Tuesday, April 8, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…   ధారావాహిక-468.
4️⃣6️⃣8️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!

                      *భగవద్గీత*
                    
               (సరళమైన తెలుగులో)

*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*54. వ శ్లోకము:*

*”బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతిl*
 *సమస్సర్వేషు భూతేషు మధ్భక్తిం లభతే పరామ్ll”*

“పై శ్లోకంలో చెప్పిన అవలక్షణాలు అన్నీ వదిలిపెట్టి బ్రహ్మజ్ఞానమును పొందిన వాడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సు కలిగి ఉంటాడు. దేనికీ దుఃఖించడు. దేనినీ కోరుకోడు. అన్ని వస్తువులను సమదృష్టితో చూస్తాడు. అన్ని ప్రాణులలో పరమాత్మను దర్శిస్తాడు. అప్పుడు అతని భక్తి పరాకాష్టకు చేరుకుంటుంది.”
```
పరమాత్మ భక్తిని పొందిన వాడి పరిస్థితి ఏంటి అని చెబుతున్నాడు. ఒకసారి పరమాత్మ యొక్క పరమమైన భక్తి తత్వమును పొందితే అతనిని సుఖములు దుఃఖములు బంధించవు. అతడు దేని కొరకు దుఃఖించడు. ఏదీ కావాలని కోరుకోడు. ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాడు. అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అతనికి ఏ కోరికా ఉండదు. అన్ని ప్రాణులను సమంగా చూస్తాడు. పరమాత్మ యందు నిర్మలమైన భక్తిని కలిగి ఉంటాడు. అంటే ఇవి జీవన్ముక్తుని లక్షణములు. ఈ శరీరములో ఉండి కూడా పరమాత్మలో ఐక్యం అయిన వాడు. మనసును ఆత్మలో స్థిరంగా ఉంచిన వాడు. ప్రాపంచిక విషయముల యందు ఎటువంటి ఆసక్తి, అనురక్తి, మమకారము లేని వాడు. అతడికి దుఃఖము సుఖము అంటే ఏమిటో తెలియదు. అంతా సమానంగానే ఉంటుంది. మనస్సు నిర్మలంగా నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది. నీచ జంతువులలోనూ ఉత్తమమైన మానవులలోనూ పరమాత్మను దర్శిస్తాడు. మనం చూచే ప్రపంచం అంతా మనసుతో కల్పించబడినది అని తెలుసుకుంటాడు. అతడికి కోరదగ్గది, పొందతగ్గది అంటూ ఏమీ ఉండదు. సంతృప్తుడు అవుతాడు. ఇది భక్తిలో పరాకాష్ట. అందుకే ‘మధ్భక్తిం లభతే పరామ్’ అంటే నా యొక్క పరమమైన భక్తి లభిస్తుంది. పరమ భక్తి అంటే శంకరాచార్యులవారు ఈ విధంగా చెప్పారు. "స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే" అంటే తన యొక్కస్వస్వరూపమును తెలుసుకోవడమే, ఆత్మతత్వమును అనుసంధానము చేసుకోవడమే పరమమైన భక్తి. అనన్యమైన భక్తి. అదే జ్ఞానము. అది తెలిస్తే ఇంక తెలుసుకోదగ్గది అంటూ వేరే ఉండదు.```


*55. వ శ్లోకము:*

*”భక్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మితత్త్వతఃl*
 *తతోమాం తత్త్వతోజ్ఞాత్వా విశతే తదనన్తరమ్ll”*

“ఓ అర్జునా! కేవలం భక్తి మార్గం వలననే మానవుడు ముందు తన గురించి తాను తెలుసుకుంటాడు. తరువాత నేను ఎవరో, నేను ఎంతటి వాడినో తెలుసుకుంటాడు. నా గురించి కూడా తెలుసుకొన్న మానవుడు తుదకు నన్నే పొందుతున్నాడు.”
```
పరమమైన భక్తి కలిగిన తరువాతి పరిణామాలు తెలియజేస్తున్నాడు పరమాత్మ. భక్తియోగంలో సిద్ధి పొందిన తరువాత మానవుడు తాను ఎవరో ముందు తెలుసుకుంటాడు. తరువాత పరమాత్మ ఎవరో, ఆయన తత్వం ఏమిటో, ఆయన ఎంతటి వాడో, ఎటువంటి వాడో మొదలు విషయాలు తెలుస్తాయి. పరమాత్మ యొక్క నిజస్వరూపమును తెలుసుకొనిన తరువాత పరమాత్మలో ఐక్యం అవుతున్నాడు. ఐక్యం కావడం అంటే మన సినిమాలలో చూపించినట్టు, మనలో నుండి ఒక వెలుగు వచ్చి ఆయనలో కలిసిపోతుందని కాదు. నేను వేరు, పరమాత్మ వేరు కాదు. నేను పరమాత్మ ఒకటే అనే బుద్ధి కలిగి ఉంటాడు. అహం బ్రహ్మాస్మి (నేను బ్రహ్మను అయి ఉన్నాను) అనే నిజాన్ని తెలుసుకుంటాడు.

కిందటి శ్లోకంలో పరమ భక్తి వలన జ్ఞానం దానంతట అదే కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి భక్తి, జ్ఞానము ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి. ముందు భక్తి కలిగితే దానితో జ్ఞానం కూడా వస్తుంది. పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటం అందరికీ సాధ్యమే. కాబట్టి పరమాత్మ గీతలో భక్తియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. జాతి, కుల భేదము లేకుండా అందరూ పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండవచ్చును. దేవుడి గురించి అందరికీ తెలుసు, కాని పరమాత్మ యదార్థ స్వరూపము అందరికీ తెలియదు. కేవలం భక్తి వలననే అది సాధ్యం అవుతుంది. పరమాత్మ గురించి తెలుసుకున్న తరువాత తానే పరమాత్మ అవుతున్నాడు. పరమాత్మలో లీనం అవుతున్నాడు. పరమాత్మలో ఐక్యం అవుతున్నాడు. ఈ శరీరము నేను కాదు, నేను పరమాత్మ స్వరూపము, నాకు పరమాత్మకు భేదం లేదు అనే స్థితికి చేరుకుంటాడు. అందుకే అనంతరమ్ అనే పదం వాడారు. భక్తి, జ్ఞానం కలిగిన తరువాత పరమాత్మ తత్వమును తెలుసుకున్న తరువాతనే పరమాత్మలో ఐక్యం కావడం సంభవిస్తుంది.✍️```
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
   (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment