అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక.
4️⃣6️⃣7️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*53. వ శ్లోకము:*
*”అహఙ్కారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్l*
*విముచ్య నిర్మమశ్శాన్తో బ్రహ్మభూయాయ కల్పతేll”*
“అహంకారము, బలము, దర్పము, కామము (కోరికలు), కోపము, ఇతరుల వస్తువులను లాక్కోవడం, అందరిమీదా వల్లమాలిన మమకారము వీటి అన్నిటినీ సమూలంగా వదిలిపెట్టాలి.(వీటి గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాము.) వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. అప్పుడే అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ నియమబద్ధంగా పాటిస్తే ‘బ్రహ్మభూయాయ కల్పతే’ అంటే పరబ్రహ్మ స్వరూపమును పొందడానికి అంటే మోక్షము పొందడానికి అర్హుడు అవుతాడు.”
```
‘ముందు నేను అనే అహంకారము పుడుతుంది. అంటే ఈ శరీరమే నేను అనే భావన. ఇది మనిషి పుట్టగానే అంకురిస్తుంది. ఇది బాగా ముదిరి నేనే చేస్తున్నాను. ఇది నాది, ఇదంతా నాది అనే భావన బలపడుతుంది. ఈ శరీరం నాది అన్నప్పుడు శరీరం మీద మమకారం పెరుగుతుంది. శరీరాన్ని బలంగా తయారు చేసుకుంటాడు. (వ్యాయామాలు, ఆసనాలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణలు). అంతే కాదు ఇదంతా నా చేతి మీద నడవాలి, నా ఆజ్ఞ లేనిదే ఎవరూ ఏమీ చేయకూడదు, అంతా నాకు లోబడి ఉండాలి, నా మాటే నెగ్గాలి అనే తత్త్వం బలానికి పరాకాష్ఠ. శరీరం బాగా బలపడినపుడు పొగరు కూడా పెగురుతుంది. చూచిందల్లా నాది కావాలి అనే మనస్తత్వం పెరుగుతుంది. ఎవర్నీ లెక్కచేయడు. పెద్ద చిన్న తేడాలేదు. తలవంచని వీరుడు అవుతాడు.
అప్పుడే వల్లమాలిన కోరికలు మనసులో పుడతాయి. అది నాకు కావాలి. నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు అనే దురభిమానం పెరుగుతుంది. అనుకున్నవి అన్నీ తీరవు కదా! ఆ కోరికలు తీరనపుడు కోపం పెరుగుతుంది. ఒళ్లు తెలియని కోపం వస్తుంది. ఆ కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియదు. తాను కోరుకున్న వస్తువు మీదా, మనిషి మీదా మమకారం అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఎదుటి వాడి నుండి తాను కోరుకున్న వస్తువును బలవంతంగా లాక్కుంటాడు. లేదా కోరుకున్న వస్తువులను ఏదో విధంగా పోగుచేస్తాడు. పనికిమాలిన వస్తువుల మీద మమకారం పెంచుకుంటాడు. వాటిని రక్షించడం కోసం తాపత్రయ పడతాడు.
(కొన్ని ఉదాహరణలు: అనేక అడ్డదారులు తొక్కి అమితమైన ధనం సంపాదిస్తాడు. పోగుచేస్తాడు. పన్ను కట్టడానికి ఇష్టం ఉండదు. ఆ నల్ల ధనం దాయడానికి నానా తంటాలు పడతాడు. బస్తాలలో కుక్కి అటకమీద పెడతాడు. అనుక్షణం భయంతో వణుకుతుంటాడు. చివరకు ఆ ధనం దొంగలపాలవుతుంది. కోటానుకోట్లు నల్లధనం సంపాదించిన వారి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే అవసరం లేకపోయినా ఒకడు కారు కొంటాడు. దానిని కడగడం, శుభ్రంగా ఉంచడం దానికి ఏ చిన్న గీతపడినా విలవిలలాడిపోవడం, దీనితో అతడికి దేవుడి ముందు కూర్చోడానికి టైము దొరకదు. మరొకడు అవసరం లేకపోయినా రాష్ట్రం అంతా తిరిగి భూములు కొంటాడు. వాటిని రక్షించుకోలేక నానాతంటాలు పడతాడు. వాటిని ఎవరన్నా ఆక్రమిస్తే కోర్టులచుట్టు పోలీసు స్టేషన్ల చుట్టు తిరుగుతుంటాడు. దైవధ్యానానికి తీరికలేదండీ అని అంటుంటాడు. అలా కాకుండా, ఎంతవరకు అవసరమో అంతే సంపాదించుకుంటే మనశ్శాంతి ఉంటుంది.)
వీటన్నిటి ఫలితంగా మనశ్శాంతిని కోల్పోతాడు. ఈ లక్షణాలు అన్నీ మానవునికి శాపాలుగా పరిణమిస్తాయి. దుఃఖాలకు కారణం అవుతాయి. కాబట్టి ఈ లక్షణాలు అన్నీ సమూలంగా తుడిచిపెట్టాలి. ఒక్కటి కూడా మిగల్చకూడదు. (సంపాదించిన ధనం, ఆస్తులు, పదవులు ఏవీ తన వెంటరావు అనే జ్ఞానం కలగాలి. అప్పుడే పరమ పదానికి అర్హుడు అవుతాడు. నివృత్తి మార్గం వైపు అడుగులు వేస్తాడు. బ్రహ్మమార్గంలో ప్రయాణం చేస్తాడు. అలాకాకుండా, జీవితంలో అహంకారం (అంటే ఈ దేహమే నేను, నేనే ఈ దేహము అనే భావన) మొదలు మమకారం(ఇదంతా నాది. ఇవి లేకపోతే నేను బతకలేను అనే భావన) దాకా ప్రయాణిస్తే, చివరకు అథఃపతనం తప్పదు. ఏ మార్గం ఎంచుకోవాలో మన ఇష్టానికే వదిలేసాడు పరమాత్మ.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment