Sunday, March 30, 2025

 *తెలుగునాట ఉగాది నవ ఉషస్సుకు శుభాది* 

*తెలుగునాట ఉగాది అనగానే సాహితీప్రియులకు గుర్తుకు వచ్చేవి కవితాగోష్ఠులు, తెలుగుభాషకే వన్నె తెచ్చిన విశిష్ట అవధానాలు. తెలుగుకవి హృదయంలో కాంక్రొత్త భావాలు తొంగిచూసి, తేటతెలుగులో భావకవితలు ఉప్పొంగే సమయం ఇది. ప్రకృతిలో కలిగే ప్రతీ మార్పూ భావకవి హృదయంలో భావుకతను నింపుతుంది. భావం ఉప్పొంగి తేటకవితగా రూపుదిద్దుకొంటుంది. భావావేశంలో జాలువారిన ఆ కవితలు భావగర్భంగా ఏదో ఒక అంతర్లీన ఆధ్యాత్మిక సందేశాన్ని అంతర్భాగంగా కలిగి ఉంటాయి. ఆశావహ దృక్పథాన్ని, నవ ఉత్తేజాన్ని అందిస్తాయి.*

*'"కొంగొత్త ఆశలకు ఆలవాలమై...* 
*హరిత పల్లవారావాలతో.. లలిత చరణ విన్యాసాలతో...*
*చకిత కవితలల్లుతూ మరో వసంతం వచ్చింది...* 
*మోడువారిన మనసులో కొత్త ఆశలొచ్చినట్లు,* *మూగవోయిన మోడులో చిగురుటాకులు. తెచ్చింది..* 
*ఎద పూచిన భావాలకు కొత్త రూపు వచ్చినట్లు లేమావి చిగురుల్లో కొత్త ఊను తెచ్చింది...* 
*సుప్త సప్తస్వరానికి సుస్వరగతి లయ చేసినట్లు, సుషుప్త కోయిల గాంధర్వానికి శబ్దమధురం జతచేసింది...* 
*భేద శైథిల్యాలను దాటి మోద మందారవనానికి ఆహ్వానం ప్రతి వసంతపు సందేశం...* 
*అందుకే... కొలమానం లేని కాలం ఒడిలో ఎన్నెన్నో వసంతాలు ఒదిగిపోతున్నా...* 
*శిశిరాన్ని దాటిన ప్రతి వసంతం ఆనందసందోహ సమ్మిళితం...* 
*అనురాగరాగాల సందోహం... అపురూప భావాల సందేశం."* 

*అలాగే ప్రకృతివాసంతిక మనకు ప్రసాదించే కానుకలు హరిత వర్ణపు లేత చిగుర్లు, కమనీయ కోకిల గానాలు, భావుకతకు పదును పెట్టిన, కొంచెం తాత్త్విక భావాలు గల కవి హృదయం ఈ విధంగా స్పందిస్తుంది.*

*"హరిత తోరణ శోభలతో... పిక సంరావారావాలతో...* 
*దివ్యసందేశ రాయబారిగా మరో వసంతం వచ్చింది...* 
*భారతీ పుత్రుల కొలువుకు దేవదేవుని రాయబారం తెచ్చింది...* 
*మాచి తరువులు వేదసారస్వతమట! ఉపనిషత్తులు లేత చిగురులట!* 
*ఆ చిగురునగరులు విందుచేసిన గదుసుకోయిల మధురగళమున, దివ్యనాదము సహజధారగ దిక్కులన్నియు మారుమ్రోగగ,* 
*కురియుచున్నది మోదవర్షము హృదయమందున జల్లు జల్లుగ..."* 

*నగరాల రణగొణ ధ్వనుల మధ్య, సిమెంట్ భవనాల మధ్య, మనిషి హస్తముద్రలతో అపభ్రంశమైన ప్రకృతి మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అసలైన వసంత శోభ చూడాలంటే పల్లెలకు పోవాల్సిందే. చెట్టు చెట్టుకు లేలేత చిగుర్లు. చెట్లతో పెనవేసుకుపోయిన తీగలు, రకరకాల ఆకారాలతో, భిన్న భిన్న స్థాయిలలో హరితవర్ణ అపురూప శోభ ఆ దేవదేవుని కళాసృష్టికి సంకేతంగా కనిపిస్తుంది. లేతపచ్చని చిగుర్లపై పడిన సూర్యకాంతి తళుకులు చూస్తూ, దిక్కులను పిక్కటిల్లజేస్తున్న కోయిల గానం వింటూ పరవశించని వారెవరైనా ఉంటారా? మహావృక్షాల మధ్యలోని సందులను ఛేదిస్తూ అంచెలంచెలుగా ప్రవహిస్తున్న కోకిలగానం విని, ఆ కోకిలను చూడాలనే తపనతో వెదుకులాడిన కవి నిరాశతో రాస్తాడు...*

*"ఏ గుబురున కోయిలా రాగమై నిలిచావు...* 
*నా హృదయపు చాటున మోదమై వెలిసావు...* 
*రసరాగబాటలో రమ్యంపు గమనమై నలుదిశలా నీ పాట నినదించు ఈ వేళ...* 
*నీ కోసమై నలుదిశలా వెదుకులాడితి నేను...* 
*అరుదైన కలలోని అందని ఆహ్లాదమై నీ పాట నన్ను మురిపించు ఈ వేళ...* 
*నీ రూపు కోసమై కలగంటినే నేను...”* 

*కోకిల గానం వినగానే వసంతం వచ్చిందని అందరికీ సూచన అందుతుంది. అయితే ఒక భావకవికి మాత్రం అనుమానం వచ్చింది. వసంతం వచ్చిన తరువాత కోకిల కూస్తుందా, లేదా కోయిల పిలుపు విని వసంతం వచ్చిందా అని. అపుడు ఆ కవి రాస్తాడు...*

*"అమని భామిని రాకతో కోయిల గళమెత్తెనో... లేక* *కోయిల పిలుపుకు అమని అరుదెంచెనో కానీ...* 
*హరిత వసంతం భావంగా... లలిత గళమధురం రాగంగా...* 
*ప్రకృతి తన ప్రాంగణంలో నూతన కవితాగానాలను నింపుకుంటోంది...* 
*చివురించు ఆశలకు ఆనవాల్లె చెట్లు చిగురిస్తుంటే...*
*శిశిర భేదాన్ని దాటి ప్రకృతి పరవళ్ళు తొక్కుతుంటే...* 
*దిగంతసథలలో గంధర్వగానం చేయడానికి సమాయత్త మవుతోంది కోకిల...*
*లేమావి గుత్తులు పూవేప గుబురులు నూతనత్వాన్ని స్వాగతిస్తుంటే...* 
*విగత శిశిరాన్ని వీడి వినూత్న వసంతం వచ్చేసింది..."* 

*తెలుగునాట ఉగాది నవజీవనానికి పునాది! నిరాశల నిశీథిని దాటిన నవ ఉషస్సుకు శుభాది! గతించిన గతాన్ని శిథిలాలకు పారద్రోలి, నూతనత్వాన్ని నిత్యం ఆహ్వానించమని, ప్రకృతి ఇచ్చే పరమసందేశమే ఈ ఉగాది. ప్రకృతి పులకించిన ప్రతీసారీ, తన ప్రత్యేకతను చాటిన ప్రతీ సందర్భమూ భారతీయులకు పండగే. నేర్చుకొనే తీరిక, ఓపిక మనకుంటే ప్రకృతి అనునిత్యం పాఠాలను నేర్పుతూనే ఉంటుంది.*

*మనలో సున్నితత్వం పెరిగేకొద్దీ ప్రకృతిలో ప్రతీ కదలికా భాగవత స్పందనను కలిగిస్తుంది. బ్రదర్ లారెన్స్ అనే క్రైస్తవ సన్న్యాసి మోడువారిన చెట్టు నుండి పల్లవిస్తున్న చిగురుటాకులు చూసి భగవంతుని అపార కరుణను అర్ధం చేసుకున్నాడు. ఆ దృశ్యం ఆయన మనసుపై చెరగని ముద్రను వేసింది.*

*బలీయమైన ఆశావహ దృక్పథాన్ని అలవరచింది. ఆయన సర్వకాల సర్వావస్థలయందు, దుర్భరమైన బాధాకరపరిస్థితులలో కూడా నిరంతరం ప్రవహించే భగవంతుని కృపను మరువకుండా చేసింది ఆ అనుభూతి! ప్రకృతి ఇచ్చే సందేశాలు అంత బలంగా ఉంటాయి. ఆయన సదా సర్వదా భగవంతుని ఉనికిని అనుభూతి చెందుతూ ఎందరో ఆధ్యాత్మిక పిపాసులకు మార్గదర్శి అయినాడు.*

*'భగవంతుని కోసం ఎక్కడో వెదకడం అజ్ఞానం. ఇక్కడే! మీ కళ్ళెదుటే ఉన్నాడనుకోవడం నిజమైన జ్ఞానం' అంటారు. శ్రీరామకృష్ణ పరమహంస, పవిత్రమైన మనసుతో, కోరికలు లేని మనసుతో, రాగద్వేషాలు లేని నిశ్చలమైన మనసుతో ప్రకృతిని స్పర్శిస్తే అనుక్షణం విజయోత్సాహమే! విరబూసిన పుష్పాలు ఆ దేవదేవుని పదముద్రలై మనల్ని పలుకరిస్తాయి. ప్రసూన పరిమళ భారాలతో మనల్ని తాకే పిల్లతెమ్మెర ఈశ్వరుని అంతరంగాన్ని మనకు పరిచయం చేస్తుంది. అంచులు అందని ఆకాశం అవధులు లేని ఆయన అనురాగ తత్త్వానికి ఆనవాలుగా కనిపిస్తుంది. కొండపై నుండి దూకే సెలయేటి అలజడి శబ్దాపాసనలో మనకు సహకరిస్తుంది. అణువణువునా అదృశ్యమై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ పోతే జీవితమంతా ఒక నిరంతర ఉగాదియే!*

*అందుకే పైరు పచ్చని ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకుందాం. నాలుగు గోడలమధ్య ఆధునిక పరికరాల యొక్క కృత్రిమ వెలుగుల మధ్య మగ్గిపోతున్న మనల్ని మనం సచేతనంగా ఉద్దరించుకుందాం! పల్లెజీవితాలపై మోజును పెంచుకుందాం. ప్రకృతితో సహవాసం చేద్దాం. జీవితాలను సంక్లిష్టతకు దూరం చేసి సహజంగా, సరకంగా తీర్చిదిద్దుకుందాం! అణువణువునా దాగివున్న భవేశుడిని గుర్తిస్తూ భావుకతతో జీవిద్దాం! నిరంతర ఉత్సాహంతో నిత్య ఉగాదిని జరుపుకుందాం!*

*┈┉┅━❀꧁•ఉగాది •꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🍃🎋🍃 🥭🕉️🥭 🍃🎋🍃

No comments:

Post a Comment