Wednesday, October 2, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
స్థూల - సూక్ష్మ - కారణ దేహాలు :

సంకలనం : భట్టాచార్య

           --- 1 ---

   స్థూల శరీరము, పంచ మహా భూతాలతో తయారు చేయబడినది. ఆకాశ తత్వము, వాయు తత్వము, అగ్ని తత్వము, జల తత్వము, భూతత్వములతో...ఈ స్థూల దేహ నిర్మాణము జరిగినది. ఈ పంచ భూతాత్మక శరీరము నిరంతరము...జననము, మరణము, శరీర - మనో పరిపక్వత, వృద్ధి - క్షయాలు, మరణము...ఈ రకమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఈ మధ్యలో మనిషి అహంకార,మమకారాలకు లోనవుతూ ఉంటాడు. అరిషడ్వర్గాలకు లోనవుతూ ఉంటాడు. స్థూలంగా...ఇది స్థూల శరీర నిర్మాణం. ఒక విధంగా చెప్పాలంటే ఈ భౌతిక శరీరము, మిగతా అన్ని శరీరాలకూ వాహనము. ఈ స్థూల శరీరములోనే అన్నమయ, ప్రాణమయ  కోశములు ఉంటాయి ఈ స్థూల శరీరము..... తన పెరుగులకు, ఆహారము, జలము మరియూ వాయువులపై ఆధార పడి ఉంటుంది. మరణ సమయంలో ఈ పంచభూతాలు విఘటనం చెందడం వలన, స్థూల శరీరం ఉనికిలో ఉండదు.

 సూక్ష్మ శరీరము : మనస్సు మరియూ బుద్ధిని ఆధారం చేసుకుని సూక్ష్మ శరీరం పరిఢవిల్లుతుంది. ప్రాణమయ కోశంలో భాగమైన మనోమయ, జ్ఞానమయ కోశాలు...ఈ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. మనస్సును కూడా మన ఋషులు ఒక కోశంగా భావించారు. ప్రాణమయ కోశము , లింగ శరీరంలో ఉంటుంది. ఈ ప్రాణమయ కోశము యొక్క ప్రాణ శక్తి, మన మానసిక, శారీరక కార్యాలను నియంత్రిస్తుంది. ఇదంతా నాడీ వ్యవస్థ ద్వారా, షట్చక్ర వ్యవస్థ ద్వారా జరుగుతుంది.
 అన్నమయ కోశం కంటే ఈ ప్రాణమయ కోశం చాలా ముఖ్యమైనది. గొప్పదైన ప్రాణ శక్తితో ఈ పొర ఆవరించబడి యుంటుంది. ఈ ప్రాణ శక్తి, మన శరీర భాగాలలోనూ...తగుమాత్రంగా ఉన్నంత వరకూ...జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ పొర మానవ శరీరంలో జరిగే, శ్వాస-నిశ్వాస క్రియలు, జీర్ణ క్రియ, సర్వ జీవ క్రియలు, ప్రసరణ వ్యవస్థ, అంతస్రావీ గ్రంథుల వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థలను...ప్రభావితం చేస్తుంది.

   ఈ సూక్ష్మ శరీరము లేదా లింగ శరీరము...స్థూల శరీరం చుట్టూ...ఒక పొరలాగా ఆవరించి ఉంటుంది. Clairvoyants (దివ్య చక్షువు ఉన్మీలనమైనవారు) ఈ సూక్ష్మ శరీరాన్ని చూడగలరు.
 ఇది స్థూల శరీరానికి నమూనా అనుకోవచ్చును.
ఈ సూక్ష్మ శరీరము, భౌతిక శరీరం కంటే ముందుగా నిర్మించబడింది.
 ఈ లింగ శరీరము సూక్ష్మ శరీరం చుట్టూ ఆవరించబడి ఉంటుంది.
 మరణించిన భౌతిక శరీరము యొక్క చివరి కణం కూడా పంచ భూతాలలో కలసిపోయినపుడు, ఈ సూక్ష్మ శరీరం పూర్తిగా భౌతిక శరీరం నుండి దూరమైనట్లే. ఈ సూక్ష్మ శరీరము యొక్క  అంతర్భాగాల యొక్క ప్రతిరూపాలు శరీరంలో బహిరంగంగా వ్యక్తీకరించబడి ఉంటాయి. ఉదాహరణకు...మన శరీరంలో శక్తి చక్రాలు ఏఏ ప్రదేశాలలో ఉన్నాయో, ఆయా ప్రదేశాలలోనే...మన భౌతిక శరీరంలో తత్సంబంధ గ్రంథులు, తత్సంబంధ శరీర భాగాలు ఉన్నాయి. గమనించగలరు.
 ఈ సూక్ష్మ శరీరము యొక్క అంతర్భాగాలనే ashtral sense organs అంటారు. గాఢమైన ధ్యానావస్తల్లో ఒక యోగి వీటి ద్వారానే అతీంద్రీయ జ్ఞానం సంపాదిస్తాడు. ఆ విధంగా ఆ యోగ భగవానుడు... దూర శ్రవణము, దూర దర్శనము అనే సిద్ధులను వీటిద్వారానే పొందుతాడు. వీటినే Clairvoyance, Clairaudience అంటారు.

    ఒక వ్యక్తి మరణిస్తే, అతని స్థూల శరీరము అగ్నిలో కాలుతూ , తద్వారా పంచ భూతాలలో కలిసిపోతుంది. ఈ సంస్కారాన్ని , హిందూ సాంప్రదాయంలో "అంత్యేష్ఠి" అంటారు.

   శరీరం అగ్నిలో కాలిపోతుంది. కానీ, ఆత్మ శరీరాన్ని ఇంకా వదలదు. ఆత్మకి ఏదో ఒక వాహనం కావాలి. ఈ వాహనమే "సూక్ష్మ శరీరము". కొన్ని సార్లు ఈ సూక్ష్మ శరీరాన్ని "అంగుష్ఠ మాత్ర పురుషుడు" గా పిలవడం కద్దు.
 ఈ భౌతిక శరీరం మరణానంతరం, అగ్నిలో కాలినప్పటికీ...సూక్ష్మ శరీరం, ఈ భౌతిక దేహం పై తేలియాడుతూ ఉంటుంది. భౌతిక దేహం పంచ భూతాలలో కలిసి పోయేంత వరకు.
 ఈ అంగుష్ట మాత్ర పురుషుడు, హృదయ కుహరంలో నివసిస్తూ, బొటన వ్రేలి ప్రమాణంలో ఉంటాడని, ఉపనిషత్తుల వ్యాఖ్యానం.
 ఈ అంగుష్ఠ మాత్ర పురుషుడు, బొటన వ్రేలి ప్రమాణంలో ఉండి , పొగ లేని కాంతిలా ప్రకాశిస్తూ ఉంటాడు. వీడే జీవుడు. వీడే జీవాత్మ. దీనినే కారణ శరీరము అంటారు. కేనోపనిషత్తు, ఈ అంగుష్ఠ మాత్ర పురుషుణ్ణి చక్కగా వివరిస్తుంది.
 సూక్ష్మ శరీరము యొక్క ఒక పొర మనస్సు మరియూ బుద్ధి అనే రెండు గుణాలతో విరాజమానమై ఉన్నది.
 ఇక్కడ మనం మనస్సును, బుద్ధిని కొంత నిర్వచించుకోవాలి. ఏదేని ఒక దృశ్యాన్ని గాని, ఒక శబ్దాన్ని గాని, ఒక స్పర్శను గాని, మనం అనుభవిస్తే....మనస్సు వాటిని యథాతథంగా అంగీకరించి పంచేంద్రియాలకు...అలా అందజేస్తుంది. ఇక్కడే బుద్ధి ప్రవేశించి, ఈ పంచేంద్రియాలు,మనస్సు ద్వారా అనుభవించినది మంచిదా లేదా చెడ్డదా లేదా మనిషికి ఉపయోగపడుతుందా లేదా....అన్న విషయాన్ని విశ్లేషించి...మరల మనస్సుకు ఆ విషయాన్ని చేరవేస్తే, మనస్సు తదనుగుణంగా నడుచుకుంటుంది. కొన్ని సార్లు బుద్ధి చెప్పినట్లు, మనస్సు నడుచుకోదు. ఇలాంటి విషయాలు చాలా మందికి అనుభవమే.

సూక్ష్మ శరీరము యొక్క ఉన్నత స్థాయి చేతనయే "విజ్ఞాన మయ కోశం".
 ఈ పొర సహజావబోధానికి, బుద్ధి ప్రచోదనాన్ని ప్రతిబింబిస్తుంది.
 సుగుణాలు-దుర్గుణాలు, మంచి-చెడు, తప్పు-ఒప్పు,  సత్యము-అసత్యముల మధ్య....విచక్షణా జ్ఞానాన్ని  పెంపొందించేలా చేస్తుంది, ఈ విజ్ఞానమయ కోశము. ఈ విజ్ఞానమయ కోశము మనస్సు, ఇంద్రియాలు, పరిణతి చెందిన సంస్కారాలపై అదుపు కలిగి ఉంటుంది. అన్ని శారీరక క్రియలన్నిటిపై ఈ కోశం ఆధిపత్యం వహిస్తుంది.

    స్వామి వివేకానంద ఏమంటారంటే, లింగ శరీరమే...సూక్ష్మ శరీరము. ఈ భౌతిక దేహం మరణిస్తే, మరో శరీరం ఎలా సంప్రాప్తమౌతుంది? పదార్థం లేకుండా శక్తి లేదు. అలాగే శక్తి లేకుండా పదార్థము లేదు. పదార్థము-శక్తుల...నిరంతర వలయాకార భ్రమణం కొనసాగవలసినదే. భౌతిక శరీరంలో, జీవ లక్షణం గల చిన్న తునక లభించిననూ, అంతర అవయవాలు, మరొక శరీరాన్ని నిర్మించగలవు. మనము ఒక సిద్ధుడైన యోగిగా మారగలిగితే, మన మెదడు కూడా యోగి యొక్క మెదడు గానే మారుతుంది. ఒక మామూలు మనిషి, స్వ ప్రయత్నంతో....తన శరీరాన్ని సిద్ధ శరీరంగా,కాయ కల్ప శరీరంగా మార్చుకోగలడు.

(సశేషం)

సంకలనం : భట్టాచార్య.        

No comments:

Post a Comment