Saturday, January 11, 2025

******మనుధర్మ శాస్త్రంలో స్త్రీ పైన వివక్ష చూపారు అంటూ చాలా మంది అంటూ ఉంటారు. దానికి సమాధానమే ఈ పోస్ట్. పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.

మనుధర్మ శాస్త్రంలో స్త్రీ పైన వివక్ష చూపారు అంటూ చాలా మంది అంటూ ఉంటారు. దానికి సమాధానమే ఈ పోస్ట్. పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.

***---***---***---***---***--****---***

✴️"మనుధర్మ శాస్త్రంలో స్త్రీలకు చదువు ఉండకూడదు..
స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు...
స్త్రీలు బయటకు వచ్చి అసలు మాట్లాడకూడదు.." అని 
మనుధర్మ శాస్త్రంలో మను మహర్షి వారు చెప్పారా...???

🟧 యత్ర నార్యస్తు పూజ్యంతే/ రమంతే తత్ర దేవతాః/   
       యత్రైతాస్తు నపూజ్యంతే/సర్వాస్తత్రాఫలాక్రియః. 
     
                - ( మనుస్మృతి 3 -56 ).

భావం :- ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో,అక్కడ దేవతలు నివసిస్తారని, ఎక్కడ పూజింప బడరో అక్కడ కార్యాలన్నీ నిష్ఫలాలని తెలిపిన మను మహర్షి స్త్రీమూర్తులకు వ్యతిరేకమా...?

🟧 స్త్రియః శ్రియశ్చ గేహేషు./ నవిశేషోస్తి కశ్చన. 

భావం :- స్త్రీలు గృహంలో గృహలక్ష్ములే,ఇంతకన్నా వేరే విశేషపదం లేదని స్త్రీని కీర్తిస్తాడు. అందుకనే వివాహ సమయంలో కన్యాదాత
 “లక్ష్మీ నామ్నీం కన్యాం లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ దదాతి". అనిచెప్పి కన్యాదానం చేస్తారు. తమ ఇంటబుట్టిన ఆడపిల్లని తండ్రి,సోదరులు బాగా చూసుకోవాలని,అమ్మాయికి కావలసినవి సమకూర్చాలని ఎంతో విపులంగా వివరించిన మనువు స్త్రీమూర్తుల పట్ల వివక్ష చూపారా...?

🟧 పితృభి: భ్రాత్రుభిశ్చైతాః పతిభిర్దేవరైస్తథా:/
      పూజ్యా భూషయితవ్యాశ్చ/ బహు కళ్యాణమీప్సుభి

భావం :- తండ్రి, భర్త,సోదరులు అందరు స్త్రీలని  గౌరవించాలని, వారుకోరిన భూషణాలు,వస్త్రాలు ఇచ్చి సంతృప్తి పరచాలని చక్కగా వివరిస్తాడు. స్త్రీకి పురుషుడు సదా  అండగా ఉండాలని మనుధర్మ శాస్త్రం బోధిస్తుంది. ఇదే అర్థంలో... ⤵️

🟧 పితారక్షతి కౌమారే/ భర్తారక్షతి యౌవ్వనే / రక్షంతి
      వార్ధకే పుత్రా: / నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. 

భావం :- చిన్నతనంలో తండ్రి, యౌవ్వనంలో భర్త, వార్ధక్యంలో పిల్లలు రక్షణ కల్పించాలి అని, రక్షణ లేకుండా ఉంచకూడదని మనువు స్త్రీలకి అధిక ప్రాధాన్యతనిస్తే, మనువుని, ప్రాచీన సంప్రదాయాలని ఇష్టపడని ఆధునిక వితండవాదులు కొందరు పైశ్లోకం మొత్తం గ్రహించకుండా చివరి పాదం నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి అన్నది మాత్రం గ్రహించి,  మనువు స్త్రీలకి వ్యతిరేకి, స్త్రీలకి స్వేఛ్చ లేదన్నాడని వాదిస్తారు. అట్టి వారికి ఎంత నచ్చ చెప్పినా మహాబధిర శంఖారావ న్యాయంలా వినరు, తమ ప్రవర్తన మార్చుకోరు. అస్తు. వారిని అలాగే వదిలేద్దాం..

వినేవారికే మనం కొన్ని మంచిమాటలు చెప్దాం. బాల్యంనుండే మంచిఅలవాట్లు, సత్ సంప్రదాయాలు నేర్పిస్తే, భావితరాలైనా బాగుపడతాయి. ( అదే ఈ వ్యాసకర్త కోరిక! మన్నిస్తారుకదూ.) స్త్రీలని గూర్చి మనువు ఇంకా ఇలా చెప్పారు... ⤵️

 🟧  శోచంతి జామయోయత్ర/ వినశ్వత్యాశు తత్కులం/
        నశోచంతితు యత్రైతా/వర్ధతే తద్ధిసర్వదా  
భావం :- "ఆడపడుచులు ఏ యింట సోదరులచే ఆదరించ బడతారో ఆయింట వంశం వర్ధిల్లుతుంది. లేదా నశిస్తుంది అని"తెలిపి...

🟧  తస్మానేతాన్సదా పూజ్యాః/ భూషనాచ్చాదనాశనై
       భూతికామైర్నరైర్నిత్యం/ సత్కారేషూత్సవేషుచ.

భావం :- తమ ఇంట పండుగలు శుభకార్యాలు జరుపుకోనేటప్పుడు, ఆడపడుచులను పిలచి మంచి భోజనం పెట్టి, వస్త్రాలు, భూషణాదులనిచ్చి సంతృప్తి  పరచాలని చాలా విపులంగా, చక్కగా మనుస్మృతి వివరిస్తుంది. కనుకనే పండగ రోజులలో కూతుళ్ళని, అల్లుళ్ళని పిలచి, ఉన్నంతలో వారికి కట్నకానుకలిచ్చి సంతృప్తి పరచే సంప్రదాయం మనం పాటిస్తున్నాం. ఇలా శృతి,స్మృతి,పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో  స్త్రీకి ఎంతో ఉన్నత స్థానంకల్పించ బడింది. 

ఇక భార్యాభర్తల సంబంధంగూర్చి ఎంతగోప్పగా చెప్పారో చూడండి.—వివాహ సమయంలో సప్తపది అనే తంతులో చదివే మంత్రాలలో ఒకమంత్రం ఇలా తెలపుతుంది.. ⤵️

🟧 సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః
      సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం,

భావం :- సఖ్యాన్మేమాయోష్టా: అనగా ఈ ఏడడుగుల బంధంతో భార్య,భర్తలమైన మనం ఇకపై స్నేహితులగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! ఆపత్సు మిత్రం జానీమః కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టిమిత్రభావంతో భార్యాభర్తలు ఉంటే, వారిమధ్య కలతలు, కార్పణ్యాలు, ఆవేశకావేశాలు, అసమానతలకు తావు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం సాగిపోతుంది.

🟧 శోచంతి జామయో యత్ర వినశ్యత్యాసు తత్కులం 
      న శోచంతి తు యత్రైతా వర్దతే తద్ది సర్వదా 
   
         - ( మనుస్మృతి 3 - 57  )

భావం :-   స్త్రీలు దుఃఖిస్తే వారి దుఃఖానికి కారణమైన వారి వంశమంతా నశించిపోతుంది. స్త్రీలు సంతోషంతో ఉంటే ఆ ఇల్లు, వారి వంశం సదా కళకళలాడుతూ వర్ధిల్లుతుంది - అనిఅన్న మను మహర్షి వారు మాతృమూర్తుల మేలు కోరినట్టా ? కీడు కోరినట్టా...?

  🟧 సంతుష్తో భార్యయా భర్తా  భర్త్రా భార్యా తథైవ చ
        యస్మిన్నేవ  కులే నిత్యం కల్యాణం తత్ర వై ధృవం 
             
          - ( మనుస్మృతి  3 -60 )

భావం :-
భర్త భార్యను, భార్య భర్తను సంతోషపెడుతూ ఉంటే ఆ ఇంట నిత్య కళ్యాణముగా సంపద నిలుస్తుంది  అని 
మను మహర్షి వారు హితవు చెప్పటం అతివల హక్కులను తెలియజేయడమా? అణచి వేయడమా..?

 🟧  ప్రజనార్థం మహాభాగాః పూజార్హా గృహ దీప్తయః 
        స్త్రియః శ్రియశ్చ గేహేషు  న విశేషోస్తి కశ్చన    
    
                  - ( మనుస్మృతి 9-26 )

భావం :- సంతతి పొందటానికి కారణమైన స్త్రీలు మిక్కిలి గౌరవించదగినవారు. వారు ఇంటికి కాంతుల వంటి వారు. 
శ్రీ (సంపద) లేని ఇల్లు ఎలా శోభాయమానంగా ఉండదో 
స్త్రీ లేని ఇల్లు కూడా కాంతి హీనమే -అని అన్న మనువు నారీలోకం ఔన్నత్యాన్ని పెంచినట్టా..? తుంచినట్టా...?

ప్రపంచంలో స్త్రీ విశిష్టతను గుర్తించి, ఆమె డిగ్నిటీని పెంచి, సమాజంలో సముచిత గౌరవ స్థానం కల్పించిన మొట్టమొదటి ధర్మవేత్త మను మహర్షి వారే... ⤵️

ఆస్తి హక్కుల విషయంలో "పుత్రేణ దుహితా సమా" కొడుకూ, కూతురూ ఇద్దరూ సమానులే అని ప్రాచీనకాలంలోనే ఘంటాపథంగా చాటిన మహనీయుడు మనువు.  అదీ ఎంత చక్కగా...!!!

     🟧 యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా 
           తస్యామాత్మని  తిష్థన్త్యాం కథ మన్యో ధనం హరేత్       
   
                      - ( మనుస్మృతి 9- 130 )

భావం :-  తానెంతో కొడుకంత. కొడుకెంతో  కూతురంత. కొడుకులు లేకపోతే తండ్రి ధనం కూతురికి కాకపోతే ఇంకెవరికి వెళుతుంది ? అలాగే -

   🟧 మాతుస్తు యౌతకం యత్స్యాత్ కుమారీ భాగ ఏవ సః
         దౌహిత్ర ఏవచ హరేదపుత్ర స్యాఖిలం ధనం 

              - ( మనుస్మృతి9- 132 )

   🟧  జనన్యాం సంస్థితాయాం తు సమం సర్వే సహోదరాః
     భజేరన్మాతృకం రిక్థం భగిన్యస్చ  సనాభయః  

               - ( మనుస్మృతి 9- 192 ).

భావం :- తల్లి చనిపోతే ఆమె స్త్రీ ధనం ఆమె కూతుళ్ళకే వెళ్ళాలి. కొడుకులకు చెందకూడదు. తల్లి చనిపోయాక ఆమె పుత్రులు, పెళ్లి కాని కుమార్తెలు  తల్లి ధనాన్ని సమానంగా పంచుకోవాలి. పెళ్లి అయిన కూతుళ్ళకు తండ్రి ధనంలాగే తల్లి ధనంలోనూ నాలుగవ పాలు పంచి ఇవ్వాలి .. అని చెప్పిన మనువు స్త్రీమూర్తులకు హితుడా...? శత్రువా...?

