*సినిమా తీయిస్త మావా*
=================
(హాస్య గుళిక)
రచన::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
2170 సంవత్సరం నేపథ్యంలో నేను రాసిన *అంతరిక్షంలో అప్పారావు* అనే హాస్య కథను సినిమాగా తీస్తే బాగుంటుందని ఎవరో ఓ పనికిమాలిన సలహా ఇవ్వడంతో నా ప్రయత్నాలు ప్రారంభించాను.
భూలోకంలో అప్పులు చేసి చంద్రమండలానికి పారిపోయి అక్కడ స్థిరపడదాం అనుకున్న ఓ అప్పారావు కథ క్లుప్తంగా ఇది. అయితే చంద్రుని
పైన దిగగానే ఇతనికి అప్పు ఇచ్చిన వ్యక్తి అక్కడ ప్రత్యక్షం కావడం అసలు కొస మెరుపు.
ఈ ప్రాజెక్టు అనుకోగానే ముందుగా నేను సంపాదించింది రాజమౌళి గారిని. నా కథ పూర్తిగా వినకుండానే "ప్రస్తుతం నేను కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉన్నాను. 2031 తరువాత అయితే ఈ ప్రాజెక్టు
మహేష్ బాబు గారి అబ్బాయితో తీద్దాం" అని చెప్పగానే ఓ నమస్కారం కొట్టి బయటపడ్డాను.
ఆ తరువాత బొడ్డు రాఘవేంద్రరావు గారిని సంప్రదించి కథ చెప్పాను. వెంటనే ఆయన "వయసు మీద పడింది. గెడ్డం తెల్లబడింది. ఈ కథలో హీరోయిన్ లేదు. మనకు వర్క్ అవుట్ కాదు" అని ఆపిల్ కాయ బద్దలు కొట్టి మరీ చెప్పారు.
అక్కడ నుంచి సుకుమార్ గారి వద్దకు వెళ్లి "ఈ కథలో అప్పారావు పాత్ర బ్రహ్మానందం గారిని అనుకుంటున్నాను" అని కథ మొత్తం చెప్పగానే ఆయన "అబ్బే అలా కాదు, భూమి మీద నుంచి చంద్రుడు మీదకు గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే విధంగా కథ మారుద్దాం " అని చెప్పగానే కామెడీ కథను క్రైం కథగా మార్చే ఆయన తెలివి తేటలకు మూడు నమస్కారాలు పెట్టి హడావుడిగా బయట పడ్డాను.
ఇంక ఇలా పని కాదని తెలియని ఓ మిత్రుడు ద్వారా జేమ్స్ కేమరూన్ గారిని సంప్రదించి కథ చెప్పాను. ఆ కథ విని చాలా ఆనందంగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన "తప్పకుండా తీద్దాం మిష్టర్ కేమ్స్! సహజంగా ఉండేలా చంద్రుడు మీదనే షూటింగ్ చేద్దాం. నేను ఎలెన్ మస్క్ తో మాట్లాడి ఓ నాలుగు రాకెట్లు ఎరేంజ్ చేయమని చెబుతా!" అని చెప్పగానే ఆనందంగా గంతులు వేసిన నేను
"ఇంతకీ బడ్జెట్ ఎంతో చెప్పారు కాదు, కేమరూన్ గారూ!" అనగానే ఆయన పెద్దగా నవ్వి,
"అబ్బే ఎంతో కాదు మిష్టర్ కేమ్స్! మీ బడ్జెట్ లోనే ఉంటుంది" అనగానే
"సరే కానీ ముందు ఫిగర్ ఎంతో కొట్టించండి మహాప్రభో!" అని నేను అడుక్కోగానే
"వేస్కోండి ఓ రెండు లక్షల కోట్లు"
"రూపాయలా మహాప్రభో?"
"కాదు డాలర్లు" అని కేమరూన్ గారు చెప్పగానే, కిక్కురుమనకుండా కామ్ గా బయటకు వచ్చేసాను.
అయినా నా తెలుగు కథను ఎవరో విదేశీయుడు దర్శకత్వం చెయ్యడం ఏమిటి అని చెప్పేసేసి అదిగో ఆ రోజు నుంచి ఎవరైనా చిన్న తెలుగు నిర్మాత కానీ దర్శకుడు కానీ వస్తాడేమో అని లక్ష కళ్ళతో వీధి గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉన్నాను.
👀👁️👀👁️💯💯👀👁️👀
No comments:
Post a Comment