*సండే స్టోరీ*
*బ్రహ్మమొక్కడే*
😄
రచన: కోనే నాగవెంకట ఆంజనేయులు
ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చి స్కూటర్ షెడ్లో పెట్టేసి ఇంట్లోకి అడుగు పెట్టాను హూషారుగా. ఆఫీస్ లో ఎంత 'పాటు' పడి నీరసించి పోయినా ఇంట్లోకి అడుగు పెట్టడం మాత్రం ఉల్లాసభరితంగా ఉండాలన్నది మా ఆవిడ ఎప్పుడో ఇచ్చిన సూచన.
కాదు...కాదు.. వార్నింగ్! నేను నీరసంగా వస్తే ఆవిడగారి మూడ్ పాడైపోతుందట. అందుకే ఆఫీస్ లో చచ్చీచెడీ అలిసి పోయినా ఇంట్లోకి హుషారుగా నాకు రాని ఈలవేస్తూ అడుగుపెట్టడం అలవాటై పోయింది నాకు చాలా కాలంగా.
అరే! ఏమిటీ వింత? నేనెంతో హుషారుగా
వస్తే ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందేమిటీ? ఏమైంది చెప్మా! ఇంట్లో ఎవరూ లేరా అంటే వంటింట్లోంచి దోరగా వేగిన బజ్జీల వాసన కమ్మగా వెలువడుతోంది.
మా యిద్దరు బడుద్దాయిలూ ఓ మూల కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్నట్లు నాటకమాడుతున్నారు. నా రూమ్ లోకి దూరి బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని బయటికి వచ్చినా పరిస్థితిలో మార్చేమీ లేదు.
విసురుగా బజ్జీల ప్లేటు నా చేతిలో కొచ్చింది. నీళ్ళ గ్లాను టేబుల్ మీద నీళ్ళు ఒంపుకుంటూ నిలబడింది.
"ఏమిటోయ్ సత్యా! దేనికీ సత్యాగ్రహం? (సత్య+ ఆగ్రహం)" అడిగాను ఆశ్చర్యంగా - విసురుగా వంటగదిలోకి వెళ్ళిపోతున్న శ్రీమతిని ఆపి.
జవాబు ఫోర్స్ గా వచ్చింది. "ఇంక ఈ పిల్లల్ని ఆపడం నా వల్ల కాదంటే కాదు బాబూ! ఈ సెలవుల్లోనైనా వాళ్ళని హైదరాబాద్ తీసుకువెళ్ళకపోతే అస్సలు ఊరుకునేలా లేరు. మీరివాళ ఏదో ఒకటి తేల్చి చెప్పే వరకూ ఇద్దరూ పచ్చి మంచి నీళ్ళయినా ముట్టుకోమని వార్నింగిచ్చేరు. ఆ తరువాత మీ ఇష్టం."
ఓహో! అదా కారణం!
"హైదరాబాద్ వెళ్దాం డాడీ! చార్మినార్, గోల్కొండ చూద్దాం! మా ఫ్రెండ్సంతా ఎప్పుడో చూశారుట" అని పిల్లలు పాపం ఎప్పట్నుంచో అడుగుతున్నా నాకు ఏవో కారణాలతో కుదరడంలేదు. నేనూ, సత్యా కూడా హైదరాబాద్ చూడకపోవడంతో మాకూ చూడాలనే ఉంది.
ఐదు నిముషాలు ఆలోచించాను. బ్యాంక్ లో బ్యాలన్స్ వుంది. ఆఫీస్ లోనూ సెలవు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా వీళ్ళను బాధపెట్టడమూ మర్యాద కాదు.
కాసేపు తరువాత నెమ్మదిగా అన్నాను - "ఈ నెలలో మనం హైదరాబాద్ వెళుతున్నాం" అని.
అప్పటి వరకూ మన్ను తిన్న పాముల్లాగా పడి వున్న పిల్లలిద్దరూ "హేయ్" అంటు కల్లు తాగిన కోతుల్లా (పోలిక బాగా లేకపోతే వదిలేయండి) ఒక్క ఉదుటున లేచి వచ్చి నన్ను చుట్టుముట్టేశారు. నన్ను ముద్దుల్లో ముంచెత్తిన తరువాత బజ్జీల మీద దాడి చేశారు.
కాఫీ కప్పుతో మరియూ చిరునవ్వుతో నా దగ్గర కొచ్చి కప్పు చేతికి ఇచ్చింది సత్య 'నిజంగానా' అంటూ.
"నిజం. రేపటి నుంచీ ఆ పనిలోనే ఉంటాను" అన్నాను ఆవిడ బుగ్గ మీద సుతారంగా చిటికె వేసి. ఇదే మంచి తరుణం - నడుం నొక్కినా కిక్కురుమనదు.
ఆ మరునాడే లీవ్ శాంక్షన్ చేయించుకుని - గోదావరి ఎక్స్ ప్రెస్ కి నాలుగు టిక్కెట్లు రిజర్వ్ చేయించాను.
హైదరాబాద్ లో మా బ్రహ్మం ఉన్నాడు కాబట్టి ఉండడానికీ, తినడానికీ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. హోటల్ ఖర్చులు ఏమాత్రం వుండవు.
“హైదరాబాద్ వెళుతున్నాం గురూ! మన బ్రహ్మంగాడు ఎప్పట్నుంచో పాపం రమ్మని
అంటున్నాడు కూడాను. వారం రోజుల పాటు ఫ్యామిలీతో వాడింట్లోనే మకాం" చెప్పాను మరో మిత్రుడు పరాంకుశంతో హుషారుగా.
"బ్రహ్మం వాళ్ళింట్లో ఉంటారా?" చాలానే ఆశ్చర్యపోతూ నోరెళ్ళబెట్టాడు పరాంకుశం.
"అవును ఏం?" అన్నాను అయోమయంగా తెరచి ఉన్న వాడి నోట్లోని పిప్పి పళ్ళు లెక్కబెడుతూ.
"ఏం లేదులే. వెళుతున్నావుగా నీకే తెలుస్తుందిలే" అన్నాడు పరాంకుశం అదోలా నవ్వుతూ.
వాడి మాటలు నాకు అర్థంకాలేదు గానీ వాడి నోట్లోని పళ్ళలో ఇటు నాలుగు, అటు నాలుగు మొత్తం ఎనిమిది పళ్ళు మాత్రం పుచ్చిపోయినట్లు అర్థమయింది.
నేనూ, బ్రహ్మం, పరాంకుశం ఒకే ఊరివాళ్ళం. పైగా ఒకే క్లాసు వాళ్ళం. పదో తరగతి వరకూ కలిసే చదువుకున్నాం! కలిసే 'పిడత' పనులూ చేశాం. చిన్నప్పుడు చెట్ల మీదికి రాళ్ళు విసిరి చింతకాయలు, మామిడికాయలు, ఉసిరికాయలులాంటివి కొట్టుకొచ్చి మాకే కానీకి, పైసాకి అమ్మేవాడు బ్రహ్మంగాడు. ఏ గుడికో ప్రసాదాల కోసం వెళ్తే బయట మా చెప్పులకి కాపలా కాసినందుకు ఒక్కొక్కళ్ళ దగ్గరా అర్థణా చొప్పున వసూలు చేసిన మేధావి మా బ్రహ్మం. అలా ఎంతో సరదాగా గడిచింది మా బాల్యం.
"వీడు పెద్దయితే ఏ బ్యాంక్ ఆఫీసరో అవుతాడురా! కానీ ఎవ్వరికీ పైసా ఇవ్వడు" సరదాగా అప్పుడు మేం వేసుకున్న జోకులు నిజమై ఇప్పుడు హైదరాబాద్ లో ఓ పేరున్న బ్యాంక్ లో మేనేజర్ గా సెటిలయ్యాడు బ్రహ్మం.
వాడెప్పుడు ఫోన్ చేసినా "ఫ్యామిలీతో సహా ఓసారి రా గురూ మా ఇంటికి!' అని ఆహ్వానిస్తుంటాడు ఆప్యాయంగా. అందుకే నేను పరాంకుశం మాటలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. మా ఆవిడ సూట్ కేసుల్లో బట్టలు సర్దుతూ "నాలుగు దుప్పట్లు, నాలుగు దిళ్ళూ పెడుతున్నాను. సరిపోతాయా" అంటుంటే -
"దుప్పట్లు, దిళ్ళూ ఏమీ వద్దు. మనం వెళుతున్నది మా ఫ్రెండ్ బ్రహ్మం ఇంటికి. హోటల్లో రూములు, బయటి తిళ్ళూ జాన్తా నై. అన్నీ వాడే చూసుకుంటాడు. ఆ డబ్బులు మిగులు మనకు. ఆ ఎమౌంట్ తో నీకేమైనా కొంటాలే తరువాత" అన్నాను- ఆవిడ ముఖం మెరిసిపోతుండగా!
📖
మమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి సికింద్రా బాద్ స్టేషన్ కొచ్చాడు బ్రహ్మం. ఆటోల్లో వాడి ఇంటికి చేరుకున్నాం.
"రా వదినా రండి అన్నయ్యగారూ" అంటూ సాదరంగా మమ్మల్ని ఆహ్వానించింది బ్రహ్మం భార్య అందరి ఆడవాళ్ళలాగానే వరస కలిపేస్తూ. మా ఫ్యామిలీ కోసం ఓ రూమ్ అప్పటికే ఎలాట్ చేశారు.
"మీరు ఉన్నంత కాలం నిర్మొహమాటంగా ఈ రూం వాడుకోండి. మేం మీ గదిలోకి రాం" అన్నాడు బ్రహ్మం.
వాడికి 'థ్యాంక్స్' చెప్పి “ఒరేయ్ బ్రహ్మం! ఈ హైదరాబాద్ లో ఏది ఎక్కడుందో నాకు ఏమీ తెలీదు. దగ్గరుండి అన్నీ సరిగ్గా చూపించాల్సిన భారం నీదే" అన్నాను.
"అలాగేరా! నేనున్నానుగా. నీకెందుకు బెంగ. దగ్గరుండి అన్నీ నేను చూపిస్తాను" అభయ ముద్ర చూపించాడు ఎన్. టి. రామా... సారీ... శ్రీకృష్ణుడిలా.
"త్వరగా స్నానాలు చేసేసి తయారవ్వండి. ఈ రోజు సాలార్ జంగ్ మ్యూజియమ్, చార్మినార్ చూసేద్దాం" అన్నాడు బ్రహ్మం.
"ఏరా! గీజర్ ఉంది. వేన్నీళ్ళతో స్నానం చేస్తారా?చన్నీళ్ళేనా?" అడిగాడు బ్రహ్మం.
ఇంకా చలి ముదరలేదు. ఐనా వేడినీళ్ళ స్నానంలో ఉన్న హాయే వేరు.
"లేదురా! వేన్నీళ్ళతోనే చేస్తాం. మాపిల్లలకు చన్నీళ్ళ స్నానాలు పడవు" అన్నాను.
అందరం వేడినీళ్ళ స్నానాలు కానిచ్చేశాం.
బ్రహ్మం భార్య ఉప్మా, పూరీ చేసింది. జీడిపప్పు వేసి నేతితో చేసిన ఉప్మా ఘుమ ఘుమలాడుతుంటే ఇక మారువడ్డించుకో కుండా ఉండలేకపోయాను. వేడివేడి పూరీలు దుంపల కూరతో లాగిస్తుంటే లెక్క తెలీలేదు.
📖
సాలార్ జంగ్ మ్యూజియంలో ఒక్కో గదీ చూస్తుంటే టైము తెలియలేదు. పన్నెండు అవుతుండగా గంటల గడియారం దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాడు. ఆ కొత్త(పాత) రకం గడియారాన్ని చూసి కేరింతలు కొట్టారు మా పిల్లలు. అటు నుంచి దగ్గర్లోని చార్మినార్ కి వెళ్ళి పైకెక్కి నగరం అందాలు చూశాం. చార్మినార్ దగ్గర సత్యా, పిల్లలు గాజులూ, పూసల దండలు లాంటివి ఏవేవో కొనుక్కున్నారు.
అలసిన శరీరాలతో ఇంటికి తిరిగి వచ్చిన మేము వేడినీళ్ళ స్నానాలతో సేదతీరాం!
బ్రహ్మాం టీవీ పెట్టాడు. డైలీ సీరియల్ ఏదో వస్తోంది.
"ఏరా! సోఫాల్లో కూర్చుని చూస్తారా? లేకపోతే గాడ్రేజ్ కుర్చీల్లో కూర్చుని చూస్తారా?" అని అడిగాడు.
"సోఫాలుండగా గాడ్రేజ్ కుర్చీలెందుకులేరా! సోఫాల్లోనే కూర్చుని చూస్తాం" అన్నాను కులాసాగా.
అందరం సోఫాల్లో కూర్చుని సీరియల్స్ చూశాం హాయిగా నవ్వుకుంటూ. తర్వాత భోజనాలకు పిలుపు వచ్చింది. డైనింగ్ టేబులు చుట్టూ సర్దుకున్నాం అందరం.
“ఏరా! ఐస్ వాటరా? లేకపోతే మామూలు నీళ్ళేనా?" అడిగాడు బ్రహ్మం.
"ఐస్ వాటర్ లేందే ముద్ద దిగదురా బాబూ మాకెవరికీ. ఐస్ వాటర్ పెట్టించు" అన్నాను. ఐస్ వాటర్ బాటిల్స్ ఫ్రిజ్ లోంచి తీసి గ్లాసులు నింపాడు బ్రహ్మం. విందు భోజనం వడ్డించింది బ్రహ్మం భార్య. కమ్మని భోజనం కడుపు నిండా తిని ఆఖర్న సేమియా పాయసం తాగేసరికి ఇంక భుక్తాయాసం రానే వచ్చింది. పిల్లలూ, ఆడవాళ్ళు టీ వీలో ఏదో కామెడీ సినిమా చూస్తున్నారు సీరియస్ గా. నేనూ, బ్రహ్మం వాడి గదిలో చేరి మా చిన్ననాటి ముచ్చట్లు జ్ఞాపకం చేసుకుని ఆ రోజులు మళ్ళీ తిరిగి రావని తీర్మానించాం.
అలసిపోయిన శరీరానికి నిద్రముంచుకు వస్తుంటే పడుకోవడానికి లేచాను. టీ వీలో సినిమా కూడా అయిపోవడంతో మా ఆవిడ, పిల్లలు కూడా లేచారు. మేం మాకు ఎలాట్ చేయబడిన రూంలోకి వెళ్ళిపోయాం.
ఆ రాత్రి కి "ఏరా! ఎ.సి. ఉంది. వెయ్యమంటారా? అక్కరలేదా?" అడిగాడు బ్రహ్మం.
వాతావరణం అంత వేడిగా ఏంలేదు. ఐనా ఉన్న సౌకర్యం ఎందుకు వదులుకోవాలి?
"ఎ.సి. లోనే పడుకుంటాంరా! వెయ్యి" అన్నాను.
వాడు ఎ.సి. ఆన్ చేసి 'గుడ్ నైట్' చెప్పి వెళ్లిపోయాడు. ఏం మర్యాదలు! ఏం మర్యాదలు! ఏం కావాలో అడిగి మరీ సమకూరుస్తున్నాడు మా బ్రహ్మంగాడు.
స్వర్గం లోకి చొచ్చుకొచ్చినట్లుగా ఉంది మాకు. మరి ఆ పరాంకుశం గాడెందుకలా సాగదీసాడు, బ్రహ్మం ఇంట్లో ఉంటున్నారా అంటూ?
ఎ.సి. చల్లని గాలిలో ఆదమరచి నిద్రించాం. రోజూ మా ఆవిడ బ్రహ్మం భార్యకు వంట పనిలో సాయం చేసేది.
మా పిల్లలిద్దరూ రోజూ రాత్రిపూట వాళ్ళ కొచ్చిన మేజిక్, మిమిక్రీ కళలు ప్రదర్శించే వారు. బ్రహ్మం పిల్లలిద్దరూ మా వాళ్ళ ప్రతిభకు ఆశ్చర్యపోతుంటే- వాళ్ళకూ మేజిక్, మిమిక్రీ నేర్పించారు మా పిల్లలు. వాళ్ళకు స్టేజ్ ప్రదర్శనలిచ్చిన అనుభవం ఉంది.
రోజుకో ప్రదేశం చొప్పున హైదరాబాదంతా తిప్పి చూపిస్తున్నాడు బ్రహ్మం. ఎక్కడా నన్ను పర్స్ తీయనీయడంలేదు. కానీ అప్పుడప్పుడూ వాడు నోట్ బుక్ లో ఏవో లెక్కలు రానుకోవడం గమనించాను.
ఓ సాయంత్రం టాంక్ బండ్ మీద చల్లగాలి పీల్చి బిర్లామందిర్ కెళ్ళాం. ఆ మర్నాడు గోల్కొండ కోటకి వెళ్ళాం. మా అందరికీ బాగా నచ్చింది.
ఓరోజు అందరం కలిసి సినిమాకి వెళ్ళి అట్నుంచి అటు ఏదయినా మంచి హోటల్లో డిన్నర్ చేసి రావాలని నిశ్చయించుకున్నాం.
"ఏరా! బస్ లో వెళ్దామా? లేకపోతే టాక్సీలో వెళదామంటావా?" అని అడిగాడు బ్రహ్మం.
ఎప్పుడైనా సరే - బస్ కంటే టాక్సీ నే బెటర్. బస్ లో సీట్లు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. టాక్సీ ఐతే ఇంటి ముందే ఎక్కి కూర్చుని డైరెక్ట్ గా థియేటర్ ముందు దిగొచ్చు. అదే చెప్పాను.
"అయితే ఫోన్ చేసి టాక్సీ పిలిపిస్తాను. ఎ.సి. టాక్సీలో వెళదామా లేకపోతే మామూలు టాక్సీలో వెళదామా" మళ్ళీ అడిగాడు బ్రహ్మంగాడు.
అయ్యబాబోయ్! వీడి మర్యాదలు భరించ లేకపోతున్నానురా బాబూ! నాతోపాటు పిల్లలందరూ కూడా ఏ.సి టాక్సీకే ఓటు వెయ్యడంతో ఫోన్ చేసి ఎ.సి. టాక్సీ రప్పిoచాడు వాడు.
ఎ.సి. థియేటర్ లో సినిమాకి టిక్కెట్లు కూడా ఫోన్ లోనే బుక్ చేశాడు. ఇంత దర్జాగా మేమెప్పుడూ సినిమాకి వెళ్ళలేదు. ఈసురోమని ఏ బస్ లోనో, ఆటో లోనో వెళ్ళేవాళ్ళం - ఆదీ నాన్ ఏ.సి. థియేటర్ కి. వాడి పుణ్యమా అని ఆ అదృష్టం ఇలా కలిసివచ్చింది. ఎప్పట్లానే బ్రహ్మం అక్కడా నన్ను పర్సు తీయనీయలేదు. సినిమా చూసి మంచి హోటల్లో భోజనాలు కానిచ్చి టాక్సీలో ఇంటికొచ్చేసరికి పదకొండు దాటింది.
మర్నాడు జూకి తీసుకువెళ్ళాడు. జూలో వాడి పిల్లలూ, మా పిల్లలూ కలిసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
హైదరాబాద్ లో ముఖ్యంగా చూడాల్సినవి అన్నీ చూశాం. ఆ మరునాడు ఉదయమే మా తిరుగు ప్రయాణం. ఆ రాత్రి భోజనాల దగ్గర ఈ వారం రోజులూ వాడిచ్చిన ఆమోఘమైన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
"చాలా థాంక్స్ రా! పాపం మా కోసం ఈ వారం రోజులూ నువ్వు ఆఫీస్ కి సెలవు కూడా పెట్టేసి అన్నీ దగ్గరుండి చక్కగా చూపించావు. మీ మర్యాదలు చూస్తుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి రావాలనిపిస్తోంది. చెల్లెమ్మా! అన్నపూర్ణ తల్లిలా నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని జీవితాంతం మరిచిపోలేం. చాలా థాంక్సమ్మా! మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము" అన్నాను.
"దాందేముందిలేరా! ఇందులో మేము చేసింది ఏమీ లేదు. ఇదిగో మొత్తం అంతా ఇందులో లెక్కరాసి ఉంచాను. చెక్ చేసుకుని పే చేసేస్తే సరిపోతుంది. రుణం ఇప్పుడే తీరిపోతుంది" అంటూ నా చేతిలో నాలుగు పేజీల లిస్ట్ ఏదో పెట్టాడు బ్రహ్మం.
ఆ లిస్ట్ చూసేసరికి మూర్చ వచ్చినంత పనైంది నాకు. అది.. అది... బ్రహ్మంగాడు మా కోసం పెట్టిన ఖర్చుల లిస్టు. నేను ఇప్పుడు అది పే చెయ్యాలన్నమాట.
రూం రెంట్ రోజుకి 200 రూపాయల చొప్పున ఆరు రోజులకు 1200. రెండు పూటలా రెండు టిఫిన్లు ప్లస్ కాఫీ నలుగురికి ఆరు రోజులకు 20x2×4×6= 960.
పై విధంగానే రెండుపూటలా రెండు భోజనాలు (లంచ్ మరియు డిన్నర్) నలుగురికి ఆరు రోజులకు 30×2×4×6=1440.
ఆరు రోజులకు నలుగురికి గీజర్ వేసుకున్నందుకు కాలిన కరంట్ యూనిట్లు రేటు, సోఫాలో కూర్చుని టీవీ చూసినందుకు, ఎ.సి. టాక్సీ రెంట్, ఐస్ వాటర్ కి, ఎ.సి. దియేటర్లో సినిమా ఖర్చు మొత్తం ఎనిమిది మందికి డివైడెడ్ బై రెండు, మాకోసం వాడు ఆరు రోజులు సెలవు పెట్టినందుకైన హాఫ్ పే లీవ్ శాలరీ.
చివరికి మా రెండోవాడి చేతిలోంచి పొరపాటున కిందపడి పగిలిపోయిన అణా కానీ గాజుగ్లాసు ఖరీదు... ఇలా ఇలా సాగిపోయిందా బిల్లు. నాలుగో పేజీ చివర్లో టోటల్ చూస్తే అది 5236.75 రూపాయలు గా తేలింది.
నేను తలెత్తి చూశాను. వాడు నవ్వుతూ, "ఒరేయ్! ఈ ఊళ్ళో నేను లేకపోతే నువ్వు ఏ హోటల్లోనో ఉండాల్సిందే కదా! అప్పుడు ఈ ఖర్చులన్నీ నువ్వే భరించాలి కదా. హోటల్ లో ఉండి నువ్వే ఈ ఖర్చులన్నీ పెట్టుకుంటే దీనికి రెట్టింపు అవుతుంది తెలుసా! అయినా ఈ విషయం నీకు తెలీదని కాదనుకో" అన్నాడు.
నేనలా నిర్ఘాంతపోయి మాట రాక మాట్లాడలేక చూస్తూ ఉండిపోయాను.
పరాంకుశం అన్న మాటల్లోని భావం ఇప్పుడు అర్థమైంది నాకు. అందుకేనా అంత ఆశ్చర్యపోయాడు వాడు. ఐనా ఇంత అన్యాయమా! వాడిన్ని ఖర్చులు పెడుతుంటే, వెళ్ళిపోయే ముందు వాళ్ళ పిల్లల చేతిలో ఎంతో కొంత పెడదామని అనుకున్నానే. సరే ఏం చేస్తాం! చేతులు ఆల్రెడీ కాలాయి.. ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ఏం లాభం!
ఎంతో మర్యాద చేస్తున్నవాడిలా ఏ.సి. వెయ్యాలా? గీజర్ వెయ్యమంటారా? సోపాలో కూర్చుంటారా? అని వింతగా అడుగుతుంటే మర్యాద చేస్తున్నాడని అనుకున్నాను గానీ ఇలా గుండెలు తీసిన బంటులా బిల్ చేతిలో పెడతాడని ఉహించలేకపోయాను. ప్రతీ దానికీ డబ్బులు వసూలు చేసే బుద్ధి ఇంకా పోలేదన్నమాట వీడికి.
ఏం చెయ్యాలి ఇప్పుడు? డబ్బులు పే చేసేయవచ్చు. కానీ వీడికి బుద్ధి చెప్పాలనీ, ఎవరూ నేర్పని గుణపాఠం నేర్పాలనీ అనిపిస్తోంది నాకు. చిన్నప్పటి ఫ్రెండ్ కదా అని ఇంటికి వస్తే ఆదరించి బిల్ చేతిలో పెడతాడా!
"అవున్రా! నిజమే! మేము హోటల్ లో దిగితే ఇంకా ఎక్కువే ఖర్చయ్యేది. ఒక్కసారి బిల్ చెక్ చేసి పే చేసేస్తాను" అంటూ మా 'అద్దెరూం' లోకి వచ్చేశాను.
మరునాడు మా సామానులు ఆటోలో వేసుకుని "ఇదుగోరా నా బిల్లు" అన్నాను వాడి చేతిలో ఓ కాగితం పెడుతూ. వాడు ఆశ్చర్యంగా చూస్తుండగా...
"ఏం లేదురా! ఈ వారం రోజులపాటు మా పెద్దాడు తన మేజిక్ ప్రదర్శన తోనూ, మా చిన్నాడు తన మిమిక్రీ కళతోనూ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేశారుకదా! దానికీ, మీ పిల్లలిద్దరికి మేజిక్, మిమిక్రీ నేర్పినందుకూ, మా ఆవిడ ఈ వారంరోజులూ మీ ఆవిడకు వంటపనిలోనూ, అంట్లు తోమడంలోనూ సాయపడినందుకు మొత్తం అయిన బిల్లు 6500 రూపాయలు. ఇందులో నేను నీకు ఇవ్వాల్సిన 5236-75 రూపాయలు మినహాయించుకుని మిగిలిన 1263-25 రూపాయలు ఇచ్చేస్తే మేమిక స్టేషన్ కి బయలుదేరుతామురా. అన్నట్టు ఒరేయ్ - మా పిల్లల మేజిక్, మిమిక్రీ కళలు లాంటివి ప్రదర్శించడానికి వాళ్ళను బుక్ చేసుకున్నా మీ పిల్లలకు మేజిక్, మిమిక్రీ ఎవరైనా గురువు దగ్గిర నేర్పించినా, మా ఆవిడ బదులు నువ్వు ఎవరినైనా పనిమనిషిని పెట్టుకున్నా మొత్తమంతా కలిపి ఇంతకంటే ఎక్కువే అవుతుంది తెలుసా? అయినా ఈ విషయం నీకు తెలియదని కాదనుకో" అన్నాను ఆటో ఎక్కికూర్చుని.
వాడి ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు. ఇంతకీవాడు నాకు ఇవ్వాల్సిన బ్యాలన్స్ అమౌంట్ ఇచ్చాడా లేదా అని కదా మీ అనుమానం? పోనీలే చిన్నప్పటి స్నేహితుడు కదా అని నేనే ఆ మొత్తం వదిలేశాను. అదీ సంగతి!
వచ్చే సంవత్సరం సెలవులకి మళ్ళీ హైదరాబాద్ కి కాకుండా వేరే ఊరుకి వెళ్లాలని అప్పడే నిర్ణయించుకున్నాను...
🪙
*సమాప్తం*
꧁☆•┉┅━•••❀❀•••
No comments:
Post a Comment