  మనుస్మృతిలో బోలెడు ప్రక్షిప్తాలు వచ్చి చేరాయని అంటున్నారు కదా !
ఇదీ ఆ బాపతుదే అయి ఉంటుంది ;
మనుధర్మాన్ని పైకెత్తడం కోసం తరవాతెప్పుడో ఈ శ్లోకాన్నీ ఇరికించి ఉంటారు - అని వాదించటానికీ    వీల్లేదు.
ఎందుకంటే ఎన్నో వేల ఏళ్ళ కిందటి వేదాంగమైన నిరుక్తంలోనే యాస్కాచార్యుడు ఇలా చాటాడు :

   🟧  అవిశేషేణ పుత్రాణామ్ దాయో భవతి ధర్మతః
          మిధునానాం విసర్గాదౌ మను స్వయంభువోబ్రవీత్   

                    - (మనుస్మృతి iii-1-4 )

    (పారంపర్యం గా వస్తున్న ఆస్తిలో కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కు ఉండాలని సృష్టి ఆరంభంలో స్వాయంభువ మనువు చెప్పాడు. )  

 భావం :-  కుటుంబ ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమానహక్కు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. అబలలన్న అలుసుతో తోడబుట్టిన ఆడపడుచులకు అన్యాయం చేసి న్యాయంగా వారికి చెందాల్సిన ఆస్తినీ కాజేసే వాళ్ళు ...  కాగితం మీద ఎన్నో చట్టాలు, న్యాయరక్షణలు కొడిగట్టిన ఈ కాలంలోనే ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దుర్మార్గాలను ముందే ఊహించే స్త్రీలకు ఆస్తిలో ఆన్యాయం చేసే వారిని ఆత్మబంధువులు, సహోదరులయినా సరే మామూలు దొంగల వలెనే కర్కశంగా శిక్షించాలని మనువు అన్నారు.

🟧 స్త్రీ ధనాన్ని అపహరించటం, స్త్రీలకు అన్యాయం 
      చేయటం మహాపాపమని హెచ్చరించారు 
       మను మహర్షి వారు...!

             - (మనుస్మృతి 2-52 ) ,
             -  ( మనుస్మృతి 8 -29 ) , 
             - ( మనుస్మృతి 9-213 ) .

అలాంటి నేరాలకు విధించిన దండనలు తీవ్రంగా ఉంటే, అవి క్రూరమనీ, అనాగరికమనీ, అమానుషమనీ మహానాగరికులమైన మనమే  మళ్ళీ తిట్టిపోస్తాం అనుకోండి !

ఇంటాబయటా మానవతులకు భద్రత లేకుండా  బరితెగిస్తున్న  నీఛ, నికృష్ట మదాంధుల స్వైర విహారాలను అరికట్టలేని, ఘోర దురాగతాలకు లోనైన మహిళలకు సరైన న్యాయం ఏ నాటికీ చేకూర్చలేని ఇప్పటి అమానుష, అవ్యవస్థ కంటే మను ధర్మం ఎంతో ఉత్తమం...!

 🟧 ఎందుకంటే అతివలను ఎత్తుకుపోయేవారికి, చంపే వారికి,  మరణ దండన విధించాలని మనువు చెప్పారు..!

పురుషాణాం కులీనానాం నారీణాం చ విశేషతః ।
ముఖ్యానాం చైవ రత్నానాం హరణే వధమర్హతి ॥ 

            - (మనుస్మృతి 8 -323 , 8- 352 ) ,
            - ( మనుస్మృతి 9- 232 ).

🟧 స్త్రీలను చెరిచిన వారిని ముక్కు, చెవులు కోయటం...
కాలే పెనం మీద మాడి పోయేట్టు చేయటం... వంటి  చిత్రహింసలు పెట్టి చంపాలనీ చెప్పింది "స్త్రీలకు శత్రువు" అని మనం ఈసడించే మనువే. 

                - ( మనుస్మృతి 8-364 , 8-372 ).

మనమేమో దేశ రాజధాని నడివీధిలో నడుస్తున్న బస్సులో ఒక మహిళను దారుణంగా చెరిచి చంపిన నరపిశాచాలను ఉరి తీయాలంటే .. అది అనాగరికం ; నేరస్థులను పందుల్లా మేపి ,  మనసు మార్చి మెల్లిగా సంస్కరించాలే తప్ప ప్రాణం తీయకూడదని మీడియా నిండా నీతుల వాంతులు చేసుకున్న సుకుమారులం !

