Wednesday, October 2, 2024

 *ఆత్రేయగీత*

మొదటి భాగం

"అధ్యాయము - 1
  
    "సత్యము”

ఆధ్యాత్మికంగా సత్యము అంటే - నిత్యము,
శాశ్వతము, ఎటువంటి మార్పులు వికారాలు
చెందనటువంటిది! చైతన్యముతో అన్నిటికీ ఆధారమైన పరబ్రహ్మము!

సత్యమే పరమాత్మ, సత్యాన్ని గుర్తించని జీవుడు పరమాత్మను చేరుకోలేడు.

సత్యాన్ని ఆధారం చేసుకొనే ధర్మము ఆవిర్భంచింది. సత్యము లోపించిన ధర్మము ఎక్కువ కాలము నిలబడదు. ధర్మము లేనిదే శాంతి, ప్రేమ, అహింసలకు మనుగడలేదు.

సత్యాన్వేషణలో సత్యము ఒక్కటే ప్రధానము. దాన్ని విస్మరించి చేసే ప్రయత్నము ఏదైనా అపార్ధానికి దారితీస్తుంది.

మనకు లభ్యమయ్యే ఎన్నోగ్రంధాలు సత్యము
గురించి సమగ్ర విశ్లేషణ జరిపేయి. సత్యాన్ని శోధించి, ఆచరించి ఎంతోమంది మహాపురుషులయ్యేరు.

సత్యంవద, ధర్మంచర   - వేదములు.

సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ   - ఉపనిషత్తులు.

సత్యమే చుక్కాని   - బ్రహ్మసూత్రములు.

సత్యధర్మాలే మానవుడ్ని పరమాత్మను చేస్తాయి   - శ్రీరామచంద్రుడు.

సత్యమును తెలుసుకున్నవాడు మాత్రమే నన్ను గ్రహింపగలడు  - శ్రీకృష్ణుడు.

సత్యం మాత్రమే మానవులను భగవంతుని వద్దకు చేర్చగలదు  - శ్రీ మధ్వాచార్యులు.

వున్నది ఒకటే సత్యము, కానీ పండితులు ఎన్నో రకాలుగా విశ్లేషణ చేస్తారు  - శ్రీ ఆదిశంకరులు.

సత్యాన్ని పదిమందికి పంచడంలోనే వుంది అసలు సత్యము  - శ్రీరామానుజులు.

విశ్వమంతటా సత్యాన్ని ప్రభోధించడమే నా ఆశయం.  - శ్రీ వివేకానందులు.

నేను ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం, సత్యము మాత్రమే చెప్పగలదు   - శ్రీరమణ మహర్షి.

శ్రద్ధ, సబూరి లతో అసలు సత్యాన్ని గ్రహింపగలరు - శ్రీ శిరిడి సాయినాధుడు.

సత్యాన్వేషణే నా జీవిత లక్ష్యము - మహాత్మా గాంధీ.

సందర్భాన్నీ బట్టీ, విశ్వాసాన్ని బట్టీ, సాంప్రదాయాన్ని బట్టీ, ఆచారాన్ని బట్టీ “సత్యం” మారదు. సత్యం శాశ్వతం, సనాతనం!

మానవుల్లో ఆలోచన ప్రక్రియ నానా రకాలుగా
వుంటుంది! ఒక్కొక్కరూ ఒక్కో ఆలోచనను అనుసరిస్తారు! ఆలోచనలు వేరైనా సత్యమొక్కటే! సత్యమే పరమాత్మ! అదే సత్యం! ఎన్ని కోణాలలో విశ్లేషించినా సత్యం మారదు!

ఈ సృష్టికి కారణమైన సత్యాన్ని గ్రహించడానికి ఎన్నో మార్గాలను కనుగొన్నాడు మానవుడు! కానీ వాటిని ఆచరించే గందరగోళంలో అసలు సత్యాన్ని విస్మరించాడు!

సాధనలో అంతిమ లక్ష్యం సత్యమై వుండాలి!
సత్యంకానిది పరమాత్మను చేరలేదు! మిగతా వ్యవహారములన్నీ బాహ్య ప్రకటనలే! అవే బంధానికి మూలకారణం! బాహ్యాన్ని త్యజిస్తే అంతా అంతర్ముఖమే! అదే సత్యం!      

No comments:

Post a Comment