Saturday, January 11, 2025

 *రహస్య యోగులు - 29*
🤟🙌🤘

రచన : శ్రీధరన్ కాండూరి 


*తిరునావుక్కరసు నాయనారు జీవిత విశేషాలు -1*

అప్పార్ లేదా తిరునావుక్కరసు అని పిలువబడిన ఒక మహా శివయోగి క్రీ.శ. 7వ శతాబ్దంలో నాటి తమిళదేశంలో జీవించాడు. ఆనాడు తమిళ రాజ్యంలో ప్రబలంగా ఉన్న జైనమతాన్ని రూపు మాపి శైవమతాన్ని స్థాపించటంలో ప్రముఖ పాత్ర పోషించాడు. 

ఈ తిరునావుక్కరసు. శైవమత ఆచార్యులలో ప్రముఖంగా పేర్కొనబడిన నలుగురిలో తిరునాఉక్కరసు ఒకడని చెబుతారు.

తిరునావుక్కరసు నాటి తమిళదేశంలోని తిరుమునైపడినాడు అనే ప్రాంతంలో ఉన్న తిరువామూరు అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తండ్రి పేరు పూకల్నార్, తల్లి పేరు మాతినియార్. పుట్టినప్పుడు తిరునావుక్కరసుకు తండ్రి పెట్టిన పేరు “మరుల్నీకియార్". ఈ పేరుకి అర్ధం "చీకట్లను పారద్రోలేవాడు/అజ్ఞానాన్ని అంతమొందించేవాడు” అని.

మరుల్నీకియార్ చాలా చిన్నతనంలోనే సమస్త శాస్త్రాలని బాగా అభ్యసించాడు. మరుల్నీకియార్ కి తిలకవతి అనే ఒక అక్క కూడా ఉండేది. ఈ తిలకవతికి 12వ సంవత్సరం రాగానే ఆమె తండ్రి పూకలనార్ ఆమెకు వివాహం చెయ్యాలని సంకల్పించాడు. ఆనాటి పల్లవ సైన్యంలో సేనాధిపతిగా పని చేస్తున్న కలైపహయార్ అనే పేరుగల ఒక యువకుడితో పుణ్యవతికి వివాహం నిశ్చయించాడు ఆమె తండ్రి. వివాహం ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతుంది అనగా కొన్ని అనుకోని పరిస్థితుల్లో కలైపహయా ర్ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధంలో కలైపహయార్ మరణించాడు.

తన కుమార్తెకు జరగవలసిన పెళ్ళి ఆగిపోవటంతో పూకల్నార్ జబ్బుపడి ఆపై దిగులుతో చనిపోయాడు. భర్త చనిపోవటంతో విరక్తి చెందిన పూకల్నార్ భార్య మాతినియార్ భర్త చితి మీదకు చేరుకుని సతీసహగమనం చేసి తనువు చాలించింది. తనకు కాబోయే భర్త కలైపహయార్ చనిపోవటంతో తిలకవతి ఎంతో విచారానికి గురైంది. అంతలోనే ఆమె తల్లి, తండ్రి కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటంతో ఆమె తీవ్ర వేదనకుగురై తాను కూడా మరణించా లని నిర్ణయించుకున్నది. అప్పుడు  మరుల్నీకియార్ ఆమెతో ఇలా అన్నాడు. "ఇప్పుడు మన కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండాపోయింది. నీవు మాత్రమే మిగిలావు. ఇప్పుడు నీవు కూడా మరణిస్తే మన కుటుంబం దిక్కులేనిది అయిపోతుంది. ఇంతవరకు అక్కగా ఉన్న నీవు ఇకపై మన కుటుంబానికి తల్లిలా ఉండాలి. మన కుటుంబాన్ని రక్షించాలి. నీవు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాన్ని మానక పోతే నేను కూడా బలన్మరణం పొందుతాను".

తమ్ముడి కోసం ఎంతో విచారించిన పుణ్యవతి తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకుని ఆపై శివయోగినిగా మారి శివుడిని ధ్యానిస్తూ జీవించాలని నిర్ణయించుకున్నది. అప్పటికి 10 సంవత్సరాల బాలుడైన మరుల్నీకియార్ ని ఎంతో శ్రద్ధతో పెంచటం ప్రారంభించింది పుణ్యవతి.

మరుల్నీకియార్ వయస్సులో చిన్నవాడై నప్పటికీ అతడు ఈ ప్రపంచం యొక్క వాస్తవాన్ని గ్రహించాడు. "ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదని" అర్ధంచేసుకున్నాడు. దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఆనాడు తన ప్రాంతంలో ఉన్న మతాలలో ఏ మతం గొప్పదా? అని విచారించాడు. ఆనాడు తమిళ ప్రాంతంలో ప్రబల మతం గా ఉన్న జైనమతం చాలా గొప్పదని మరుల్సీకియార్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా అహింసా సిద్ధాంతాన్ని ప్రధాన సూత్రంగా పాటించే జైనమత విధానాలు మరుల్నకియార్ కి బాగా నచ్చాయి. జైనమతంలో చేరితే తనకు ముక్తి లభిస్తుందని భావించాడు. ఫలితంగా ఆయన జైనమతాన్ని స్వీకరించి ఆపై దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉన్న పాటలీ పుత్రం అనే పట్టణానికి చేరుకుని అక్కడ ఉన్న జైనమత విద్యాలయంలో విద్యార్థిగా చేరాడు. కొన్ని సంవత్సరాల పాటు జైనమత సిద్ధాంతాలను క్షుణ్ణంగా అభ్యసించి గొప్ప పండితుడిగామారాడు. జైనమత గురువులు మరుల్నీకియార్ కి “ధర్మసేనుడు” అనే ఒక కొత్త పేరును పెట్టారు.

తరతరాలుగా శివుడిని ఆరాధిస్తూ శైవ మతాన్ని పాటిస్తున్న తమ కుటుంబం లోని మరుల్నీకియార్ జైనమతంలో చేరిపోవటం అతడి సోదరి పుణ్యవతికి ఎంతమాత్రం నచ్చలేదు. దాంతో ఆమె ఎంతో ఆవేదనచెంది తన ప్రాంతాన్ని విడిచి తిరువడిగామ్విరాట్టనాం అనే శైవ క్షేత్రానికి చేరుకుని అక్కడ ఉన్న శైవ మఠంలో చేరింది. ఆ క్షేత్రంలో వెలసిన విరాట్టనేశ్వరుడిని పూజించటం మొదలు పెట్టింది. జైనమతంలో చేరిన తన సోదరుడు మరుల్నీకియార్ ఏనాటికైనా మళ్ళీ శివభక్తుడిగా మారాలని ఆమె మనస్పూర్తిగా వాంఛిస్తూ ఉండేది. మరుల్నీకియార్ శైవమతంలోకి మారేలా చెయ్యమని విరాట్టనేశ్వరుడిని ప్రతిరోజూ ప్రార్ధిస్తూ ఉండేది పుణ్యవతి. 

ఒకరోజు రాత్రి విరాట్టనేశ్వరుడు, పుణ్యవతికి కలలో కనిపించి ఆమెతో ఇలా చెప్పాడు. "నీ సోదరుడు గతజన్మ లో నా గురించి ఎంతో తీవ్ర తపస్సు చేసాడు. విధివిలాసం వల్ల అతడు జైన మతంలో చేరాడు. అతడిని తీవ్రవ్యాధికి గురిచేసి అతని మనస్సును మారుస్తాను. అతడు మళ్ళీ నా భక్తుడికి మారేలా చేస్తాను. నీవేమీ విచారించకు”.

శివసంకల్పం వల్ల మరుల్నీకియార్ కి అతిదారుణమైన కడుపునొప్పి వ్యాధి మొదలయ్యింది. జైనమత గురువులు ఎన్ని ఔషధాలు ఇచ్చినా మంత్రాలు ప్రయోగించినా మరుల్నీకియార్ కి ఆ వ్యాధి తగ్గలేదు. దాంతో మరుల్నీకియార్ కి జైనమతం మీద నమ్మకంపోయింది. తన అక్క పుణ్యవతి గుర్తుకు వచ్చింది. శ్రేష్టమైన శైవ మతాన్ని వదిలిపెట్టి వేదవిహిత మార్గాలను అనుసరించే జైన మతాన్ని పుచ్చుకున్నందువల్ల తనకు ఈ భయంకర వ్యాధి వచ్చిందని మరుల్నీకి యార్ కి అనిపించింది. దాంతో ఆయన అప్పటి వరకు తను ధరించిన జైనమత సంబంధ వస్త్రాలను త్యజించి ఒక ధోతీ ధరించి ఆపై తన అక్క పుణ్యవతి వద్దకు వెళ్ళి ఆమె కాళ్ళపైపడి తనను క్షమించి రక్షించమని వేడుకున్నాడు. 

పుణ్యవతి చాలా ఆశ్చర్యపడింది. తన సోదరుడిని మార్చటంకోసమే పరమ శివుడు ఈ లీలను జరుపుతున్నాడని పుణ్యవతికి అర్ధమయ్యింది. అప్పుడు ఆమె, మరుల్నీకియార్ ని ఓదార్చి ఆపై కొంచెం విభూతిని చేతిలోకి తీసుకుని "ఓం నమఃశ్శివాయ” పంచాక్షరీ మంత్రాన్ని జపించి ఆపై ఆ విభూతిని అతడి నుదుటను అద్దింది. దాంతో మరుల్నీకి యార్ జైనమత స్వీకరణ కారణంగా ఏర్పడిన పాపం నశించిపోయింది. ఆ తరువాత పుణ్యవతి, మరుల్నీకియార్ ని తీసుకుని విరాట్టనేశ్వర ఆలయానికి వెళ్ళింది. అక్కడ మరుల్నీకియార్ ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆపై ఆలయంలోకి వచ్చి ఆ ఆలయ గర్భగుడి లో వేంచేసి ఉన్న విరాట్టనేశ్వరుడిని కళ్ళారా చూస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ ఒక అద్భుత గీతాన్ని ఇలా ఆలపించాడు.

"మహాదేవుడవు అయిన నిన్ను కాదని పాషండ మతమైన జైనమతాన్ని స్వీకరించి చాలా తప్పుచేసాను. గోదావరి తీరంలో శివభక్తులైన ఋషులతో వాదించి శైవమతం అల్పమైనదని, జైనమతం గొప్పదని ప్రచారంచేసాను. నేను చేసిన ఈ శైవమత అపచారం కారణంగా ఆ యముడే ఈ కడుపు నొప్పి రూపంలో నావద్దకి వచ్చి నన్ను అనేక చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఓ పరమేశ్వరా! నీవే నా రక్షకుడవు. నీవే నన్ను ఈ వ్యాధి నుండి రక్షించాలి”.

మరుల్నీకియార్, శివుడిని ప్రార్థిస్తూ పాడిన పాట పూర్తి అయ్యిందో లేదో కొంత కాలంగా అతడిని వేధిస్తున్న కడుపునొప్పి వ్యాధి విచిత్రంగా వెంటనే అదృశ్యం అయిపోయింది. అప్పుడు ఒక అదృశ్య వాణి ఇలా పలికింది. "ఇకపై నీవు తిరునాఉక్కరసు అనే పేరుతో లోకంలో పిలువబడతావు. నీ పేరు ఈ దేశమంతా ప్రాకిపోతుంది”. (తిరునావుక్కరసు అనగా “వాక్కుకి అధిపతి” అని అర్ధం). ఈ తిరునావుక్కరసుకే “వాగీశుడు” అనే ఇంకొక పేరు కూడా ఉన్నది. వాగీశుడు అనగా వాక్కుకి అధిపతి అని అర్ధం.
🪷

*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅

*రహస్య యోగులు - 30*
🤟🙌🤘

రచన : శ్రీధరన్ కాండూరి 


*తిరునావుక్కరసు నాయనారు జీవిత విశేషాలు*

ఎప్పుడైతే పరమశివుడు తన వ్యాధిని తగ్గించాడో అప్పటి నుండి తిరునావుక్క రసుకి శివుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి.

నిరంతరమూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివుడే లోకంగా జీవించటం ప్రారంభించాడు. అప్పటివరకు జైన మతానికి వెన్నుముకగా ఉన్నధర్మసేనుడు (తిరునావుక్కరసు) హఠాత్తుగా శైవ మతంలోకి మారిపోయేసరికి ఆ ప్రాంతం లోని జైనమత గురువులకు ఆందోళన కలిగింది. తాము ధర్మసేనుడికి వచ్చిన కడుపునొప్పిని తగ్గించలేకపోయామని, దాంతో అతడు పరమశివుడిని ప్రార్ధించి కడుపునొప్పిని తగ్గించుకుని ఆపై పరమ శివుడి భక్తుడిగామారి శైవమతంలోకి తిరిగి వెళ్ళిపోయాడని ఆ జైనమత గురువులకు అర్ధమయ్యింది. 

ధర్మసేనుడు శైవమతంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిస్తే ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న మహారాజుకి జైనమతం మీద విశ్వాసం పోతుందని, పైగా అప్పటివరకు జైన మతాన్ని పోషిస్తున్న ఆ మహారాజు కూడా శైవమతంలోకి వెళ్ళే ప్రమాదం ఉన్నదని ఆ జైనమత గురువులు ఊహించారు. దాంతో వాళ్లు ఒక ఎత్తు వేసారు.

ఆ ఎత్తు ప్రకారమే కొందరు జైనమత గురువులు, మహారాజు వద్దకు వెళ్ళి ఆయనతో ఇలా చెప్పారు. “ధర్మసేనుడు మీకు ద్రోహం చెయ్యాలని కుట్రపన్నాడు. అతడు మిమ్మల్ని ఏదో విధంగా పదవి నుండి తప్పించాలని ప్రయత్నిస్తున్నాడు". అన్నారు. తన పదవికి ముప్పు వస్తుందని భావించిన మహారాజు వెంటనే తన భటుల్ని పిలిచి ధర్మసేనుడు (తిరునా ఉక్కరసు) ఎక్కడ ఉన్నా వెంటనే పట్టి తీసుకురమ్మని చెప్పాడు. ఆ భటులు మరియు కొంతమం జైనమతస్తులు, తిరువతికాయ్ లో ఉంటున్న తిరునా ఉక్కరసు వద్దకువెళ్ళి అతడిని వెంటనే బయలుదేరి తమతో పాటు రమ్మని అతడితో చెప్పారు. అప్పుడు తిరునా వుక్కరసు వారితో ఇలా అన్నాడు.

"నేను మీ మహారాజుగారి ప్రజలలో ఒకడిని కాదు. నేను పరమశివుడి చెందిన వాడిని. ఆయనే నాకు అధిపతి. రాజు గారి ఆజ్ఞను ధిక్కరించుట ఆయన ప్రజలకు తగదు. కానీ నేను ఆ రాజు రక్షణలో బ్రతకటంలేదు. సర్వ లోకాలకు అధిపతి అయిన ఆ ఈశ్వరుడి రక్షణలో జీవిస్తున్నాను అందువలన నేను మీ రాజుగారి మాటలు గౌరవించి మీతో రావాల్సినపనిలేదు. సాక్షాత్తు యమధర్మ రాజునే భస్మం చేసిన పరమశివుడు! భక్తుడిని అయిన నాకు ఏ రాజును చూసి భయపడవలసిన పనిలేదు".

ధర్మసేనుడు (తిరునావుక్కరసు) ఇదివరకటి మనిషి కాదని శివకటాక్షాన్ని పొందిన మహాత్ముడని ఆ రాజభటులకు మరియు ఆ భటులతో పాటు వచ్చిన జైనులకు స్పష్టంగా అర్ధమయ్యింది. అప్పుడు వారు తిరునావుక్కరసుతో ఇలా అన్నారు. 

“ఓ పూజ్యుడా! నీవు మా వెంట రాకపొతే మేము కూడా తిరిగివెళ్ళం. నీవు కూడా మాతో పాటు వచ్చి మా మహారాజుకు కూడా శివుని గొప్పతనాన్ని గురించి తెలియజేయి”. జైన మతాన్ని పోషిస్తున్న మహారాజుని శైవంలోకి మార్చినట్లయితే జైనమతం తొందరగా నశించిపోతుంది అని అర్ధంచేసుకున్న తిరునావుక్కరసు మరేవీ అడ్డుచెప్పకుండా ఆ భటుల వెంట బయలుదేరి మహారాజు వద్దకు వెళ్ళాడు.

తిరునావుక్కరసుని చూడగానే మహా రాజు ఆగ్రహంతో రంకెలు వేసాడు. "రాజద్రోహానికి మరియు జైనమత ద్రోహానికి పాల్పడిన ఈ దుర్మార్గుడికి తగిన శిక్ష విధించండి" అని జైనమత గురువుల్ని కోరాడు ఆ మహారాజు. తమ కంట్లో నలుసులాగా తయారయిన తిరునావుక్కరసుని శిక్షించే అవకాశం రాజుగారు తమకు ఇవ్వటంతో ఆ జైన మత గురువులు ఎంతో పొంగిపోయారు. ఆ తరువాత వాళ్ళు భటుల్ని పిలిచి వారితో ఇలా చెప్పారు.

"ఈ తిరునావుక్కరసుని ఏడు రోజుల పాటు సున్నపు బట్టీలో పడవేయండి". ఆ భటులు తిరునావుక్కరసుని తీసుకువెళ్ళి సున్నపు బట్టీలో వేసారు.

సున్నపు బట్టీలో నుండి పుట్టే వేడికి తిరునావుక్కరసు ఉడికిపోయి మాడి చనిపోతాడని జైనమత గురువులు భావించారు. శివుడినే తన రక్షకుడిగా భావించిన తిరునావుక్కరసు ఆ సున్నపు బట్టీలో పద్మాసనంలో కూర్చుని శివ పంచాక్షరీ జపిస్తూ సమాధిలోకి వెళ్ళిపోయాడు. 

ఏడు రోజులు పూర్తి అయిన తరువాత సున్నపుబట్టీ తలుపు తెరిచి చూడగా తిరునావుక్కరసు క్షేమంగా కనిపించాడు. అది చూసి మహారాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ జైనమత గురువులు మహారాజుతో ఇలా అన్నారు. “జైనమతంలో ఉన్నప్పుడు అతడు నేర్చుకున్న విద్యల మహత్యం కారణంగా అతడు సున్నపుబట్టీలో ఉన్నా క్షేమంగా ఉన్నాడు. అతడు చెబుతున్నట్లుగా అతడిని శివుడు కాపాడలేదు".

జైనమత గురువుల మాయమాటలు నమ్మాడు ఆ మహారాజు. మరి ఈ తిరునావుక్కరసుని ఎలా శిక్షించాలి అని ఆ మహారాజు, జైనమత గురువుల్ని అడిగాడు. తిరునావుక్కరసుకి కాలకూట విషం ఇస్తే అతడు తప్పక చనిపోతాడు  అని జైనమత గురువులు అన్నారు. ఆ తరువాత జైనమత గురువులు ఒక పాత్రనిండా భయంకరమైన విషాన్ని తెప్పించి తిరునావుక్కరసుని త్రాగమని కోరారు. సమస్త లోకాల్ని నశింపచేయగల కాలకూట విషాన్ని తన గరళంలో దాచుకున్న ఆ గరళకంఠుడి భక్తుడైన తిరునావుక్కరసు ఎంతో ధైర్యంతో ఆ విషాన్ని త్రాగాడు. శివ మహాత్యం కారణంగా ఆ విషం, తిరునావుక్కరసుని ఏమీ చెయ్యలేకపోయింది. అది చూసి మహారాజు మరింతగా ఆశ్చర్యవడ్డాడు. 

రాజుగారు, తిరునావుక్కరసును ఆదరిస్తాడేమో అని భయపడిన జైనమత గురువులు మహారాజుతో ఇలా అన్నారు. “ఈ తిరునావుక్కరసు జైనమతంలో ఉన్నప్పుడు చేసిన సాధన కారణంగా అతడికి విషం వల్ల ఏ ప్రమాదమూ కలుగలేదు".

ఆ తరువాత జైనమత గురువులు, తిరునావుక్కరసుని ఒక మదపుటేనుగు చేత త్రొక్కించారు. శివమహత్యం కారణంగా ఆ ఏనుగు తిరునావుక్కరసుని త్రొక్కలేదు సరికదా ఆయన ముందు శిరస్సు వంచి ఆయనకు తన తొండంతో అభివాదం చేసింది. ఇది చూసిన మావటీలు ఏనుగుని అంకుశాలతో పొడిచి తిరునావుక్కరసున్న త్రొక్కి చంపమని ఏనుగుని బలవంతం చేసారు. దాంతో ఏనుగు మాము వాళ్ళను మరియు ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది జైనమ్మ గురువుల్ని తన కాళ్ళతో త్రొక్కి చంపివేసింది, దాంతో అక్కడ చావకుంది. మిగిలిన కొందరు జైనమత గురువులు అక్కడ నుండి ప్రాణభయంత పరుగులు తీసారు. ఇన్ని జరిగినా జైనమత గురువులు తమ ప్రయత్నాలు విరమించలేదు. 

తిరునావుక్కరసుని ఒక పెద్ద బండరాయి కి కట్టి అతడిని ఆ బండరాయితో సహా సముద్రంలో పడవేసారు.

తిరునావుక్కరసు, శివపంచాక్షరీ జపిస్తూ ఉండిపోయాడు. ఆ మంత్రి బలం వల్ల సముద్రంలో మునిగిపోతున్న బండరాయి బెండులాగా నీళ్ళపై తేలింది. అంతే కాకుండా అది అలా నీళ్ళపై తేలుతూ తిరుప్పులియార్ ఒడ్డుకి చేరుకున్నది. ఆ ప్రాంతంలో ఉన్న అనేకమంది శివభక్తులు సముద్ర తీరానికి చేరుకుని అక్కడ బండ రాయికి కట్టివేయబడి ఉన్న తిరునావుక్క రసు కట్లు విడదీని ఆయనకు ఘన స్వాగతం చెప్పి గ్రామంలోకి తీసుకు వెళ్ళారు. పరమ శివుడి మహత్యం కారణంగానే తాను సముద్రంలో పడ్డా క్షేమంగా బయటకు వచ్చానని తిరునావుక్కరసు భావించాడు. మానవులు తనని సంహరించాలని చూసినా పరమేశ్వరుడు తనని రక్షిస్తున్న కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నానని తిరునావుక్కరసు ఒక గీత రూపంలో పాడాడు.

ఆ తరువాత తిరునావుక్కరసు ఆ ప్రాంతంలోని అనేక దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ చివరిగా తిరువత్తికాయ్ అనే క్షేత్రానికి చేరాడు.

అప్పటి వరకు జైనమత గురువుల ప్రభావంలో ఉండి తిరునావుక్కరసును సంహరించటానికి అనేక ప్రయత్నాలు చేయించిన పల్లవరాజుకి తిరునావుక్కర సు క్షేమంగా ఉన్నాడని సమాచారం అందింది. తిరునావుక్కరసు గొప్ప శివ భక్తుడని ఆ పల్లవరాజుకి అర్ధమయ్యింది. తిరునావుక్కరసు ఎంతటి మహత్యం గలవాడో పల్లవరాజు స్వయంగా తెలుసుకున్నాడు. ఆ తరువాత పల్లవ రాజు స్వయంగా తిరువత్తికాయ్ గ్రామానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న తిరునావుక్కరసు పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. 

అప్పుడు తిరునావుక్కరసు, పల్లవ రాజును గాఢాలింగనం చేసుకుని ఆదరించాడు. ఆ క్షణంలోనే పల్లవరాజు శైవమతంలోకి మారిపోయాడు.
🪷
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉

*రహస్య యోగులు - 31*
🤘🙌🤟

రచన : శ్రీధరన్ కాండూరి 


*తిరునావుక్కరసు నాయనారు జీవిత విశేషాలు*

ఆ తరువాత పల్లవరాజు తిరువత్తికాయ్ లో పరమశివుడికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయంలో తిరునావుక్కరసు కొంతకాలం పాటు శివారాధన చేసాడు. ఆపై తిరునావుక్కర సు అనేక ప్రాంతాలలో పర్యటించి శైవ మతం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేసాడు. ‘శివుడే పరదైవం' అనే సత్యాన్ని అన్ని వర్గాల ప్రజలలో వ్యాపింపచేసాడు. కొంతకాలం గడిచింది. 

తిరునావుక్కరసులో ఒక ఆలోచన మొదలయ్యింది. అది ఏమిటంటే “తాను గతంలో కొంతకాలంపాటు తిరుత్తూంగానై మావడన్ అనే క్షేత్రంలో జైనులతో కలిసి ఉండి వారితో సహపంక్తి భోజనాలు చేసాడు. ఫలితంగా తన శరీరంలో అపవిత్రత ఏర్పడింది. కొంతకాలంగా శివారాధనలో ఉన్న కారణంగా ఆ అపవిత్రతలో చాలా భాగం నశించి పోయింది. కానీ ఇంకా కొంత అపవిత్రత తన శరీరంలో దాగి ఉన్నది. పూర్తి పవిత్రత లేకుండా శివుడిని పూజించటం భావ్యంకాదని” భావించిన తిరునావుక్కర సు తనకు శివదీక్షను ప్రసాదించమని శివుడిని వేడుకున్నాడు.

అప్పుడు పరమేశ్వరుడు తన సేవకులలో అత్యంత ఉత్తముడైన ఒకడిని పిలిపించి అతడిని తిరునావుక్కరసు వద్దకు వెళ్ళి తిరునావుక్కరసుకి శివదీక్ష ఇవ్వమని ఆజ్ఞాపించాడు. ఆ శివసేవకుడు, తిరునావుక్కరసు వద్దకు వచ్చి అతడి భుజాల మీద త్రిశూలము మరియు నంది చిహ్నాలను ముద్రించాడు. ఆ విధంగా శివదీక్ష లభించటంతో తిరునావుక్కరసు పరమ పవిత్రుడుగా మారిపోయాడు. ఆ తరువాత తిరునావుక్కరసు తిరువత్తర,
కనకసభ లాంటి దివ్య క్షేత్రాలను దర్శించి ఆపై చిదంబర క్షేత్రానికి చేరుకున్నాడు. 

చిదంబర క్షేత్రంలో వెలసిన నటరాజ స్వామిని చూసి తన్మయత్వం చెందిన తిరునావుక్కరసు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు చిదంబరంలో ఉండి నటరాజస్వామిని తనివితీరా దర్శించుకున్నాడు. ఆ సమయంలోనే తిరునావుక్కరసుకి బాలయోగి అయిన తిరుజ్ఞానసంబంధర్ గురించి తెలిసింది. 

సాక్షాత్తు పార్వతీదేవి యొక్క స్తన పానాన్ని చేసిన ఆ బాలయోగిని కళ్ళారా చూసి తరించాలని భావించిన తిరునావు క్కరసు, షియాలి గ్రామం చేరుకున్నాడు. మహాయోగిగా గుర్తించబడిన తిరునావు క్కరసు తన కోసం వస్తున్నాడని ముందు గానే తెలుసుకున్న తిరుజ్ఞాన సంబంధర్, తిరునావుక్కరసుకి ఎదురువెళ్ళి మరీ స్వాగతం చెప్పాడు. తిరుజ్ఞానసంబంధర్, తిరునావుక్కరసుకి సాష్టాంగదండ ప్రమాణంచేసాడు. తిరునావుక్కరసు కూడా తిరుజ్ఞాన సంబంధర్ కి పాదాభి వందనం చేసాడు. ఇద్దరు మహా యోగులు పరస్పరం ఎలా గౌరవించు కుంటారో ఈ ఇద్దరు శివయోగులు నిరూపించారు.

తిరుజ్ఞానసంబంధర్ ఎంతో ఆదరంతో తిరునావుక్కరసును “అప్పారే” అని పిలిచాడు. అప్పారే అనగా "తండ్రి" అని అర్ధం. ఆ తరువాత తిరునావుక్కరసు, తిరుజ్ఞానసంబంధర్ ని వెంటపెట్టుకుని నటరాజస్వామి ఆలయానికి వెళ్ళాడు. సంబంధర్ కోరిక మీద తిరునావుక్కరసు, శివుడిని కీర్తిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని ఆలపించాడు. ఆ తరువాత ఆ ఇద్దరు మహాయోగులు, తిరుక్కోరకు ఆలయాన్ని దర్శించారు. ఆ తరువాత తిరునావుక్కరసు, తిరుజ్ఞానసంబంధర్ కి వీడ్కోలు పలికి తాను మాత్రం అనేక దేవాలయాను సందర్శిస్తూ చివరగా తిరువావదూతురై క్షేత్రానికి చేరుకున్నాడు. 

ఆ క్షేత్రంలోనే తిరునావుక్కరసు తీవ్ర వైరాగ్య స్థితికి చేరుకున్నాడు. తనకు ఈ లోకం నుండి మరియు జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించమని ఆ పరమశివుడిని వేడుకున్నాడు. తర్వాత తిరునావుక్కరసు, సత్తిమూలం క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో వెలసిన ఈశ్వరుడిని ఇలా ప్రార్ధించాడు.

“ఓ మహాదేవా! నేను ఈ శరీరం త్యజించే లోగా నీ పాద పద్మాలను నా శిరస్సుపై ఉంచు". అప్పుడు పరమశివుడు, తిరునావుక్కరసుతో ఇలా అన్నాడు. 

“నీవు తిరునల్లూర్కి రా. అక్కడ నీ కోరిక తీరుతుంది". 

ఆ పై తిరునావుక్కరసు అక్కడ నుండి తిరునల్లూర్ క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రంలో పరమశివుడు తన పవిత్ర పాదాలను తిరునావుక్కరసు శిరస్సుపై కొద్దిసేపు ఉంచాడు.

ఆ తరువాత తిరునావుక్కరసు, తింగలూర్ అనే ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడ అప్పూడిఎడి గళ్నయనార్ అనే ఒక శివభక్తుడు నివసిస్తున్నాడు. ఆయనకు తిరునావు క్కరసు మీద ఎనలేని భక్తిశ్రద్ధలు ఉన్నాయి. ఆ కారణంగానే ఆయన తన బిడ్డలందరికీ “వాగీశుడు" అన్న పేరు పెట్టాడు. (తిరునావుక్కరసు అన్నా, వాగీశుడు అన్నా అర్ధం ఒకటే. తిరునావు క్కరసు తమిళ భాషాపదం కాగా, వాగీశుడు సంస్కృత భాషాపదం అని గుర్తించాలి.) 

అంతేకాకుండా ఆయన త్రవ్వించిన చెరువులకు, కట్టించిన ధర్మసత్రాలకు "వాగీశుని ధర్మంతో లేదా ఆర్ధిక సహాయం తో కట్టబడ్డాయని వ్రాయించాడు. తిరునా వుక్కరసును అంతగా అభిమానించే అప్పూడిఎడిగళ్నయనార్, తిరునావుక్క రసుని తన ఇంటికి విందు భోజనానికి ఆహ్వానించాడు. భోజనం చెయ్యటానికి అవసరం అయిన అరిటాకులను కోసుకు రమ్మని తన పెద్ద కుమారుడైన పెద్ద వాగీశుడిని అరటి తోటకు పంపాడు అప్పూడిఎడిగళ్నయనార్.

ఆ అబ్బాయి అరిటాకులు కోస్తూ ఉన్న సమయంలో ఒక త్రాచుపాము అతడిని కరిచింది. ఆ అబ్బాయి పాముకాటు బాధను ఎలాగో తట్టుకుని అరిటాకులు తెచ్చి తండ్రికి ఇచ్చి ఆపై ప్రాణాలు వదిలాడు. ఆ అబ్బాయి పాముకాటుతో చనిపోయిన విషయం తెలిస్తే తిరునావు క్కరసు భోజనం చెయ్యడని భయపడిన అప్పూడిఎడిగళ్నయనార్ దంపతులు ఏమీ జరగనట్లుగా ప్రవర్తిస్తూ తిరునావు క్కరసును భోజనానికి రమ్మని సాదరంగా ఆహ్వానించారు. దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుక్ను తిరునా వుక్కరసు గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు.

"చనిపోయిన మీ బిడ్డ మృతదేహాన్ని తీసుకుని శివాలయం వద్దకురండి". 

ఆ తరువాత అప్పూడిఎడిగళ్నయనార్ తన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని శివాలయంలో ఉన్న తిరునావుక్కరసు వద్దకు వచ్చాడు. అప్పుడు తిరునావుక్క రసు చనిపోయిన బిడ్డని బ్రతికించమని పరమశివుడిని ప్రార్ధించాడు. ఫలితంగా ఆ బిడ్డ నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. చనిపోయిన తన బిడ్డ మళ్ళీ బ్రతకటంతో అప్పూడిఎడిగళ్ నయనార్ ఆనందంతో పొంగిపోయాడు. ఆ తరువాత తిరునావుక్కరసు అందరితో కలిసి అప్పూడిఎడిగళ్నయనార్ గృహంలో విందుభోజనం ఆరగించాడు.

ఆ తరువాత తిరునావుక్కరసు అన్ని క్షేత్రాలను దర్శిస్తూ తిరువారూర్ అనే శైవ క్షేత్రానికి చేరుకున్నాడు. తిరువారూర్ లో ఉండే శివభక్తులు, తిరునావుక్కరసుకి ఘనస్వాగతం చెప్పారు. ఆ తరువాత తిరునావుక్కరసు తిరువారూర్లోని శివాలయంలో శివుడిని ప్రార్ధించాడు. అక్కడ పరమ శివుడు తిరునావుక్కర సుకి దర్శనమిచ్చాడు. శివదర్శనంతో ఉప్పొంగిపోయిన తిరునావుక్కరసు ఆ ఆలయంలో నృత్యం చేసాడు. ఆ తరువాత తిరునావుక్కరసు అనేక దేవాలయాలు సందర్శిస్తూ తిరువూకలూ రు క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ తిరునావుక్కరసు, రెండవసారి తిరుజ్ఞాన సంబంధర్ ని కలుసుకున్నాడు. ఆ తరువాత ఆ ఇద్దరు భక్తులు కొంతకాలం పాటు తిరువూకలూరులో నివసించారు. ఆ సమయంలో అనేకమంది శివభక్తులు ఇక్కడికివచ్చి ఈ ఇద్దరు శివయోగుల్ని దర్శించుకున్నారు.

ఆ తరువాత తిరునావుక్కరసు మరియు తిరుజ్ఞానసంబంధర్ కలసి తిరునీజిమలై అనే గ్రామానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ గ్రామంలో తీవ్రమైన కరువుపరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలను చూడలేక ఆ ఇద్దరు శివయోగులు చలించిపోయారు. ఆ ప్రజల కష్టాలను తీర్చమని పరమశివుడిని ప్రార్ధించారు. అప్పుడు పరమశివుడు ఆ ఊరులోని శివాలయంలో ఉన్న పశ్చిమద్వారం బలిపీఠం మీద ఒక బంగారు నాణెం, తూర్పు ద్వారం బలిపీఠం మీద ఒక బంగారు నాణెం ఉంచి వాటితో ప్రజలకు కావలసిన ఆహారాన్ని కొనిపెట్టమని చెప్పాడు. అంతేకాదు ఇంకా కొద్ది రోజులు పాటు ప్రతిరోజూ అలాగే రెండు నాణాల ను ఇస్తానని ఆ ఇద్దరు శివయోగులకు చెప్పాడు.

శివుడు ప్రసాదించిన బంగారు నాణాల కారణంగా ఆ ప్రాంత ప్రజల కరువు పూర్తిగా తీరిపోయింది. ఆ శివయోగులు పరమశివుడికి కృతజ్ఞతలను తెలియజే సుకున్నారు. ఆ తరువాత వారు ఇద్దరూ  “తిరుమలైకాడు” అనే దివ్య శైవ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ క్షేత్రానికే “వేదారణ్యం” అనే ఇంకొకపేరు కూడా ఉన్నది. పూర్వం ఈ క్షేత్రంలో వేదాలు పరమశివుడిని పూజించేవి. అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు కూడా వేదాలను పఠిస్తూ ఉండేవారు. కొంతకాలం గడిచిన తరువాత ఆ ప్రాంతం ప్రజలు వేదాలను చదవటంమానివేసారు. ఫలితంగా వేదాలు ఆ క్షేత్రంలోని శివుడిని పూజించటం మానివేసాయి. ఒక విశేషం ఏమంటే ఈ వేదారణ్యం క్షేత్రంలోని ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉండేవి. అందులో ఒక ద్వారం ద్వారా వేదాలు ఆ శివాలయంలోకి ప్రవేశించేవి. ఇంకొక ద్వారం ద్వారా భక్తులు ఆలయం లోపలికి ప్రవేశించేవారు.
🪷
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉

*రహస్య యోగులు - 32*
🤟🙌🤘

రచన : శ్రీధరన్ కాండూరి 


*తిరునావుక్కరసు నాయనారు జీవిత విశేషాలు*

ఒక విశేషం ఏమంటే ఈ వేదారణ్యం క్షేత్రంలోని ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉండేవి. అందులో ఒక ద్వారం ద్వారా వేదాలు ఆ శివాలయంలోకి ప్రవేశించేవి. ఇంకొక ద్వారం ద్వారా భక్తులు ఆలయం లోపలికి ప్రవేశించేవారు.

వేదాలు ఆ ఆలయంలోకి రావటం మానివేసిన కారణంగా ఆ ద్వారం మూసివేయబడింది. ఇతర భక్తులు ఇంకో ద్వారం ద్వారా ఆలయంలోకి వెళుతూ ఉండేవారు. ఆ ఆలయం దగ్గరకు చేరుకున్న తిరునావుక్కరసు మరియు జ్ఞానసంబంధర్ లు మూసి ఉన్న ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళాలనుకున్నా రు. కానీ ఆ ద్వారాలను తెరవటం మానవ మాత్రులవల్ల కాదని వారికి తెలుసు. అందుకే వారు ఆ ద్వారం ముందు నుంచుని పరమశివుడిని కీర్తిస్తూ ఒక గీతం ఆలపించారు. ఫలితంగా ఆ ద్వారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఆపై ఆ ఇద్దరు భక్తులు లోపలికివెళ్ళి పరమశివుడిని పూజించుకున్నారు. ఆ తరువాత ఆ భక్తులు ఇద్దరూ బయటకువచ్చి మళ్ళీ శివుడిని శ్లాఘిస్తూ ఒక గీతం పాడారు. ఫలితంగా ఆ ద్వారం తలుపులు మళ్ళీ యధాతధంగా మూసుకుపోయాయి.

ఒక రోజు రాత్రి పరమశివుడు, తిరునావుక్కరసు కలలో కనిపించి అతడిని తిరువాయిమూర్ కి రమ్మని ఆహ్వానించాడు. మర్నాడు ఉదయం తిరునావుక్కరసు, తిరువాయిమూర్ వైపు నడక ప్రారంభించాడు. తిరునావు క్కరసుకి కొంచెం ముందుగా శివుడు నడుస్తూ కనిపించాడు. తిరునావుక్కరసు ఎంత ప్రయత్నించినా శివుడి ప్రక్కకి వెళ్ళలేకపోయాడు. ముందు శివుడు నడుస్తూ ఉండగా తిరునావుక్కరసు ఆయనను అనుసరిస్తూ వెనకాలే నడుస్తున్నాడు. అలా కొంతసేపు నడిచిన తరువాత అక్కడ ఒక ప్రదేశంలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్ళి అదృశ్యం అయిపోయాడు శివుడు. ఆ వెనకే వెళ్ళిన తిరునావుక్కరసు ఆలయంలోకి వెళ్ళి చూడగా అక్కడ శివుడు కనిపించలేదు.

ఇది ఇలా ఉండగా తిరునావుక్కరసు, తిరువాయిమూర్ వైపు నడవటం గమనించిన సంబంధర్ తాను కూడా తిరునావుక్కరసు వెనకాలే నడవటం ప్రారంభించాడు. కొద్దిసేపటికి సంబంధర్ కూడా ఆ ఆలయంలోకి ప్రవేశించాడు. అక్కడ విచారంగా ఉన్న తిరునావుక్కర సు కనిపించాడు. అప్పుడు పరమశివుడు ఆ ఇద్దరు శివయోగులకిదర్శనమిచ్చాడు.

ఆ ఇద్దరు శివయోగులు అక్కడి నుండి తిరువాయిమూరికి వెళ్ళారు. ఆ తర్వాత అక్కడినుండి తిరుమలైకాడ(వేదారణ్యం) కు తిరిగివచ్చారు. ఆ సమయంలో నాటి పాండ్యదేశపు మహారాణి మంగయార్ కారసియార్ మరియు మహామంత్రి కులాచారాయ నాయనార్ తమ రాజ్యం లో జైనమత గురువులు చేస్తున్న దుర్మార్గాల గురించి జ్ఞానసంబంధర్ కి వర్తమానం పంపారు. తిరుసంబంధర్ తానే స్వయంగా పాండ్యదేశ రాజధానికి వెళ్ళి అక్కడ అకృత్యాలకి పాల్పడుతున్న జైనమత గురువుల్ని ఓడించాలని నిర్ణయించుకున్నాడు. 

అప్పుడు తిరునావుక్కరసు, జైనమత గురువులయొక్క దుర్మార్గపు స్వభావాన్ని జ్ఞానసంబంధర్ కి తెలియజేయటమే కాకుండా అతడిని పాండ్యరాజ్యానికి వెళ్ళవొద్దని కోరాడు. అయితే సంబంధర్ పాండ్యరాజ్యానికి వెళ్ళితీరతానని తిరునావుక్కరసుకి గట్టిగా చెప్పాడు.

బాలుడైన జ్ఞానసంబంధర్ని ఎంతో అభిమానించే తిరునావుక్కరసుకి, జ్ఞాన సంబంధర్ చిక్కుల్లోపడటం ఇష్టంలేని కారణంగానే అతడిని పాండ్యరాజ్యానికి వెళ్ళవొద్దని కోరాడు. జైనమత వ్యాప్తిని అరికట్టి శైవమతాన్ని పునరుద్ధరించటం కోసం తాను పాండ్యరాజ్యానికి వెళ్ళక తప్పదని జ్ఞానసంబంధర్, తిరునావుక్క రసుకి నచ్చచెప్పాడు. ఇక చేసేదిలేక తిరునావుక్కరసు అంగీకరించాడు. అప్పుడు జ్ఞానసంబంధర్ మధురకు ప్రయాణం మొదలుపెట్టాడు.

జ్ఞానసంబంధర్ వెళ్ళిపోయిన తరువాత తిరునావుక్కరసు, తిరువావదూతురాయ్ క్షేత్రానికి వెళ్ళాడు. ఆ తరువాత అక్కడ నుండి పజిహైయరాయ్ క్షేత్రానికి వచ్చాడు. ఈ క్షేత్రంలో ఉన్న వడతలాయ్ ఆలయాన్ని బయట నుండే దర్శించి శివుడిని పూజించాడు. ఒకప్పుడు అది శివాలయంగా ఉండేది. అయితే జైనులు ఆ ఆలయాన్ని ఆక్రమించి అందులో ఉండే శివలింగాన్ని ఎక్కడకో తీసుకువెళ్ళి దాచి పెట్టి ఆపై ఆ  శివాలయాన్ని జైనమత ఆలయంగా మార్చివేసారు. శివలింగం లేని అలయంలోకి వెళ్ళటానికి ఇష్టపడని తిరునావుక్కరసు ఆ ఆలయం బయటే ఒక చోట కూర్చుని తన మనసులో శివుడిని ఇలా ప్రార్ధించాడు.

"ఈశ్వరా! నీ లింగరూపము కనపడని ఈ ఆలయంలోకి నేను రాలేను. ఈ ఆలయం లో ఆ లింగము కనపడేవరకు నేను ఆన్నాహారాలు లేకుండా ఇక్కడే నిన్ను ధ్యానిస్తూ ఉండిపోతాను”. 

అలా రెండు రోజులు గడిచాయి అప్పుడు పరమశివుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు కలలో కనిపించి అతనితో ఇలా చెప్పాడు. “ఓ రాజా! నా భక్తుడైన తిరునావుక్కరసు నా దర్శనం కోసం నా ఆలయం బయట రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. నీవు వెంటనే ఆ ఆలయం వద్దకువెళ్ళి ఆ ఆలయాన్ని ఆక్రమించి ఉన్న జైన మతస్తుల్ని అక్కడ నుండి తరిమివెయ్". తన లింగాన్ని జైనులు ఎక్కడ దాచిపెట్టారు? అన్న విషయాన్ని కూడా పరమశివుడు ఆ మహారాజుకి స్వప్నంలో తెలియజేసాడు.  

మర్నాడు ఉదయం ఆ మహారాజు కొంతమంది భటులతో కలిసి ఆలయం వద్దకువెళ్ళి ఆ ఆలయంలో పూజలు చేసుకుంటున్న జైనమతస్తుల్ని బయటకు తరిమివేసాడు. ఆ తరువాత జైనులు రహస్యంగా దాచిపెట్టిన శివలింగాన్ని తెచ్చి ఆలయ గర్భ గుడిలో ప్రతిష్టింప చేసాడు. శివలింగం మళ్ళీ కనిపించటం తో తిరునావుక్కరసు ఎంతో సంతోషించి ఆపై ఆలయంలోకి ప్రవేశించి శివుడిని మనసారా పూజించాడు.

ఆ తరువాత తిరునావుక్కరసు తన తీర్థ యాత్రను కొనసాగించాడు. అందులో భాగంగా ఆయన తిరుపెయిన్జలి అనే ప్రదేశానికి దగ్గరలో ఉన్నప్పుడు ఆయనకి విపరీతమైన ఆకలివేసింది. తననే సర్వంగా భావించే తిరునావుక్కరసుకి ఆకలివేస్తున్న విషయం గ్రహించిన పరమశివుడు అతడి ఆకలిని తీర్చటానికి ఒక చక్కటి తోటను మరియు అమృతం వంటి నీరు ఉన్న ఒక చెరువును సృష్టించాడు. అప్పటికే బాగా నడచి నడచి అలసిపోయిన తిరునావుక్కరసుకి శివుడు సృష్టించిన తోట కనిపించింది. వెంటనే ఆయన వేగంగా నడుస్తూ ఆ తోటలోకి ప్రవేశించాడు. ఆపై ఆ తోటలో ఉన్న చెరువులో ఉన్న చల్లటి నీటిని కడుపునిండా త్రాగి ఆ తరువాత ఆ తోటలో ఉన్న ఒక చెట్టునీడలో విశ్రమించాడు. అప్పుడు పరమశివుడు
ఒక బ్రాహ్మణ వృద్ధుడి రూపం ధరించి, కొన్ని పాత్రలలో ఆహార పదార్ధాలను తీసుకుని తిరునావుక్కరసు వద్దకు వచ్చాడు.

తిరునావుక్కరసు ఆ ఆహార పదార్థాలను తిని ఎంతో తృప్తిచెందాడు. తనకు ఆహారం ఇచ్చింది మారువేషంలో ఉన్న పరమశివుడు అని తిరునావుక్కరసు గ్రహించలేకపోయాడు. 

“మీరు ఎక్కడికి వెళుతున్నారు?" అని బ్రాహ్మణ వేషంలో ఉన్న శివుడిని ప్రశ్నించాడు తిరునావుక్కరసు". 

"నేను తిరుప్పెయిన్జలికి వెళుతున్నాను” అని సమాధానం ఇచ్చాడు బ్రాహ్మణుడు. కొంతసేపు గడిచిన తర్వాత బ్రాహ్మణుడు మరియు తిరునావుక్కరసు, తిరుప్పెయి న్జలి వైపు నడక ప్రారంభించారు. ఇంకా కొద్ది నిమిషాలలో తిరుప్పెయిన్జలి గ్రామం వస్తుంది అనగా ఆ బ్రాహ్మణుడు హఠాత్తుగా అదృశ్యం అయిపోయాడు. అలా అదృశ్యం అయిపోయింది సాక్షాత్తు మారువేషంలో వచ్చిన పరమశివుడే అని తిరునావుక్కరసుకి అప్పుడర్ధమయ్యింది. తన ఆకలితీర్చి, తనకు తోడుగా నడచి వచ్చిన శివుడిని గుర్తుపట్టలేకపోయిన తన అజ్ఞానానికి ఎంతో విచారించాడు తిరునావుక్కరసు.
 🪷
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅

No comments:

Post a Comment