సాధారణంగా స్త్రీలు ఎదుర్కొనే సమస్యలకు , లోనయ్యే అన్యాయాలకు పరిష్కర మార్గాలను చూపాడు మనువు.
వారిపై నిరాధారమైన నిందలు, అభాండాలు మోపేందుకు ఎవరూ సాహసించలేని రీతిలో శిక్షలు ఎలా ఉండాలో కూడా చెప్పాడు.
వారి తప్పేమీ లేకపోయినా, భార్యలను వదిలిపెట్టేవారిని ఎలా దండించాలో నిర్దేశించాడు.

ఇన్నిన్ని విధాల స్త్రీల యోగక్షేమాలకు గట్టి రక్షణలు సూచించి , "ఇంతి ఇంటికి కాంతి " అని ఘోషించిన మనువును భయంకర నారీద్వేషిగా శాపనార్థాలు పెట్టటం సబబేనా...?

📛 చిన్నతనంలో తండ్రి, పెళ్ళయ్యాక భర్త, పెద్దతనంలో కొడుకు స్త్రీకి రక్షణగా నిలవాలనీ,
ఆ సురక్షిత వ్యవస్థను అతిక్రమించి స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించటం తగదనీ వేల సంవత్సరాల కిందట  మనువు చెప్పిన హితవులో తప్పు పట్టాల్సింది ఏమిటి ?

    🟧  పితా రక్షతి కౌమారే  భర్తా రక్షతి యౌవనే!
           రక్షన్తి స్థావిరే పుత్రా నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి!! 

                    -  (మనుస్మృతి 9-3 )

అని చెప్పిన శ్లోకంలో... చివరి మాటలను మాత్రం పట్టుకొని స్త్రీకి స్వాతంత్ర్యం అర్హత లేదు అని మనువు అన్నాడనీ ... బతికినంతకాలం తండ్రికిందో, మొగుడికిందో, కొడుకు చేతికిందో బానిసలా పడి ఉండాలని, అతివకు తీరని శాపం పెట్టాడనీ మిడిమిడి జ్ఞానంతో దుమ్మెత్తిపోయటం ఏ రకమైన విజ్ఞత...???

🟧 త్రీణి వర్షాణి ఉదీక్షేత కుమార్యుతుమతీ సతీ
ఉర్థ్వంతు కాలాదేతస్మా ద్విన్థేత సదృశం పతిమ్

          -  (మను స్మృతి 9-90)

భావం :- కన్యకు వివాహం చేసుకోవాలనే కోరిక కలిగినప్పుడు, రజస్వల అయిన 4 సంవత్సరాలపైన నే వివాహం చేసుకొవచ్చును.వితంతు స్త్రీలు పునర్వివాహం చేసుకొనవచ్చని చెప్పారు మను మహర్షి వారు...!

🟧 న కన్యయాః పితా విద్వాన్ గృహ్ణైయాచ్చుల్క మణ్వపీ
      గృహ్ణం చ్ఛుల్కం హిలోభే చ స్యాన్నరో పత్య విక్రయా

భావం :- బుద్దిమంతుడైన కన్య తండ్రి కన్య వివాహవిషయంలో కొంచెంకూడా ధనం తీసుకో కూడదు. లోభంయై ధనం తీసుకుంటే అతడు సంతానాన్ని అమ్ముకున్నవాడుగా పరిగణించాలి.
ఈవిధంగా మహర్షి కన్యాశుల్కం, వరకట్నం రెండింటినీ నిషేధించారు.

🟧 కామమా మరణాత్తిష్ఠేద్ గృహే కన్య ర్తుమత్యపి
      నచైవైనాం ప్రయచ్ఛేత్తు గణ హీనాయ కర్హిచిత్.

భావం :- కన్య మరణించేంత వరకూ కుమారిగానైనా ఉండవచ్చుగానీ, గుణహీనునికిచ్చి మాత్రం వివాహం చేయరాదు.
సర్వగుణ లక్షణఅయిన కన్య    నీచుల ఇంట పుట్టినా అద్భుతమైన మణిగా భావించి ఆకన్యను స్వీకరించమని మనువు ఆదేశం.
స్త్రీల పట్ల మహర్షికున్న ఇంత అవగాహన, గౌరవం కనిపిస్తూఉంటే. ఆమహర్షిని నిందించడం అమానుషం, దారుణం.

స్త్రీల పై జరిగే అత్యాచారాలకు శిక్షలు ఎంత కఠినంగా ఉండేవో చూద్దాం.
స్త్రీలను హత్యచేయడం , అపహరించడం, వంటి దుష్కర్మలు చేసేవారికి మరణశిక్షను విధించాలి. అత్యాచారాలకు పాల్పడడం, బలాత్కారంచేయడం లాంటి దుష్కర్మలకు యాతనలతోకూడిన శిక్షలతో పాటు దేశబహిష్కరణ విధించాలి అని మనువు శాసించారు...!!⤵️

🟧 పురుషాణాం కులీనానాం నారీణాంచ విశేషతః
      ముఖ్యానాంచైవ రత్నానాం హరణే వధమర్హతి.

భావం :- శ్రేష్టపురుషులను, విశేషించి స్త్రీలను అపహరించినపుడు, వజ్రవైడూర్యాలను, రత్నాలను అపహరించినపుడు అపహరించినవారిని వధించాలి..!

🟧 మాతాపితృభ్యాం జామీభిః బ్రాత్రా పుత్రేణ భార్యయా
      దుహిత్రా దాసవర్గేణ వివాదం న సమాచరేత్

భావం :- తల్లి, తండ్రి, తోబుట్టువులు, సోదరులు, భార్య, కుమార్తెలు, సేవకులతో తగాదాలు పెట్టుకోకూడదు.

ఈ రకంగా స్త్రీల జీవితాలలో సంభవించే ప్రతి చిన్న సమస్య.నూ దృష్టిలో ఉంచుకుని మనువు పరిష్కారాలు శిక్షలు నిర్ధారించాడు. 
ఈనాడు ఇంత రక్షణ స్త్రీలకు ఉందేమో ఆలోచించండి. నిర్బయ చట్టం వచ్చిన తరువాత ఎంతమంది అత్యాచారాలకు గురి అయ్యారో గమనించండి. స్త్రీలపై అత్యాచారాలు చేసేవారికి ఎంతమందికి శిక్షలు పడ్డాయో ఆలోచించండి...!

🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸🔸

✴️ "స్త్రీలు చదువుకుంటే... వర్షాలు పడవు, కరువుకాటకాలు వస్తాయని వేదాలలో చెప్పబడిందా...
ఎంతవరకూ స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకూ అణగదొక్కుతూ, వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ,వాళ్లకు (స్త్రీలకు) ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండకూడదు " అని వేదాలలో చెప్పారా...???

అసలు #వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో చూడండి...⤵️⤵️⤵️

 🟧 స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి...!
            
                 - (యజుర్వేదం 10.03)

 🟧 స్త్రీలు మంచి కీర్తి గడించాలి...!
    
                 - (అధర్వణవేదం 14.1.20)

🟧  స్త్రీలు పండితులవ్వాలి...!
      (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)
             
                         - ( అధర్వణవేదం 11.5.18) 

🟧 స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి...!

                          - (అధర్వణవేదం 14.2.74)

🟧 స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి...! 
 
                              - (అధర్వణవేదం 7.47.2)

🟧  స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి.! 
 
                                - (అధర్వణవేదం 7.47.1)

 🚩 పరిపాలన విషయంలో స్త్రీలు:-

🟧 పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు 
      కూడా పాల్గొనాలి...!
     
                          - (అధర్వణవేదం 7.38.4)

🟧 దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ   
       కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి...! 

                 - (ఋగ్వేదం 10.85.46)

❇️ ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు... 

🟧 కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది... ⤵️⤵️⤵️

🚩ఆస్తిహక్కు:-

🟧 పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది...!

                         - (ఋగ్వేదం 3.31.1)

🚩 కుటుంబం:-

🟧 సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా   
      వ్యవహరించాలి...!
    
                       - (అధర్వణవేదం 14.1.20)

🟧 స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి...!
(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను
చేకూర్చగలుగుతుంది)
               
                        - (అధర్వణవేదం 11.1.17)  

🟧 నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు...!

                               - ( అధర్వణవేదం 7.46.3)

🚩 ఉద్యోగం:-

🟧 స్త్రీలు కూడా రధాలను నడపాలి...!
  
                            - (అధర్వణవేదం 9.9.2)

🟧 స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి...!

                   - (యజువేదం 16.44) 

(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.
స్త్రీలు బయటకురాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 
కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. 
కైకేయి దీనికి ఉదాహరణ కదా. 
శ్రీ రామాయణంలో కైకైకయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. 
దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చిన అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

🟧 కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి...!

                         - (ఋగ్వేదం 10.85.26)

🟧 ఓ స్త్రీల్లారా! పురుషలతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాకా. మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాకా. మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్దం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను...
    
                  - (ఋగ్వేదం 10-191-3)

***వివాహం -విద్యాభ్యాసం***

ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు...!

              – (అధర్వణవేదం 14-1-64)

 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

✴️వేదాలలో ప్రావీణ్యం, నైపుణ్యత, పాండిత్యం సాధించి, సనాతనధర్మం లోని స్త్రీమూర్తులు కొందరు... ⤵️⤵️⤵️

(1)గార్గి, 
(2)రోమష,
(3)ఘోషా, 
(4)విశ్వవర,
(5)ఆత్రేయి,
(6) లోపాముద్ర,
(7)వసుత్రపత్ని,
(8) ఇంద్రాణి,
(9)అపాల,
(10)శ్రద్ధ,
(11)వైవశ్వతి
(12) యామి,
(13)పౌలమి, 
(14)సూర్య,
(15) శ్వాస్తి, 
(16)శిఖండిని,
(17)ఊర్వశి, 
(18)సచి,
(19)దేవరాణి, 
(20)ఇంద్రమాత,
(21)గోద,
(22) జుహు,
(23)మైత్రేయి.

వీళ్ళంతా వేదాలలో ఉదాహరించిన స్త్రీ మూర్తులు. వేదాలను  స్త్రీలు పఠించరాదు, శూద్రులు నేర్చుకోరాదు అని మనుస్మ్రతి లో చెప్పారని చేస్తున్న వితండ వాదాన్ని తప్పని నిరూపించేలా ఆధారాలతో సహా ఇస్తున్నాను. వేదాలను నేర్చుకొని వాటి సూక్తాలు దర్శించి, వ్యాఖ్యానించిన మేధావంతులైన మహిళలు వీరు.

మహిళాయోగులు, స్త్రీబుుషులు, యోగిణిలు, స్త్రీ మునులనే మాటలను మనం వినివుంటాం.కాని వీరిని బుుషికలు లేదా బ్రహ్మవాదినులని పిలవాలి.

బుుగ్వేదంలో 23 మంది బుుషికలు సూక్తాలు దర్శించారు. అపాల దర్శించిన సూక్తానికి ఆమె పేరు మీదనే అపాలసూక్తమని పిలుస్తారు.

విశ్వవర ఐదవ మండలంలోని 28 వ సూక్తాన్ని లోపాముద్ర 19వ సూక్తాన్ని దర్శించారు. బుుగ్వేదంలో 125 సూక్తాన్ని జుహు దర్శించింది.

గార్గి బుుషిక యజ్ఞవల్కునితో వేదాంత చర్చ చేసింది...!

ఒక్క హిందూధర్మంలో తప్ప మరే ఇతర మతాలలో స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్యసందేశం ఇచ్చినట్టుగా లేదు...!

No comments:

Post a Comment