అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-465.
4️⃣6️⃣5️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*50. వ శ్లోకము:*
*”సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాఽఽప్నోతి నిబోధమేl*
*సమాసేనైవ కౌస్తేయl నిష్ఠా జ్ఞానస్య యా పరాll”*
“కౌంతేయా! నిష్కామ యోగం ఆచరించి, దాని ద్వారా జ్ఞాన, విజ్ఞానములను నిష్టతో ఆర్జించి ఎలాగైతే పరమగతిని పొందుతున్నారో అలాగే కేవలం జ్ఞానయోగంతో కూడా పరమగతిని పొందగలరు. అది ఎలాగో నీకు క్లుప్తంగా చెబుతాను శ్రద్ధగా విను.”
```
ఇప్పటి వరకు మనం జ్ఞాన యోగము, కర్మయోగము గురించి తెలుసుకున్నాము. జ్ఞానయోగమును, కర్మయోగమును అనుసరించి మోక్షము పొందవచ్చు అని తెలుసుకున్నాము. అందులో జ్ఞానయోగము గురించి మరలా సంక్షిప్తంగా చెబుతాను అంటున్నాడు పరమాత్మ. ఈ కింది మూడు శ్లోకములు గీతా సారము అని చెప్పబడ్డాయి. జ్ఞానము మనకు మూడు విధాలుగా కలుగుతుంది. శాస్త్రములు గురుముఖతా వినడం వలన, విన్నది మననం చేయడం వలన, ఆ మననం చేసినది ధ్యానం మొదలగు నాటితో ఆచరించడం వలన కలుగుతుంది. అంటే ధ్యానం వలన మన మనసులో బుద్ధిలో ఉన్న విపరీత భావనలను తొలగించుకొని మనసును, బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం. ఈ మూడు జ్ఞానమార్గానికి సోపానాలు. ఇందులో ఏది లోపించినా జ్ఞానం కలుగదు.
ఈ శ్లోకంలో నిష్ఠా జ్ఞానస్య అని అన్నారు వ్యాసులవారు. అంటే జ్ఞాన నిష్ఠ, కేవలం శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదించి నందువలన సరిపోదు. ఈ జ్ఞానము అణువు అణువునా జీర్ణించుకుపోవాలి. మనకు ఏదైనా సమస్య వచ్చినపుడు ఆ జ్ఞానం ఉపయోగపడాలి. అలా ఉపయోగ పడని జ్ఞానం వృధా.
ఉదాహరణకు మనకు బాంకులో పది లక్షలు ఉన్నాయి. జేబులో వెయ్యిరూపాయల నోట్లు ఉన్నాయి. కాని దాహం వేస్తే నీరు కొనుక్కోవడానికి 20 రూపాయలు లేవు. ప్రాణం పోతోంది. అప్పుడు ఎవడో మనకు కాసిని నీళ్లు ఇచ్చాడు లేక 20 రూపాయలు ఇచ్చాడు. అదే నిజమైన ధనం. కాబట్టి అవసరానికి ఉపయోగపడని ధనము, జ్ఞానము ఉన్నా లేనట్టి కాబట్టి జ్ఞానాన్ని అణువు అణువునా పదిలపరచుకొని దానిని అనునిత్యము ఉపయోగిస్తుంటే, పరమ పదము చేరుకోవచ్చు. అది ఎలాగో సంగ్రహంగా చెబుతాను అని అంటున్నాడు కృష్ణుడు.```
*51. వ శ్లోకము:*
*”బుద్ధ్యావిశుద్ధయా యుక్తో ధృత్యాఽఽత్మానం నియమ్య చl*
*శబ్దాదీన్విషయాం స్త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్యచll”*
“ఈ కింది మూడు శ్లోకములు గీతాసారము. ఈ మూడు శ్లోకములలో చెప్పబడిన సాధనసంపత్తిని మనం స్వంతం చేసుకోవాలి. ఇవి కనుక పాటిస్తే పరమపదము సులభంగా పొందవచ్చు 51వ శ్లోకం చూద్దాము.”
```
బుద్ధ్యా విశుద్ధయా యుక్తో అంటే శాస్త్రములను వినడం ద్వారా, మననం చేయడం ద్వారా బుద్ధిని బాగా శుద్ధి చేసుకోవాలి. అప్పటికే చేరి ఉన్న మలినములను కడిగి వేయాలి. అది మంచిదా ఇది మంచిదా, అది చేయాలా, ఇది చేయాలా, ఆ దేవుడు గొప్పవాడా ఈ దేవుడికి మహిమలు ఉన్నాయా అనే సందేహాలను సమూలంగా తుడిచిపెట్టాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఇక్కడ బుద్ధి అంటే మనసు అని కూడా అర్థం. నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. మనసు మకీలపట్టని అద్దంలాగా ఉండాలి. అప్పుడే మన యొక్క నిజస్వరూపమును మనం చూడగలము. ధృత్యా ఆత్మానం నియమ్మచ. ఇది ఎలా కలుగుతుంది అంటే మనసును మన అధీనంలో ఉంచుకుంటే కలుగుతుంది. అంటే ధైర్యంతో మనసును స్వాధీనం చేసుకోవాలి. సింహాన్ని లొంగదీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. మనసు సింహం కంటే బలం అయినది. కాబట్టి మనసును లొంగదీసుకోడానికి తగిన ధైర్యం కలిగి ఉండాలి. మన మనసుకు శాస్త్రముల యొక్క, వాటిని అధ్యయనం చేస్తే వచ్చే ఫలితాలను గురించి తెలియజేసి, మనసును బుద్ధిని సమాధాన పరచాలి. అప్పుడే మనసు, బుద్ధి మనం చెప్పినట్టు వింటాయి. అలా సమాధాన పరచడానికి ముందు మనకు ధైర్యం కావాలి. సందేహాలు పనికిరావు.
శబ్దాదీన్విషయాంస్త్యక్త్యా అంటే శబ్ద, స్పర్మ, రూప, రస, గంధములు అనే పంచ తన్మాత్రలను విషయ వాంఛలను స్త్యక్త్యా అంటే విడిచిపెట్టాలి. వాటి వెంట మనసు పరుగెడుతూ ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియములు పరుగెడుతూ ఉంటాయి. వాటిని ఆపాలి. మనసును బుద్ధిని వాటి నుండి వెనక్కు మళ్లించి, అంతర్ముఖం చేయాలి. లేక పోతే ఒకటి చూస్తూ (ఎవరెవరు వస్తున్నారో పోతున్నారో చూస్తూ), ఒకటి వింటూ(తన గురించి ఎవరెవరు ఏం మేం అనుకుంటున్నారో అని ఒక చెవి అటుపెట్టి వింటూ), మరొకటి తాకుతూ, (కేవలం పురోహితుడు ఇచ్చిన పూలను తాకి మమ అనుకొని, తరువాత ఇంటి వచ్చిన అతిధులకు షేక్ హాండ్ ఇచ్చి పలకరిస్తూ) వీటి మీద మనసుపెట్టి, దేవుడి ముందు కూర్చుని పూజచేస్తే ఏం ఫలితం ఉంటుంది.
రాగద్వేషా వ్వుదస్యచ అంటే రాగద్వేషములను వదిలిపెట్టాలి. కనీసం పూజచేసే కొద్ది సేపు అయినా, ధ్యానం చేసే కాసేపు అయినా, రాగద్వేషములను వదిలిపెట్టాలి. అది కావాలి ఇది వద్దు అనే బుద్ధిని త్యాగం చేయాలి. మనసులో నుండి వెళ్లగొట్టాలి. అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది. కాని మనం ఏ పూజ చేసినా ఏవేవో కోరికలు తీరడానికే పూజలు చేస్తుంటాము. ఇష్టకామ్యార్ధ సిద్యర్ధం అనకుండా ఏ పూజా చేయము. ఇంకా కొంతమంది మహానుభావులు తమకు లాభం లేకపోయినా పర్వాలేదు. పక్కవాడికి నష్టం కలగాలి అనే కోరికతో పూజలు చేస్తుంటారు. మనం కోరుకున్న కోరికలు తీరకపోతే మనసు విపరీతంగా కలత చెందుతుంది. బుద్ధి చలిస్తుంది. ఈ దేవుడు లాభం లేదు మరొక దేవుడిని పూజించాలి అని మరొక దేవాలయానికి వెళతాము. రాగద్వేషాలతో ఏ దేవాలయానికి వెళ్లినా ఒకటే అని తెలుసుకోలేము. వీటి వలన జ్ఞానం రాదు సరికదా అజ్ఞానం మరింతగా పెరుగుతుంది. కాబట్టి ఇష్టము, అయిష్టము అనే రెండు పదాలు వదిలి పూజచేసే కాసేపు నిర్మలమైన మనస్సుతో దేవుడిని అర్చిస్తేనే జ్ఞానం కలిగే అవకాశం ఉంది.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment