Friday, August 23, 2024

****నిలువునా కాల్చేసే ద్వేషం

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅
      *నిలువునా కాల్చేసే ద్వేషం*

*మానవ సమాజంలో సమదృష్టి, సమభావన చాలా అవసరం. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు అన్నింటి పట్లా ఒకే విధమైన భావం కలిగి ఉండటం చాలా కష్టం. కష్టం కలిగినప్పుడు కుంగిపోతాం. సంతోషం కలిగినప్పుడు పొంగిపోతాం. సమస్యలు చుట్టుముట్టినప్పడు ధైర్యంగా ఉండాలి. సంతోషం కలిగినప్పుడు నేల విడిచి సాము చేయకూడదు. జీవితంలో ఇటువంటి సమతుల్యత కలిగి ఉండటమే స్థితప్రజ్ఞ.*

*సమదృష్టి కలగాలంటే - ధనం పట్ల, ఆస్తుల మీద, అధికారం పైన తీవ్రమైన కాంక్ష ఉండకూడదు. ఇటువంటి స్వభావం ఉంటే అహంకారం అప్రయత్నంగానే వచ్చి చేరుతుంది. హిరణ్యకశిపుడి అహంకారం ఇటువంటిదే. మౌఢ్యం, అహంకారం అతడి ప్రేమను కూడా మంటగలిపాయి. దురహంకారంతో పేట్రేగిపోయే వ్యక్తికి పతనం అచిర కాలంలోనే సంభవిస్తుందని హిరణ్యకశిపుడి వృత్తాంతం బోధిస్తుంది. అది ఎటువంటిదైనా, స్వార్థం స్వీయ పతనానికి హేతువని మనిషి తెలుసుకోవాలి. సమభావం పెరగాలంటే ద్వేషాన్ని త్యజించాలి. ద్వేషం మనిషిని కనిపించకుండా కాల్చివేస్తుంది. పక్కవారి ఆనందాన్ని ఎదుగుదలను చూసి ఈర్ష్య చెందకూడదు. ఇటువంటి ద్వేషమే కదా కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ధృతరాష్ట్రుడిది అంధత్వమే కాదు, అతడిది మనో అంధత్వం కూడా. రెండు కళ్లూ ఉండి కూడా దుర్యోధనుడు పూర్తి అంధుడయ్యాడు. పాండవుల మీద అకారణంగా ద్వేషం పెంచుకుని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.*

*దీనికి అంతటికీ కారణం- ఓర్వలేనితనం, విపరీతమైన ద్వేష భావం. మనిషి తన లోపాలు తనకు తెలిసి కూడా సరిదిద్దుకోడు. ఎదుటివారిని చూసి తన లోపాలను సరిదిద్దుకోవడానికి అహం అడొస్తుంది. అటువంటప్పుడు ప్రకృతిని చూసైనా మనిషి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రకృతి గొప్ప దయామయి. అది మనిషిని బిడ్డలా ప్రేమిస్తుంది. దాపరికం లేకుండా తన సంపదను సకల మానవులకు పంచుతుంది. ప్రకృతికి ఉన్న సమదృష్టి ఈ మనిషికి లేకపోవడం ఎంత శోచనీయం? పంచభూతాలకున్న సమభావన ఈ మానవుడిలో లేకపోవడం ఎంత ఘోరం? ప్రకృతి ఇచ్చే ఈ సందేశమైనా మనిషిలో మానవీయ మార్పు తీసుకురావాలి.*

*ఎవరైనా విజయం సాధించాలంటే సమదృష్టి అలవరచుకోవాలి. ఎవరైనా అభివృద్ధి చెందాలంటే సమభావనను సాధన చేయాలి. జనన మరణాల మధ్య పాటించే ధార్మికతను సమతాభావానికీ అన్వయించుకోవాలి. ఈ పరివర్తన మనిషిలోని అహంకారాన్ని నియంత్రిస్తుంది. ఇటువంటి సంస్కృతి, సంప్రదాయాలు మనిషిలోని ద్వేషాన్ని, అహంకారాన్ని నిర్మూలిస్తాయి. అంతే కాకుండా సమదృష్టి, సమభావనలు- మనిషి విశాల దృక్పథం కోల్పోయి స్వీయ రక్షణ కోసం అలమటించే దుస్థితి రాకుండా మేల్కొలుపుతాయి.*
🔅🍂🔅 🍂🔅🍂 🔅🍂🔅
*🙏సర్వేజనా సుఖినో భవంతు🙏*
🌻🌴🌻 🌴🌻🌴 🌻🌴🌻

No comments:

Post a Comment