*జీవిత పరమార్థం ఉగాది ప్రబోధం*
*భారతీయుల ఆచార సంప్రదాయాలు పటిష్టంగా, పరి పూర్ణంగా ఉండడంలో పండుగలు, పర్వదినాల పాత్ర అత్యంత విశిష్టమైనది. మనం జరుపుకొంటున్న ప్రతీ పండుగ మానవ జీవిత పరమార్థాన్ని తెలియజేసేదే!*
*మనకు మేలు చేసేవారిని మరచిపోకుండా, వారి పట్ల సదా కృతజ్ఞతాభావాన్ని కలిగివుండాలని గుర్తు చేసే పండుగ 'సంక్రాంతి'. అందుకే ఆ పర్వదినాన పితృదేవతల్నీ, పుడమి తల్లినీ, చివరకు పశువులను సైతం ఆరాధిస్తాం;*
*అక్రమాలు, అన్యాయాల లాంటివి తాత్కాలికంగా రాజ్యమేలినప్పటికీ చెడుపై మంచి ఆధిపత్యం వహిస్తుందనీ, అధర్మంపై ధర్మమే విజయకేతనం ఎగురవేస్తుందనీ 'విజయదశమి' గుర్తు చేస్తుంది;*
*అజ్ఞానాంధకారంలో మునిగి అకృత్యాలకు పాల్పడిన మనుష్యులకు జ్ఞానజ్యోతిని ప్రసరింపజేసి సన్మార్గంలో పయనించేలా అప్రమత్తుల్ని చేసే పండుగ 'దీపావళి'-*
*ఇలా ప్రతీ పండుగ సద్వర్తనులై మెలగాలని మానవులకు సూచించేదే! మానవజన్మ సార్ధకతకు తోడ్పడేదే!*
*సంవత్సరాది ఇచ్చే సందేశం:*
*సంవత్సరాది అయిన ఉగాది పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున - మధుర, తిక్త; లవణ, ఆమ్ల: కటు, కషాయం వంటి షడ్రుచులతో చేసిన పచ్చడిని స్వీకరించడం ఓ ఆచారం, జీవితమంటే సుఖదుఃఖాల మిశ్రమమని గ్రహించి, ఈ రెండింటినీ సమభావంతో స్వీకరించాలని తెలియజేయడమే ఉగాది పచ్చడి స్వీకరించడంలోని అంతరార్థం.*
*చీకటి లేకపోతే వెలుగు విలువ తెలియదు, చేదు లేకపోతే తీపి విలువ తెలియదు. అలాగే జీవితంలో దుఃఖం అన్నది లేకపోతే సుఖం విలువ తెలియదు. ఈ ద్వంద్వాలతో కూడుకొన్నదే జీవితం, ఈ సత్యాన్ని తెలుసుకొన్నప్పుడే ఆనందమయ జీవితాన్ని గడపడం సాధ్యం.*
*పరిపూర్ణతకు ప్రథమ నియమం:*
*జీవితంలో నిరంతరం సుఖాన్ని అనుభవించాలని, దుఃఖాలు దరిచేరకూడదని భావించేవారు ఎన్నటికీ ఉన్నతిని సాధించలేరు. నిజానికి మనిషిని ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా మలచడానికి సుఖదుఃఖాలు రెండూ సమానమైన పాత్రను పోషిస్తాయి. కష్టం లేని సుఖాన్ని పొందాలనుకునేవారు జీవితంలో నిరాశ పాలవుతారు. అందుకు ఉదాహరణ ఈ రైతు కథ!*
*వరుణదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు మొదలైన దేవతలంతా తన ఆదేశానుసారం నడుచుకోవాలని తలచి, ఒక రైతు అందుకోసం ఇంద్రుని నుండి వరం పొందాలని తపస్సు చేశాడు. రైతు చేసిన తీవ్రమైన తపస్సుకు మెచ్చి ఇంద్రుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రైతు 'వరుణ దేవుడు, వాయుదేవుడు, సూర్యుడు మొదలైన దేవతలంతా నా ఆదేశానుసారం పని చేసేలా వరం ప్రసాదించమని కోరాడు. రైతు కోరిన వరాన్ని ఇంద్రుడు ప్రసాదించాడు.*
*ఒకరోజు ఉదయాన్నే ఆ రైతు పొలానికి వెళ్ళి, భూమిని దున్ని, మొక్కజొన్న విత్తనాలు జల్లాడు. తరువాత వరుణదేవుణ్ణి వర్షించమని ఆదేశించాడు. వెంటనే వర్షం కురిసింది. పొలమంతా నీటితో బాగా తడిసిన తరువాత సూర్యరశ్మి కోసం సూర్యుణ్ణి ఆజ్ఞాపించాడు. రైతు కోరిన ప్రకారమే సూర్యుడు ప్రకాశించాడు. కొన్ని రోజులకు మొక్కజొన్న తోట బాగా పెరిగింది. రైతు ఎంతో ఆనందంతో తోటను చూడడానికి వెళ్ళి ఒక మొక్కజొన్న పొత్తును విప్పి చూశాడు. మొక్కజొన్న కంకి బాగా ఎదిగింది కానీ-అందులో గింజలు లేవు, ఆశ్చర్యానికి గురైన రైతు ఇలా జరగడానికి గల కారణమేమిటని తెలుసుకోవడానికి ఇంద్రుణ్ణి ప్రార్ధించాడు. ఇంద్రుడు రైతు ముంగిట ప్రత్యక్షమయ్యాడు. రైతు జరిగిన విషయాన్ని ఇంద్రునికి వివరించాడు. అప్పుడు ఇంద్రుడు, "నువ్వు వరుణుణ్ణి వర్షించమని, సూర్యుణ్ణి ప్రకాశించమని కోరావు. కానీ గాలి వీయమని వాయువును కోరలేదు. సాధారణంగా వర్షంతో పాటు గాలి వీచినట్లయితే, తాము పడిపోతామన్న భయంతో మొక్కలు భూమిలోపలికి వేళ్ళూనుకుపోతాయి. అప్పుడు భూమిలోపల ఉన్న సారం వేళ్ళ ద్వారా మొక్కకు చేరుతుంది. అప్పుడే ఆ మొక్క ఫలవంత మవుతుంది" అని రైతుతో అన్నాడు. ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించిన రైతు తన తప్పును తెలుసుకున్నాడు.*
*జీవితాకాశంలో విహరించే మనిషికి కష్టసుఖాలు రెండు రెక్కల్లాంటివి, ఇది ప్రకృతి నియమం. ఈ ప్రకృతి నియమానికి విరుద్ధంగా వ్యవహరించేవారు జీవితంలో ఉన్నతిని సాధించలేరు. కష్టాల కడలిలో ఎదురీదగలిగేవారే మహోన్నత వ్యక్తులుగా పరిణతి చెందుతారు.*
*కాబట్టి మనిషికి సుఖం కన్నా దుఃఖమే గుణపాఠాల్ని నేర్పుతుంది. సంపద కన్నా దారిద్ర్యమే సౌశీల్యునిగా మారుస్తుంది. ప్రశంసల కన్నా విమర్శలే ఆత్మశక్తిని జాగృతపరుస్తాయి అన్న విషయం మహోన్నత వ్యక్తుల జీవితాలను పరిశీలించినట్లయితే మనకు అవగతమవుతుంది.*
*సుఖాల పందిట్లో సేద తీరాలనీ, ప్రశంసల జల్లుల్లో పరవశించాలనీ ఆశించేవారు ఎన్నడూ నిజమైన ఆనందాన్ని పొందలేరు. సుఖాన్ని కోరుకునే వ్యక్తి దుఃఖాన్ని కూడా భరించగలిగే శక్తిని కలిగివుండాలి. ఎందుకంటే దుఃఖం, సుఖాన్ని అనుసరిస్తూంటుంది. అందుకే. "సుఖం, దుఃఖమనే ముళ్ళ కిరీటం ధరించి వస్తుంది' అని అంటారు స్వామి వివేకానంద. అందువల్ల జీవితంలో కష్ట సుఖాలు సహజమని భావించి, రెండింటినీ సమభావంతో ఆహ్వానించగలిగే మనఃస్థితిని అలవరచుకోవాలి.*
*పరమోన్నత స్థితి:*
*జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించగలగడం ఓ ఉన్నత స్థితి. కానీ సుఖం ఉన్నచోట దుఃఖం ఉంటుంది: రాగం ఉన్నచోట ద్వేషం ఉంటుంది: భయం ఉన్నచోట క్రోధం ఉంటుంది. ఈ ద్వంద్వాలకు అతీతమైన స్థితిని సాధించడమే జీవిత పరమార్థం. ఆ స్థితిని పొందినవాడే పరమోన్నతుడనీ, స్థితప్రజ్ఞుడనీ శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.*
*దుఃఖేష్వనుద్విగ్నమనాః సుభేషు విగతస్పృహః |*
*వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే॥ (గీత- 2.56)*
*'దుఃఖాలకు దిగులు చెందనివాడూ, సుఖాలకు సంతోషించని వాడూ, రాగం (దేనితోనూ బంధం) గానీ, భయంగానీ, క్రోధం గానీ లేనివాడూ అయిన మునిని స్థితప్రజ్ఞుడంటారు'.*
*నూతన సంవత్సర 'ఉగాది' పర్వదినాన సుఖదుఃఖాలకూ, రాగద్వేషాలకూ, భయక్రోధాలకూ అతీతమైన పరమోన్నత స్థితిని మనకు కూడా ప్రసాదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిద్దాం.*
*┈┉┅━❀꧁హరి ఓం꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🪷🌺 🙏🕉️🙏 🌺🪷🌺
No comments:
Post a Comment