*రహస్య యోగులు -28*
🤟🙌🤘
రచన : శ్రీధరన్ కాండూరి
*భవిష్యత్తులో వాయుదేవుడిగా అవతరించబోతున్న మహాయోగి వడిరాజరు జీవిత విశేషములు -6*
ఒకసారి వడిరాజ ఒక పనస చెట్టు క్రింద కూర్చుని విద్యార్ధులకు శాస్త్రాలు బోధిస్తున్నాడు. ఆ సమయంలో ఒక పిడుగు ఆ చెట్టు మీద పడింది. ఫలితంగా ఆ చెట్టు మాడిపోయి చనిపోయింది. అందుకు ఎంతో విచారించిన వడిరాజ తన తపోబలంతో ఆ చెట్టుకి ప్రాణంపోసి మళ్ళీ బ్రతికించాడు. ఇప్పటికీ ఆ చెట్టుకి చక్కటి పనసపండ్లు కాస్తున్నాయి. వాటిని వడిరాజతీర్థ అభిమాన దైవం అయిన హయగ్రీవ స్వామికి నైవేద్యంగా పెడుతున్నారు.
వడిరాజతీర్థ తనకు ఏదైనా అనారోగ్యం వస్తే దాని గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పేవాడుకాదు. భగవంతుడు తనకు మంచిని ఇచ్చినట్టుగానే రోగాన్ని కూడా ఇచ్చాడని, దాన్ని సంతోషంగా భరిస్తూ అనుభవించటమే తన ధర్మము అని వడిరాజతీర్థ భావించేవాడు.
అలా చాలా ఏళ్ళు గడిచాయి. తనకు ఇక భౌతిక దేహం చాలించే సమయం ఆసన్న మైనదని గుర్తించిన వడిరాజ తనకు ప్రాణ సమానమైన ఉడిపి పీఠాన్ని చివరిసారి కళ్ళారా చూద్దామని నిర్ణయించుకుని ఉడిపికి వెళ్ళాలనుకున్నాడు. అప్పటికే ఆయనకు 120 ఏళ్ళ వయస్సు రావటం తో కంటిచూపు బాగా మందగించింది. పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉడిపి పీఠానికి వెళ్ళినా ఆ పీఠంలో ప్రధాన దైవంగా పూజలందుకుంటున్న బాల కృష్ణుడిని ఎలా దర్శించాలో? ఆయనకు అర్ధంకాలేదు.
ఏదిఏమైనా భారం భగవంతునిపై వేసి ఉడిపికి నడక ప్రారంభించాడు. మార్గ మధ్యంలో ఆయన తాను శ్రీకృష్ణుడిని కళ్ళారా చూడగలనో లేదో అని ఆందోళన కి గురిఅవుతూ శ్రీకృష్ణుని మీద పాటలు కట్టి పాడుతూ ముందుకు కొనసాగాడు. చివరికి ఆయన ఉడిపి చేరుకుని కృష్ణుడి విగ్రహం ముందు రెండు చేతులూ జోడించి నుంచున్నాడు. మహాభక్తుడు అయిన వడిరాజతీర్ధను ఉడిపి పీఠంలోని బాలకృష్ణుడు అనుగ్రహించాడు. ఫలితం గా వడిరాజతీర్థకు చూపు బాగుపడింది. ఆయనకు బాలకృష్ణుడు తన విశ్వ రూపాన్ని చూపించాడు. స్వామివారి దివ్యదర్శనంతో వడిరాజతీర్థకు ఎంతో స్వస్థత చేకూరింది.
వడిరాజతీర్థ ఈ మానవలోకాన్ని వదిలి పెట్టే దురదృష్ట సమయం ఆసన్నమైనది. ఫాల్గుణ, బహుళ, తృతీయ తిథినాడు వడిరాజతీర్థ సజీవంగా బృందావనంలో ప్రవేశించారు. ఆయన సమాధి అయిన మరుక్షణమే ఆయన భక్తులు భోరుభోరు న విలపించారు. ఆ సమాధి నుండే వడిరాజతీర్థ స్వర్గానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళేటప్పుడు అయన తాను ధరించిన వస్త్రాన్ని మరియు పాదుకల్ని తన శిష్యులకు తన జ్ఞాపకార్ధంగా ప్రసాదించాడు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం వడిరాజతీర్థ ఆరాధన జరిగే సమయంలో ఆయన జీవించినపుడు ధరించిన వస్త్రాలను మరియు పాదుకలను ఎంతో భక్తితో పూజిస్తారు.
వడిరాజతీర్థ యొక్క ఆత్మ స్వర్గానికి చేరుకున్న తరువాత కూడా ఆయన తన భక్తుల్ని మర్చిపోలేదు. ఆయన జీవించి ఉన్న సమయంలో ఒక పుట్టుగుడ్డి మూగ మరియు అవిద్యావంతుడు అయిన ఒక బ్రాహ్మణ యువకుడు ఆయన వద్ద పనులు చేస్తూ ఉండేవాడు. వడిరాజతీర్థ వస్త్రాలు ఉతకటం, ఆయన భోజనం చేసిన పాత్రలు కడగటం లాంటివి కూడా ఆ బ్రాహ్మణ యువకుడు చేసేవాడు. తనకు అన్నిరకాలుగా సపర్యలుచేస్తున్న ఆ బ్రాహ్మణ యువకుడికి ఏదో ఒక సమయంలో తగిన ప్రత్యుపకారం చెయ్యాలని వడిరాజతీర్థ అనుకుంటూ ఉండేవాడు.
ఏదిఏమైనా ఆ బ్రాహ్మణ యువకుడికి ఏ సహాయం చెయ్యకుండానే వడిరాజతీర్థ బృందావనంలోకి ప్రవేశించి ఆపై తన అవతారాన్ని చాలించారు. కానీ ఆ బ్రాహ్మణ యువకుడు, వడిరాజతీర్ధను నిరంతరమూ తలచుకుంటూఉండేవాడు. వడిరాజతీర్థ అవతారాన్ని చాలించిన కొన్ని ఏళ్ళ తరువాత ఒకరోజున ఆ బ్రాహ్మణ యువకుడి స్వప్నంలో కనిపించి అతనితో ఇలా చెప్పాడు.
"నేను వ్రాయాలి అనుకుని వ్రాయలేక పోయిన ఒక గ్రంధాన్ని నీచే వ్రాయించాలి అనుకుంటున్నాను. నేను ప్రతిరోజూ నీకు కలలో కనిపించి ఆ గ్రంధంలో కొంతభాగం చెబుతాను. నీవు దానిని తెల్లవారిన తరువాత తాళపత్రాలపై వ్రాయాలి. ఇలా కొద్ది రోజులు వ్రాసినట్లయితే ఆ గ్రంధం పూర్తి అవుతుంది".
అన్నమాట ప్రకారమే ఒకరోజు రాత్రి వడిరాజతీర్థ ఆ అవిద్యావంతుడైన బ్రాహ్మణ యువకుడికి కలలో కనిపించి ఆ గ్రంధంలోని కొంతభాగాన్ని చెప్పాడు. మర్నాడు ఉదయం ఆ యువకుడు, ఉడిపి పీఠాధిపతి వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా అన్నాడు. “నాకు రాత్రి స్వప్నంలో వడిరాజతీర్థ కనిపించి ఒక గ్రంధంలో కొంతభాగాన్ని నాకు చెప్పారు. అది మీకు ఇప్పుడు వివరిస్తాను".
ఒక పుట్టు మూగవాడు హఠాత్తుగా మాట్లాడటం చూసిన ఉడిపి పీఠాధిపతికి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. ఆ తరువాత ఆ బ్రాహ్మణ యువకుడు రాత్రి తనకు కలలో వడిరాజతీర్ధ చెప్పిన అనేక సంస్కృత పద్యాలను ఉడిపి పీఠాధిపతి కి వినిపించాడు. అవిద్యావంతుడు ఐన ఆ బ్రాహ్మణ యువకుడు అద్భుతమైన సంస్కృత భాషలో అశువుగా పద్యాలను చెప్పటం చూసిన ఉడిపి పీఠాధిపతి నిర్ఘాంతపోయాడు.
ఏదిఏమైనా వడిరాజతీర్థ యొక్క కరుణ వల్ల మరియు మహత్యం వల్ల పుట్టు మూగ, చెవిటివాడు మరియు అవిద్యా వంతుడైన ఆ బ్రాహ్మణ యువకుడు ఆ గ్రంధం మొత్తాన్ని కొన్ని వారాల పాటు భాగాలు, భాగాలుగా ఉడిపి పీఠాధిపతికి వినిపించాడు. ఆ బ్రాహ్మణ యువకుడు అసువుగా చెబుతున్న పద్యాలు ఉడిపి పీఠాధిపతి నియమించిన కొందరు పండితులు తాటియాకు పత్రాల మీద వ్రాస్తూ ఉండేవారు. కొన్ని వారాల తరువాత ఆ గ్రంధం పూర్తి అయ్యింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరా లకే ఆ బ్రాహ్మణ యువకుడు హఠాత్తుగా చనిపోయాడు. ఆ బ్రాహ్మణ యువకుడికి వడిరాజతీర్థ కలలో కనిపించి చెప్పిన గ్రంధం పేరు "స్వప్న బృందావనాఖ్యానం". అద్భుతమైన ఈ గ్రంధంలో ఉన్న పద్యాలకు అర్ధంఏమిటో? మరియు వాటి ప్రాముఖ్యం ఏమిటో? ఆ గ్రంధాన్ని చదివిన ఏ పండితుడికి అర్ధంకాలేదు. చనిపోయిన ఆ బ్రాహ్మణ యువకుడు అనేక సంవత్సరాలు గడిచిన తరువాత మళ్ళీ జన్మించి సోదేమఠంలో సన్యాసి జీవితాన్ని గడిపి చివరికి ఆ మఠానికి పీఠాధిపతి అయ్యాడు. ఆ యువకుడే "స్వప్న బృందావనాఖ్యానం"లోని శ్లోకాల కి అర్ధం ఏమిటో తెలియజేసే ఒక వ్యాఖ్యానాన్ని వ్రాసాడు.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న రుక్మిణీ దేవి ఒక వృద్ధ బ్రాహ్మణుడిని తన రాయబారిగా కృష్ణుడి వద్దకు పంపి కృష్ణుడికి తన నిర్ణయాన్ని ఆ రాయబారి ద్వారా తెలియజేసింది. అవతారుడైన శ్రీకృష్ణుని వివాహానికి కారకుడైన ఆ వృద్ధ బ్రాహ్మణుడు మహాపుణ్యాన్ని పొంది ఆపై మరుసటి జన్మలో వడిరాజతీర్థగా జన్మించాడని చెబుతారు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం జరుగుతున్నది. ఇది ముగిసిపోయిన తరువాత వచ్చే మన్వంతరంలో వడిరాజతీర్థ, వాయు దేవుడిగా అవతరిస్తాడని కొందరు పండితులు తెలియజేస్తున్నారు.
ఇప్పటికీ వడిరాజతీర్థ భక్తులు ఆ "స్వప్న బృందావనాఖ్యానం" వ్యాఖ్యానాన్ని ఎంతో భక్తితో పఠిస్తూ ఉంటారు. ఈనాడు వడిరాజతీర్థ భౌతికంగా లేనప్పటికీ ఆయన “అమర ఆత్మ” బృందావనం నుండి భక్తులను కరుణిస్తూ ఉంటుంది. సోడేలో ఉన్న ఆయన బృందావనాన్ని దర్శించి ఆయనను ప్రార్ధించిన భక్తులకు కోరిన కోర్కెలు ఖచ్చితంగా తీరతాయని చెప్పుకుంటూ ఉంటారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉
No comments:
Post a Comment