🔱 అంతర్యామి 🔱
# మనకెందుకులే అనుకుంటే...
🍁మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తీ ఒక్కో విధంగా స్పందిస్తారు. అది వారి మనస్తత్వాల మీద, ఆలోచనా విధానాల మీద ఆధారపడి ఉంటుంది. 'లోకంలో ఎంత మంది మనుషులున్నారో, అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి' అంటాడో ఫ్రెంచి శాస్త్రవేత్త.
🍁'మంచి చేయకపోయినా సాటివాడికి చెడుచేయకు' అంటారు కొందరు. కానీ మన బాగు మాత్రమే మనం చూసుకుంటే చుట్టూ ఉన్న ఆపన్నుల సంగతో? వాళ్లనెవరు చూసుకుంటారు? వారికి సాయం చేయడం మన ధర్మం కాదా! మనకెందుకులే- అనుకుంటామా! అది మానవత్వం అనిపించుకుంటుందా?
🍁భగవంతుడు మానవజన్మ అనే గొప్ప వరాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఇవ్వడం తెలుసుకొమ్మని. సాటి జీవిని ప్రేమించడం అలవరచుకొమ్మని. ఆపదల్లో ఉన్నవారిని ఆదుకొమ్మని. సమస్యలతో సతమతమవుతున్నవారికి తగిన సలహాలివ్వమని మన జ్ఞానాన్ని పంచమని, మన సంపదలో కొంతయినా నిస్సహాయులకు దానం చెయ్యమని. ఈ పరమసత్యాన్ని గ్రహించి, ఆచరించలేని జన్మ వ్యర్థం.
🍁పరీక్షార్థులందరికీ ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. జీవితమనే ప్రశ్నపత్రం మాత్రం మనిషి మనిషికీ వేరుగా ఉంటుంది. విజ్ఞతతో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకోగలవాడే సమర్థుడు. భీష్మద్రోణాదులు దుర్యోదనుడికి ఎన్నోసార్లు హితవు చెప్పారు. ధార్మికులైన పాండవులపైన కక్ష తగదని చెప్పి చూశారు. దుర్యోధనుడు అహంభావి. వినలేదు సరికదా, పెద్దలను అవమానించాడు. ధృతరాష్ట్రుడికి విదురుడూ ఎన్నో ధర్మసూత్రాలు చెప్పాడు. పుత్రవ్యామోహితుడికి ఆ మాటలు చెవికెక్కలేదు. శ్రీకృష్ణుడు ధర్మ పక్షపాతి. నిర్లిప్తంగా ఏనాడూ ఉండలేదు. ప్రతి ఆపదలోను పాండవులను
ఆదుకున్నాడు. దుష్టశిక్షణ చేసి శిష్టుల్ని కాపాడాడు.
🍁ఇవాళ మనకు పరమాత్మ కళ్లెదుట ప్రత్యక్షం కాడు. ఏ జీవి రూపంలోనో మనిషి రూపంలోనో మనల్ని ఆదుకుంటాడు. అలాగని మన కృషి, ప్రయత్నం మానుకోం. కెరటం పడేది లేవడానికే. శిల అడ్డం వచ్చినా, ప్రవాహం పక్కనుంచి దారి చూసుకుంటుంది. ఈ శరీరం పరోపకారానికే అన్ని పెద్దలు చెప్పారు. దీన, హీన స్థితిలో దయనీయ పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు. మనకున్నదాంట్లో కొంతయినా వారి కోసం కేటాయించాలి. ఏ రూపంలో సాయం చేయగలిగితే ఆ రూపంలో సాయం చేయాలి. మన కోరికలు కొన్ని తగ్గించుకోగలిగితే ఇతరుల అవసరాలు కొన్ని అయినా తీర్చగలం. సంఘజీవులుగా సమాజం నుంచి ఎన్నో పొందుతున్నప్పుడు తిరిగి ఎంతో కొంత ఇవ్వడం మన విధి. 'చిన్ని నా పొట్టకే
శ్రీరామరక్ష అనుకునే వాడికి 'శ్రీరామరక్ష కలగదు.
🍁మనకన్నా గొప్పవారైతే అనుసరించాలి. వెనుక ఉన్న వారైతే చేయి అందించాలి. దానగుణం కలవాడే ధనికుడు. ఆ గుణం లేనివాడు ఎంత ఉన్నా నిర్ధనుడే! మనసుంటే మార్గం ఉంటుంది. మనసు లేకపోతే సాకు దొరుకుతుంది. ఆ సాకే మన
ధర్మానికి బాకు అవుతుంది. 'మనకెందుకులే' అనుకుంటే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరులూ అలాగే అనుకోరా?🙏
✍️- చిమ్మపూడి శ్రీరామమూర్తి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment