Saturday, January 11, 2025

****

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-380.
3️⃣8️⃣0️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)


*14. గుణత్రయ విభాగ యోగము*
(పదునాలుగవ అధ్యాయము)
_________________________
*13. వ శ్లోకము:*

*”అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చl*
 *తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దనll”*

“ఓ అర్జునా! తమోగుణము ఎక్కువగా ఉన్న వాడికి వివేకము, బుద్ధి పనిచేయవు. మందబుద్ధిగా ఉంటాడు. ఏ పని చేయడానికి ఇష్టపడడు. సోమరితనమునకు అలవాటు పడతాడు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటాడు. పొరపాట్లు చేస్తుంటాడు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాడు. వాడికి తెలియదు, ఒకరు చెబితే వినడు. ఇవీ తామసగుణ లక్షణములు.”
```
తమోగుణము ఎక్కువగా ఉన్న వారిలో అజ్ఞానము,అవివేకము,అవిద్య ఎక్కువగా ఉంటాయి. వారి ముఖంలో తేజస్సు ఉండదు. వాడిపోయిన ముఖంతో ఉంటారు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారి మాదిరి ముఖం పెడతారు. వారు మనసు, ఇంద్రియములు, చెప్పినట్టు చేస్తారు. బుద్ధి చెప్పినట్టు వినరు. ఎక్కువగా సోమరితనము ఉంటుంది. ఎవరి మాటా వినరు. తమకు తోచింది చేస్తారు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోరు. అజాగ్రత్తగా ఉంటారు. ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. మూర్ఖంగా, మూఢంగా ప్రవర్తిస్తారు. అన్నీ తమకే తెలుసనే అపోహలో ఉంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలో ఉంటారు. పొరపాట్లు చేస్తుంటారు. పరధ్యానంగా ఉంటారు. చూచిన ప్రతి వస్తువు మీదా మోహం పెంచుకుంటారు. అది నాకు కావాలనే మూర్ఖపు పట్టుదలతో ఉంటారు.```


*14. వ శ్లోకము:*

*”యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్l*
 *తదోత్తమవిదాం లోకా నమలాన్ప్రతిపద్యతేll”*

“మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్వగుణము ఎక్కువగా ఉంటుందో, ఆ దేహములో ఉన్న సూక్ష్మదేహము (జీవాత్మ) మరణించిన తరువాత, యోగులు, వేదవిదులు, జ్ఞానులు పొందే ఉత్తమములు, పరిశుద్ధములు అయిన లోకములు పొందుతుంది.”
```
ఇప్పటి వరకు మూడు గుణములు కలవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాము. మరణ కాలంలో మానవుడు సత్వగుణసంపన్నుడుగా ఉంటే, మరుజన్మలో ఉత్తమ లోకములను పొందుతాడు. మరు జన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది. అంటే చనిపోయేటప్పుడు ఏ గుణము ఉచ్చస్థితిలో ఉంటుందో ఆ గుణమునకు అనువైన లోకములను పొందుతారు. సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకములు, ఉత్తమ జన్మ వస్తుందని చెప్పుకున్నాము.

అంటే, కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు. జీవితాంతం సత్వగుణ సంపన్నుడుగా ఉండాలి. అప్పుడే చనిపోయే ముందు కూడా సత్వగుణ సంపన్నుడుగా ఉంటాడు. అలా కాకుండా మరణ సమయంలో కూడా ఆస్తిపాస్తుల గురించి, బంధువుల గురించి ఆలోచిస్తుంటే, తాను జీవితంలో చేయలేని పనుల గురించి తలచుకుంటుంటే, అతనిలో సత్త్వగుణం ఏ కోశానా కనిపించదు.

సత్వ గుణం అభివృద్ధి చెందడానికి ఏంచేయాలంటే, ముందు చిత్తములో నుండి రజోగుణము, తమోగుణములను తొలగించాలి. అప్పుడు సత్వగుణము కోసం సాధన చేయాలి. జీవితంలో నిష్కామ కర్మలు, కర్తృత్వ భావనలేని కర్మలు, పుణ్యకార్యములు, పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా అటువంటి సాత్వికభావనలే కలుగుతాయి. అంతేకానీ, జీవితాంతం రజోగుణము, తమోగుణములో ఉండి, అంత్యకాలంలో నారాయణా అన్నా, కృష్ణా అన్నా, ఏమీ ప్రయోజనము లేదు. ఆఖరు రోజుల్లో సత్వగుణము ఏర్పడటం చాలా కష్టము.```


*15. వ శ్లోకము:*

*”రజసి ప్రళయం గత్వా కర్మసజ్గిషు జాయతేl*
 *తథాప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతేll”*

“అదే విధంగా, అంత్యకాలంలో రజోగుణము ప్రధానంగా ఉన్న వారు ఎక్కువగా కర్మలు చేసే అవకాశము ఉన్న జన్మలు ఎత్తుతారు. అలాగే మరణ సమయంలో తామస ప్రవృత్తి కలిగిన వారు, మరుజన్మలో మూడుడు అవివేకి, అజ్ఞానిగానో లేక అటువంటి లక్షణములు కల జంతువుగానో, పక్షిగానో పుడతాడు.”
```
సత్వగుణము ఎక్కువగా ఉంటే పుణ్యలోకాలు వస్తాయి అని చెప్పారు పరమాత్మ. ఇప్పుడు రజోగుణము, తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే వారికి జనన మరణ చక్రము తప్పదు అని అన్నారు. అంటే తాము చేసిన కర్మలకు ఫలము మానవులుగా పుట్టి మాత్రమే అనుభవించాలి. మరోమార్గం లేదు. కాబట్టి రజోగుణము ఎక్కువగా ఉన్న వారు కర్మల యందు ఎక్కువగా ఆసక్తి ఉన్న వారి గృహములలో జన్మిస్తారు. కాని తమోగుణము ఎక్కువగా ఉన్న వారు మూఢయోనులు అంటే ఏమాత్రం బుద్ధి, జ్ఞానం, ఆలోచన లేని వారి ఇంట్లో జన్మిస్తారు. అది మానవజన్మ కావచ్చు, మృగ, పశు, పక్షి, కీటక జన్మలు కావచ్చు. ఎందుకంటే వాటికి ఆలోచనా శక్తి ఉండదు. ఏది తోస్తే అది చేసెయ్యడమే. వాటి వాటి సహజలక్షణముల బట్టి ప్రవర్తిస్తుంటాయి. వాటికి మంచి పనులు చేసే స్వతంత్రత, బుద్ధి, జ్ఞానము ఉండదు. రజస్తమోగుణములలో జీవితాంతం పడిఉన్నవారు, మరణించిన తరువాత వారి వారి గుణములకు తగ్గ యోనులలో పుడుతూ చస్తూ ఉంటారు. కాబట్టి జీవితాంతం సత్వగుణమును అలవరచుకోవడమే మంచిది.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment