ధర్మ వ్యాధుడు : కథ
రచన : సుధావిశ్వం
ఈ ధర్మవ్యాధుని వృత్తాంతం మహాభారతం, అరణ్యపర్వంలో ఉంది. ధర్మరాజు వనవాస కాలంలో ఎంతోమంది మహర్షులను సేవించి, ఎన్నో ధర్మసూక్ష్మాలను తెలుసుకుంటాడు.
సనాతన ధర్మంలో మానవులకు నాలుగు ఆశ్రమ ధర్మాలు నిర్దేశించ బడ్డాయి. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.
ప్రతి మానవుడు తప్పకుండా ఈ ఆశ్రమ ధర్మాలు పాటించాలి. ఏ ఒక్కటి పాటించకపోయినా ఉత్తమగతులు లభించవు. సక్రమంగా ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ఉంటే భగవంతునికి ప్రియం అవుతారు.
బ్రహ్మచర్యంలో విద్యార్థిగా విద్యను అభ్యసించాలి. అప్పటి కాలాన్ని బట్టి వారి కులవృత్తులు నేర్చుకునేవారు. ఈ దశలో నేర్చుకోవడం తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టకూడదు.
విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. తనకు తగిన ధర్మపత్నిని చేపట్టి, న్యాయంగా సంపాదిస్తూ, కుటుంబ పోషణ చేస్తూ, అందులో కొంత దానధర్మాలు చేస్తూ జీవించాలి. అటు తర్వాత పిల్లలు పెద్దగా అయి వాళ్ళూ గృహస్థాశ్రమం లోకి వచ్చాక, వారికి అప్పజెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ ఋషుల ఆశ్రమానికో వెళ్లి అక్కడ దొరికేవి తింటూ, భగవంతుని ధ్యానం లో గడపాలి. భార్య చనిపోతే సన్యాసం స్వీకరించి పూర్తిగా సన్యాస ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ చివరగా భగవన్నామంతో తరించాలి. ఇది పూర్వం అనుసరించేవారు.
ఇప్పుడు ఎలా కుదురుతుంది అనుకుంటారు కానీ ఇప్పటికీ అన్వయం అవుతుంది.
చదువు పూర్తయ్యేవరకూ ఏ ప్రలోభాలకు లొంగకుండా చక్కగా చదువుకోవాలి. పరీక్షలు వ్రాసి పాస్ అవ్వడమే కాదు, మంచి పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోవాలి.
అటు తర్వాత ఉద్యోగం సంపాదించి, తగిన వారిని పెళ్లి చేసుకున్నాక న్యాయంగా సంపాదిస్తూ, సంపాదనలో కొంత డబ్బుతో నలుగురికి సాయం చేస్తూ ఉండాలి.
పిల్లలు సెటిల్ అయ్యాక, అనవసర విషయాల్లో కల్పించుకుంటూ, వాళ్ళు ఏ విషయాలు చెప్పట్లేదు అనీ, ఇంకా కట్నం తెచ్చే కోడలు రాలేదు అని అంటూ అనవసర విషయాలు ఆలోచిస్తూ, సమయం వృధా చేసుకోకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలి. అన్నిటిపై మమకారం పెట్టుకోకుండా డిటాచ్డ్ గా ఉండాలి. అదే వానప్రస్థం, సన్యాసం. వేరే చోటికి దూరంగా పోనక్కర్లేదు. ఇంట్లోనే వుంటూ మానసిక దూరం పాటిస్తే అదే ప్రశాంతంగా భగవంతుని చేరుస్తుంది.
పూర్వం కౌశికుడు అనే పేరు గల బ్రాహ్మణుడు శాస్త్రాధ్యయనం అయిన వెంటనే తపస్సు చేయడానికి వెళ్ళాడు.
విద్యాభ్యాసం పూర్తి కాగానే ఇక ఇంటికి వెళ్లకుండా, అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు. కొద్దికాలం గడిచింది. రోజూ ఉదయమే లేచి నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుని తపస్సు చేసేవాడు. ఆకలి వేసినప్పుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఊళ్ళోకి వెళ్లి భిక్ష తెచ్చుకుని, ఆరగించేవాడు.
అలా కొంత కాలం గడిచింది.
ఓ రోజు కౌశికుడు తపస్సులో ఉండగా, ఆ చెట్టుపైకి ఒక కాకి వచ్చి వాలి, కాసేపు అక్కడే తిరిగి, మళ్ళీ చెట్టు కొమ్మపై కూర్చుని రెట్ట వేసింది. అది సూటిగా వెళ్లి కౌశికుని పైన పడింది. ఆ స్పర్శ వల్ల అతనికి తపోభంగం అయ్యింది. వెంటనే కళ్ళు తెరిచి, రెట్ట వేసిన కాకి వైపు కోపంగా చూసాడు. ఆయన తపఃశ్శక్తి వల్ల, ఆ కోపాగ్ని చూపులు కాకిపై ప్రసారించగానే, అది కాలి బూడిద అయిపోయింది.
తనకు కొంత తపఃశ్శక్తి లభించిందని సంతోషించాడు. లోపల చిన్న గర్వం కూడా ఏర్పడింది. మళ్ళీ అలాగే తపస్సు చేసుకొనసాగాడు.
అలా కొంతకాలం గడిచింది. అప్పుడు ఓ రోజు ఆకలివేసి దగ్గర్లోని పల్లెటూళ్ళోకి వెళ్లి, ఓ ఇంటిముందు నిలబడి "భవతి భిక్షాoదేహి" అని పిలిచాడు.
కొద్దిసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి, భిక్ష తెస్తాను అని చెప్పి, లోపలికి వెళ్ళింది. ఈ లోపు భర్త వచ్చేసరికి, ఆయనకు కావలసినవి సమకూర్చడంలో ఉండి, భిక్ష విషయం కొద్దిసేపు మర్చిపోయింది.
మళ్ళీ గుర్తురాగానే భిక్ష తీసుకుని బయటకు వచ్చి, కౌశికునితో...
"అయ్యో! నా పతిసేవలోపడి, మర్చిపోయాను. మిమ్మల్ని ఇలా నిలబెట్టినందుకు నన్ను మన్నించండి. ఈ భిక్ష స్వీకరించి నన్ను ధన్యురాలిని చేయండి" అని ప్రార్ధించింది.
కానీ అదేమీ పట్టించుకోకుండా క్రోధం పెరిగిన కౌశికుడు, కళ్ళల్లో నిప్పులు వర్శిస్తూ, తీక్షణంగా ఆవిడను చూసాడు భిక్ష స్వీకరించకుండా.
అప్పుడు ఆవిడ..
"ఓయీ కౌశికా! నువ్వు అంత క్రోధంతో చూడగానే కాలిపోవడానికి నేనేమైనా అడవిలో చెట్టుపైన వాలిన కాకిని అనుకున్నావా? సన్యాస ధీక్షలో ఉన్నవారికి క్రోధం పనికిరాదు. అల్ప ప్రాణిపై కోపం అసలే ఉండరాదు. అనుకోకుండా జరిగిన నా తప్పిదాన్ని మన్నించమని వేడుకున్నా పట్టించుకోకుండా ఇలా కోపిస్తున్నావు" అనగానే
ఆ పలుకులు వినగానే ఆశ్చర్యపోయిన కౌశికుడు, మొదట తన కోపానికి సిగ్గుపడతాడు.
ఆ తర్వాత కౌశికుడు..
"అడవిలో కాకి కాలిపోయిన విషయం ఎలా తెలిసింది ఈమెకు. ఈమె సామన్యురాలు కాదు" అనుకున్నాడు మనసులో.
క్షమించమని అడుగుతూ ఇలా అన్నాడు...
"అమ్మా! నీవు సామాన్య స్త్రీ వి కాదు. అందుకే అడవిలో జరిగిన విషయం నీకు తెలిసింది. నీవు ఎంతో తెలిసిన జ్ఞానివి. నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానబోధ చేయమ్మా!" అన్నాడు.
అప్పుడు ఆవిడ ..
"నాయనా! ఈ పక్కనే ఉన్న ఊరిలో ధార్మికుడైన ధర్మవ్యాధుడు అనే పేరు గల కటికవాడు ఙివిస్తున్నాడు. అతని వద్దకు వెళ్ళు. ఆయన నీకు జ్ఞానబోధ చేస్తాడు" అని చెప్పింది.
కటికవాడా! అని మనసులో అనుకుని ఆమె మాటపై విశ్వాసంతో ధర్మవ్యాధుని వద్దకు బయలుదేరాడు.
********
ఆ ఊళ్ళోకి వెళ్లి విచారణ చేస్తే, అతను వుండే చోటు చూపించారు.
అది మాంసం అమ్మే దుకాణం. వెళ్లడానికి తటపటాయిస్తూ, కొద్దిదూరం వెళ్తుంటే అందరూ ఈయన్ని వింతగా చూస్తారు. ఇంకా పూర్తిగా దుకాణం వద్దకు వెళ్ళకుండానే, అక్కడ్నుంచి చూడడానికి ఎలాగో ఉన్న ఒక వ్యక్తి ఎదురుగా వచ్చాడు.
"స్వామీ! మీరు వస్తారని తెలుసు. ఆ ఇల్లాలు మిమ్మల్ని పంపింది కదా! ఈ సమయంలో నేను ఈ దుకాణంలో ఉండవలసి ఉంది. రద్దీ కాలం కదా! ఈ పక్కనే నా పాక ఉన్నది. నన్ను మన్నించి మీరు అక్కడ కొద్దిసేపు వేచివుండండి. నేను కొద్దిసేపటిలో వచ్చేస్తాను. అప్పుడు మీకు కావలసిన విషయాలు చెబుతాను" అన్నాడు వినయంగా.
"అంటే నువ్వు ధర్మవ్యాధునివా?" అన్నాడు
అవునని చెప్పి ఒక పిల్లవానితో కౌశికుని తన పాక వద్దకు పంపాడు.
అక్కడికి వెళ్లిన కౌశికుడు, పాక ముందు ఉన్న ఓ చిన్న ఆసనంపై కూర్చున్నాడు వేచి చూస్తూ..
ఇంతలో సమయానికి రానే వచ్చాడు ధర్మవ్యాధుడు. శుచియై వచ్చి, పాకలోనున్న వృద్ధులు అయిన తల్లిదండ్రులను పలకరించి, కావాల్సిన సేవ చేసి, అప్పుడు కౌశికుని వద్దకు వచ్చాడు. ఇదంతా చూస్తూనే వున్నాడు కౌశికుడు.
"చెప్పండి స్వామి! నన్ను ఏమి అడగాలనుకుంటున్నారు?"
"నేనెంతో తపస్సు చేశాను విషయ వాంఛలు మర్చిపోయి. నా తపశ్శక్తి వల్ల కాకి కాలిపోయింది. కానీ ఏ తపస్సు లేని ఒక సాధారణ స్త్రీ ఆ విషయం ఎలా చెప్పగలిగింది? గృహస్థాశ్రమంలోనే ఉన్న ఆవిడకు అంతటి దృష్టి ఎలా వచ్చింది. ఆవిడను అడిగితే నీ దగ్గరకు పంపింది. నీవు కూడా ఇక్కడ ఏ తపస్సు చేయటం లేదు. మాంసం అమ్ముకునే ఒక కటికవాడివి. నువ్వు జ్ఞానివి ఎలా అయ్యావు? నువ్వు కూడా ఒక గృహస్తువు. నీకంతటి శక్తి ఎలా వచ్చింది" అని అడిగాడు కౌశికుడు
అప్పుడు ధర్మవ్యాధుడు ఇలా వివరించాడు.
"స్వామీ! మీకు తెలియనిది ఏముంది. అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం కీలకం. ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ, దైవస్మరణ చేస్తే అదే గొప్ప జ్ఞానం.
నిన్ను నా వద్దకు పంపిన ఆ ఇల్లాలు మహా పతివ్రత. ఇల్లాలిగా తను చేయవలసిన పనులు సక్రమంగా చేసుకుంటూ , నిరంతరం దైవస్మరణ చేస్తుంది. అందుకే ఆవిడకు కోరుకోకుండానే ఆ శక్తులు వచ్చాయి.
అందుకే ఆ స్త్రీకి నీవు కాకిని దగ్ధం చేసిన విషయం తెలిసింది.
ఇక నా విషయం. నేను జన్మించినది ఈ వృత్తి కలిగిన కుటుంబంలో. ఎవరి వృత్తి వారు చేయడం ధర్మం. కుటుంబ పోషణకు నా తండ్రి చేసిన పనినే నేనూ చేస్తున్నాను. నాకు అనుగుణమైన నైమిత్తిక కర్మలు ఆచరిస్తున్నాను. వృద్ధులైన తల్లిదండ్రులకు సేవ చేయడం నా ధర్మం. నా భార్యాపిల్లలకు కావాల్సిన పోషణ చేయడం నా ధర్మంలో భాగమే. నేను సంపాదించిన దానిలో కొంత నాకంటే దీనులైన వారికి తోచిన సాయం చేస్తుంటాను. అన్ని పనులు భగవంతుడు నాకు నిర్ధేశించిన పనులుగా భావించి, మనసులో భగవదర్పణం చేసి నా ధర్మం నేను పాటిస్తాను.
మానవ ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం గొప్పది. తరించడానికి సులభమైనది అని చెబుతారు.
మహానుభావా కౌశికా! నువ్వు గొప్ప తపస్సు చేసింది నిజమే. కానీ వృద్ధులైన నీ తల్లిదండ్రులను సేవించకుండా, వారు బాధపడుతుంటే అలా వదిలేసి తపస్సు అని వచ్చావు. అందువల్ల నీకు సిద్ధి లభించలేదు. నువ్వు పెళ్లి చేసుకుని, గృహస్థాశ్రమ ధర్మం నిర్వహించి, నీ తల్లిదండ్రులను సేవిస్తూ, చివరి దశలో సన్యాసం స్వీకరించి తపస్సు చేస్తే నీకు సిద్ధి లభిస్తుంది" అని ముగించాడు ధర్మవ్యాధుడు
శాస్త్రాలు చదివినట్టుగా చెప్పిన ధర్మవ్యాధుని మాటలకు ఆశ్చర్యపోయిన కౌశికుడు...
"అయ్యా! నువ్వు సామాన్యుడివి కావు. నీకు ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చిందో, నీవు ఎన్నో ధర్మాలు వివరంగా ఎలా చెప్పగలిగావు. నీకు ఇవన్నీ ఎలా తెలిశాయో చెప్పు" అని అడిగిన కౌశికునితో ధర్మవ్యాధుడు..
"అయ్యా! నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించాను. కానీ రాకుమారుని స్నేహం చేత అడవిలో వేటకు వెళ్ళాను. అక్కడ వేటాడాలనే కోరిక కలిగి రాకుమారుని ధనుర్భాణాలు తీసుకుని బాణం వదిలాను. అది వెళ్లి అక్కడ ఉన్న ఒక మునికి గుచ్చుకుంది. ఆయన వద్దకు వెళ్లి చూస్తే ఆయన
"బ్రాహ్మణుడిగా పుట్టి, జంతుహింస చేసే కటికవాడిగా ప్రవర్తించావు. కనుక ఆ కటికవాడిగానే జన్మించు" అని శపించాడు.
బాణం తొలగించి, ఆయనకు సపర్యలు చేసి, బాధనుంచి విముక్తి కలిగించాను.
ఆయన " నీవు కటికవాడిగా పుట్టినా పూర్వజన్మ స్మృతి ఉంటుంది నీకు. ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. నీ తల్లిదండ్రులను సేవించినంతవరకూ నీకు ఏ జంతుహింస దోషమూ అంటదు" అని చెప్పాడు.
అలా నాకీ జన్మ వచ్చింది. నా తల్లిదండ్రుల సేవ వల్ల ఇలా నా జ్ఞానం నిలబడింది. అంతే తప్ప నేను జ్ఞానిని కాను. స్వధర్మాచరణ వల్ల ఇలాంటి జ్ఞానం వస్తుందని తెలిసింది" అన్నాడు.
ధర్మవ్యాధునికి ధన్యవాదాలు తెలుపుకుని అక్కడ్నుంచి బయలుదేరాడు కౌశికుడు.
సరాసరి తన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు చెప్పిన విధంగా పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమ నియమాలను పాటిస్తూ తల్లిదండ్రులను సేవించి తరించాడు.
*****
ఇక్కడ ధర్మవ్యాధుని గొప్పతనం ఒకటి చెప్పుకోవాలి. ఆయన , కౌశికుడు రాగానే నా వద్ద జ్ఞానం నేర్చుకోడానికి వచ్చావు కదా! ఇక్కడే కూర్చో నా పని అయ్యాక చూస్తా. నేనే గొప్ప నీకంటే అన్నట్టుగా ప్రవర్తించి ఉంటే, కౌశికుడు అహంకరించి, కోపంతో అల్ప ప్రాణి అయిన కాకిని ఎలా దగ్ధం చేసాడో ధర్మవ్యాధుడు కూడా అలా అహంకరించినట్లే అయ్యేది. అప్పుడు అతడు జ్ఞానిగా చెప్పబడేవాడు కాదు.
మనం ఏ వృత్తిలో వున్నా , అంటే ఇప్పటి కాలానికి ఏ ఉద్యోగంలో వున్నా ఒకరు మనల్ని ఏదో సందేహం అడిగారంటే మనమే గొప్ప అన్న భావన రాకూడదు. మనకు తెలిసింది చెప్పడం వేరు. అహంకరించడం అనేది భవిష్యత్తులో పతనానికి దారి తీస్తుంది.
కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు.
వుండొచ్చు కానీ , ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఒళ్ళంతా పొగరే ఉండాలి అన్నట్టుగా సినిమాలో చూపిస్తున్నారు. అదే యువత నేర్చుకుంటున్నారు. సౌమ్యంగా మాట్లాడడం అన్నదే కరువు అయిపోతోంది. ఎవరితో, ఎలా మాట్లాడాలి అనేది ఇంచుమించుగా లేకుండానే పోతోంది. ఎవడైతే నాకేంటి అని నోటికొచ్చినట్లు వాగడం, తోచినట్లుగా చేయడం ఆ తర్వాత సమస్యల్లో కూరుకుపోవడం. ఇది సర్వసాధారణం అయ్యింది.
చిన్నప్పటి నుంచే పిల్లలకు మాట్లాడే విధానం నేర్పాలి. అది తల్లిదండ్రులు తాము అలా సక్రమంగా వుంటూ వారికి చెబితే వాళ్ళూ వింటారు. ఉత్తమ మానవులుగా, నలుగురికి ప్రయోజకులుగా అవుతారు.
లేదంటే...?
కృష్ణార్పణమస్తు
No comments:
Post a Comment