Saturday, January 11, 2025

***** *మగువ* - *ఆలంబన* రచన : లక్ష్మిమదన్

 *మగువ* - *ఆలంబన* 

రచన : లక్ష్మిమదన్ 

ఆడపిల్ల పెళ్ళి చేసుకుని పుట్టినింటి నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు కంటతడి పెడుతుంది.

అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లి తండ్రులు గుర్తొస్తారు, తోబుట్టువులు పెరిగిన పరిసరాలు, ఇంటి వెనక పూల చెట్లు, ఆడుకున్న బొమ్మలు, చదువుకున్న పుస్తకాలు, తోటి నేస్తాలు అందరినీ గుర్తు చేసుకుంటుంది. 

రానురాను అత్తింటి పద్ధతులకు అలవాటు పడుతుంది. అదృష్టము కొద్దీ అత్తవారింట్లో అందరూ బాగా చూసుకునే వాళ్ళు ఉంటే, ఆమె పెదవులపై చిరునవ్వు మాసి పోదు.

భర్త ఆప్యాయత, ప్రేమను పొందుతూ మరింత అదృష్టవంతురాలు అవుతుంది. ఆమె కళ్ళు కూడా అనుక్షణం మెరుస్తూనే ఉంటాయి. 

పుట్టింటివారు గుర్తొస్తే, సంతోషంగా వాళ్ళని తలుచుకుంటుంది. వాళ్లతో  జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంది. మరింత సంతోషపడుతుంది. 

అదే అత్తవారింట్లో ఆమెకు సమస్యలు ఎదురైతే, మరొకలా ఉంటుంది ఆమె పరిస్థితి. అత్తమామలు బాగా చూసుకోకుంటే ముఖంలో ఒక విధమైన బాధ కనిపిస్తుంది. అయినా చిరునవ్వు పెదవుల మీద ఉంటుంది. కళ్ళలో మెరుపు ఉంటుంది. 

భర్త కూడా బాగా చూసుకోకుంటే, కళ్ళల్లో మెరుపు మాయమవుతుంది. పెదాలపై చిరునవ్వు పారిపోతుంది. 

ఈ సమయంలో పుట్టింటి వారు గుర్తొస్తే, దుఃఖంతో అల్లాడుతుంది. కుమిలి కుమిలి ఏడుస్తుంది. అనుక్షణం వారి ఆగమనం కావాలని ఎదురుచూస్తుంది. పుట్టింటికి వెళ్లాలని మనసు కోరుకుంటుంది. 

భర్త మంచిగా చూసుకుంటే," ఆయమ్మ పొనంది పుట్టింటికి "అనే తీరుగా ఉంటుంది. ఎన్ని చదువులు చదివినా, పెళ్ళికి ముందు ఎంత ధైర్యం ఉన్న, భర్త అనే వాడు క్షణంలో తన ధైర్యాన్ని నిర్వీర్యం చేయగలడు. ఆమె చదివిన చదువును, ఆమె విజ్ఞానాన్ని క్షణంలో హరించి వేయగలడు. ఇది ఇంకా మాసిపోని చరిత్రనే. మానని గాయంలా సలుపుతూనే ఉంది.

మగవారిలో పరివర్తన రావాలి...

No comments:

Post a Comment