అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-466.
4️⃣6️⃣6️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*52. వశ్లోకము:*
*”వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసఃl*
*ధ్యానయోగపరోనిత్యం వైరాగ్యం సముపాశ్రితఃll”*
“వివిక్తసేవీ అంటే రణగొణధ్వనుల మధ్య కాకుండా ఏకాంతంలో ఉండటానికి ప్రయత్నించాలి. ఇంటిలోనే ధ్యానమునకు ఒక ఏకాంత ప్రదేశమును ఏర్పాటుచేసుకోవాలి. గలగల మాట్లాడకుండా, అవసరమైనంత వరకు మాట్లాడుతూ ఎక్కువకాలం మౌనంగా ఉండాలి. కాని మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటుంటే అంతా హడావిడే. వచ్చేవాళ్లు పోయేవాళ్లు, వంటలు, టిఫిన్లు, అందరికీ అందాయో లేదో అన్న టెన్షన్, పురోహితుడు తన మానాన తాను పూజచేస్తుంటాడు. చేసేవాళ్లు యంత్రికంగా పూజచేస్తుంటారే కానీ మనసు ఇతర విషయముల మీద ఉంటుంది.
```
(ఈ కాలంలో ప్రతి మనషి మనసును చికాకు పరిచే సాధనం ఒకటి ఉంది. అదే సెల్ ఫోన్. చాలామందికి అది చేతిలో లేనిదే తోచదు. ధ్యానం, పూజ, వ్రతం చేసేటప్పుడు కూడా అది పక్కన ఉండాల్సిందే. మనిషి ఏకాగ్రతను చెడగొట్టడానికి దానిని మించిన సాధనం మరొకటి లేదు. అందుకని పూజకు ముందు దాని పీక నొక్కడం అత్యంత ఆవశ్యకము)
‘కాబట్టి, పూజ, వ్రతం చేస్తున్న గంటసేపూ మనసు ప్రశాంతంగా, ఏకాంతంగా, ఎటువంటి అలజడి లేకుండా ఉంచుకోవాలి. మౌనంగా మనసు పరమాత్మ యందు లగ్నం చేయాలి. పూజ తప్ప మరొక ధ్యాస ఉండకూడదు. ఇది అంతా జరగాలంటే ఏకాంతం చాలా ముఖ్యం. పూజ గది ఒక మూలగా ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ఎటువంటి రణగొణ ధ్వనులు లేకుండా, ఎవరూ చికాకుపరచకుండా ధ్యానం చేసుకోగలగాలి.
‘లఘ్వాశీ’ అంటే మితంగా భోజనం చేయాలి. తగినంత వరకే తినాలి. అధికంగా తిన్నా, అసలు తినకపోయినా ఆరోగ్యం చెడుతుంది. మనం తినే ఆహారం మన మీద దాని ప్రభావం చూపుతుంది. పూటుగా కడుపు నిండా టిఫిన్ చేసి పూజకు కూర్చుంటే నిద్రవస్తుంది. అందుకే ఏదైనా పూజలు, వ్రతాలు చేసేటప్పుడు, వ్రతం చేసుకొని, భక్తితో ప్రసాదం స్వీకరించే వరకు ఏమీ తినకూడదు అని చెబుతారు. దాహం వేస్తే ఆచమనం పేరుతో కాస్త జలం పుచ్చుకోవచ్చు. ఉపవాసాల పేరుతో రోజూ తినే దానికంటే ఎక్కువ టిఫిన్లు లాగించడం దీని కిందికే వస్తుంది. కాబట్టి మిత భోజనం ఆరోగ్యానికి, మానసిక వికాసానికి, భగవంతుడి మీద మనసు నిలవడానికి ఉపయోగపడుతుంది. “తినే ఆహారం కూడా సాత్విక ఆహారం అయితే సాత్విక లక్షణాలు వస్తాయి. మనసు సత్త్వగుణ సంపన్నం అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్వికాహారం సేవించాలి. అదీ మితంగా సేవించాలి.
‘యతవాక్కాయ మానసః’ అంటే మాటను, ఇంద్రియములను, మనసును మన అదుపులో ఉంచుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనసులో భావన, మాట్లాడే మాట, చేసే పని ఒకటిగా ఉండాలి. ఒకటి అనుకొని, మరొకటి చెప్పి, ఈ రెండింకి విరుద్ధంగా మరొకటి చేయకూడదు. అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చిన పనులు చేయడం మంచిది కాదు. ఈ రెండింటికి మనసు మూలకారణం. మనసును కూడా అదుపుచేయాలి.
‘వైరాగ్యంసముపాశ్రితః’ రాగమును అంటే కోరికలను వదిలిపెట్టడమే వైరాగ్యము. ఆ వైరాగ్యాన్ని బాగా అవలంభించాలి. ఎక్కడా సడలింపు ఉండకూడదు. అనవసరపు కోరికలను మనసులోకి రానీయకూడదు. వైరాగ్యం అంటే పెళ్లాం బిడ్డలను వదిలి హిమాలయాలకు వెళ్లడం కాదు. ఎందుకంటే రిషీకేష్ లో ఉన్నా మనసు ఇంటి మీద ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. అందుకని మనసును, ఇంద్రియములను అదుపులో ఉంచుకోవడం వైరాగ్యానికి లక్షణం. ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకోగలగాలి. అనవసరమైన వాటి మీద విపరీతమైన ఆసక్తి అనురాగము మమత పెంచుకోకూడదు. అనవసరమైన వాటి కొరకు బాధపడకూడదు. దేని మీద ఎంతవరకు అనుబంధం పెంచుకోవాలో అంతే చేయాలి. తృప్తిగా జీవించాలి. అసంతృప్తిని మనసులోకి రానీయకూడదు. దీనినే వైరాగ్యం అంటారు.
‘ధ్యానయోగపరోనిత్యం’ అంటే ప్రతిదినము కొంచెం సేపు అయినా ధ్యానం చేయాలి. ప్రతిదినం ఎలా ఆహారం తీసుకుంటామో అలాగే ప్రతిదినం ధ్యానం చేయాలి. అది ఒక అలవాటుగా చేసుకోవాలి. ఆ కాసేపు అయినా మనసు, శరీరం మన అధీనంలో ఉంటుంది. అలా చేస్తూ ఉంటే సాత్విక చింతన, భగవంతుని యందు భక్తి అలవడతాయి.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment