Wednesday, April 9, 2025

 *****
                      బడిలో ఆరోజు
                      =========
                   (జ్ఞాపకాల పందిరి)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

ఈ సంఘటన  జరిగి సుమారు 58 సంవత్సరాలై ఉంటుంది. అవి నేను 4వ తరగతి చదువుతున్న రోజులు. మా స్వంత ఊరు, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, ద్రాక్షారామం మధ్యలో ఉన్న  జగన్నాధగిరి అనే చిన్న గ్రామం. మా ఊరిలో ఉన్న ఎలిమెంటరీ స్కూలు లోనే మా కుటుంబ సభ్యులు అందరమూ ప్రాధమిక విధ్య అభ్యసించాం.

స్కూలు అంటే పెద్ద బిల్డింగ్ ఏమీ కాదు. బడి చుట్టూ పెద్ద ప్రహారీ గోడ ఉండి లోపల వాడపల్లి పెంకులతో పేర్చిన రెండు పెద్ద పెద్ద షెడ్డులు. ఒక్కో షెడ్డులోపల రెండేసి పెద్ద పెద్ద హాల్స్ ఉండేవి. ఎదురెదురుగా ఉన్న ఆ రెండు షెడ్డుల మధ్యలో ఉన్న ఖాళీ స్థలమే మా ఆటల స్థలం. 

కుడి వైపు ఉన్న షెడ్డులో మటుకు అదనంగా ఓ సామానుల గది లాంటిది ఉండేది. దానిని రికార్డు రూముగా వాడేవారు. స్టాప్ కూడా తక్కువే. హెడ్ మాష్టారు సుబ్బారావు గారు, కృష్ణమాచార్యులు మాష్టారు, కమలమ్మ గారు, నక్క మాష్టారుగా పేరుపడ్డ నారాయణ మాష్టారు, వీరు కాక మిగతా అన్ని పనులు చూడడానికి పాలమ్మ అనే ఆవిడ ఉండేవారు. 

అయితే, ఇది స్కూలు కోసం కట్టిన  బిల్డిగు కాదు. పెద్దాపురం మహారాణి వారు బాటసారుల కోసం కట్టిన రహదారి సత్రం. తదనంతరం స్కూలు బిల్డింగులా రూపాంతరం చెందింది.

మాకు ప్రతీరోజూ సాయంత్రం ఆఖరి పిరియడ్ గా  గార్డెన్ వర్క్, డ్రిల్ ,లేదా ఆటలు కానీ ఉండేవి. ఆటలంటే చాకలి బండ, కుంటాట లాంటివి.   ఎక్కువగా దొంగ పోలీసు ఆటే ఆడుకునే వాళ్లం. సాయంత్రం నాలుగున్నరకి, పాలమ్మ అని, స్కూలు వ్యవహారాలు చూసే ఆయా లాంటి ఆవిడ లాంగ్ బెల్ కొట్టేది. 

తరువాత అందరమూ పొలోమంటూ ఆనందంగా ఇంటికి పోవడమే. మేము స్కూలు వదలడం పాపం, క్లాసు రూముల్లో గబ్బిలాల సందడి మొదలయ్యేది. సాయంత్రం దాటిందంటే స్కూలు పరిసరాల్లో మానవసంచారం ఉండేది కాదు. పక్కనే ఉన్న స్మశానం కూడా దీనికి కారణం కావచ్చు. 

     *****     *****     *****     *****     

1966 వ సంవత్సరం. సెప్టెంబరు నెల. చలికాలం మొదలైన రోజులు. అప్పటికి మా ఊరికి పూర్తిగా కరెంటు రాలేదు. మా ఇంట్లోను, ప్రెసిడెంట్ వసంతరాయుడు గారింట్లోను, కరణం పెరవలి సత్తిరాజు గారింట్లోను, ఇలా ఓ పదిమంది ఇళ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి. అవి కూడా చాలా బలహీనంగా కిరసనాయిల్ దీపాలు మాదిరి వెలుగునిచ్చేవి. ఆ రోజుల్లో అదే పెద్ద వింత.

ఆరోజు, ఆఖరి పిరియడ్ లో ఆటలు ఆడుకుని, స్కూలు నుంచి వచ్చి, హోమ్ వర్క్ చేసేసుకున్న మమ్మల్ని అమ్మ 

"ఇదిగో, పిల్లలూ, చదవడం అయిపోతే రండర్రా, వెలుతురు ఉండగానే అన్నాలు  పెట్టేస్తాను !" అని పిలవడంతో, పుస్తకాలు సర్దేసుకుని, అన్నం తినడానికి వంటింటి బయట ఉన్న వరండాలోకి చేరుకున్నాం.

మాది పెద్ద కుటుంబం. పెద్ద అన్నయ్యలు ఇద్దరూ పై చదువుల కోసం వేరే ఊర్లకు, అక్కలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యి కాపరాలకు పోగా మిగిలిన నన్నూ, మా ఇద్దరు అన్నయ్యలను, నా ఇద్దరు తమ్ముళ్లను పక్కన కూర్చోబెట్టుకుని, ఇంకో తమ్ముడిని ఒళ్లో పెట్టుకుని, ఒక పెద్ద కంచంలో అన్నం, వెల్లుల్లి ఆవకాయ బాగా కలిపి, దానిని  చిన్న కంచాల్లో సర్ది, జాతక కథలు చెపుతూ ఆరుబయట వరండాలో మాచేత అన్నం తినిపిస్తోంది అమ్మ.

     *****     *****     *****     *****     

ఈ లోగా మా ఇంటి బయట ఏదో కేకలు,అరుపులు, వాదనలతో ఒకటే అలజడి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి అధికంగా ఉండే వయసు అది. అందుకే వెంటనే కంచం నుంచి లేచి, జారిపోతున్న లాగును పైకి లాక్కుని, కంచం దగ్గర నుంచి లేచి, వీధి గదిలోకి వేగంగా వెళ్లబోతున్న నన్ను,

"ఎక్కడికి పోతున్నావు, అన్నం తినకుండా ! బుద్ధిగా కూర్చొని ముద్ద మింగు " అంటూ నన్ను జబ్బ పట్టుకుని లాగి కంచం ముందు కుదేసింది అమ్మ. 

"బయట ఏదో గొడవ అవుతోంది, చూసి రావడం తప్పా ?" ధైర్యంగా అమ్మని ఎదిరిస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూడసాగేరు అన్నయ్యలు, తమ్ముళ్లూ,  తింటున్న భోజనం మధ్యలో ఆపి. 

"తప్పు కాదురా, వెర్రి వెధవా ! ఏదైనా చూడ కూడనిది చూస్తే, భయపడి మళ్లీ మంచ మెక్కుతావని. నెలరోజుల క్రితం ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయావా ? " అంటూ కొంచెం గట్టిగానే తిట్టి పోసింది అమ్మ.

అమ్మ చెప్పిన ఆ సంఘటన మరో సారి జ్జాపకం చేసుకునేందుకు నా చిట్టి బుర్రని ఓ నెల రోజులు వెనక్కి పంపేను.

     *****     *****     *****     *****     

రోజూ లాగే ఆ రోజు కూడా సాయంత్రం స్కూలు నుంచి రాగానే, బుద్ధిగా వీధి గదిలో కూర్చుని హోమ్ వర్క్ చేసుకుంటున్నాం మా అన్నదమ్ములందరమూ.  ఈలోగా వీధిలో ఏవో ఏడుపులు, అరుపులు వినిపిస్తే అందరమూ పుస్తకాలు పక్కన పడేసి, అరుగు మీదకు పరిగెట్టేం, ఆ హడావుడి ఏమిటో చూడడానికి.

మా నాన్నగారు డాక్టర్ , మా ఊర్లోనే ఉన్న గవర్నమెంట్ రూరల్ డిస్పెన్సరీలో.  ఆయన కాకుండా, సహాయకులుగా అమ్మాజీ అనే ఓ  నర్సు, మరియు ఇంటి పనులు, ఆసుపత్రి పనులు చూడడానికి నాన్నగారు స్వంత ఖర్చుతో నియమించుకున్న దొమ్మేటి గన్నెయ్య అనే తాత  ఉండేవారు. 

మా జగన్నాధగిరి కి చుట్టుపక్కల ఉన్న యండమూరు, విజయ రాయుడు పాలెం, ఉండూరు, కాపవరం‌, హసన్ బాద, పెనుమళ్ల, తనుమళ్ల, అండ్రంగి, తిప్పరాజు పాలెం లాంటి ఓ ఇరవై గ్రామాలకు మా ఊర్లోనే ఆసుపత్రి, మా నాన్నగారే డాక్టర్. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆసుపత్రిలో, ఆ తరువాత ఏవైనా అర్జెంట్ కేసులు వస్తే ఇంటి దగ్గరే వైద్యం చేసేవారు.

ఈలోగా, ఓ పాతిక ముప్పై మంది మనుషులు ఏదో ఊరేగింపుగా, ఓ నులక మంచానికి తాళ్లు కట్టి మోసుకు రావడం దూరాన్నించి కనపడింది. దగ్గరకు వచ్చిన తరువాత చూస్తే ఆ మంచంమీద అరటి ఆకులు వేసి, వాటిమీద ఓ మనిషిని పడుకోబెట్టారు. పాపం, అతను భరించలేని బాధతో  "నన్ను చంపేయండి బాబోయ్, ఈ మంట తట్టుకోలేక పోతున్నాను" అంటూ గుండెలు పగిలేలా అరుస్తున్నాడు.

ఈలోగా, జనం లోంచి ఓ పెద్దాయన అరుగు మీద ఉన్న నాన్నగారి వద్దకు హడావుడిగా వచ్చి, 

"డాక్టరు గారూ, మాది పెనుమళ్ల. వీడు నా తమ్ముడు. దీపావళికి ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా రాపిడి ఎక్కువయ్యి , మందుగుండు అంటుకుని ఒళ్లు కాలిపోయింది. ఆ మంటని భరించలేక పోతున్నాడు. మీరే ఏదైనా…" అతను ఇంకా ఏదో చెపుతుండగానే నాన్నగారు, వారి వెనకే వచ్చిన గన్నెయ్యతో ఏదో చెప్పి,  మందులు తేవడానికి ఆయన గదిలోకి వెళ్లారు.

అరుగు మీదకు వచ్చిన గన్నెయ్య తాత,

"నాన్నగారు కేకలేస్తున్నారు. లోపలకి పొండి. ఏం చూస్తారు ఇక్కడ ?" అంటూ మమ్మల్ని గదమాయించి, వీధి గదిలోకి తోసేసి, బయట గొళ్లెం పెట్టేసాడు. అప్పటికే చాలా చోట్ల చర్మం  కాలిపోయి  ఉన్న అతనిని ఇంకో సారి దగ్గరగా చూడడానికి మాకు కూడా ధైర్యం చాలక పోవడంతో మేము కూడా  ఇంక కిక్కురు మనకుండా లోపలికి వెళ్లిపోయాము. 

ఆ తరువాత నాన్న గారు, తాత్కాలికంగా  మంట తగ్గడానికి ఆ పేషెంట్ గాయాలమీద ఏదో లేపనం రాసి, వెంటనే నాన్న గారి కోసం ప్రత్యేకంగా నియమించుకున్న జగ్గపు తాతాలు గుర్రపు బండి మీద సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ పెద్ద ఆసుపత్రికి, ఆ ఆసుపత్రిలో సర్జన్ గా పని చేస్తున్న మా పెద్ద బామ్మ గారి మనవడు పిండిప్రోలు సత్యనారాయణ మూర్తి కి ఓ సిఫార్సు లెటర్ రాసి ఇతడిని కాకినాడ తరలించారుట. సరైన సమయంలో ప్రాధమిక చికిత్స అందడం వలన అతను బతికేడుట. అది వేరే సంగతి.

కానీ,  కాలిన గాయాలతో ఉన్న ఆ మనిషిని చూసిన నేను, ఆ దెబ్బకి  ఓ వారం రోజుల పాటు రాత్రిపూట నిద్రలో భయంతో ఉలిక్కి పడడం, కెవ్వు మని కేకలు వెయ్యడం లాంటివి చేసేనుట.

     *****     *****     *****     *****     

అమ్మ గుర్తు చేసిన ఆ పాత సంఘటన జ్ఞాపకం రాగానే మళ్లీ ఒళ్లంతా ఓసారి జలదరించింది. సరే, ఇప్పుడు కూడా అలాంటి కేసే వచ్చి ఉంటుంది. మనకెందుకులే అని మళ్లీ మౌనంగా  భోజనం చేస్తున్న నాకు 

"అమ్మగారూ, భోజనం చేసిన తరువాత కాంబాబుని ఓ సారి బయటికి పంపమని అయ్యగారు చెప్పమన్నారు"
అన్న గన్నెయ్య తాత  పిలుపుతో, "నాన్నే నన్ను రమ్మన్నారు అంటే,   ఇది భయపడాల్సిన విషయం కాదన్న మాట" అని మనసులో అనుకొని, తిరిగి బయట ఏం జరుగుతోందో వెళ్లి చూడాలన్న ఆతృత మళ్లీ మొదలైంది.

వెంటనే, కంచంలో ఉన్న నాలుగు ముద్దలు గుటుక్కున మింగేసి, చేతులు కడుక్కుని, "ఎక్కడికి రా ? పెరుగన్నం తినకుండా ?" అనే అమ్మ అరుపులు కూడా వినిపించుకోకుండా ఒక్క అంగలో వీధి అరుగు మీదకు చేరుకున్నా.

అప్పటికే అరుగు మీద నాన్నగారితో కూర్చుని ఓ పదిమంది ఊరి పెద్దలు దేని గురించో చర్చించుకుంటున్నారు. అప్పుటికే ఆకాశంలో సూరన్న పూర్తిగా డ్యూటీ దిగి, చంద్రన్న బద్ధకంగా డ్యూటీ ఎక్కే పనిలో ఉన్నాడు. 

ఆ మసక వెలతురులో అరుగు మీద నిలబడ్డ నాకు, కింద రోడ్డు మీద నిలబడ్డ జనంలో, బడిలో నా పక్కనే కూర్చునే అమలకంటి కొండ గాడు కనపడేటప్పటికి ప్రాణం లేచి వచ్చి, మెట్లు దిగి వెళ్లి వాడితో 

"ఏరా ! అమలకంటీ , ఏం జరిగింది ? వీళ్లంతా ఎందుకు వచ్చారు ?" అని అడిగా, ఎంతో ఆతృతతో. 

ఆ రోజుల్లో ఇంటి పేరు తోనే పిలుచుకునే వాళ్లం మరి. ఇంకో విషయం, నటసార్వభౌమ యస్.వీ.రంగారావు గారికి మా ఊర్లో ఉన్న పొలాలు వీళ్ళ కుటుంబమే కౌలు చేసేది. నా చిన్న తనంలో ఓ సందర్భంలో ఆ మహానటుడ్ని చూసే అదృష్టం కూడా నాకు కలిగింది.

"ఒరే, బుద్ధవరపూ, నీకు తెలవదా ? మనతో పాటు చదువుకొనే నల్లా వారి అమ్మాయి బడి అయిపోయిన తరువాత ఇంటికి రాలేదుట. ఊర్లో తెలిసిన వాళ్లందరి ఇళ్లకు వెళ్లి చూసొచ్చారుట. ఎక్కడా కనపడకపోవడంతో, మీ నాన్నగారి సలహా తీసుకుని గొల్లపాలెం పోలీసు స్టేషన్ కి వెళ్లదామని అను కుంటున్నారుట………….". 

కొండగాడు చెబుతున్న మాటల్ని భయంతో  వింటున్న నేను "ఒరే, కామూ !  ఓ సారి ఇలా అరుగు మీదకి రారా !!" అన్న నాన్న గారి పిలుపుతో, ఒక్క అంగలో అరుగు మీదకి వెళ్లి, నాన్న గారి పక్కన నిలబడ్డాను.

"ఏరా! ఈవేళ బడిలో, నువ్వు నల్లా వారి అమ్మాయిని చూసేవా ?" అడిగారు నాన్న గారు.

"ఓ చూసా, సాయంత్రం ఆడపిల్లళ్లంతా దొంగ పోలీసు ఆట ఆడుతుంటే చూసా ! ఏమయ్యింది ఆ అమ్మాయికి ? " కొంచెం ఆందోళనతో అడిగాను.

"ఏం లేదులే, నువ్వెళ్లి చదువుకో " చెప్పారు నాన్నగారు. నేను మళ్లీ కిందకు వచ్చి కొండగాడి పక్కనే నిలబడి, పెద్ద వాళ్ల సంభాషణ వింటున్నా .

"చూసేరా ! మా అబ్బాయి కూడా చెపుతున్నాడు. ఆఖరి సారిగా బడిలోనే చూసానని. అందువలన మీరనుకున్నట్టు అమ్మాయిని ఎవరూ ఎత్తుకు పోయి ఉండరు. కంగారు పడకండి" ధైర్యం చెప్పారు నాన్న గారు, ఏడుస్తున్న అమ్మాయి తండ్రితో.

"మీరన్నది నిజమే డాట్రుగారూ ! కానీ, మా అనుమానం ఏమిటంటే, బడిలోంచి బయటికి వస్తున్నప్పుడు ఎవరైనా తీసుకుని పోయారేమోనని ? దానికి తోడు ఈ మద్యనే పిల్లల్ని ఎత్తుకొని పోయే ముఠా మన ద్రాక్షారామం పరిసరాల్లో తిరుగుతున్నారని మొన్న ఆంధ్ర ప్రభ పేపరులో కూడా వేసేరు .అందుకే ఆలశ్యం చేయకుండా పోలీసులకు చెబితేనే మంచిదేమోనని  !! " అనుమానం వెల్లబుచ్చాడు అమ్మాయి మేనమామ.

"సరే, మీరు చెప్పినట్లు గానే పోలీసు రిపోర్టు ఇద్దాము, కానీ ఎందుకైనా మంచిది, అన్ని చోట్ల వెతికారు కానీ, స్కూలులో వెతకలేదు కాబట్టి, అక్కడ కూడా ఓ సారి వెతికి అప్పుడు ఇద్దాం రిపోర్టు. ఏమంటారు ??"

నాన్న గారు ఇచ్చిన ఈ సలహా ప్రెసిడెంటు‌ వసంత రాయుడు గారు, కరణం సత్తిరాజు గారితో సహా అందరికీ నచ్చడంతో, మారు మాట్లాడకుండా అందరూ  స్కూలు వైపు నడిచారు.

     *****     *****     *****     *****     

చేతిలో బేటరీ లైట్లతో కొంతమంది, హరికెన్ లాంతర్లతో కొంతమంది, ప్రెసిడెంట్ గారి ఇంటి నుంచి తెచ్చిన  పెట్రోమేక్స్ లైట్లతో వచ్చిన ఇద్దరితో సహా సుమారు ఓ ముప్పై మంది బడి వైపు నడక సారించారు. 

"మీరెక్కడికి ? చీకట్లో దడుసుకుంటారు. లోపలికి పొండి" అని మా ఇంటి పక్కనే ఉండే కిరాణా కొట్టు మరియు చేనేత చీరలు తయారు చేసే బూడిద తాతబ్బాయి, చనువుకొద్దీ సున్నితంగా హెచ్చరిస్తున్నా వినకుండా, మా గన్నెయ్య తాతను బతిమాలి ఆయన చేతులు గట్టిగా పట్టుకుని గుంపును అనుసరించాం నేనూ, మా కొండగాడు. మళ్లీ సూరన్న కానీ డ్యూటీ ఎక్కేసాడా అన్నంత వెలుతురు ఆ మట్టిరోడ్డు మీద పరుచుకుంది. 

మా ఇంటి నుంచి బయలుదేరి, బూడిద తాతబ్బాయి, దవులూరి దాసు, ఎక్కల వీర్రాజు, కామాచార్యులు, కరణం సత్తిరాజు గారు, కొటికెలపూడి వెంకట్రావు గారు, పెండ్యాల సత్యం గారు, పెండ్యాల వెంకటేశ్వర్లు గారు, దత్తుడు గారు, తోట వారి ఇంటి మీదుగా ఆచంట సత్తెమ్మ, శివాలయం, బొండా వారి ఇల్లు దాటి  స్కూలుకు చేరుకున్నాం.

అప్పటికే ఈ కబురు అందడంతో హెడ్ మేష్టారు, పాలమ్మ తాళం చెవులు తీసుకుని, బడి మెయిన్ గేటు ముందు నిలబడి ఉన్నారు. రాత్రి కావడంతో పురుగూ పుట్రా తిరుగుతూ ఉంటాయి అన్న ఉద్దేశ్యంతో  కామోసు, నాన్నగారు అందరినీ ఉద్ధేశించి నిశ్శబ్దంగా ఉండమని నోటి మీద వేలు పెట్టుకుని సౌంజ్జ చేసేరు. తాళం తీయగానే, అందరూ మౌనంగా బడి లోపలికి అడుగు పెట్టాం. 

బడికి ఎడమవైపు ఉన్న షెడ్డు వెనుక భాగానికి కొంతమంది, మరి కొంతమంది కుడి వైపు షెడ్డు  వెనుక భాగానికి  వెళ్లి, మొక్కలు, పొదలు తో సహా అన్నీ వెతికి ఓ పది నిమిషాల తరువాత ఉత్త చేతులతో తిరిగి వచ్చేరు ఎటువంటి జాడ దొరకలేదని.

సరే లోపల గదుల్లో చూద్దాం రండి అని హెడ్ మేష్టారు సైగ చేసి, ఎడమవైపు ఉన్న షెడ్డు తాళం తీసేరు. ఓ పదిమంది లోపలికి వెళ్లి అణువణువునా గాలించి ఇక్కడ కూడా లేదు అంటూ చేతులతో సౌంజ్జ చేస్తూ బయటికి వచ్చేసారు.

"ఏమిటో మీ ఊరు వాళ్ల పద్ధతి నాకు అర్థం కావడం లేదు. ఇలా సమయం వృధా చేసుకుంటూ పోతే ఆ దొంగ వెధవలు పిల్లని రాజమండ్రి వరకూ తీసుకుని వెళ్లి ఏదో రైలు పట్టుకొని రాష్ట్రం దాటించేస్తే ఇంక మన పిల్ల మనకు దక్కదు. ఆలశ్యం చేయకుండా పద బావా, పోలీసులుకి రిపోర్ట్ చేద్దాం" పిల్ల మేనమామ ఆందోళనతో చెప్పాడు, లో గొంతుకతో.

"సరే, ఈ లోగా ఓ ఇద్దరు గొల్లపాలెం పోలీసు స్టేషన్ కి వెళ్లే పనిలో ఉండండి. ఎలాగూ వచ్చేం కదా ఈ కుడి వైపు షెడ్డులో కూడా వెతికి వెళ్దాం" అని ప్రెసిడెంట్ గారు నెమ్మదిగా చెప్పడంతో..

"ఔను. ఔను. ఇక్కడ కూడా చూద్దాం. ఇందులోనే ఉంది మా తరగతి గది" అని నేను కొంచెం గట్టిగానే అరిచా, ఇలాంటి చీకటి టైం లో మా క్లాస్ ఎలా ఉంటుందో చూడాలన్న ఆదుర్దాలో, మిగతా వారంతా ఏమిటా అరుపులు అన్నట్లు నా వైపు కోపంగా చూస్తుండగా !!

పాలమ్మ, హెడ్ మేష్టారూ కలిసి మా తరగతి తలుపు తీసేటప్పటికి , ఆ శభ్ధానికి లోపల ఉన్న గబ్బిలాలు బిలబిల లాడుతూ వెనకవైపు వసారా గుండా బైటికి పోయాయి. ఆ శబ్దానికి భయపడి నేను, మా అమలకంటీ మా గన్నెయ్య తాత చేతులు పట్టేసుకున్నాం గట్టిగా. 

"అదిగో , ఆ నేలబల్ల కింద చూసేరా, అవే ఆ అమ్మాయి పుస్తకాలు" అని ఆ వెలుగులో నాకు కనపడ్డ పుస్తకాలు నాన్న గారికి చూపించాను. వెంటనే ఆ పుస్తకాలు తీసుకుని గుండెల కద్దుకుని బావురు మన్నాడు పిల్ల తండ్రి. 

వెంటనే అతన్ని బయటకు తీసుకు పోయాడు  అమ్మాయి మేనమామ. ఆయనతో పాటే ఇంక అందరూ కూడా మెయిన్ గేటు తాళం వేసేసి బయటకు వచ్చేసాం.

అమ్మాయి ఏమైంది అన్న బాధతో అందరూ మౌనంగా స్కూలు దాటి రోడ్డు మీద నడుస్తూ శివాలయం సమీపం వరకూ వచ్చేము. 

"స్కూలు లోనూ లేక, ఇంటిలోనూ లేక ఎక్కడ ఉందంటారు?" అడిగాడు బూడిద తాతబ్బాయి, మా నాన్న గారిని.

"బియ్యం డబ్బాలో ఉందేమో ?" యాధాలాపంగా అన్నాను నేను.

"బియ్యం డబ్బాలో ఉండడం ఏంటండోయ్ కామయ్య గారూ ?" కుతూహలంగా అడిగాడు నల్లా సత్యనారాయణ. ఈయన, మా పెద్ద అన్నయ్య స్నేహితుడు. అంతేకాకుండా, హాస్యనటుడు రాజబాబు గారు తండ్రి మా ఊర్లో ఉద్యోగం చేసే సమయంలో ఈ సత్యనారాయణ గారి తోనే రాజబాబు గారు కలిసి తిరిగేవారుట. ఈయనే,  సినిమాలు గురించి ఎన్నో విషయాలు మాకు చెబుతూ ఉండేవారు. ఆ తరువాత రోజుల్లో రాజబాబు గారు ఆయన ఫొటోతో ప్రింట్ చేయించిన 1000 సంవత్సరాల కేలండర్ ఈ సత్యనారాయణ ద్వారానే మా ఊరి వాళ్ళందరికీ పంపించారు రాజబాబు గారు.

"ఓ అదా? అది వీడు చేసిన ఓ పెద్ద ఘణకార్యంలే" అంటూ చెప్పడం మొదలెట్టారు నాన్న. ఆయన చెబుతూంటే నేను కూడా నెమ్మదిగా గతం లోకి వెళ్లిపోయాను.

     *****     *****     *****     *****     

ఆ రోజు కూడా ఎప్పటిలాగే, మా అన్నదమ్ములతో కలిసి ఇంటినుంచి స్కూలుకు బయలుదేరాను. కామాచార్యులు గారి ఇంటి వద్దకు వచ్చేటప్పటికి నాకు షడెన్ గా జ్ఞాపకం వచ్చింది, నారాయణ మేష్టారు ఇచ్చిన లెక్కలు హోమ్ వర్కు చేయలేదని. ఆయన అసలే ఛండశాసనుడు. హోమ్ వర్కు చేయకుండా వచ్చేనని తెలిస్తే, పేక బెత్తంతో వీపు సాపు చేసేస్తారు. అందుకే

"మీరు నడుస్తూ ఉండండి. నేను లెక్కల హోమ్ వర్క్ పుస్తకం తెచ్చుకోవడం మరచిపోయా, తీసుకుని వచ్చేస్తా" అని మా సోదరులతో అబద్ధం చెప్పి ఇంటి దారి పట్టేను. 

నా అదృష్టం బావుండి, వీధి తలుపు దగ్గరకు వేసి ఉంది. అమ్మ లోపల నూతి దగ్గర నీళ్లు తోడుకుంటోంది. పిల్లిలా నెమ్మదిగా లోపలికి వచ్చి, పుస్తకాల సంచీ అలమారలో పడేసి, కొంతసేపు ఎవరికీ కనపడకుండా ఉండడానికి ఎక్కడ దాక్కుంటే బావుంటుందా అని ఆలోచిస్తున్నా. 

వెంటనే వెనకవెంపు వసారాలో ఉన్న సుమారు రెండు బస్తాల బియ్యం పట్టే బియ్యం డబ్బా గుర్తుకొచ్చి, చడీ చప్పుడు లేకుండా, నెమ్మదిగా మూత తీసి, అందులో దూరి‌, లోపలకి కొంచెం గాలి, అలాగే బయట నుంచి వచ్చే శబ్దాలూ వినపడేలా కొంచెం వెలితి ఉంచి మూత వేసేసుకుని కూర్చున్నాను.

ఓ అరగంట తరువాత నాకు బయట మాటలు వినబడసాగేయి.

"అమ్మగారూ, కాంబాబు ఈ రోజు బడికి రాలేదు. కారణమేంటో కనుక్కొని రమ్మన్నారమ్మా నారాయణ మేట్టారు" అమ్మని అడిగింది పాలమ్మ.

ఆ మాటలు వినడంతోనే నా గుండెలు జారి పోయాయి.

"రాకపోవడం ఏమిటి ? మా అందరి పిల్లలతో పాటు వాడూ బయలుదేరేడుగా ? ఎక్కడికి వెళ్లి ఉంటాడు ? ఏమీ అనుకోకుండా కొంచెం ఆసుపత్రికి వెళ్లి అయ్య గారికి కూడా ఈ విషయం చెప్పి వెళ్ళమ్మా !!  " ఆదుర్దాగా చెప్పింది అమ్మ.

"అలాగే చెబుతానమ్మా ! ఈ లోగా ఇంటికి వస్తే బడికి పంపించండమ్మా ! నే వెళుతున్నా, తలుపు వేసుకోండమ్మా" అని చెప్పి బయలు దేరింది పాలమ్మ.

ఓ పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఈ లోగా వీధి తలుపు ఎవరో కొట్టిన శబ్దం వచ్చింది. తలుపు తీసిన అమ్మతో ,

"అమ్మా, కాంబాబు బడికి రాలేదుట కదమ్మా ! ఆసుపత్రికి కూడా రాలేదు. వత్సవాయి తమ్మిరాజు గారి ఇంట్లోను, అమలకంటి వారి ఇంట్లో కూడా చూసా. అక్కడ కూడా లేరు. మన ఇంట్లోనే ఓ సారి చూడమన్నారమ్మా డాక్టర్ గారు" తలపాగా తీసి, చెమట తుడుచుకుంటూ అమ్మతో చెబుతున్నాడు గన్నెయ్య తాత.

"బడికి వెళ్ళడం నేను చూసేను. ఎలాగైనా, ఈ మద్యన చదువు మీద శ్రద్ధ తగ్గి, ఆటల మీద దృష్టి ఎక్కువైంది. నేననుకోవడం మధ్యలో ఎక్కడో ఆగి బడికి వెళ్ళకుండా ఆటలాడడానికి పోయుంటాడు. ఏమీ అనుకోకుండా మన కొత్తదొడ్డిలోనూ, సూరిబాబు గారి పశువుల పాకలోనూ చూడు నాయనా. నాకు ఈ రోజు అసలు పని తెమలటం లేదు. ఎసట్లో బియ్యం పడెయ్యాలి" అంటూ గన్నెయ్య తాతకు పురమాయించి, బియ్యం తీసుకోవడానికి డబ్బా దగ్గరికి వచ్చింది అమ్మ.

ఏవో దేవుని మంత్రాలు చదువుకుంటూ, బియ్యం డబ్బా మూత తీసిన అమ్మ , లోపల ఉన్న నన్ను చూసి, భయంతో కెవ్వుమని అరచి, చేతిలో గిన్నె, కాలుమీద వేసేసుకుంది. 

నేను వెంటనే హనుమంతునిలా ఒక్క గెంతు గెంతి డబ్బాలోంచి బయటపడ్డాను. ఈ లోగా నా చొక్కా దొరక పుచ్చుకున్న అమ్మ వీపు మీద నాలుగు సార్లు ప్రైవేటు చెప్పేసింది, పారిపోయే ప్రయత్నంలో ఉన్న నన్ను ఒడిసిపట్టుకొని!

అమ్మ అరచిన అరుపుకి, బయటకు వెళ్ళబోతున్న గన్నెయ్య తాత, "ఏమైంది అమ్మగారూ" అంటూ లోపలికి వచ్చేడు. 

జరిగినదంతా చెప్పిన అమ్మ "పట్టుకో వెధవని. మళ్ళీ పారిపోతున్నాడు" అని చెప్పడంతో, మెట్లు దిగి పారిపోతున్న నన్ను గట్టిగా ఒడిసి పట్టుకుని, మేకను రెండు భుజాల మీద వేసుకుని తీసుకుని వెళ్ళినట్లు, నన్ను తీసుకుని వెళ్లి బడిలో పడేయడానికి బయలుదేరాడు గన్నెయ్యతాత.  ఇంట్లో ప్రైవేటే ఇలా ఉంటే, ఇక బడిలో చెప్పే ప్రైవేటు ఎలా ఉంటుందో దేవుడా అనుకుంటూ గుండె రాయి చేసుకున్నాను, వేరే గత్యంతరం లేక.

   *******     ********     *********  

"అదీ మా వాడు చేసిన ఘణకార్యం" చెప్పడం ముగించారు నాన్న. నేను కూడా గతంలోంచి మామూలు స్థితికి వచ్చేను.

"సరే డాక్టర్ గారూ, మరి నేను ఇంటికి బయలు దేరుతా. కొంచెం ఇంగ్లీషులో కంప్లైంట్ రెడీ చేసి ఉంచండి. మా సూరిగాడిని పంపిస్తా. తరువాత ఎవరినైనా తోడిచ్చి, అమ్మాయి తండ్రిని గొల్లపాలెం పోలీసు స్టేషన్ కి పంపుదాం !" అంటూ నాన్న దగ్గర శెలవు తీసుకున్నారు ప్రెసిడెంట్ గారు.

"ఒక్క నిమిషం ఆగండి" అంటూ ప్రెసిడెంట్ గారిని తీసుకుని పక్కకు వెళ్ళేరు నాన్నగారు.  ఓ అయిదు నిమిషాలు పోయిన తరువాత,

"అలాగే డాక్టర్ గారూ, మీరు అన్నట్టుగానే చేద్దాం" అంటూ ప్రెసిడెంట్ గారు, నాన్నతో పాటు వెనక్కి వచ్చి, 

"ఏవండీ, హెడ్ మాష్టారూ ! మీరూ, అమ్మాయి తండ్రీ, మేనమామా, ఇంకో పదిమంది లైట్లు తీసుకుని మా వెనకాల రండి" అంటూ ఓ పదిహేను మందిని వెంటబెట్టుకుని మళ్లీ స్కూలు వైపు బయలుదేరారు, మిగతా వారిని శివాలయం వద్దే ఉండమని చెప్పి.

"మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు, ఎందుకంటారు ?" అడిగారు ఎక్కల వీర్రాజు, శివాలయంలోని దేవుడికి బయట నుంచి దణ్ణం పెట్టుకుంటూ.

"బడి బయట తుప్పలు ఉన్నాయి కదా ! అక్కడ సూడ్డానికో లేదా ఆ ఎనకున్న శ్మశానంలో ఎతకడానికో ఎళ్ళింటారు లెండీ" చెప్పాడు గన్నెయ్య తాత, మా ఇద్దరినీ పొదివి పట్టుకుంటూ.

కాసేపటికి మళ్ళీ చీకటి ఆవరించి, మొత్తం అంధకారం అలముకుంది. మిగిలిన జనానికి ధైర్యం చెబుతున్నట్లు,  బూడిద తాతబ్బాయి శివస్తుతిని కొంచెం మంద్ర స్థాయిలో చదువుతున్నాడు.

వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ? ఎందుకు వెళ్ళేరు ? అమ్మాయి ఎక్కడ ఉంది ? అందరి బుర్ర లోనూ ఇదే ఆలోచన. ఓ పావుగంట ఇలాంటి ఆలోచనలు తో చాలా భారంగా గడిచింది.

ఈలోగా, బడి దగ్గర నుంచి ఏదో గుంపు హడావుడిగా వస్తున్నట్టు ఆ మసక వెలుతురు లో కనిపించింది. ఓ ఇద్దరు పరుగు పరుగున మా దగ్గరకు వచ్చి, 

" ష్..ష్.. ఎవ్వరూ గట్టిగా మట్లాడకండి. ఏం జరిగిందో అంతా డాక్టర్ గారు చెబుతారు" అని చెప్పేలోపే, అమ్మాయి మేనమామ ఏదో భుజం మీద వేసుకొని హడావుడిగా నడుచుకుంటూ మా ముందు నుంచి వెళ్ళిపోయాడు.

"అయ్యయ్యో, ఏం జరిగింది ? ఆ అమ్మాయికి ఏమైంది ? అలా తీసుకుని పోతున్నారు ఎందుకు? "

ప్రశ్నల వర్షం మొదలైంది.

"ఏమీ కంగారు పడకండి. భగవంతుని దయవల్ల అమ్మాయి క్షేమంగా ఉంది. అసలు జరిగింది ఏమిటో డాక్టర్ గారు చెబుతారు" అంటూ శివాలయం మెట్లు మీద చతికిల పడ్డారు ప్రెసిడెంట్ గారు.

"అసలేం జరిగింది అంటే.." చెప్పడం మొదలెట్టారు నాన్నగారు.

"మనం బడిలో అంతా చూసి, వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో, ఈ శివాలయం వద్దకు వచ్చేటప్పటికి నాకు ఓ అనుమానం వచ్చింది. మనం అంతా చూసేం కానీ, కుడివైపు షెడ్డులో ఉన్న రికార్డు రూమ్ చూడలేదని. అదే విషయం ప్రెసిడెంట్ గారికి చెప్పేను. మా ఊహ నిజమైంది. ఆ అమ్మాయి రికార్డు రూములో ఉన్న పెద్ద భోషాణం పెట్టి పక్కన ఆదమరిచి నిద్రపోతోంది. అందుకే ఆ అమ్మాయికి మెలుకువ రాకుండా నిశ్శబ్దంగా వెళ్లి, భుజం మీద వేసుకుని ఇంటికి పంపించేసాము. ఇప్పుడు కూడా ఆ అమ్మాయికి మెలుకువ రాలేదు. అంతేకాదు ఈ సంగతులు ఏవీ కూడా ఆ అమ్మాయికి తెలియవు. ఎవరైనా చెబితే తప్ప" చెప్పడం ముగించారు నాన్న.

"అసలు ఆ రికార్డు రూమ్ లోకి ఎలా వెళ్లిం
దంటారు ? విడ్డూరం కాకపోతే? " ఆతృతగా అడిగారు పెండ్యాల సత్యం గారు.

దానికి జవాబుగా, హెడ్ మాష్టారు,  

"మా పాలమ్మ ప్రతీ రోజు ఉదయం ఆ రికార్డు రూమ్ తలుపు తీసి, హాజరు పట్టీలు, సుద్దలు‌, డస్టర్లు లాంటివి బయట పెట్టి మళ్ళీ తాళం వేసేస్తుంది. తిరిగి సాయంత్రం అవన్నీ మళ్లీ లోపల పెట్టేసి యధావిధిగా తాళం వేసేస్తుంది. ఈ రోజు సాయంత్రం ఆఖరి పీరియడ్లో, దొంగ పోలీసు ఆట ఆడుకునే సమయంలో ఈ అమ్మాయి ఎవరికీ దొరక కూడదని, తలుపు తీసి ఉంచిన ఈ గదిలోకి వచ్చి, భోషాణం పక్కన దాక్కుని ఉంటుంది.. ఇదేమీ ఊహించని పాలమ్మ మాములుగా తాళం వేసేసిందిట. ఏదైనా మనం అందరం అదృష్ట వంతులం. అమ్మాయి దొరికింది" చెప్పి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు హెడ్ మాష్టారు.

"డాక్టర్ గారూ, నాకు తెలియక అడుగుతున్నా, ఆ పిల్ల ఒక్కతే సుమారు ఐదు గంటలు అలా అంత ధైర్యంగా ఎలా ఉండగలిగిందంటారు ??" అడిగారు గడియారాలు, రేడియోలు బాగుచేసే కామాచార్యులు గారు.

"మీరు అనుకుంటున్నట్లు ఆ అమ్మాయి అన్ని గంటలు స్పృహలో లేదు. ఆ పిల్ల తండ్రి ఈ మధ్య ఓ సారి నాతో చెప్పేడు ఈ అమ్మాయికి అతినిద్ర అలవాటు ఉందని. ఎక్కడైనా ఓ పది నిమిషాలు కదలకుండా కూర్చుంటే నిద్ర లోకి వెళ్లి పోతుందనీ ! ఏదైనా మందు ఉంటే ఇమ్మని. దానికి నేను కొన్ని సూచనలు కూడా చేసేను. అందువల్ల ఆ అమ్మాయి ఆ భోషాణం పెట్టె పక్కన కూర్చున్న పది నిమిషాల కే నిద్ర లోకి జారిపోయింది. ఇప్పటికీ మెలకువ రాలేదు" చెప్పారు నాన్న, కళ్ళజోడు అద్దాలు తుడుచుకుంటూ.

"ఔను కానీ, డాక్టర్ గారూ, అమ్మాయి దొరకలేదు, ఇంక ఇళ్ళకు వెళ్లిపోదాం అనుకుంటున్న సమయంలో, ఆ అమ్మాయి రికార్డు రూములో దాక్కుని ఉంటుంది అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది ?" ఆశ్చర్యం ఒలకబోస్తూ అడిగారు కరణం సత్తిరాజు గారు.

"చెప్పకూడదు కానీ, ఆ ఆలోచన రావడానికి కారణం మా అబ్బాయి కాము గాడు చెప్పిన "బియ్యం డబ్బాలో ఉందేమో?" అన్న మాటలే. ఎందుకంటే, మనం రికార్డు రూమ్ చూడలేదు..... ఆ అమ్మాయికి అతినిద్ర అలవాటు ఉంది..... అమ్మాయి లందరూ ఆఖరి పీరియడ్ దొంగ పోలీసు ఆట ఆడుకున్నారన్న విషయం మా వాడు చెప్పేడు. మా వాడు బియ్యం డబ్బాలో దూరినట్లు ఈ అమ్మాయి కూడా ఆటలో భాగంగా, దాక్కోవడానికి ఆ గదిలో దూరి ఉంటుంది అని ఊహించాను. అదే జరిగింది. ఆ దేవుని దయవలన అంతా మంచే జరిగింది" చెప్పి ముగించారు నాన్న.

అందరి చూపులు నా వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూంటే, ఆనందంతో ఏం చేయాలో తెలియక గన్నెయ్య తాత వెనుక దాక్కున్నాను, సిగ్గు పడుతూ.

ఇది జరిగి ఏభై ఎనిమిది సంవత్సరాలు  అయినప్పటికీ, నా బాల్యం చేష్టలు గుర్తుకు వస్తే నవ్వు వచ్చే నాకు, 'బడిలో ఆ రోజు'  రాత్రి ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయికి షడన్ గా మెలకువ వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదన్న ఆలోచన వస్తే చాలు.. ఎందుకో ఒళ్ళంతా గగుర్పొడుస్తుంది.  

ఏదిఏమైనా, నాకైతే మటుకు ఈ సంఘటనలో "అతినిద్ర ఆమెకు దేముడు ఇచ్చిన వరం" అనిపిస్తుంది.


            ******      శుభం.     *******

No comments:

Post a Comment