*సమస్య... పరిష్కారం.....*
*కష్టాలు లేని మనిషి ఉండడు. కానీ కొందరు కష్టాలలో కూడా సంతోషంగా ఉంటారు. దానిని వారు జీవితంలో ఒక ఆటగా భావిస్తారు. మరికొందరు 'నాకు ఏమయ్యింది. నాకే ఎందుకిలా జరుగుతోంది' అని గంటలకొద్దీ ఆలోచిస్తూ కూర్చుంటారు. ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్లుగా కనిపిస్తారు. జీవితంలో కష్టాలు కొన్నాళ్ళు, సుఖం కొన్నాళ్ళు సహజమని మరుస్తారు. తాము దుఃఖం అనుభవిస్తూ చుట్టుపక్కల వారిని కూడా దుఃఖసాగరంలో ముంచుతారు.*
*మంచి వర్షం కురిసినప్పుడు వాన చినుకులతో పాటు వడగండ్లు కూడా పడుతాయి. నీళ్ళు కావాలనుకున్నప్పుడు వర్గంతో పాటు వడగండ్లను కూడా భరించాలి. జీవిత ప్రయాణంలో వాన చినుకుల్లాంటి ఎన్నో మంచి సంఘటనలు మనకి ఎదురవుతాయి. వాటితో పాటు సమస్యలనే వడగండ్లు కూడా పడి తీరుతాయి. వడగండ్లు పడ్డాయని గగ్గోలు పెడితే లాభం లేదు, వడగండ్ల వర్షాన్ని ఆనందంగా ఆస్వాదించాలి.*
*ఎందుకంటే వడగండ్లు కొద్దిసేపటికి చల్లని నీరుగా మారుతాయి. అలాగే మన సమస్యలు కూడా కొద్ది రోజులకి మననుంచి పక్కకి తొలుగుతాయి. ఎందుకంటే ఏదీ శాశ్వతం కాదు కనుక. కాగితంపై సూర్యకిరణాలను భూతద్దం ద్వారా కేంద్రీకరిస్తే క్షణాల్లో కాగితం కాలిపోతుంది. అలాగే ఆలోచనల తీవ్రత ఎక్కువైతే అది మనల్ని నిలువునా దహించి వేస్తుంది. మనిషికి ఆలోచనలు అవసరమే, అయితే వాటికి కొన్ని హద్దులున్నాయి. వాటిని ఎక్కడ వరకు రానివ్వాలో అంతవరకే రానివ్వాలి.*
*తెల్ల కాగితంలో ఎక్కడో ఒక మూల చిన్న నల్లని చుక్క ఉందనుకుందాం. దానినే చూస్తూ కూర్చుంటే చిన్నగా మనకి తెల్ల కాగితం కనిపించడం మాని పూర్తిగా నల్ల చుక్కే కనిపిస్తుంది. అదే తరహాలో సమస్య గురించే ఇరవై నాలుగ్గంటలూ ఆలోచిస్తుంటే, సమస్య మనల్ని విడిచిపెట్టకుండా పీడిస్తుంది.*
*మనలో అనేకులు పరిష్కారం కోసం చేసే ఆలోచనలకు హద్దులు తెలుసుకోలేరు. ఆలోచించి ఆలోచించి మానసిక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఎక్కువ నీళ్ళతో చెరువు నిండిపోతే ఆ నీళ్ళే చెరువుకు భారమై కట్ట తెగిపోతుంది. మొత్తం నీరంతా నిరుపయోగమవుతుంది. చెరువు చుట్టుపక్కనున్న వాటిని కూడా నష్టపరుస్తుంది.*
*ఇంట్లో పోరు ఎక్కువయ్యిందని ఒక వ్యాపారి ఆశ్రమానికి వెళ్లి గురువును కలిశాడు. భార్యాబిడ్డల కోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వ్యాపారం చేస్తున్నానని. ఇంటికొస్తే భార్య అది కావాలి ఇది కావాలి అని పోరు పెడుతోందని చెప్పాడు. దానివల్ల తనకు మానసిక ప్రశాంతత కరువయ్యిందని వాపోయాడు.*
*గురువు చిన్నగా నవ్వి, నీవు వ్యాపారం ముగించుకుని ఇంటి లోపలికి వెళ్లే ముందు చెప్పులు ఎక్కడ వదిలి వెళ్తావు అని ప్రశ్నించాడు. ఇంటి గుమ్మం బయట వదిలి లోపలికి వెళ్తానని వ్యాపారి బదులిచ్చాడు.*
*అందుకు గురువు చిరునవ్వులు చిందిస్తూ, "మనం నిజ జీవితంలో కూడా ఇదే చెయ్యాలి. మనం ఎన్నో లౌకిక వ్యవహారాలలో తలమునకలై అదే ఒత్తిడితో ఇంటికి వెళ్తాం. మనకు తెలిసో తెలియకో ఆ ఒత్తిడిని ఇంట్లో వారిపైన ప్రదర్శిస్తాం. ఎంతటి ఖరీదైన చెప్పులైనా ఇంటి బయటే కదా వదులుతాం. అలాగే ఎంత పెద్ద సమస్యలున్నా మనం వాటిని ఇంటి బయటే వదిలేయాలి. సమస్యలను మనం ఇంట్లోకి మోసుకుపోవడం వలన ఇబ్బందులు వస్తాయి. ఇంట్లో వారి సాధకబాధకాలు అల్పంగాను, మన సమస్యలు పెద్దవిగాను కనిపిస్తాయి. దీంతో భార్యాభర్తల మధ్య సఖ్యత కొరవడుతుంది, సమస్యలు తెచ్చి పెడుతుంది" అని వివరించాడు. అలాగే చేస్తానని వ్యాపారి ఇంటికెళ్ళాడు. గురువు చెప్పినట్లు ఆచరించాడు. ఆరు నెలల తర్వాత భార్యతో కలిసి నవ్వుతూ వచ్చి గురువు ఆశీర్వాదం తీసుకున్నాడు.*
*అవసర ఆలోచనలు మనల్ని శక్తిమంతుల్ని చేస్తాయి. అనవసర ఆలోచనలు మనల్ని బలహీనులను చేస్తాయి. వద్దన్నామని ఆలోచనలు రాకుండా ఉండవు, వస్తాయి. అది మనసు సహజ లక్షణం. అయితే వాటి పరిమితులు మనం గుర్తించాలి. చెప్పుల్ని ఇంటి బయట వదిలినట్లు వదిలేయాలి. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే చాలు, ఆలోచనలనే గుర్రానికి కళ్ళెం వేయగలం.*
*┈┉┅━❀꧁హరి ఓం ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
No comments:
Post a Comment