Wednesday, April 9, 2025

 ద్విభాషితం- 8

కథానిక: 'మనసులోని ముల్లు'

రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.


అపరాహ్నం దాటి జాము పొద్దు వాటారింది .
ఉదయం నుండి  దట్టంగా కురిసిన వాన వెలిసింది.

రాఘవయ్య గారు వీధి వరండాలో పడక్కుర్చీలో కూర్చున్నారు. చేతి కర్ర వంకీ చుట్టూ చేతులు రెండూ బలంగా ముడివేసి, దానిమీద చుబుకాన్ని మోపి దీర్ఘంగా వీధి గేటు వైపు చూస్తున్నారు. 
దబ్బపండు లాంటి ఆయన ముఖం కోపంతో కందగడ్డలా తయారయింది! ఆయన వక్షం ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది!
'హు ...!ఎలాంటి పని చేశాడు! పన్నెండేళ్లు నిండని వెధవ! ఛీ!...నా కడుపున చెడపుట్టేడు!' అనుకున్నారు కసిగా .
ఆ క్షణంలో రాజు తన ఎదుట ఉంటే 'పీక పిసికి చంపేద్దామన్నంత' కోపం వచ్చింది.

రాజు తన సంతానం లో మిగిలిన ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి చక్కగా చదివించి ,సుగుణాలతో తీర్చిదిద్ది, సంఘంలో గొప్ప వ్యక్తి గా తయారుచేయాలని తను ఎన్ని కలలు కంటున్నాడో! అందుకు అనుగుణంగానే వాడు పెరుగుతున్నాడని తాను ఎంతో ఆశతో జీవిస్తున్నాడు. కానీ ఈ దినం జరిగిందేమిటి?!

రాజు కోసం నిరీక్షిస్తూ తదేకంగా గేటు వైపు చూస్తున్నారు రాఘవయ్య గారు. శాంతమ్మ గారు లోపల నుండి తలుపు వరకు వచ్చి భర్త ముఖంలోని కోప చిహ్నాలు ఇంకా తగ్గకపోవడం చూసి, అక్కడే ఆగిపోయింది!
'ఏమిటో..ఈయన కోపం వస్తే మనిషి కారు!' అనుకుంటూ నిట్టూర్చింది.

"ఇంతకీ వాడు ఏం చేశాడండీ?" అంది మెల్లగా.
నిశ్చల తపస్సుకు భంగం కల్గిన మహర్షికి మల్లె కోపంగా ఆమె వంక చూసారు రాఘవయ్య గారు.

"ఏం చేసాడా? వస్తాడుగా... వాడినే అడుగుదువు గాని! వేలెడంత లేడు... సెకండ్ ఫారం వెలగబెడుతున్నాడు... వీడు పరీక్షల్లో స్లిప్పులు రాశాడట! వార్నింగ్ ఇచ్చి డిబార్ చేయకుండా వదిలేశారట!
మధ్యాహ్నం హెడ్మాస్టర్ హనుమంతయ్య వచ్చి నేను కచేరీలో ఉండగా చెప్పారు. 
అందరి ముందూ ఆ మాట చెబుతూ ఉంటే, నాకు తల తీసేసినట్లయింది!
ఇప్పటినుండి వీడికి ఇలాంటి బుద్ధులు అలవాటయితే, ఇక వీడు పెద్ద చదువులు ఏం చదువుతాడు?
వాణ్ణి పెద్ద ఆఫీసరు చేసేద్దామని నువ్వు తెగ ఉబలాట పడిపోతున్నావు .....ఆశ అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందిట...."ఇంకా ఆయన మాటలు పూర్తికాకుండానే వీధి గేటు తెరుచుకున్న చప్పుడయింది .

రాజు బెదురుతూ మెల్లగా పిల్లిలా వరండా మెట్లు ఎక్కుతున్నాడు!
"ఒరేయ్! ఇలా రా !"రాఘవయ్య గారి కంఠం ఉరిమింది. రాజు తన చేతిలోని అట్ట, పేపరు స్తంభం వారగా పెట్టి మెల్లగా తండ్రి వద్దకు వచ్చాడు.

రాఘవయ్య గారు వాలు కుర్చీ లోంచి లేచి నిలబడ్డారు. జరగబోయే సన్నివేశం తలుచుకుని శాంతమ్మ గారు భయంతో వణికిపోయింది!
"ఇవాళ పరీక్షల్లో స్లిప్పులు రాసావా?" రాఘవయ్య గారు గర్జించారు.
"............"
"మాట్లాడవేం?"
ఔనన్నట్లు భయంగా తల ఊపాడు రాజు.
అంతే !!
రాఘవయ్య గారి చేతి కర్ర రాజు నడుం మీద పడింది!
ఒకటి... రెండు...ఆరు.. ఇంకా ఎన్నో దెబ్బలు నడుం మీదా, వీపు మీదా, అందిన చోటల్లా కొట్టారు.
"ఇంకెప్పుడూ రాయనండీ...అమ్మో... కొట్టకండీ.." అంటూ దెబ్బలు భరించలేక విలవిల్లాడుతున్నాడు రాజు.

గొంతు చించు కొస్తున్న అతని ఏడుపు, ఎక్కిళ్ళ మధ్యనే ఆగిపోతోంది!
అతని కనుల నుండి ధారావాహికంగా స్రవిస్తున్న కన్నీళ్లు ఎర్రని చెంపల మీద నుండి జారిపోయి చొక్కాను తడిపేస్తున్నాయి!
ఆ దృశ్యం చూడలేక శాంతమ్మ గారు ఒక్క ఉదుటన వెళ్లి రాఘవయ్య గారికి అడ్డుపడింది.
శాంతమ్మ గారి భుజం మీద ఆఖరి దెబ్బ తీసి, వంకీకర్ర తన న్రృత్యాన్ని ఆపింది!

" అయ్యయ్యో.... కుర్రాణ్ణి చంపేస్తారేమిటండీ.... పోయిన ఐదుగురూ రోగాలతో పోయారు... ఈ ఒక్క వెధవనీ మీరు బలవంతంగా చంపేయండి!"అంటూ ఏడుపు ప్రారంభించింది. 
" వాడిని ముందు నా ఎదుటి నుంచి తీసుకెళ్ళు!" అంటూ చేతికర్ర విసురుగా కింద పడేసి, ముఖం తిప్పుకొని వాలు కుర్చీలో కూలబడ్డారు.
రాజు నడుం చుట్టూ చెయ్యి వేసి మెల్లగా నడిపించుకుంటూ లోపలకు తీసుకువెళ్ళింది శాంతమ్మ.

రాఘవయ్య గారు వాలుకుర్చీలో వెనక్కు వాలి దీర్ఘంగా నిట్టూర్చారు.
చేతులు రెండూ వక్షం మీద ఆన్చుకుని మండిపోతున్న గుండెను సున్నితంగా రాసుకుంటూ బలంగా కళ్ళు మూసుకున్నారు.

రాజుకి తెలివితేటలు ఉన్నాయి. కష్టపడి చదువుతాడు. పరీక్షలలో మంచి మార్కులే వస్తాయి. కానీ ఈ దినం వాడు ఈ పని ఎందుకు చేశాడు? 
తన సామర్థ్యం మీద తనకు నమ్మకం లేకనా? లేక మిగిలిన వాళ్ళు చేస్తూ ఉంటే అది తప్పుఅని తెలియక తనూ చేశాడా?
ఈ తరం కుర్రాళ్ళు ఎందుకిలా  తయారవుతున్నారు?
నిజాయితీకి  విలువ ఎందుకు తరిగి పోతోంది?
ఈ లోపం ఎక్కడుంది?
ఈ పరిస్థితి ఎవరి వలన వస్తోంది?
నానాటికీ క్రమశిక్షణ కోల్పోతున్న పాలకుల వల్లనా.... నిజాయితీ లోపిస్తున్న వ్యక్తుల వల్లనా....
ఎన్నెన్నో ప్రశ్నలు!!
తుది మొదలు లేని సందేహాలు!!

వీధిలో ఏదో కలకలం వినిపించింది!
పెద్ద గోల! మైకులో అరుపులు !
ఆలోచనలు చెదిరిపోతే, అరమోడ్పు గా కనులు విప్పి
చూశారు రాఘవయ్య గారు.

రోడ్డుమీద గుంపులుగుంపులుగా విద్యార్థులు!
వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద బోర్డులు! వాటి మీద ఎర్రని తాటికాయలంత అక్షరాలు.... 'విద్యార్థి నాయకుడు జిందాబాద్!'.... అక్రమం నశించాలి!.....డిబార్ చేసిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలి!.... హెడ్మ

ాస్టర్ హనుమంతయ్య డౌన్ డౌన్!'
ఇంకా ఎన్నో నినాదాలు!!
 
విద్యార్థుల ప్రవాహం ముందుకు కదులుతోంది !
ఎలుగెత్తి అరుస్తోంది!
భావి భారత దేశాన్ని స్వర్గధామంగా దిద్ది, పునీతం చేయడానికి తోడ్పడవలసిన ఈ వెల్లువ, ఈ ప్రవాహం, ఈ మహత్తర శక్తి ;ఏవేవో అర్థంలేని నినాదాలతో రోడ్డుమీద చిందులు తొక్కుతోంది!

ఎన్ని పసి గొంతులు..ఎన్ని లేత మనసులు... ఎన్ని బంగారు మొగ్గలు... ఎన్నెన్ని పసిడి పాదాలు!
పలుచని మృదువైన చేతులు,అన్యాయానికి అక్రమానికి అలవాటుపడని మువ్వల్లాంటి చేతులు, భరతమాత పాదాల చెంత పూజా సుమాలనుంచి భక్తితో ముకుళించ వలసిన చేతులు; రక్తవర్ణాక్షరాలతో నిండిన తడికల బోర్డులు మోస్తూ ఊరంతా తిరుగుతున్నాయి!! 

ప్రవాహం ఇంటి ముందు నుండి ఎదరకు సాగిపోయింది. రాఘవయ్య గారికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కుర్రాళ్ళు స్లిప్పులు రాస్తుండగాపట్టుకొని ,ఉపాధ్యాయుడు దండిస్తే అది దౌర్జన్యం! అది మహా నేరం!!
అందుకుగాను, ఆ దౌర్జన్యాన్ని  అరికట్టేందుకుగాను సమ్మెలు, నినాదాలు, ఊరేగింపులు!!

 ఈ వ్యవస్థ ఎలా మారుతుంది?

వ్యవస్థ మారాలంటే  వ్యక్తులు సంస్కరింపబడాలి. నిజాయితీ అలవరుచుకోవాలి. క్లాసులోని అరవై మంది పిల్లల్ని సంస్కరించడం ఒక్క ఉపాధ్యాయుని వల్ల కాదు. ఇది మూకుమ్మడిగా సాధ్యమయ్యే పని కాదు! పిల్లలను సంస్కరించుకోవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. కానీ ఎంత మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు సరియైన శిక్షణ ఇవ్వగలుగుతున్నారు?

స్తన్యాలతో పాలను అందించే తల్లి, ఆప్యాయంగా ఆదరించే తండ్రి నేర్పని శిక్షణను ఇంకెవరో పై వ్యక్తులు నేర్పటం ఎంతవరకు సాధ్యం?!
పిల్లలను స్కూలుకు పంపేసి తమ బాధ్యత తీరిపోయినట్లు నిట్టూర్పు విడిచే దృక్పథం మారనంత వరకూ ఈ వ్యవస్థ మారదు.

ఏవేవో ఆలోచనలు రాఘవయ్య గారి మనసులో కదలాడాయి.
బరువుగా శ్వాస పీల్చుకుని కుర్చీలోంచి లేచి మెల్లగా అడుగులువేసుకుంటూ ఇంట్లోకి వచ్చారు.

వంటింటి గుమ్మం పక్కగా దిగాలు పడిన ముఖంతో కూర్చుని ఉంది శాంతమ్మ గారు.
ఆమె కళ్ళ నిండా నీళ్ళు! ముఖం నిండా ఆవేదన!
ఆవిడ ఒడిలో ముఖం దూర్చుకొని గువ్వ పిట్టాలా ఒదిగి పోయి సన్నగా రోదిస్తున్నాడు రాజు.
వాడి వీపు మీద చొక్కా తొలగించి ఎర్రని దద్దుర్లు మీద కొబ్బరి నూనె రాసి మెల్లగా నిమురుతోంది శాంతమ్మ గారు. 

ఏడుపు మధ్య ఎక్కిళ్ళతో రాజు వీపు ఎగిరెగిరిపడుతోంది.
రాఘవయ్య గారి వైపు ఒకసారి మౌనంగా చూసి తల దించుకుంది శాంతమ్మ గారు.
ఆ దృశ్యం చూడగానే రాఘవయ్య గారి కడుపులో కలుక్కుమంది ! అనుకోకుండా ఆయన కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి!

చేతికర్ర ఒక వారగా పెట్టి శాంతమ్మ దగ్గరకు వచ్చి ఆమె పక్కన చతికిల పడ్డారు. రాజు వీపు మీద మెల్లగా రాస్తూ  "వెర్రి వెధవని గొడ్డును బాదినట్టు బాదాను" అంటూ సణుక్కున్నారు.
"పాపం..చూడండి !వీపంతా ఎలా తట్లు తేలిపోయిందో!" అంటూ శాంతమ్మ గారు నోట్లో కొంగు కుక్కుకున్నారు. "బాబూ... రాజూ...." మృదువుగా పిల్చారు . ఆ పిలుపులో ఆయన గొంతు బొంగురు పోయింది.

 రాజు తల్లి ఒడిలోంచి మెల్లగా తల ఎత్తి ఆయన వైపు భయంగా చూశాడు.
 అతని కళ్ళు వాచిపోయి ఉన్నాయి.
.".... ఇంకెప్పుడూ పరీక్షల్లో  స్లిప్పులు రాయకేం!"అన్నారు రాఘవయ్య గారు .
'రాయను' అన్నట్లు తల ఊపాడు రాజు.

"బాబూ! విద్యార్థులు, గురువులు నిజాయితీని కోల్పోతే విద్యావ్యవస్థ నాశనమైపోతుంది. విద్యా వ్యవస్థ నాశనం అయిపోతే మొత్తం దేశ సౌభాగ్యమే నాశనం అయిపోతుంది . ఒకసారి పరీక్ష పోగొట్టుకుంటే మరోసారి రాసి ప్యాసవుదువు గాని.... కానీ, నిజాయితీని మాత్రం పోగొట్టుకోకు బాబూ!..." 
ఆ మాటలు అంటూ ఉంటే ఆయన కంఠం కంపించింది!
ఆయన వేళ్ళు రాజు వీపు మీద మృదువుగా కదిలాయి!!

                                **********
(యువ మాసపత్రిక సౌజన్యంతో)

(సుమారు యాభై ఏళ్ల  క్రితం 10 -11 -1972 యువ దీపావళి సంచికలో ప్రచురితం)

No comments:

Post a Comment