వైకుంఠ ద్వార దర్శనం :
వైకుంఠ ఏకాదశి కదా! దక్షిణాదిన ఉన్న మన ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం అందరూ ఎంతో ఉత్సాహంగా పరుగులు పెట్టడానికి రెడీ అవుతూ ఉంటారు.
అందరం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందాం! అందరూ రెడీ గా ఉండండి! పొద్దున్నే తిరుమలలో మెయిన్ గేటు అదే సెక్యూరిటీ వాళ్ళు ఎత్తుపైన కూర్చుని వుంటారు కదా! అంతేకాదు మనం దర్శనం అయ్యాక బయటకు వస్తాం కదా... అక్కడికి వచ్చేసి రెడీగా ఉండండి! చకచకా వెళ్లి వైకుంఠ ద్వారం గుండా వెళ్లి, ఆ దివ్య మనోహరమూర్తిని దర్శించుకుని వచ్చేసి, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోదాం!
*****
అందరూ వచ్చేసారా? ఓకే! వరుసగా పదండి!
ఇది మహాద్వారం! ఇక్కడ వస్తున్న నీళ్లలో కాళ్ళు పెడితే, కాళ్ళు కడుక్కోవడం అయిపోతుంది. ఆ తర్వాత ఆ గడపకు అటూ, ఇటూ ఉన్న ద్వారపాలకులు 'పద్మనిధి, శంఖ నిధి' ఇద్దరికీ నమస్కారం చేసుకోండి! చేసుకున్నారా! ఓకే!
ఇక గడప దాటి ముందుకు రెండు అడుగులు వేయగానే కుడివైపు గోడ పైకి చూడండి! అక్కడ ఏం కనిపించింది? ఆ.. కరెక్ట్! గునపం కనిపించింది కదా! అనంతాళ్వార్ విసిరితే స్వామి గడ్డానికి దెబ్బ తగిలిందని, ఆ లీలకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ స్వామికి గంధం రాస్తారని ఇంతకుముందు అనంతాళ్వార్ చరిత్రలో చెప్పుకున్నాం కదా! ఆ గునపానికి ఒక నమస్కారం చేసుకుని ముందుకు నడవడి!
ఎడమవైపు వాహన మండపం, తులభారం తూచే ప్రదేశం, కుడివైపు స్వామి, అమ్మలతో ఊయలు ఊగే అద్దాల మండపం చూస్తూ ముందుకు నడిస్తే అక్కడ ధ్వజస్తంభం, క్షేత్రపాలక శిల కుడివైపున వస్తుంది. ఆ రెండింటికి నమస్కారం చేసుకుని ముందుకు వెళితే, వెండి వాకిలి. ఆ ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులకు నమస్కారం చేసి, ముందుకు నడవగానే ఎదురుగా అద్దాల పెట్టెలో రంగనాథ స్వామి. కనిపించాడా? నమస్కారం చేసి, ఎడమ వైపు తిరిగి నడవాలి.
అక్కడ కంచి వరదరాజ స్వామి. ఆయనకు నమస్కారం చేసుకుని అలాగే ముందుకు వెళితే, పూలబావి. ఎడమవైపున మెట్లెక్కి వెళ్లి చూస్తే, వంటశాల. అక్కడ వకుళ మాత! ఆ పక్కనే కాస్త ముందుకు వెళ్ళాక ఆళ్వార్లు. మళ్ళీ మెట్లు దిగితే ఎదురుగా బంగారు పూతతో పసుపు పచ్చగా దేదీప్యమానంగా వెలిగిపోతూ వైకుంఠ ద్వారం. అదే ద్వారం నుండి వెలుగులు విరజిమ్ముతూ వెళుతున్న సమస్త దేవతాగణాలు, మహర్షులు, సిద్ధులు, అప్సరసలు, నారదాది ముని ముఖ్యులు. వారందరికీ ఒక నమస్కారం చేసుకోండి!
ఆ ద్వారానికి నమస్కారం చేసుకుని.......
"తండ్రీ! ఈ వైకుంఠ ద్వారం గుండా ప్రవేశించే భాగ్యం కలిగించి, మాకు నీ దర్శన భాగ్యం కలిగించావు. మా జన్మలు చరితార్థం చేసి, గట్టెక్కించే పూర్తి భారం నీకే అప్పగిస్తూ, నీ నామ స్మరణ చేస్తున్నాం తండ్రీ!" అని అనుకుంటూ లోపలికి ప్రవేశిద్దాం! పదండి!
ఇలా లోపలికి వెళ్లి చూడగానే దివ్యమంగళ విగ్రహుడైన ఆనందనిలయుడు... ఆ శ్రీనివాసుడు.. శ్రీవేంకటేశుడు.. వక్షస్థలం పై తన మాతృవాత్సల్యాన్ని మనపై కురిపిస్తూ అమ్మ.. 'పద్మాసనస్థ అయిన పద్మావతీదేవిని నిజవక్షమందున నిలుపుకుని..' ఆ పరాత్పరుడు, జగన్నాథుడు, జగన్మోహనుడు, సకల చరాచర సృష్టిలో అంతర్యామి అయి కొలువైన ఆ శ్రీనిలయుడు వైకుంఠుడుగా శేషతల్పం పైన అలవోకగా పవ్వళించి, నాభి కమలంలో బ్రహ్మదేవుడు, శ్రీమహాలక్ష్మి పాదాలు పడుతుండగా, నారద,తుంబురులు నామ సంకీర్తన చేస్తుండగా, బ్రహ్మ, రుద్రాది దేవతలు కొలుస్తుండగా అనుగ్రహ వీక్షణాలు ప్రసరింపజేస్తూ ఉన్న శ్రీమన్నారాయణుడు మన మనసుల్లో ముద్రితం అయిపోతే... ఇక కావాల్సింది ఏముంది..?
అమ్మ మనందరినీ కూడా అనుగ్రహించమని చెప్పగానే, ఆ భక్త వత్సలుడు మనపై కూడా కరుణారస దృష్టి ప్రసరింపజేయగానే, ఆనందంలో తేలిపోతూ మళ్లీ సాష్టాంగ నమస్కారం చేసి, మిగతా వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అనుకుని, ఇక బయటకు వచ్చి, విమాన వేంకటేశ్వర స్వామిని చూసి, దండం పెట్టుకుని, రామనుజుల దర్శనం, నృసింహుని దర్శనం చేసుకుని, తిరిగి వెండి వాకిలి నుండి, బయటకు వచ్చాం! ప్రసాదం తీసుకుని మళ్లీ మహాద్వారం వద్దకు రావడం. అందరూ దర్శనం చేసుకుని వచ్చారు కదా!
మళ్లీ ఓసారి ఆ పద్మావతీ ప్రియుని తలచి, నమస్కరించుకోండి.
ఓకే
ఎవరి పనుల్లోకి వాళ్ళు జంప్..!
ప్రశాంతంగా అన్ని పనులూ చేసుకుంటూ, హాయిగా, ఆనందంగా...
*సుధా విశ్వం*
No comments:
Post a Comment