర్ పిక్చర్‌లోగానీ ఆమె ఫోటో ఉంచుతున్నారా... అయితే జాగ్రత్త. సైబర్ నేరస్తులు ఆ ఫోటోలతో మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిరావొచ్చు.
చెన్నైలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం
చెన్నై అయ్యన్నవరంలో నివసించే ఓ వ్యక్తిని ఇటీవల సైబర్ నేరగాళ్లు వేధిస్తున్నారు. ఆయన భార్య నగ్నఫోటోను పంపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. అడిగినంత డబ్బివ్వకుంటే ఆఫోటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ వేధింపులు భరించేక ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. సైబర్ నేరగాళ్ల వేధింపుల గురించి వివరించాడు. వెంటనే స్పందించిన పోలీసులు కేసును సైబర్ వింగ్ కు బదిలీచేశారు. అసలు నేరగాళ్లకు ఫోటో ఎలా దొరికిందని ఆరా తీశారు. అందులో అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తి వాట్సప్ డీపీగా పెట్టుకున్న ఫోటోనే సైబర్ నేరగాళ్లు మార్పింగ్ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం వారి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.
నిజానికి వాట్సప్‌లో ఫోటో షూట్ చేసుకొని డీపీలు, స్టేటస్‌లు పెట్టుకొని సంతోషపడటం సర్వసాధారణం అయింది. దీన్నే సైబర్ నేరస్తులు అవకాశంగా తీసుకుంటున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి వాట్సప్ డీపీల్లో తమకు పనికొచ్చే ఫోటో ఉంటే తీసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు. తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. మనం చేస్తున్న చిన్న తప్పు పెద్ద సమస్యలకు కారణమవుతోంది. అందుకే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు.
No comments:
Post a Comment